Indian Polity | అత్యవసర పరిస్థితి.. ప్రతి పొడిగింపులో పరిమితి
అత్యవసర/అత్యయిక అధికారాలు
అర్థ వివరణ
దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా (బాహ్య లేదా అంతర్గత) దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తే, అలాంటి పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తారు.
అత్యవసర పరిస్థితి-రాజ్యాంగ స్థానం
- అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలను రాజ్యాంగంలో పొందుపరచాలని రాజ్యాంగ పరిషత్‌లో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి. క్రిష్ణమాచారి, డా.బీఆర్ అంబేద్కర్ సమర్థించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా కేంద్రానికి ప్రత్యేక అధికారాలు అనివార్యమని, వీటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
- వీటిని మృత ప్రకరణలుగా (Death Articles) పరిగణించవచ్చని వ్యాఖ్యానించారు. అయితే అత్యవసర అధికారాలను వ్యతిరేకించిన వారిలో ముఖ్యులు హెచ్.వి.కామత్, ప్రొ.కె.టి.షా, సి.డి. దేశ్‌ముఖ్.
- భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ప్రకరణ 352 నుంచి 360 వరకు మూడు రకాలైన అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు.
- అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఐక్యత, రక్షణలను పరిరక్షించడానికి అత్యవసర అధికారాలను పొందుపరచడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి.
అత్యవసర పరిస్థితులు- రకాలు
రాజ్యాంగంలో మూడు రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్కొన్నారు.
1. జాతీయ అత్యవసర పరిస్థితి- ప్రకరణ 352
2. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన- ప్రకరణ 356
3. ఆర్థిక అత్యవసర పరిస్థితి- ప్రకరణ 360
జాతీయ అత్యవసర పరిస్థితి - జాతీయ అత్యవసర పరిస్థితిని రెండు కారణాల వల్ల విధించవచ్చు.
బాహ్య కారణాలు - విదేశీ దాడి, యుద్ధం మొదలైన కారణాల వల్ల దేశ సమగ్రతకు భంగం కలిగినప్పుడు లేదా కలుగుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
అంతర్గత కారణాలు - దేశంలో అంతర్గత కల్లోలం ఏర్పడినప్పుడు, తద్వారా దేశ ఐక్యతకు, సమగ్రతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారు.
- 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అంతర్గత కల్లోలం అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు.
- ప్రస్తుతం అంతర్గత కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించాలంటే సాయుధ తిరుగుబాటు అనే కారణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.
- గమనిక: జాతీయ అత్యవసర పరిస్థితిని దేశ వ్యాప్తంగా కానీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో కానీ లేదా ఒక రాష్ట్రంలో కానీ లేదా ఒక రాష్ట్రంలోని కొంత భాగంలో గానీ విధించవచ్చు. ఈ ఏర్పాటును 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
- ప్రధానమంత్రి అధ్యక్షతన గల క్యాబినెట్ స్థాయి మంత్రుల లిఖితపూర్వకమైన సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు.
- క్యాబినెట్, లిఖితపూర్వక అనే పదాలను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 352కు చేర్చారు. (ఈ సవరణకు పూర్వం మంత్రిమండలి సాధారణ సలహా మాత్రమే ఉండేది)
- రాష్ట్రపతి జారీ చేసిన అత్యవసర పరిస్థితిని పార్లమెంటు 30 రోజుల లోపే (జారీ చేసిన రోజు నుంచి) ప్రత్యేక మెజారిటీతో అంటే 2/3 వంతు హాజరై ఓటు వేయాలి. ఆ మెజారిటీ సభలోని మొత్తం సభ్యుల్లో సగానికంటే తగ్గరాదు.
- మౌలిక రాజ్యాంగంలో పార్లమెంటు రెండు నెలల్లోగా ఆమోదించాలని ఉండేది. దాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక నెలకు తగ్గించారు.
- రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించే సమయానికి లోక్‌సభ రద్దయినా లేదా విధించిన రోజు నుంచి 30 రోజుల లోపు అత్యవసర పరిస్థితిని ఆమోదించకుండా రద్దయినా తిరిగి కొత్త లోక్‌సభ ఏర్పడిన రోజు నుంచి 30 రోజుల లోపల రాష్ట్రపతి ఆదేశాన్ని లోక్‌సభ ఆమోదించాల్సి ఉంటుంది.
- ఈ మధ్య కాలంలో రాజ్యసభ ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. లేదంటే 30 రోజుల తర్వాత అత్యవసర పరిస్థితి దానంతట అదే రద్దవుతుంది.
- ఒకసారి పార్లమెంటు ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ఆరు నెలల వరకు అమల్లో ఉంటుంది. (ఆమోదించిన రోజు నుంచి).
- పార్లమెంటు అనుమతితో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్ని పర్యాయాలైనా పొడిగించవచ్చు. (ప్రతి పొడిగింపు ఆరు నెలలే ఉండాలి).
రెండు వేర్వేరు కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించడం- ప్రకరణ 352(9) - రెండు వేర్వేరు కారణాల వల్ల ఒకేసారి అత్యవసర పరిస్థితి విధించడానికి మౌలిక రాజ్యాంగంలో అవకాశం లేదు.
- 1975లో 38వ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేర్వేరు కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించేందుకు అవకాశం కల్పించారు. ఉదా: 1971లో బాహ్య కారణాల వల్ల విధించిన అత్యవసర పరిస్థితి 1977 వరకు కొనసాగింది.
- ఈ పరిస్థితి అమల్లో ఉండగానే అంతరంగిక కారణాల ప్రాతిపదికన అత్యవసర పరిస్థితిని 1975, జూన్ 25న విధించారు.
జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు- ప్రకరణ 352(7, 8) - రాష్ట్రపతి మరొక ఆదేశం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు.
- 1978లో 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించిన తర్వాత అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తారు.
లోక్‌సభ ప్రత్యేక తీర్మానం - లోక్‌సభ సమావేశంలో ఉంటే స్పీకర్‌కు నోటీస్ ఇచ్చి తీర్మానం చేస్తారు. ఒకవేళ లోక్‌సభ ఆ సమయానికి సమావేశంలో లేకపోతే లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో 1/10వ వంతు సభ్యులు, లోక్‌సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్రపతికి నోటీసు ఇస్తారు.
- నోటీసు ఇచ్చిన 14 రోజుల లోపే రాష్ట్రపతి లోక్‌సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. లోక్‌సభ సాధారణ తీర్మానం మేరకు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తారు.
జాతీయ అత్యవసర పరిస్థితి-పర్యవసానాలు
- జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు దేశంలో వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
- కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం
- లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలపై ప్రభావం
- ప్రాథమిక హక్కులపై ప్రభావం
- ఆర్థిక సంబంధాలపై ప్రభావం
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం - జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కేంద్రం, రాష్ట్ర సంబంధాల మధ్య మౌలిక మార్పులు సంభవిస్తాయి. అవి..
కార్యనిర్వాహక అధికారాలపై ప్రభావం - కేంద్ర కార్యనిర్వాహక వర్గం అధికారాలు విస్తృతమవుతాయి.
- రాష్ర్టాలకు అన్ని అంశాలపై కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావు. కానీ వాటి అధికారాలన్నీ కేంద్ర నియంత్రణలోకి వస్తాయి.
శాసన అధికారాలపై ప్రభావం - రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపైన పార్లమెంటు చట్టాలు చేయవచ్చు కానీ రాష్ట్ర శాసనసభలు రద్దు కావు.
- పార్లమెంటు ఆ విధంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై చేసిన చట్టాలు అత్యవసర పరిస్థితి రద్దు చేసిన తర్వాత ఆరు నెలల వరకు అమల్లో ఉంటాయి. ఆరు నెలల తర్వాత రద్దవుతాయి.
- పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర జాబితాలో చేయవచ్చు.
ఆర్థిక అధికారాలపై ప్రభావం - కేంద్ర, రాష్ర్టాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. సాధారణ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ర్టాల మధ్య విభజింపబడే వనరులు రద్దు కావచ్చు లేదా కేంద్రానికి బదలాయించవచ్చు.
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలపై ప్రభావం - జాతీయ అత్యవసర పరిస్థితుల్లో లోక్‌సభ సాధారణ పదవీ కాలాన్ని ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చు. ఇలా ఎన్ని పర్యాయాలైనా పొడిగించవచ్చు. అయితే అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ పొడిగించటానికి వీలు లేదు.
ప్రత్యేక వివరణ - 1975లో ఐదో లోక్‌సభ పదవీ కాలాన్ని పొడిగించారు.
- ఐదో లోక్‌సభ 1976, మార్చి 18 వరకు ముగియాల్సి ఉంది. అయితే దీన్ని 1977, మార్చి 18 వరకు పొడిగించారు. కానీ మధ్యలోనే 1977 జనవరి 18న రద్దు చేయడం జరిగింది.
- మొత్తానికి ఐదో లోక్‌సభ ఐదు సంవత్సరాల 10 నెలలు కొనసాగింది. ఇదే సుదీర్ఘ లోక్‌సభ.
- అలాగే రాష్ట్ర శాసనసభ పదవీ కాలాన్ని కూడా పార్లమెంటు ఒక సంవత్సరం వరకు పొడిగించవచ్చు. ఇలా ఎన్ని పర్యాయాలైనా పొడిగించవచ్చు.
- గమనిక: అత్యవసర పరిస్థితి కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదో అసెంబ్లీని కూడా 1977 నుంచి 78 వరకు ఒక సంవత్సరం పాటు పొడిగించారు.
- అలాగే కేరళ అసెంబ్లీ పదవీ కాలాన్ని కూడా రెండుసార్లు పొడిగించారు.
ప్రాథమిక హక్కులపై ప్రభావం - జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ప్రాథమిక హక్కులపై ప్రభావాన్ని ప్రకరణ 358, 359లో వివరించారు.
- ప్రకరణ 19లో పేర్కొన్న ప్రాథమిక హక్కులపై అత్యవసర పరిస్థితి ప్రభావాన్ని గురించి ప్రకరణ 358 తెలుపుతుంది.
- ప్రకరణ 358 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ప్రకరణ 19లో పేర్కొన్న ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలు వాటంతట అవే రద్దవుతాయి.
- ప్రభుత్వం ఈ స్వేచ్ఛలపై పూర్తిగా పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు లేదు.
- అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత ప్రకరణ 19లోని స్వేచ్ఛలు వాటంతట అవే పునరుద్ధరించబడతాయి. అయితే రద్దయిన కాలంలో జరిగిన సంఘటనలు/ఉల్లంఘనలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలులేదు.
- 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ స్వేచ్ఛలపై కొన్ని పరిమితులు విధించారు. బాహ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు మాత్రమే ప్రకరణ 19లోని స్వేచ్ఛలు పరిమితమవుతాయి.
- సాయుధ తిరుగుబాటు కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు వీటిపైన ప్రభావం ఉండదు.
- అత్యవసర పరిస్థితికి సంబంధించిన చట్టాలకు మాత్రమే పరిరక్షణ ఉంటుంది. ఇతర చట్టాల ద్వారా స్వేచ్ఛలపై పరిమితులు విధించడానికి వీలు లేదు.
- ప్రకరణ 359 ఇతర ప్రాథమిక హక్కులపై ప్రభావాన్ని గురించి తెలుపుతుంది.
- ప్రకరణ 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు వాటంతట అవే రద్దు కావు.
- నిర్దేశించిన కాలపరిమితికి ఒక నోటిఫికేషన్ ద్వారా వాటి అమలును రాష్ట్రపతి రద్దు చేస్తారు. ఈ సందర్భంలో ప్రాథమిక హక్కుల అమలు మాత్రమే రద్దవుతుంది.
- ప్రకరణ 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ప్రాథమిక హక్కుల అమలు ఉండదు. కానీ ప్రకరణలు 20, 21లను రద్దు నుంచి మినహాయిస్తారు. వాటి అమలు ఉంటుంది.
- ప్రత్యేక వివరణ: 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 359 ప్రభావాన్ని కొంతవరకు పరిమితం చేశారు.
జీబీకే పబ్లికేషన్స్, హైదరాబాద్, 8187826293
Previous article
Geography | ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు