Indian Polity | ఓటర్ల అభిప్రాయం తెలిపేది.. ఫలితాలు అంచనా వేసేది
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం
- ప్రకరణ 87 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం పార్లమెంటు మొదటి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం అవుతుంది. ఈ ప్రసంగం పాఠాన్ని క్యాబినెట్ తయారు చేసి ఆమోదిస్తుంది.
- ఈ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, పథకాలను సూచనప్రాయంగా తెలియజేస్తారు. ఈ ప్రసంగం తర్వాత ఉభయ సభలు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలి.
- రాజ్యసభ తీర్మానం తిరస్కరించినా లేదా సవరణలను ప్రతిపాదించినా ప్రభుత్వంపై ప్రభావం ఉండదు. కానీ లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించకపోయినా లేదా సవరించినా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.
స్వల్ప వ్యవధి చర్చ - ప్రజా సంబంధమైన ముఖ్య అంశాల మీద సభ్యులు స్వల్ప వ్యవధి చర్చ లేవనెత్తవచ్చు. ఇందులో ఓటింగు ఉండదు. సభా కార్యక్రమాల చివర స్పీకరు దీన్ని అనుమతిస్తారు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్ - ఇది ఒక అసాధారణ పద్ధతి. దీన్ని అనుమతిస్తే జరుగుతున్న సభా కార్యక్రమాలను పక్కనపెట్టి ఈ అంశం చర్చకు వస్తుంది. సభా కార్యక్రమాలు నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అని పరిశీలించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది సభ్యులు లేవనెత్తే ఒక ఆక్షేపణ. సభాధ్యక్షుల అనుమతితోనే మాట్లాడాలి. ఈ విషయంలో సభాధ్యక్షులదే తుది నిర్ణయం. దీనిపైన ఓటింగ్ ఉండదు.
ఇంకా పేర్కొనబడని తీర్మానం - సభాధ్యక్షులచేత అనుమతించబడిన తీర్మాన ప్రవేశానికి ఒక నిర్ధారిత సమయం కేటాయించబడనిచో, వాటిని ఇంకా పేర్కొనబడని తీర్మానం అంటారు.
- రూల్ 377 కింద ప్రస్తావన లేదా ప్రత్యేక ప్రస్తావన ఏవైనా అంశాలను మిగతా ప్రక్రియల ద్వారా సభలో ప్రస్తావించడానికి వీలుకానప్పుడు, అలాంటి అంశాలను రూల్ 377 కింద సభ దృష్టికి తీసుకురావచ్చు.
- రాజ్యసభలో ఈ విధానాన్ని ‘స్పెషల్ మెన్షన్’ అంటారు. దీని కోసం సెక్రటరీ జనరల్‌ను లిఖితపూర్వకంగా అభ్యర్థించాలి.
లేమ్ డక్ సెషన్ - లేమ్ డక్ అంటే ఓడిపోయినవారు అని అర్థం. లోక్‌సభకు ఎన్నికలు జరిగిన తర్వాత, రద్దయిన లోక్‌సభకు సభ్యులుగా ఉండి ప్రస్తుత లోక్‌సభకు ఎన్నిక కాని సభ్యులు, కొత్తగా ఎన్నికైన సభ్యులు కలిసి చిట్టచివర ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే లేమ్ డక్ సెషన్ అంటారు. ఇది భారతదేశంలో అమల్లో లేదు. అమెరికాలో అమల్లో ఉంది.
కాంపోజిట్ ఫ్లోర్ టెస్టింగ్ - ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు లేదా అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ కోల్పోయినప్పుడు అనేక రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకొస్తాయి. అలాంటి సమయాల్లో రాష్ట్రపతి కాని, గవర్నర్ కానీ ఆయా పార్టీల బలాబలాలను నిరూపించుకునేందుకు సభలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
ఫిలిబస్టరింగ్ - శాసనసభ కార్యక్రమాలు జరగకుండా అలాగే ఒక బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు సభ్యులు ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఉపన్యాసం ఇతరత్రా చర్యల ద్వారా నిర్ణీత గడువు ముగిసేటట్లు ఇబ్బందులు సృష్టిస్తుంటారు. దీన్నే ఫిలిబస్టరింగ్ అంటారు.
గెర్రిమాండరింగ్ - ఒక అభ్యర్థి తన విజయావకాశాలను మెరుగు పరచుకొనే విధంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చే పద్ధతిని గెర్రిమాండరింగ్ అంటారు.
గ్యాలప్ పోల్ - అమెరికాకు చెందిన హెన్రీ గ్యాలప్ అనే ఎన్నికల విశ్లేషకుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల దీన్ని గ్యాలప్ పోల్ అంటారు. ఇది ఎన్నికల కంటే ముందు జరిపే ఒక సర్వే లాంటిది. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే అంశాలను, రాబోయే ఎన్నికల ఫలితాలను గ్యాలప్ పోల్ ద్వారా అంచనా వేయవచ్చు.
ఎగ్జిట్ పోల్ - ఎన్నికల్లో ఓటింగ్ జరిగే సమయంలో ఓటు వేసిన వారి అభిప్రాయాన్ని తెలుసుకునే పద్ధతిని ఎగ్జిట్ పోల్ అంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చు.
ఈల్డింగ్ ది ఫ్లోర్ - ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ సభ్యుడిని నిరోధించి మరొక సభ్యునికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడాన్ని ‘ఈల్డింగ్ ది ఫ్లోర్’ అంటారు.
రూల్ 184 కింద చర్చ - ప్రజా ప్రయోజనం నిండి ఉన్న అంశాలను చర్చించిన తర్వాత వాటిని ఓటింగ్ ద్వారా ఆమోదిస్తారు.
రూల్ 193 - ప్రజా ప్రాముఖ్యం గల సమకాలీన అంశాలను చర్చించడానికి ఈ రూల్ కింద నోటీసు ఇవ్వొచ్చు.
రూల్ 194 కింద చర్చ - ప్రజా సంబంధ అంశాలను ఓటింగ్ లేకుండా చర్చించడం.
ఫ్లోర్ క్రాసింగ్ - ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు.
కార్పెట్ క్రాసింగ్ - అధికార పక్షానికి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి ఫిరాయించడాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటారు.
తీర్మానాలు - సభ దృష్టికి ఒక విషయాన్ని ప్రతిపాదించడానికి ఎన్నుకునే ప్రక్రియనే ప్రతిపాదన అంటారు. సభ అభిప్రాయాన్ని కోరడం దీని ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో మూడు రకాలైన ప్రతిపాదనలు ఉన్నాయి.
నిర్దిష్ట తీర్మానం - ఇది నిర్దిష్టమైన స్వచ్ఛంద ప్రతిపాదన. సభ నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా దీన్ని ప్రతిపాదిస్తారు. ఇందులో మరో ప్రతిపాదన ఉండదు. ఉదా: వాయిదా తీర్మానం, అవిశ్వాస తీర్మానం.
ప్రత్యామ్నాయ తీర్మానం - మార్పు చెందిన విధానాలకు, పరిస్థితులకు సంబంధించి అసలు ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా చేసే ప్రతిపాదన. ఇది ఆమోదించబడితే దీన్ని అసలు ప్రతిపాదనగానే పరిగణిస్తారు.
సహాయ తీర్మానం - ఇదివరకు ప్రవేశపెట్టిన ప్రతిపాదన స్థితిగతులను విచారించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అసలు ప్రతిపాదన మీద, సహాయ ప్రతిపాదన మీద కూడా చర్చ సాగుతుంది. కానీ ఓటింగ్ మాత్రం సహాయక ప్రతిపాదన మీదనే జరుగుతుంది. దీన్ని మూడు ఉప ప్రతిపాదనలుగా విభజించవచ్చు.
1. అనుషంగిక ప్రతిపాదన - రకరకాల సభా వ్యవహారాల కొనసాగింపునకు దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: బిల్లును నిర్ధారిత కమిటీ లేదా సంయుక్త కమిటీ పరిశీలనకు పంపడం.
2. అధిక్రమణ తీర్మానం - ఏదైనా ఒక విషయాన్ని అక్కడితో వదిలివేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆ విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారు.
3. సవరణ - ఒరిజినల్ ప్రతిపాదనలను మార్పు చేయడం లేదా అందులో ఒక అంశాన్ని ప్రతిక్షేపన చేయడం
స్పాయిల్ సిస్టం
- ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్చుకునే పద్ధతి. అమెరికాలో ఈ పద్ధతి పాక్షికంగా అమల్లో ఉంది. నూతన అధ్యక్షుడు తన అధికార నివాసమైన వైట్ హౌస్‌లో పని చేసే ఉద్యోగులను తన విచక్షణ మేరకు నియమించుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తారు.
ప్రతిపాదనలు - ప్రజాసంబంధ వ్యవహారాలపైకి సభ దృష్టిని మళ్లించడానికి ఉన్న అనేక విధానాల్లో ఇది ఒక విధానం. నిజానికి ఇది నిర్ధారిత ప్రతిపాదన. కానీ తీర్మానం ఒక అభిప్రాయ రూపంలో, సూచన రూపంలో ఉంటుంది. వీటిని వ్యక్తిగత ప్రతిపాదనలు, ప్రభుత్వ ప్రతిపాదనలు, చట్టపర ప్రతిపాదనలుగా వర్గీకరించవచ్చు.
- వ్యక్తిగత/ప్రైవేట్ ప్రతిపాదనలు: దీన్ని ప్రైవేట్ మెంబర్ ప్రతిపాదిస్తారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం చర్చిస్తారు.
- ప్రభుత్వ ప్రతిపాదనలు: దీన్ని మంత్రులు ప్రవేశపెడతారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు చర్చిస్తారు.
- చట్టపర ప్రతిపాదన: దీన్ని మంత్రులు కాని, ప్రైవేట్ సభ్యులుకానీ ప్రతిపాదించవచ్చు. రాజ్యాంగం, పార్లమెంట్ చట్టం ప్రకారం వీటిని పరిశీలిస్తారు.
ప్రతిపాదన, తీర్మానానికి మధ్య తేడా - ప్రతిపాదనలన్నీ నిర్దిష్ట తీర్మానాలే. అంటే ప్రతి ప్రతిపాదన ఒకరకమైన తీర్మానం. అలాగే తీర్మానాలన్నీ నిర్దిష్ట ప్రతిపాదనలు కాకపోవచ్చు. తీర్మానాలు అన్నిటిని ఓటింగ్‌కు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి ప్రతిపాదనను ఓటింగ్‌కు పెట్టాల్సి ఉంటుంది.
ట్రెజరీ బెంచెస్ - ఈ భావన ఇంగ్లండ్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అమల్లో ఉంది. సభలో స్పీకర్‌కు కుడి పక్కన మొదటి, రెండో వరుస బెంచీలను అధికార పార్టీకి చెందిన ప్రధానమంత్రి, మంత్రి మండలికి కేటాయిస్తారు. భారతదేశంలో కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు మంత్రులు సాధారణ సభ్యులకు కేటాయించిన స్థానంలో నుంచి కూడా సమాధానాలు ఇస్తారు.
వెల్ ఆఫ్ ది హౌస్
- సభలో సభాధ్యక్షుల స్థానం కింది భాగంలో సభకు సంబంధించిన అధికారులు, వారి కార్యకలాపాల నిర్వహణకు కొంత భాగాన్ని కేటాయిస్తారు. ఈ సమీప భాగాన్ని (నోడల్ పాయింట్) పార్లమెంటు పరిభాషలో ‘వెల్ ఆఫ్ ది హౌస్’ అంటారు. సభ్యులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించొద్దు. కొన్ని సందర్భాల్లో సభ్యులు ఈ ప్రాంతంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇది పార్లమెంటరీ మర్యాదకు విరుద్ధం.
రూలింగ్ - సభలో తలెత్తే వివాదాలపై నిబంధనల అన్వయంపై సభాధ్యక్షులు ఇచ్చే తీర్పును రూలింగ్ అంటారు. వీరు ఇచ్చిన రూలింగ్ అంతిమం. సభ్యులు దీన్ని ప్రశ్నించరాదు.
ముగింపు తీర్మానం - సభలో జరుగుతున్న చర్చని ఇక ముగించాలని ఒక సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ముగింపు తీర్మానం అని అంటారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదిస్తే చర్చ అంతటితో ఆగిపోతుంది. ఈ విషయాన్ని ఓటింగ్‌లో పెడతారు. ముగింపు తీర్మానం నాలుగు రకాలు. అవి:
సాధారణ ముగింపు - ‘విషయాన్ని పూర్తిగా చర్చించడం జరిగింది. కనుక దీన్ని ఓటింగ్‌లో పెట్టడం జరుగుతుంది’ అని ఎవరైనా ఒక సభ్యుడు తీర్మానాన్ని ప్రతిపాదిస్తాడు.
విభాగపరమైన ముగింపు - చర్చ మొదలయ్యే ముందు బిల్లుని వివిధ క్లాజులుగా చేయటం జరుగుతుంది. ప్రతి భాగాన్ని చర్చించటం చివరికి అన్నింటినీ కలిపి ఓటింగ్‌లో పెడతారు.
కంగారు ముగింపు - ఈ విధానంలో ముఖ్యమైన క్లాజులని చర్చిస్తారు. తర్వాత ఓటింగ్‌లో పెడతారు. మధ్యలో ప్రాముఖ్యం లేని క్లాజులని వదిలేస్తారు. తద్వారా తీర్మానాన్ని ఆమోదిస్తారు.
గిలటిన్ ముగింపు - ఈ పద్ధతి బిల్లులో చర్చించిన విషయంతో పాటు చర్చించని క్లాజులని కూడా చేర్చి దాన్ని ఆమోదిస్తారు. సాధారణంగా బిల్లుకి కావాల్సిన చర్చా సమయం ముగించినప్పుడు ఈ విధంగా చేస్తారు.
హంగ్ పార్లమెంటు - లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితిని హంగ్ పార్లమెంటు అంటారు. ఇంతవరకు ఏడు హంగ్ పార్లమెంటులు ఏర్పడ్డాయి.
పదో సంకీర్ణ ప్రభుత్వం (2009) - కాంగ్రెస్ నేతృత్వంలో 11 పార్టీల యు.పి.ఎ. కూటమి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఆపద్ధర్మ ప్రభుత్వం - అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు, పరిపాలనా బాధ్యతలను కొనసాగించడానికి అదే ప్రభుత్వాన్ని , ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే వరకు అధికారంలో కొనసాగమని రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరతారు. అయితే రాజ్యాంగంలో అలాంటి ఏర్పాటు ఏమీలేదు. ఈ సమయంలో ఆ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు.
సభ్యుల ఆటోమెటిక్ సస్పెన్షన్ - రూల్ 374(ఎ) పార్లమెంటరీ నియమాల ప్రకారం ఒక సభ్యుడు సభా కార్యక్రమాలకు నిరవధికంగా ఆటంకం కలిగించడం, పదే పదే సభాధ్యక్షుల ముందుకు దూసుకొస్తే స్పీకర్ ఆ సభ్యుని పేరును ప్రస్తావిస్తే సంబంధిత సభ్యుడు ఆటోమెటిక్‌గా సభ నుంచి సస్పెండ్ అయినట్లుగా భావిస్తారు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు