Indian Polity | 1969లో అధికారిక గుర్తింపు.. 1977లో చట్టబద్ధత
పార్లమెంటు సచివాలయం
- ప్రకరణ 98 ప్రకారం పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభలకు ప్రత్యేక సచివాలయ సిబ్బంది ఉంటారు.
- లోక్‌సభ కార్యదర్శిని లోక్‌సభ సెక్రటరీ జనరల్ అంటారు.
- రాజ్యసభ కార్యదర్శిని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అంటారు.
సభా నాయకుడు - సాధారణంగా ప్రధానమంత్రి లోక్‌సభ నాయకుడిగా వ్యవహరిస్తారు. అయితే ప్రధానమంత్రికి లోక్‌సభలో సభ్యత్వం లేనప్పుడు, లోక్‌సభలో సభ్యత్వం కలిగిన మంత్రిని సభా నాయకుడిగా నియమిస్తారు.
- అదేవిధంగా రాజ్యసభలో కూడా ఆ సభలో సభ్యత్వం ఉన్న మంత్రి ఒకరు సభా నాయకుడిగా వ్యవహరిస్తారు.
పార్లమెంటు-ప్రతిపక్ష నాయకుడు
- రాజ్యాంగపరంగా అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు.
- అయితే మొదటి స్పీకర్ జి.వి.మౌలాంకర్ రూపొందించిన నియమావళి ప్రకారం లోక్‌సభలో కనీసం 1/10వ వంతు సభ్యులు కలిగిన, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుని హోదాను పొందుతారు.
- రాజ్యసభలో కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇదే రకమైన హోదా కల్పించబడుతుంది. ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఇవ్వబడుతుంది.
గమనిక: 1969లో అధికారికంగా ప్రతిపక్ష నాయకుడిని గుర్తించారు. 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం ప్రకారం లోక్‌సభ లేదా రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు అనే హోదాకు మొదటిసారి చట్టబద్ధత కల్పించడం జరిగింది.
ప్రత్యేక సమాచారం - ఈ చట్టం ప్రకారం మొదట గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నేత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన వై.వి.చవాన్ (ఆరో లోక్‌సభ) (1977-78). (అనధికారికంగా మొదటి ప్రతిపక్ష నాయకుడు డా.రామ్ సుభాగ్ సింగ్).
- రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠి (1977-78). అనధికారికంగా శ్యామ్ నందన్ మిశ్ర (1969-71)
- మొదటి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేరు. అలాగే రెండు, మూడు, ఐదు, ఏడు, ఎనిమిది, పదహారు, పదిహేడో లోక్‌సభలకు కూడా ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ముగిశాయి. కారణం నిర్ణీత సంఖ్యలో సభ్యులు లేకపోవడమే.
- లోక్‌సభ నియమావళిలోని సెక్షన్ 12(1) ప్రకారం సంబందిత పార్టీకి 1/10వ వంతు తక్కువ కాకుండా సీట్లు వచ్చినప్పుడే ప్రతిపక్ష హోదా ఇస్తారు.
ప్రతిపక్ష పార్టీ హోదా-సమకాలీన ఆవశ్యకత- సమకాలీన ప్రాముఖ్యత - బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ ఉన్న భారతదేశంలో పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకురావడం తరువాత చీలిపోవడం, అవి అవకాశవాద, అధికారపూరిత రాజకీయాలకు పాల్పడటం వల్ల రాజకీయ అనిశ్చితికి, అవినీతికి దారి తీస్తుంది.
- ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నియమించే ముఖ్య నియామక కమిటీల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులు కూడా సభ్యులుగా ఉండటం వారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీ హోదా గుర్తింపునకు ప్రాముఖ్యత ఏర్పడింది.
- 17వ లోక్‌సభలో ఏ పార్టీకి 1/10వ వంతు స్థానాలు రాకపోవడంతో ప్రతిపక్ష పార్టీ హోదా గుర్తింపు పొందలేకపోయాయి.
గమనిక: ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ గుర్తింపు పొందిన అధికార పార్టీ నాయకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, లోక్‌పాల్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల్లో ప్రతిపక్ష నాయకుల్నీ సంప్రదించాలి. - చీఫ్ విప్, గుర్తింపు పొందిన పార్టీ నాయకులు, బృంద నాయకులు- పార్లమెంటు చట్టం (1988)
- ఈ చట్టం ప్రకారం లోక్‌సభలో 10% సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుంది. అంతకంటే తక్కువ సీట్లు సాధించినప్పుడు ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీ బృందంగా పరిగణిస్తారు.
- పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం (1977) ప్రకారం సభాధ్యక్షులు ఆ సభలోని అతిపెద్ద పార్టీ నేతను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు.
శాసన నిర్మాణ ప్రక్రియ-బిల్లులు-రకాలు
- బిల్లు అంటే చట్టం చేయడానికి ఉద్దేశింపబడిన ప్రతిపాదన లేదా ముసాయిదా.
- చట్టం మొదటి దశే బిల్లు. శాసన నిర్మాణం పార్లమెంటు అత్యంత ముఖ్యమైన అధికారం, విధి.
- శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఉభయసభల్లో అనేక దశల్లో వెళ్లాల్సి ఉంటుంది.
- బిల్లుల రకాలను వాటిని రూపొందించే ప్రక్రియను కింది విధంగా వివరించడం జరిగింది.
బిల్లును ప్రవేశపెట్టేవారిని బట్టి రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
1. ప్రభుత్వ బిల్లు
2. ప్రైవేటు మెంబర్ బిల్లు - మంత్రి బిల్లు ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వ బిల్లు అంటారు. ప్రభుత్వ బిల్లును ఏ రోజైనా ప్రవేశపెట్టవచ్చు.
- మంత్రి కానీ ఏ సభ్యుడైనా ప్రతిపక్ష సభ్యులతో సహా బిల్లును ప్రతిపాదిస్తే దాన్ని ప్రైవేటు మెంబర్ బిల్లు అంటారు.
వారం విడిచి శుక్రవారం ప్రవేశపెడతారు.
ప్రత్యేక సమాచారం - 17వ లోక్‌సభ వరకు పార్లమెంటులో 15 ప్రైవేటు మెంబర్ల బిల్లులు ఆమోదించబడ్డాయి. 1956లో ఆరు ప్రైవేటు బిల్లులు ఆమోదించారు. 17వ లోక్‌సభలో 28 ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు.
- బిల్లులోని అంశాలు, ప్రక్రియల ఆధారంగా బిల్లును కింది రకాలుగా వర్గీకరిస్తారు.
- రాజ్యాంగంలో ప్రకరణ 107 నుంచి 122 వరకు శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన ప్రక్రియను పొందుపరిచారు. బిల్లులను కింది విధంగా వర్గీకరించవచ్చు.
1. సాధారణ బిల్లులు (ప్రకరణ 107)
2. ఆర్థిక బిల్లు (ప్రకరణ 117)
3. ద్రవ్య బిల్లులు (ప్రకరణ 110)
4. రాజ్యాంగ సవరణ బిల్లులు (ప్రకరణ 368)
సాధారణ బిల్లులు-ప్రక్రియ
- సాధారణ బిల్లులను వాటిలోని అంశాలను బట్టి కూడా వర్గీకరించవచ్చు.
ఎ. కొత్త అంశాలకు, కొత్త చట్టాలకు సంబంధించినవి
బి. ప్రస్తుతం ఉన్న అంశాలను, చట్టాలను సవరించడానికి ఉద్దేశించినవి
సి. ప్రస్తుతం ఉన్న చట్టాలు గడువు ముగుస్తున్నప్పుడు పొడిగించడానికి సంబంధించినవి
డి. ప్రస్తుతం ఉన్న చట్టాలను రద్దు చేయడానికి ఉద్దేశించినవి
ఇ. ఆర్డినెన్స్ స్థానంలో చట్టాలను చేయడానికి ఉద్దేశించినవి - సాధారణ బిల్లుకు ప్రత్యేక నిర్వచనం లేదు. ప్రకరణ 107 ప్రకారం ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు కానివి సాధారణ బిల్లుగా
పరిగణించాలి. - సాధారణ బిల్లును ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టొచ్చు.
- సాధారణ బిల్లును ప్రవేశపెట్టదలచుకున్న సభ్యుడు ప్రైవేటు సభ్యుడైతే ఒక నెల ముందు నోటీసుతో తన సంకల్పాన్ని లిఖితపూర్వకంగా ఆయా సభాధ్యక్షులకు తెలపాలి.
- అదే గవర్నమెంటు బిల్లు అయితే ఏడు రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
- సభ్యుడి నుంచి విజ్ఞాపన అందగానే సభాపతి ఒక తేదీని నిర్ణయిస్తాడు. ఏ సభ్యుడైనా బిల్లు ప్రవేశాన్ని వ్యతిరేకిస్తే, ఆ సభ్యుడి అభిప్రాయాలను వివరించడానికి అనుమతిస్తారు.
గమనిక: ఆర్థిక, అనుమతి ఉపక్రమణ బిల్లులను ప్రవేశ దశలో వ్యతిరేకించొద్దు. సాధారణ బిల్లులో కింది దశలుంటాయి.
1. ప్రవేశ దశ (మొదటి పఠనం)
2. పరిశీలన దశ (రెండో పఠనం)
3. ఆమోద పరిశీలన దశ (మూడో పఠనం)
4. రెండో సభలోకి బిల్లు పంపడం
5. రాష్ట్రపతి ఆమోదం
ప్రవేశ దశ లేదా మొదటి పఠనం - ఒక బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సభ్యుడు, ఆ బిల్లు పేరును, ఆవశ్యకతను, ప్రాధాన్యతను వివరిస్తాడు. ఈ దశలో బిల్లుపైన ఎలాంటి చర్చ జరగదు.
రెండో దశ లేదా రెండో పఠనం - బిల్లు మొదటి దశ పూర్తయ్యాక, ముద్రించిన బిల్లుల ప్రతులను సభ్యులకు అందజేస్తారు. బిల్లుపైన ఈ దశలో సమగ్రమైన, విస్తృతమైన చర్చ జరుగుతుంది. దీన్ని పరిశీలన దశ అంటారు.
- ఈ దశలో కింది ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి.
- బిల్లును చర్చించి వెంటనే ఆమోదించమని అడగవచ్చు.
- బిల్లును ఎంపిక కమిటీకి లేదా రెండో సభ అంగీకారంతో సంయుక్త ఎంపిక కమిటీకి నివేదించవచ్చు.
- బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపమని అడగవచ్చు. అంటే బిల్లుకు విస్తృత ప్రచారాన్ని కల్పించమని కోరడం.
కమిటీ దశ-వివరణ - అత్యంత ప్రాముఖ్యత లేదా వివాదాస్పద, రాజ్యాంగపరమైన వ్యాఖ్య అవసరమున్న బిల్లులను ఎంపిక కమిటీ అభిప్రాయానికి పంపుతారు. ఎంపిక కమిటీ సభ్యులను ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు.
- సాధారణంగా వీరి సంఖ్య 20 నుంచి 30 వరకు ఉంటుంది.
- ఉభయ సభల సభ్యులతో కలిపి ఏర్పాటు చేస్తే జాయింట్ సెలెక్ట్ కమిటీ అంటారు. ఈ కమిటీ సూచించిన సవరణను, ప్రతిపాదనలను సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
మూడో దశ లేదా మూడో పఠనం - మూడో దశ కేవలం ఆమోద దశ మాత్రమే. ఈ దశలో బిల్లుపైన పరిమితంగా చర్చించడానికి సభ్యులకు అనుమతి లభిస్తుంది.
- బిల్లులను అంగీకరించడానికి, నిరాకరించడానికి మాత్రమే చర్చ పరిమితమవుతుంది.
- హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే ఆ బిల్లును సభ ఆమోదించినట్లు సభాపతి ప్రకటిస్తారు. దీంతో ప్రవేశపెట్టిన సభలో బిల్లు ప్రక్రియ పూర్తి అవుతుంది.
రెండో సభలోకి బిల్లు వెళ్లడం - బిల్లు శాసనంగా మారడానికి ఉభయ సభలు ఆమోదించాలి. ప్రవేశపెట్టిన సభలో బిల్లు ఆమోదించబడిన తరువాత రెండో సభ ఆమోదానికి పంపుతారు.
- ఈ సభలో కూడా బిల్లు మూడు దశల్లో వెళ్లాలి. రెండో సభకు పంపిన బిల్లు కింది విధంగా పరిగణింపవచ్చు.
- ఈ సభ బిల్లును పూర్తిగా తిరస్కరించవచ్చు.
- బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన సభ పునఃపరిశీలనకు పంపవచ్చు. ఒకవేళ రెండో సభ చేసిన సవరణను మొదటి సభ అంగీకరించినట్లయితే ఆ బిల్లు సవరణను అనుకూలంగా రెండు సభలు ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. ఒక వేళ రెండో సభ సూచించిన సవరణను మొదటి సభ వ్యతిరేకిస్తే ఆ బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది.
- రెండో సభకు పంపబడిన బిల్లులపై ఆ సభ ఎలాంటి చర్య తీసుకోకుండా అలాగే ఉండవచ్చు. రెండో సభ ఏ అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా బిల్లును వాయిదా వేయడం లేదా ఆ సభ ఆ బిల్లును ఆరు మాసాలకు మించి అట్టిపెడితే ఈ సందర్భంలో కూడా ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది.
ఆమోద దశ
- ఉభయ సభలు వేర్వేరుగా గాని, సంయుక్తంగా గానీ ఆమోదించిన తర్వాత ఆ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం
పంపుతారు. - రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుంది.
- ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
- రాష్ట్రపతి బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా పార్లమెంటు పునఃపరిశీలనకు పంపవచ్చు.
- పార్లమెంటు పునఃపరిశీలన తర్వాత పంపిన బిల్లును (రాష్ట్రపతి సూచించిన సవరణను అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా) రాష్ట్రపతి తప్పక ఆమోదించాలి. తిరస్కరించలేడు.
ఉభయ సభల సంయుక్త సమావేశం – ప్రకరణ 108(1) - ఉభయ సభల మధ్య పైన పేర్కొన్న సందర్భాల్లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రకరణ 108 ప్రకారం
రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. - ఈ సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్, అతడు లేని సమయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
గమనిక: సంయుక్త సమావేశంలో బిల్లులను మొత్తం సభ్యుల్లో హాజరై ఓటు వేసిన వారిలో మెజారిటీ సభ్యులు
ఆమోదించాలి.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు