Indian Polity | ఎన్నిక ప్రత్యక్షం… ప్రజలు పరోక్షం
కార్యనిర్వాహక శాఖ
- కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అటార్నీ జనరల్‌లు ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.
- భారతదేశం బాధ్యతాయుత పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్థగల దేశం. పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాలైన కార్యనిర్వహణాధికారులు ఉంటారు. ఒకరు రాష్ట్రపతి, రెండోవారు ప్రధానమంత్రి. రాష్ట్రపతి దేశాధినేతగాను, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగాను వ్యవహరిస్తారు. దేశాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణాధికారాలను కలిగి ఉండగా, ప్రధాని అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయిస్తుంది. భారతదేశానికి రాజ్యాంగరీత్యా అధిపతి రాష్ట్రపతి. ప్రభుత్వాధికారమంతా రాష్ట్రపతి పేరుమీద నడుస్తుంది. రాజ్యాంగం రాష్ట్రపతికి అనేక అధికారాలు ప్రసాదించిన వాటన్నింటిని రాష్ట్రపతి మంత్రి మండలి సలహాతోనే చెలాయించాలి. కాబట్టి పాలనాధికారమంతా మంత్రిమండలి ఆధీనంలో ఉంటుంది. ఈ కారణంగా రాష్ట్రపతిని రబ్బరుస్టాంప్గా పేర్కొంటారు. కాబట్టి భారత రాష్ట్రపతిని బ్రిటన్‌లోని రాజమకుటంతో పోల్చడం సరైందే.
- దేశ పరిపాలన రాష్ట్రపతి పేరుమీద నిర్వహించే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు.
- రమ్జనాయ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు(1955), షంషేర్‌సింగ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (1974)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుతాన్ని ఏర్పరచింది కాబట్టి రాష్ట్రపతి కేవలం రాజ్యాధినేత మాత్రమే అని ప్రధాన మంత్రి ప్రభుత్వాధినేత అని స్పష్టం చేసింది.
- భారత రాజ్యాంగంలోని ప్రకరణ 52 నుంచి ప్రకరణ 62 వరకు గల 11 ప్రకరణల్లో రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేందుకు కావలసిన అర్హతలు, ఎన్నిక విధానం, పదవీకాలం, ఎన్నికల గుడువు తొలగింపు పద్ధతి మొదలైనవి పేర్కొన్నారు.
- ప్రకరణ 52 ప్రకారం దేశానికి రాష్ట్రపతి ఉంటాడు.
- ప్రకరణ 53 ప్రకారం రాష్ట్రపతే సర్వోన్నత కార్యనిర్వాహణాధికారి
- 53(1) ప్రకారం భారతదేశ కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. యూనియన్ కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతికి అప్పగించడమైంది. ఈ సర్వోన్నత అధికారాన్ని రాష్ట్రపతి స్వయంగా గానీ లేదా తన కింది అధికారుల ద్వారా గానీ రాజ్యాంగానికి అనుగుణంగా చెలాయిస్తాడు.
- ప్రకరణ 53(2) ప్రకారం త్రివిధ సాయుధదళాలకు రాష్ట్రపతి సర్వోన్నతాధికారి.
- 53(3) (ఎ) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక శాసనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారాలను తన ఇతర అథారిటీకి చెందిన అధికారాలను గాని రాష్ట్రపతికి బదలాయించరాదు.
- 53(3)(బి) ప్రకారం ఏమైనా అధికారాలను ఇతర అథారిటీకి సక్రమింపజేస్తూ శాసనాలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. (క్లాజు (3) రాష్ట్రపతి అధికారాలపై పరిమితులను విధిస్తుంది)
- రాష్ట్రపతి హోదాను 53వ ప్రకరణ తెలియజేస్తుంది. రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారాలు ఏవి అనేది రాజ్యాంగంలో నిర్వచించలేదు.
- ప్రకరణ 54 రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేవారి గురించి తెలియజేస్తుంది.
- ప్రకరణ 54 ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక ఒక ఎలక్టోరల్ (ప్రత్యేక ఎన్నికల గణం) కాలేజీ ద్వారా జరుగుతుంది.
- ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు, రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు.
- 76వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రకరణ 54, 55లకు సంబంధించి రాష్ర్టాలు అనే పదం కింద ఢిల్లీ, పుదుచ్ఛేరి కూడా వస్తాయి.
- 70వ రాజ్యాంగ సవరణను 1992లో చేశారు. ఈ సవరణ ద్వారా రాష్ర్టాలు అనే పదం కిందికి కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్ఛేరి శాసనసభ్యులను కూడా ఎలక్టోరల్ కాలేజీలో చేర్చారు. ఇది 1995 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీరు మొదటగా 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు.
- రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష విధానంలో జరుగుతుంది. ప్రజలు నేరుగా రాష్ట్రపతిని ఎన్నుకోరు. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ర్టాల శాసనసభల్లో నామినేట్ చేసిన సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు ఉండదు.
- రాష్ర్టాల్లోని శాసనమండలి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు ఉండదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతికి ఓటుహక్కు ఉండదు. ఎందుకంటే అతను ఏ సభలోను సభ్యుడు కాదు. కేవలం పదవిరీత్యా రాజ్య సభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
- శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభ సభ్యులు ఉండరు కాబట్టి వాటికి ఎలక్టోరల్ కాలేజీలో స్థానం లేదు.
- ప్రకరణ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని తెలుపుతుంది
- ప్రకరణ 55 (1) ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో అన్ని రాష్ర్టాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి.
- ప్రకరణ 55(2)(ఎ) ప్రకారం ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర శాసనసభలోని ఎన్నికైన సభ్యుల సంఖ్యతో భాగించాలి. అలా భాగించగా వచ్చిన లబ్ధాన్ని తిరిగి 1000తో భాగించి 1000కి ఒక సీటు చొప్పున ఒక్కొక్క సభ్యునికి గల ఓట్లను నిర్ధారిస్తారు.
- ప్రకరణ 55(2) (బి) ప్రకారం 1000ని లెక్కించే సందర్భంలో శేషం 500 కంటే తక్కువగా వస్తే పరిగణనలోనికి తీసుకోరు. ఎక్కువ వస్తే మాత్రం సభ్యునికి ఉండే ఓట్లకు అధనంగా ఒక ఓటును కలపాలి.
- ప్రకరణ 55(2)(సి) పార్లమెంట్ సభ్యుల ఓట్ల సభ్యుల సంఖ్యను నిర్ధారించే విధానాన్ని కింది విధంగా తెలుసుకోవచ్చు.
- వివిధ రాష్ట్ర శాసనసభ సభ్యుల ఓట్ల విలువను మొత్తం కూడి ఆ మొత్తాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్యతో భాగించబడుతుంది. ఆ వచ్చిన భాగహార లబ్ధమే పార్లమెంట్ సభ్యుల ఓట్ల విలువ. ఒక వేళ శేషం సగం కంటే తక్కువ వస్తే పరిగణనలోకి తీసుకోరు. శేషం సగం కంటే ఎక్కువ వస్తే ఒక ఓటుగా పరిగణిస్తారు.
- ప్రకరణ 55(3) ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతి రహస్యంగా జరుగుతుంది. దీన్నే ‘దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య ఎన్నిక’ అని కూడా అంటారు. రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తున్నపుడు ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవలసి ఉంటుంది. దీన్నే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ఒక ఓటరు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యతాక్రమంలో ఓటు వేస్తాడు.
ఉదా: ఎ, బి, సి అనే ముగ్గురు పోటీ చేస్తున్నపుడు ‘ఎ’ కి 2వ ప్రాధాన్యతని ‘బి’ కి 3వ ప్రాధాన్యతని, ‘సి’ మొదటి ప్రాధాన్యతని ఇవ్వవచ్చు. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యతా క్రమంలో సగం కంటే ఎక్కువ కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థిని రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యతా క్రమంలో కోటా ఓట్లు రానపుడు, అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారు. - రాష్ట్రపతిని ఎన్నుకొనే సమయంలో ఏ కారణాల వల్లనైనా ఏదైనా రాష్ట్ర శాసనసభ రద్దయి ఉన్నా, పార్లమెంట్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నా కూడా రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ఉన్నవారితోనే నిర్వహిస్తారు. శాసనసభ రద్దవడం, పార్లమెంట్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయన్న కారణాలతో రాష్ట్రపతి ఎన్నికను వాయిదా వేయవలసిన అవసరం లేదు.
- 1974లో గుజరాత్ శాసనసభ రద్దు అయినపుడు రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది.
- 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. 64వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 సంవత్సరం వరకు లోక్‌సభ స్థానాలను పెంచరాదు.
- రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది, నోటిఫికేషన్ జారీ, ఎన్నికల తేదీ మొదలైన అన్ని విషయాలను కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారు.
- రాష్ట్రపతి, ఎన్నికల్లో పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు, రాష్ర్టాల్లో ఎన్నికైన శాసనసభ్యులు కచ్ఛితంగా ఓటు వేయాలనే నిబంధన లేదు. అలాగే రాజకీయ పార్టీలు ఫలానా అభ్యర్థికే కచ్చితంగా ఓటు వేయాలనే నిబంధన లేదు. అలాగే రాజకీయ పార్టీలు ఫలానా అభ్యర్థికే కచ్చితంగా ఓటు వేయాలని కాని, వద్దని కాని తమ సభ్యులకు విప్ జారీ చేయరాదు. పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులు ఆయా సభల్లో వివిధ సమయాల్లో వేసే ఓటుకు తేడా ఉంది కాబట్టి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద పేర్కొన్న అనర్హత నిబంధనలు కూడా వర్తించవు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్లు ఓటు వేయవచ్చు. లేదా అసలు ఓటు వేయకుండా కూడా ఉండవచ్చు అని ఎలక్షన్ కమిషన్ 2012 రాష్ట్రపతి ఎన్నిల సందర్భంగా ఒక వివరణాత్మక పత్రికా ప్రకటనను జారీ చేసింది.
- 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు సేకరించే వరకు 1971 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇది 2002 ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చింది. శాసన సభ్యుడి ఓటు విలువను లెక్క కట్టడానికి కింది సూత్రాన్ని ఉపయోగిస్తారు.
- రాష్ట్ర శాసన సభల సభ్యులందరి ఓటు హక్కు సమానమైనప్పటికీ ప్రతి రాష్ట్రం జనాభా వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి శాసనసభ సభ్యుని ఓటు విలువ రాష్ర్టానికి మారుతూ ఉంటుంది.
- ఎంఎల్ఏ ఓటు విలువ = రాష్ట్ర జనాభా/ ఎన్నికైన శాసనసభ్యుల సంఖ్య + 1000
- రాష్ట్ర శాసనసభ సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ = ఒక ఎమ్మెల్యే ఓటు విలువ x మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య
- ఎన్నికైన పార్లమెంట్ సభ్యుని ఓటు విలువను లెక్కగట్టడానికి కింది సూత్రాన్ని ఉపయోగిస్తారు.
- ఎం.పీ ఓటు విలువ = అన్ని రాష్ర్టాల శాసనసభ్యుల మొత్తం ఓట్ల విలువ/ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య
- ప్రతి రాష్ట్రం శాసనసభ సభ్యుల ఓట్ల విలువను కూడితే అన్ని రాష్ర్టాల శాసన సభ్యుల మొత్తం ఓట్ల విలువ వస్తుంది
- రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు ప్రధాన సూత్రాలైన 1) ఏకరూపతా సూత్రం
2) సామ్యతా సూత్రాలను పరిగణనలోనికి తీసుకోవాలి. - మొదటి సూత్రం ప్రకారం రాష్ట్ర శాససభ్యుని ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ర్టానికి ఓటు విలువ మారుతుంది.
- రెండో సూత్రం ప్రకారం దేశంలోని ఎంపీల ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. రాష్ర్టాల తేడా ఉండవు. అంటే మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ మొత్తం ఎంపీల ఓటు విలువకు దాదాపు సమానం దీనినే సామ్యతా సూత్రం అంటారు.
పదవీకాలం
- రాష్ట్రపతి పదవీ కాలపరిమితిని ప్రకరణ 56 తెలియజేస్తుంది.
- ప్రకరణ 56(1) ప్రకారం రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 5 సంవత్సరాలపాటు రాష్ట్రపతిగా కొనసాగుతాడు.
- 56(10 (ఎ) ఏ కారణం చేతనైనా 5 సంవత్సరాలలోపు కూడా రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయవచ్చు. రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తాడు.
- ఒక వేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతి తన రాజీనామాను పంపిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి కూడా ఆ సమయంలో ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తికి రాజీనామా లేఖను అందించాలి. తన రాజీనామా విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు ప్రధానమంత్రికి తెలియజేయాలి.
- ప్రకరణ 56(1)(ఎ) ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి పంపాలి.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ అయితే సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని భావించిన కేంద్రం దాన్ని అధిగమించడానికి రాష్ట్రపతి బాధ్యతా నిర్వహణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రెండు పదవులకు ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి గాని రాష్ట్రపతి విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ విధంగా జస్టిస్ హిదయతుల్లా మొదటి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించారు.
- 56(1) (బి) ప్రకారం ఒక వేళ రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లయితే అతన్ని ప్రకరణ 61లో పేర్కొన్న విధంగా పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుంచి అభిశంసించవచ్చు.
- 56(1) (సి) ప్రకారం పదవీకాలం ఐదు సంవత్సరాలు ముగిసినప్పటికీ కొత్త రాష్ట్రపతి ప్రమాణ ప్వీకారం చేసి పదవిని చేపట్టే వరకు అతనే రాష్ట్రపతి బాధ్యతలను నిర్వర్తిస్తారు.
- 56(2) ప్రకారం రాష్ట్రపతి రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి అందుకున్న వెంటనే ఆ విషయన్ని లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేయాలి.
- రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే 3 రకాల పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవి ఖాళీకావచ్చు.
- రాష్ట్రపతి రాజీనామా చేయడం వల్ల
- రాష్ట్రపతి మరణించడం వల్ల
- పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించిన సందర్భంలో పై పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలలకు మించని కాలవ్యవధిలో నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. అంతవరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.
- 1967లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన జాకీర్ హుస్సేన్ 3 మే 1969న మరణించడంతో 1969 ఆగస్టులో రాష్ట్రపతి పదవికై మళ్లీ ఎన్నికలు నిర్వహించారు.
- 1974 రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఫిబ్రవరి 1977లో మరణించారు. దాంతో 1977 ఆగస్టులో రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మొత్తం 37 మంది అభ్యర్థుల్లో 36 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నీలం సంజీవరెడ్డి ఎన్నికల బరిలో నిలిచిన ఏకైక అభ్యర్థిగా మిగలడంతో ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.
- సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవీకాలం ముగియకముందే నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి.
- అనివార్య కారణాల వల్ల నూతన రాష్ట్రపతి ఎన్నిక వాయిదా పడితే రాష్ట్రపతి ఐదేళ్ల కాలం ముగిసిందనే కారణంతో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడానికి అవకాశం లేదు. నూతన రాష్ట్రపతి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసేవరకు రాష్ట్రపతి కొనసాగుతారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు