Indian Polity | మేధావుల చేరిక.. పాత కొత్తల మేలు కలయిక
Indian Polity | రెండు సభలను కలిగి ఉండే శాసనసభను ద్వంద్వ శాసనసభ అంటారు. ఈ రెండు సభలను ఎగువసభ, దిగువ సభ అని పిలుస్తారు. ప్రపంచంలోని చాలా దేశాలు రెండు సభలతో కూడిన శాసనసభలను ఏర్పాటు చేసుకున్నాయి.
సాధారణంగా పెద్ద రాజ్యాలు, సమాఖ్య వ్యవస్థ కలిగి ఉన్న రాజ్యాలు తమ చట్టాలను రూపొందించుకోవడానికి ద్విశాసనసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విధానం బ్రిటన్ ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, భారతదేశాల్లో అమల్లో ఉంది.
ద్వి శాసనసభా విధానం
- ద్విశాసనసభా విధానంలో దిగువసభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం వల్ల ప్రభుత్వ ఖర్చులను మంజూరు చేసే అధికారంతోపాటు పన్నులను విధించే అధికారం కూడా దిగువ సభకే ఉంటుంది. అందువల్ల రెండు సభల్లో దిగువ సభయే శక్తిమంతంగా ఉంటుంది.
ద్విసభా విధానంలో ఎగువ సభ ప్రతినిధుల నిమామక పద్ధతులు
ప్రత్యక్ష ఎన్నిక: కొన్ని దేశాల్లో ఎగువసభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
ఉదా: ఆస్ట్రేలియాలోని 6 రాష్ర్టాలు 10 మంది ప్రతినిధుల చొప్పున ఎగువసభ అయిన సెనెట్‌కు ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు.
అమెరికాలో ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఎగువసభ అయిన సెనెట్‌కు ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.
పరోక్ష ఎన్నిక : కొన్ని దేశాల్లో ఎగువసభ సభ్యులను పరోక్ష ఎన్నిక పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు.
ఉదా: ఐర్లాండ్, ఫ్రెంచ్‌లోని సెనెట్ - మనదేశంలో రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసససభల సభ్యులు ఎన్నుకుంటారు.
కార్యనిర్వాహక శాఖతో నియామకం: కొన్ని దేశాల్లో ఎగువ సభ సభ్యులను కార్యనిర్వాహకశాఖ నామినేట్ చేస్తుంది.
ఉదా: కెనడాలో వివిధ రంగాల్లోని ప్రముఖులను జీవితకాలానికి గవర్నర్ జనరల్ సెనేట్‌కు నామినేట్ చేస్తారు. - భారతదేశంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
వారసత్వం: బ్రిటన్‌లో ఈ పద్ధతి నేటికీ అమల్లో ఉంది. బ్రిటన్‌లోని హౌస్‌ఆఫ్ లార్డ్స్‌కు హౌస్ ఆఫ్ లార్డ్స్‌ను, స్పిరిచ్యువల్ లార్డ్స్‌ను, పేర్స్ను, మహిళాపేర్స్ను జీవితకాలానికి రాజు/ రాణి నియమిస్తారు. సభ్యుల మరణానంతరం అతడి సంతతికి చెందినవారు వారసత్వ సూత్రం ప్రకారం సభ్యులుగా కొనసాగుతారు.
ద్విసభా విధానం ప్రయోజనాలు
- చట్టనిర్మాణంలో తొందరపాటును నివారిస్తుంది
- దిగువసభ సభ్యులు అనాలొచితంగా , తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు కొన్ని సార్లు విపరీత పరిణామాలకు దారితీసే అవకాశముంటుంది. కాబట్టి దిగువసభ కంటే వయస్సులోనూ, అనుభవంలోనూ నిపుణులైన మేధావులున్న ఎగువసభ, దిగువసభ చేసే తొందరపాటు నిర్ణయాలను పరిశీలించి వాటిలోని లోపాలను సవరించగలుగుతుంది. అందుకే జవహర్లాల్ నెహ్రూ తొందరపాటుతో దిగువసభ తీసుకున్న నిర్ణయాలపై ఎగువసభ ఒక బ్రేకులాగా పని చేస్తుందని పేర్కొన్నారు.
- అదేవిధంగా దిగువసభ చేసే అపరిపక్వ నిర్ణయాలకు ఎగువసభ తన మితవాద వైఖరితో అడ్డుకట్ట వేయగలుగుతుందని చెప్పవచ్చు.
ఏకసభా నిరంకుశత్వాన్ని నిరోధిస్తుంది - ఒకే సభ ఉంటే అది తన రాజకీయాధికారంతో, నియంతృత్వ పోకడలతో కార్యనిర్వాహక వర్గం న్యాయవ్యవస్థలపై పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. కానీ ద్విసభా విధానంలో ఎప్పటికప్పుడు ఒక సభ మరొక సభను నియంత్రించడంలో నిరంకుశత్వానికి అవకాముండదు. అందుకే లార్డ్ అక్టన్ ‘రెండవ సభ స్వాతంత్య్రానికి అతి ముఖ్యమైన పూచీకత్తు’ అని తెలిపారు. అదే విధంగా జె.ఎస్.మిల్ మొదటి సభ నియంతృత్వాన్ని రెండవసభ నివారిస్తుందని పేర్కొన్నారు. మరికొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు ద్విసభా విధానంలో రెండు సభల మధ్య అధికారాలు విభజించడం వల్ల ప్రజల స్వేచ్ఛకు అల్పసంఖ్యాకుల స్వాతంత్య్రానికి రక్షణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
మేధావుల ప్రాతినిధ్యం వివిధ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం - సాధారణంగా విజ్ఞానవేత్తలు, మేధావులు, ప్రత్యేక రంగాల్లోని నిపుణులు రాజకీయాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారికి ఎగువసభలో ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వారి సేవలు మొత్తం జాతికి ప్రత్యేకించి అల్పసంఖ్యాక వర్గాల వారికి వృత్తిపరమైన వ్యాపారపరమైన వర్గాల వారి ప్రయోజనాలను కాపాడటం కోసం మేధావులకు ప్రాతినిధ్యం సమకూర్చడానికి ద్విసభా వ్యవస్థ అనుకూలమైంది. అందుకే బ్లంట్షీలి ‘ సమాజంలో అన్ని వర్గాలవారికి తగిన రీతిలో ద్విసభా విధానం ప్రాతినిధ్యం కల్పిస్తుందని పేర్కొన్నారు.
- మనదేశంలో సాహిత్యం, కళలు, శాస్త్రవిజ్ఞానం, సంఘసేవల్లో విశిష్ట స్థానం సంపాదించిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు.
- కెనడాలో గవర్నర్ జనరల్ వివిధ రంగాల్లో నిపుణులైన వారిని సెనెట్‌కు నియమించే అధికారాన్ని కలిగి ఉన్నాడు.
దిగువసభ పనిభారం తగ్గుతుంది - ఆధునిక కాలంలో అనేక రాజ్యాలు శ్రేయోరాజ్యాలు కావడం వల్ల రాజ్యవిధులు పెరిగి, తద్వారా శాసన నిర్మాణ బాధ్యత సంఖ్యాపరంగా పెరగటంతోపాటు శాసనాలు రూపొందించడంలో ప్రత్యేక పరిజ్ఞానం అవసరమవుతుంది. అందువల్ల శాసన నిర్మాణానికి సంబంధించిన విషయాలను చర్చించడానికి ఆలోచించడానికి ఒకే సభ ఉంటే సరిపోదు.
- అంతేకాక శాసన నిర్మాణానికి సంబంధించి కొన్ని కాలపరిమితులు ఉండటం వల్ల ఒకే సభ ప్రతి బిల్లును చర్చించడానికి అవకాశముండదు. ద్విశాసనసభా విధానంలో అయితే దిగువసభతోపాటు ఎగువసభ కూడా శాసన నిర్మాణ బాధ్యతను వహించటంతో దిగువసభకు కొతమేర పనిభారాన్ని తగ్గించడం ద్వారా ఎగువసభ ప్రభుత్వ సామర్ధ్యాన్ని పెంచగలుగుతుంది.
చట్ట సామర్థ్యం పెరుగుతుంది - సాధారణంగా ఎగువసభ సభ్యులు అనుభవజ్ఞులు, మేధావులై ఉంటారు. కాబట్టి వారు దిగువసభ సభ్యులు చేసిన పొరపాట్లను సరిదిద్దడానికి ద్విసభా విధానంలో అవకాశముంటుంది. ఈ విధానంలో తమవద్ద (ఎగువసభ) వచ్చిన బిల్లులను పరిశీలించి చట్టపరంగా వాటిలోని లోపాలను సరిదిద్ది పటిష్టవంతమైన శాసనాలను రూపొందించడానికి ద్విసభా విధానం దోహదపడుతుంది.
ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు ఎక్కువ అవకాశాలుంటాయి - కేంద్రంలో రాష్ర్టాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఎగువసభను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అంతేకాక దిగువసభకు 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటే ఎగువసభలో ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేయడం ద్వారా వారి స్థానంలో కొత్తసభ్యులు ఎన్నికవుతారు. ఇలా కొత్తగా ఎన్నికైన సభ్యులు తాజా ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు దోహదపడతారు. అందుకే ఎగువసభను పాత కొత్తల మేలు కలయికగా వర్ణిస్తారు.
- మనం ముందే చెప్పుకున్నట్లుగా ఎగువ సభలో శాస్త్ర సాంకేతిక, సాహిత్య, వ్యాపార మొదలైన రంగాలకు చెందిన ప్రముఖులను నియమిస్తారు. కాబట్టి ఆయా రంగాలవారి ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే బ్లంట్షీలి ద్విసభా విధానం సమాజంలో అన్నివర్గాలవారికి తగిన రీతిలో ప్రాతినిధ్యం కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సమాఖ్య వ్యవస్థకు అత్యంత ఉపయోగకారి - సమాఖ్య ప్రభుత్వ విధానంలో రాష్ర్టాలకు ప్రాతినిధ్యం కల్పించి తద్వారా శాసన నిర్మాణంలో ఆయా రాష్ర్టాల ప్రయోజనాలను కాపాడి సమాఖ్య ధర్మాన్ని నెరవేరిస్తే దిగువసభ సభ్యులు ప్రజల్లో ప్రత్యక్షంగా ఎన్నికయి ప్రజాభీష్టానికి ప్రాధాన్యతను కల్పిస్తారు. తత్ఫలితంగా ప్రజలకు, రాష్ర్టాలకు వేర్వేరు సభలు ప్రాతినిధ్యం వహించడానికి ద్విశాసనసభా విధానం దోహదపడుతుంది.
ఎగువసభ శాశ్వతంగా ఉండి దేశ ప్రయోజనాలను కాపాడుతుంది. - ద్విశాసనసభా విధానంలో సాధారణంగా దిగువసభను రద్దు చేయడానికి ఎన్నికలు జరిపే కొత్త సభను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగరీత్యా అధికారముంది. కానీ ఎగువసభ శాశ్వతసభ అవడంతో దీన్ని రాజ్యాంగరీత్యా రద్దు చేయడానికి వీలులేదు. అందువల్ల దిగువసభ రద్దయిన కాలంలో కూడా రాజ్యసభ తన విధులను నిర్వహిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడటానికి తనవంతు కృషి చేస్తుంది. కాబట్టి ద్విసభా విధానం ఏర్పాటు అత్యంతావశ్యకం. మొదట ఏకసభను ఏర్పాటు చేసుకున్న అనేక దేశాలు ఆ విధానం విజయవంతం కాకపోవడంతో ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాయని ప్రొ. మెరియట్ పేర్కొన్నారు.
ఉదా: ఫ్రాన్స్, నేపుల్స్ (ఇటలీ) మెక్సికో, బొలీవియా కూడా ద్విసభా విధానాన్ని అనుసరిస్తున్నాయి. - ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రాన్స్‌లో ఏకసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది 1791-93 వరకు అమల్లో ఉంది. 1793లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈవిధానం 1881 వరకు నిరాటంకంగా కొనసాగింది. తర్వాత కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా ప్రస్తుతం ఫ్రాన్స్ ద్విసభా విధానాన్నే కొనసాగిస్తుంది.
ద్విసభా విధానం-లోపాలు
- ఏకసభా పద్ధతిని సమర్థించిన బెంజిమన్ ఫ్రాంక్లిన్, జెరెమీ, బెంథామ్, హెరాల్డ్, జె.లాస్కి, అబ్సీసాయిన్, శామ్యూల్ ఆడమ్స్ మొదలైనవారు ద్విసభా విధానాన్ని వ్యతిరేకించారు. ద్విసభా విధానంలోని లోపాలను కిందివిధంగా వివరించవచ్చు.
ప్రజాభిప్రాయ విభజన - ద్విసభా విధానంలో శాసననిర్మాణ శాఖలో ఉన్న రెండు సభలూ ప్రజలకే ప్రాతినిధ్యం వహిస్తాయి. కొన్ని సందర్భాల్లో వీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఫలితంగా ప్రజాభిప్రాయం రెండుగా చీలిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో సార్వభౌమాధికారం ఏ సభకు ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వం కూడా అదే విధంగా తన పటిష్టతను కోల్పోవడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూడా సందిగ్ధత ఏర్పడే అవకాశముంది.
బాధ్యతల విభజన - ద్విసభా విధానంలో రెండు సభల మధ్య బాధ్యతలు విభజించబడతాయి. దీనివల్ల ప్రజాసంకల్పానికి ప్రాముఖ్యత లేకుండా పోతుంది. అందుకు రెండు సభల సభ్యులు ప్రజల ద్వారా ఎంపికై, సమాన అధికారాలను కలిగి ఉంటే ప్రజా సంకల్పానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది.
- అందుకే ఫ్రాన్స్ రాజకీయ నాయకుడు అబ్బిసాయిన్ శాసనసభ ఒక్కటే ఉండి ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసే వ్యవస్థగా అది ఏదైనా శాసనాన్ని రూపొందిస్తే, అటువంటి శాసనం ప్రజా సంకల్పాన్ని ప్రకటించేదవుతుంది. అలాకాక ఎగువసభ దిగువసభల పేర్లతో రెండు శాసనసభలు ఉంటే ఒకే అంశంపై రెండు సభల మధ్య విరుద్ధమైన అభిప్రాయాలు ఏర్పడితే శాసనసభ సార్వభౌమాధికారం విభక్తమైపోతుంది.
అధిక వ్యయం
- రెండు సభల ఎన్నికలకయ్యే ఖర్చు శాసనసభ సభ్యుల జీతభత్యాలు, ఆయా సభల నిర్వహణకు సహాయపడే ఉద్యోగుల వేతనాలు మొదలైనవాటి వల్ల అధిక ప్రజాధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
అనవసర కాలయాపనకు దారితీస్తుంది - ఒక బిల్లును ఆమోదించే విషయంలో రెండు సభలు వేర్వేరుగా శాసన నిర్మాణ ప్రక్రియను కొనసాగించవలసి ఉంటుంది. దీని వల్ల అనవసర కాలయాపన జరుగుతుంది. అత్యవసర బిల్లుల విషయంలో ఇటువంటి కాలయాపన జరగటం కొన్ని సందర్భాల్లో అధిక నష్టానికి దారితీయవచ్చు. అదే విధంగా ఏదైనా ఒక బిల్లు విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి రావటం మరింత కాలయాపనకు దారితీస్తుంది.
రెండోసభ ఏర్పాటు ప్రజాస్వామ్య విరుద్ధం - ఎగువసభ సభ్యులు పరోక్షంగా ఎనుకోబడతారు. వారు ప్రత్యక్షంగా ప్రజలకు బాధ్యత వహించరు. అంతేకాక ప్రజల మద్దతు లేక ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను ఎగువసభకు నామినేట్ చేస్తున్నారు. ఇది ప్రజా స్వామ్య విరుద్ధం. అంతేకాక ఇలా నియమించే ఎగువసభ సభ్యులు అభివృద్ధి నిరోధక వ్యక్తులుగా పనిచేస్తున్న దాఖలాలున్నాయి.
రెండు సభలకు సమానమైన అధికారాలు లేవు - దిగువసభకు ఉన్నన్ని అధికారాలు ఎగువసభకు లేవు. దానితో అనేక విషయాల్లో ఎగువసభ అలంకార ప్రాయంగా మిగిలిపోతుంది.
- సమాఖ్య స్ఫూర్తిని కాపాడటానికి ఎగువసభ ఉండవలసిన అవసరం లేదు.
- సమాఖ్య వ్యవస్థలో రాష్ర్టాల ప్రయోజనాలను కాపాడటం కోసం ఎగువసభ ఏర్పాటు అవసరం అని కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడటానికి ఎగువసభతో నిమిత్తం లేకుండా దిగువసభ కూడా పనిచేస్తుంది.
వర్గ ప్రాతినిధ్యం అనవసరం
సాధారణంగా ఎగువసభ పెట్టుబడిదారి వర్గాలకు సంప్రదాయ వర్గాలకు ప్రాతినిధ్యం వహించడమే కాక, దిగువసభ కార్యకలాపాలకు అడ్డుకట్టగా వ్యవహరిస్తుంది. ప్రత్యేక వర్గాలకు, మేధావులకు నిజంగానే ప్రాతినిధ్యం కల్పించి న్యాయం చేయాలనుకుంటే వారికి రిజర్వేషన్ ప్రాతిపదికపైన ప్రత్యేక స్థానాలను శాసనసభలో కేటాయించవచ్చు, - ద్విసభా విధానంలో పైన చెప్పుకున్న అనేక లోపాలు ఉన్నప్పటికీ ఈ పద్ధతివల్ల కలిగే ప్రయోజనాలు వాటిని అధిగమించగలుగుతున్నాయి. అందుకే అధునిక కాలంలో ద్విసభా విధానాన్ని ఎక్కువ దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు