Indian Polity | స్వతంత్రత ఎక్కువ… కాలపరిమితి వరకే బాధ్యత
కమిటీ పద్ధతి
ఇటీవల కాలంలో శాసన సభలు శాసన నిర్మాణంతోపాటు అనేక కర్తవ్యాలను నిర్వహించవలసి వస్తుంది. అదే విధంగా శాసన నిర్మాణంలో అనేక సాంకేతిక విషయాలు చేసుకుంటున్నాయి. సాధారణంగా శాసనసభ్యులు వివిధ అంశాలపై
సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానం కలిగి ఉండరు. అందువల్ల శాసనసభల కార్యభారాన్ని తగ్గించి వాటి సామర్థ్యాన్ని పెంచడానికి శాసనసభలు కమిటీ పద్ధతిని అనుసరిస్తున్నాయి.
- కమిటీ పద్ధతి గురించి ప్రొఫెసర్ మారిస్‌జోన్స్ శాసనసభల సామర్థ్యం వాటికి ఉండే కమిటీలను బట్టి గ్రహించవచ్చు. కమిటీల సహాయం లేనిదే శాసనసభలు సామర్థ్యంతో తమ బాధ్యతను సరిగా నిర్వహించలేవు అని పేర్కొన్నారు.
కమిటీ-అర్థం - కమిటీ అనే ఆంగ్లపదం ‘కమియన్’ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఆవిర్భవించింది. కమియన్ అంటే విశ్వాసం అని అర్థం. ఏదైనా వ్యవహారాన్ని / అంశాన్ని పరిశీలించి దానిపై ఒక నివేదికను తయారు చేయడానికి నియమించే వ్యక్తుల సమూహాన్ని కమిటీ అని చెప్పవచ్చు.
- శాసన సభకు సంబంధించినంత వరకు ఒకానొక వ్యవహారం లేదా అంశానికి సంబంధించిన విషయాలను పరిశీలించి, వాటిపై ఒక నివేదికను తయారు చేయడానికి ఒక ప్రజాప్రతినిధి లేదా శాసనసభా ప్రతినిధుల బృందాన్ని కమిటీగా వ్యవహరిస్తారు.
- పార్లమెంటరీ ప్రభుత్వానికి మాతృక అయిన బ్రిటన్ ‘కమిటీ పద్ధతి’ ని మొదటిసారి ప్రవేశ పెట్టింది.
విధులు - ఏదైనా చర్చనీయాంశానికి సంబంధించి అవసరమైన సమాచారాన్ని సేకరించడం లేదా దర్యాప్తు జరపడం లేదా ఏదైనా అంశానికి సంబంధించిన వివరాలను సేకరించడం కమిటీల బాధ్యత.
కమిటీ పద్ధతి- లక్షణాలు
- కమిటీలు సర్వస్వంతంత్రమైనవి కావు. వాటిని శాసనసభలు తమ అవసరార్థం నియమిస్తాయి.
- కమిటీలు శాసనసభకు బాధ్యత వహిస్తాయి.
- కమిటీలకు సొంత పరిధి అంటూ ఏదీ ఉండదు.
- కమిటీలు తాత్కాలికమైనవి. అవి తమ బాధ్యతలు నెరవేర్చడంతో రద్దవుతాయి.
- కమిటీల్లోని సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు.
- కమిటీలోని సభ్యులు మెజారిటీ నిర్ణయం మేరకు కమిటీ తన అంతిమ నివేదికను శాసనసభకు సమర్పిస్తుంది. అయితే కమిటీ నిర్ణయాలతో విభేదించిన కమిటీ సభ్యుడు తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించవచ్చు .
కమిటీల వర్గీకరణ - కమిటీలను 2రకాలుగా వర్గీకరించవచ్చు
స్థాయి కమిటీలు - ఈ కమిటీల పదవీకాలం సాధారణంగా శాసనసభా పదవీకాలంతో సమానంగా ఉంటుంది. నెరవేర్చే విధులను బట్టి వారికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలతోపాటు హోదాను కల్పిస్తారు. కమిటీలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు.
1) పాలనా సంబంధమైన కమిటీలు
2) విచారణ కమిటీలు
3) ఆర్థిక కమిటీలు
4) పరిశీలన కమిటీలు
5) సాధారణమైన కమిటీలు
6) తాత్కాలికమైన కమిటీలు - ఈ కమిటీలు తాత్కాలికంగా ఏర్పాటవుతాయి. వాటి బాధ్యతలు పూర్తయిన వెంటనే అంతరించి పోతాయి.
కమిటీ పద్ధతి ప్రయోజనాలు
శాసనసభ్యులు తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
- నిర్దిష్ట అంశాలపై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న సభ్యులు శాసనసభ చేత ఒక కమిటీ సభ్యులుగా నియమించబడతారు.ఈ సభ్యులు తాము పరిశీలన జరిపే విషయాల గురించి మేధావులతో చర్చించడానికి అవకాశం కలుగుతుంది. కమిటీలోని సభ్యుల్లో కొందరు విషయ నిష్ణాతులైన సీనియర్ సభ్యులుండవచ్చు. ఇలాంటివారితో జూనియర్ సభ్యులు కలిసి పనిచేయడం వల్ల తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని కమిటీ పద్ధతి కల్పిస్తుంది.
శాసనసభా కాలం వృథాకాదు - కమిటీల నివేదికల్లోని సిఫారసుల మేరకు శాసనసభ బిల్లులను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో జరుగుతుంది. దీనివల్ల శాససభా కాలం వృథాకాదు. తక్కువ కాలంలో ఎక్కువ పనిని శాసనసభలు చేయడానికి కమిటీ పద్ధతి వీలు కల్పిస్తుంది.
శాసనసభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశం - శాసనసభ సభ్యులు ఆసక్తులను బట్టి కమిటీలో వారికి సభ్యత్వం కల్పించబడుతుంది. కాబట్టి సభలోని సభ్యులుగా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తారు.
చట్టాల నాణ్యత పెరుగుతుంది: - కమిటీల పద్ధతిలో శాసనసభలో కంటే మరింత క్షుణ్ణంగా బిల్లులను అనేక కోణాల్లో పరిశీలించి విషయ పరిజ్ఞానాన్ని అనేక మార్గాల ద్వారా సేకరించి నిష్పక్షపాతంగా తమ సిఫారసులను నివేదికలో పొందుపరిచి సభకు సమర్పిస్తాయి. వీటిని ఆధారంగా చేసుకొని రూపొందించే చట్టాలు సహజంగానే నాణ్యత కలిగి ఉంటాయి.
శాసనసభలు తొందరపాటుతో చేసే నిర్ణయాలను నిరోధించవచ్చు - శాసనసభ ప్రతినిధులు కొన్ని సందర్భాల్లో గొప్పలకు పోయి/ అవేశాలకు లోనయి తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అనర్థాలకు దారితీయవచ్చు. ఇటువంటి పరిస్థితులు కమిటీల్లో ఉండవు. విషయ పరిజ్ఞానం ఉన్న కమిటీ సభ్యులు ప్రశాంత వాతావరణంలో అనేక కోణాల్లో పరిశీలించి, అత్యంత పటిష్టంగా రూపొందించిన సిఫారసులతో కూడిన నివేదికలు శాసనసభలు తొందరపాటుతో చేసే నిర్ణయాలను నిరోధిస్తాయి
ప్రజాభిప్రాయానికి విలువ - కమిటీలు బిల్లులను పరిశీలించేటప్పుడు సంబంధిత పాలనాశాఖాధికారుల నుంచి వివరాలను సేకరించటంతోపాటు అవి అమలైతే వాటిని ఉపయోగించుకొనే లబ్ధిదారుల నుంచి/ప్రభావ వర్గాల నుంచి అభిప్రాయాలను ముందస్తుగా పరిగణనలోకి తీసుకొని నివేదికలను రూపొందిస్తాయి.
కమిటీ పద్ధతి- లోపాలు
కమిటీల వల్ల శాసనసభల ప్రాధాన్యం తగ్గుతుంది.
- విశేష నైపుణ్యంతో పనిచేసే కమిటీల ప్రాధాన్యం పెరగటం వల్ల శాసనసభల ప్రాధాన్యం తగ్గుతుంది.
- ప్రతి కమిటీ ఏదో ఒక బిల్లుకే పరిమితం కావటం వల్ల విభిన్న కమిటీలు ప్రతిపాదించే బిల్లుల మధ్య సమన్వయం తక్కువగా ఉంటుంది. తత్ఫలితంగా శాసనసభ రూపొందించే చట్టాల్లో కూడా సమన్వయ లోపం కనిపిస్తుంది.
- కొన్ని సందర్భాల్లో కమిటీలు శాసన సభలకు సమర్పించిన నివేదికలను సమయాభావంతో శాసనసభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించవచ్చు.
- ఆ పరిస్థితుల్లో చాలా మంది సభ్యులు చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉండదు. కాబట్టి కమిటీలు సమర్పించిన నివేదికలు శాసనసభ అభిప్రాయాలను పూర్తిగా వ్యక్తం చేయలేవు.
- సాధారణంగా కమిటీల్లో కొద్దిమంది సభ్యులే ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కమిటీలు ప్రభుత్వం కల్పించే ప్రలోభాలకు లోనయి ప్రజావ్యతిరేక బిల్లులను సమర్థించే అవకాశాలుంటాయి.
- శాసననిర్మాణం దాదాపు కమిటీల ద్వారా జరగటం వల్ల శాసనసభ్యులకు శాసన నిర్మాణంలో అసక్తి తగ్గుతుంది. శాసన సభ్యులు శాసనసభలో జరిగే చర్చల్లో కంటే కమిటీ పనివిధానం గురించే ఆలోచించటం వల్ల శాసన నిర్మాణ వ్యవస్థగా శాసనసభ సభ్యులు చురుకుగా పాల్గొనలేకపోతున్నారు.
- ప్రతి విషయం కమిటీలోనే పరిష్కారం కావటంతో శాసనసభ కేవలం బిల్లులను ఆమోదించే సభగానే పరిమితమైపోతుంది.
- బాసిల్ఛబ్ అనే శాస్త్రవేత్త తన గ్రంథమైన ‘ది కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్ పెండేచర్లో కమిటీలోని సభ్యులందరూ సమావేశాల్లో చురుకుగా పాల్లొనలేకపోతున్నారని, కొందరు సభ్యులైతే సమావేశాలకే హాజరు కావటం లేదని, మరికొందరైతే స్పీకర్ నిర్బంధానికి లోనయి సమావేశాల్లో పాల్గొంటున్నారని, ఇంకొంతమంది నామ మాత్రంగా కమిటీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, మరికొందరు ఇతర సభ్యులు తీసుకున్న నిర్ణయాలతో ఏకీభవిస్తూ కేవలం నివేదికలపై సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు.
నియోజిత శాసనాధికారం/ దత్త శాసనాధికారం
- కార్యనిర్వాహక వర్గానికి శాసన నిర్మాణ సభ ప్రసాదించే శాసన నిర్మాణాధికారాన్ని నియోజిత శాసనం లేదా దత్త శాసనం అంటారు. (దీన్నే కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణం’, ‘ఉత్పన్న శాసన నిర్మాణాధికారం’, ‘ఆధీన శాసన నిర్మాణాధికారం’ అని కూడా పిలుస్తారు)
- దీనివల్ల కార్య నిర్వాహక వర్గం అధికారాలు, విధులు అపారంగా పెరిగిపోయాయి.
- ఆధునిక కాలంలో శ్రేయోరాజ్యం భావన వల్ల రాజ్యవిధులు నిబంధనలను రూపొందించటం పరిమిత కాలరీత్యా శాసనసభకు సాధ్యం కావట్లేదు.
- అందువల్ల శాసననిర్మాణ సభలు చట్టాల స్థూల రేఖా బిల్లులను మాత్రమే రూపొందించి, మిగిలిన వివరాలన్నింటిని పూర్తి చేసి సవివర సమగ్ర చట్టాలను రూపొందించే అధికారాన్ని / బాధ్యతను కార్యనిర్వాహక వర్గానికి అప్పగించాల్సిన అవశ్యకత ఏర్పడింది.
ప్రయోజనాలు
శాసన నిర్మాణ సభ కాలం వృథా కాదు
- శాసన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించవలసిన అవసరం శాసనసభకు ఉండక పోవడం వల్ల అది రాజ్యానికి సంబంధించిన ముఖ్య సమస్యలపై తన దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది.
- కాలానుగుణంగా మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేర్పులకు కార్యనిర్వాహకశాఖ సమర్థవం తం చేయగులుగుతుంది.
- అనుకోకుండా వచ్చే పరిణామాలకు అనుగుణంగా నియమ నిబంధనలను రూపొందించుకునే అధికారాన్ని అధికారులకు ఇవ్వడం వల్ల నిపుణుల పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకొనే అవకాశం ఏర్పడుతుంది.
- కార్యనిర్వాహక వర్గానికి క్షేత్రస్థాయిలో కూడా మంచి పట్టు వుండటంతో వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకొని దానికనుగుణంగా చట్టాల రూపకల్పన చేయగలుగుతుంది.
- శాసనసభ కొన్ని కాలాల్లో / సమయాల్లో సమావేశంలో ఉండదు. అటువంటప్పుడు శాసనసభ ఏవైన విధాన పరమైన చర్యల్ని తీసుకోవలసివస్తే కార్యనిర్వాహక వర్గమే వాటిని నిర్వర్తించవలసి ఉంటుంది.
లోపాలు
- ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రకారం శాసనసభ, కార్యనిర్వాహక శాఖను నియంత్రించాలి. కానీ దత్త శాసనాధికారం వల్ల శాసన శాఖను కార్యనిర్వాహక శాఖ నియంత్రించే పరిస్థితి తలెత్తుతుంది. దీనివల్ల కార్యనిర్వాహక శాఖ నిరంకుశత్వం పెరిగి ఒక ఉదాసీనత వైఖరిలోకి శాసన శాఖ నెట్టివేయబడుతుంది. తత్ఫలితంగా వ్యక్తిస్వేచ్చకు ప్రమాదం ఏర్పడే అవకాశముంది.
- దత్త శాసనాధికారం వల్ల కార్యనిర్వాహక వర్గం అధికారాలు పెరిగి నియంతృత్వ పోకడలతో అవినీతి కార్యకలాపాలకు పాల్పడే అవకాశముంది.
- కార్యనిర్వాహక వర్గం తమకు కేటాయించిన టార్గెట్స్‌ను పూర్తి చేయాలనే అత్యుత్సాహంతో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు.
- కార్యనిర్వాహక వర్గానికి శాసనాధికారాలు దత్తత చేయడం అనేది ఒక నవ్య నియంతృత్వానికి దారితీస్తుందని ప్రఖ్యాత ప్రజాస్వామ్యవాది ‘సర్ జాన్ మరియట్’ వ్యాఖ్యానించారు.
దత్త శాసనాలపైన శాసన నియంత్రణ - సంక్షేమ రాజ్యంలో దత్త శాసనాలు అనివార్యం, అవసరమైన చెడు. అలాంటప్పుడు ఆ చెడును తగ్గించే చర్యలు వాటి పరిణామాల్ని తగ్గించే చర్యలు కూడా చేపట్టాలి. దీని కోసమే రాజ్యాగంలో పార్లమెంటరీ రూల్స్, ప్రొసీజర్స్లోను ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
- దత్త శాసనాలపై పార్లమెంట్లో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దత్త శాసనాలకు సంబంధించిన అన్ని అంశాల్ని సమగ్రంగా పరిశీలించి రూపొందించి పర్యవేక్షణ చేస్తుంది.
- దత్త శాసనాలు మూల చట్టాలకు అనుగుణంగా ఉండేలా అలాగే వాటి అమల్లో ప్రభుత్వాధికారులకు ఎక్కువ విచక్షణాధికారాలు ఉండకుండా నిర్దిష్టమైన నిర్వచనాలు, పరిమితులు, పరిధులు పేర్కొంది.
- దత్త శాసనాలు, కార్యనిర్వాహక విధుల్ని అధికారాల్ని విస్తృతం చేస్తాయి. అలాంటప్పుడు శాసనశాఖ వాటిపై నిరంతర పర్యవేక్షణ కలిగి తగిన అంక్షలను విధించాలి.
- ఇతర పరిరక్షణలు లేదా పద్ధతులు
- దత్తత చేస్తున్న ప్రతి నిబంధనను, క్లాజ్‌ను, సబ్ క్లాజ్‌ను ఎక్స్ప్లరేటరీ లేదా వివరణాత్మక సూచిక రూపంలో పొందుపరచాలి.
- దత్త శాసనాలపైన న్యాయస్థానాల జోక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదు. న్యాయసమీక్షకు అవకాశం ఉండాలి.
- ప్రభావితమవుతున్న శాఖల్ని ముందుగానే సంప్రదించాలి.
- దత్తత చేయబడుతున్న అన్ని అంశాలపైన ఏక రూపతలో ఉన్న ప్రక్రియల్ని ఆమోదించాలి.
- దత్త శాసనాన్ని విశ్వసనీయమైన శాఖలకు అధికార వ్యవస్థకి అప్పగించాలి.
- దత్తత చేసిన అన్ని అంశాలపైన డాక్యుమెంటేషన్ చేయాలి.
- ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతుల్ని యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
Indian Polity, TSPSC, Competitive exams, groups special
Previous article
DEET Recruitment 2023 | ‘డీట్’లో ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు