మొత్తం అనే పదం చేర్చిన అధికరణం?
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలోని 3వ భాగంలోని 12వ అధికరణం నుంచి 35 అధికరణం వరకు 7 ప్రాథమిక హక్కులను పొందుపర్చి భారత ప్రజలందరికీ సమానంగా హక్కు లు కల్పించారు. కానీ సామ్యవాదంలో భాగంగా సమసమాజ స్థాపనకు ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. ప్రస్తుతం 3వ భాగంలో 6 ప్రాథమిక హక్కులున్నాయి. ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించినప్పటికీ రాజ్యాంగంలో చట్టబద్ధమైన హక్కుగా అమల్లో ఉంది. పోటీ పరీక్షల్లో ఆస్తిహక్కుకు సంబంధించిన అంశాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు వాటిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.
ఆస్తిహక్కు: 31వ అధికరణం
-రాజ్యాంగ సంక్షేమం దృష్ట్యా సమసమాజ భావనతో భూసంస్కరణల చట్టాలు రూపొందించి భూమిని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ప్రాథమిక హక్కుల్లో ఆస్తిహక్కు ఉండటంతో, భూ సంస్కరణ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పడంతో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
-ఆస్తిహక్కు గురించి 31వ నిబంధన వివరిస్తుంది.
-రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జూన్ 18, 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కుకు 31 (ఏ), 31 (బీ) క్లాజ్‌లను చేర్చారు.
31 (ఏ) అధికరణం
-భూముల స్వాధీనానికి సంబంధించిన అంశాలను పొందుపర్చారు.
-ప్రజా సంక్షేమం కోసం ప్రైవేట్ వ్యక్తుల భూములను, ఎస్టేట్లను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.
-రాష్ట్ర ప్రభుత్వాలు భూసంస్కరణలపై చట్టాలు చేసినప్పుడు 200 నిబంధన ప్రకారం రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి.
-201 నిబంధన ప్రకారం గవర్నర్ ఆమోదించిన బిల్లును భారత రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
31 (బీ) అధికరణం
-పార్లమెంట్ రూపొందించిన శాసనాలు కొన్ని న్యాయ సమీక్షకు లోబడకుండా చెల్లుబాటవుతాయి.
-9వ షెడ్యూల్లో చేర్చిన 284 చట్టాలు న్యాయ సమీక్ష అధికార పరిధిలోకి రావు.
-31(బీ) అధికరణం సుప్రీంకోర్టు అధికార పరిధిని తగ్గించింది.
-వామనరావు వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1981) కేసులో సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్‌కు అనుబంధంగా చేసిన నోటిఫికేషన్, ఆర్డర్ మొదలైన వాటికి రాజ్యాంగ రక్షణ లభించదు. అంటే అదనంగా చేర్చే అంశాలు న్యాయ సమీక్ష అధికార పరిధిలోకి వస్తాయి.
-కామన్ కాజ్కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు 2007లో 9వ షెడ్యూల్ కూడా న్యాయ సమీక్ష అధికార పరిధిలోకి వస్తుందని ప్రకటించింది.
-శంకర్‌ప్రసాద్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1952) కేసులో సుప్రీంకోర్టు మొదటి రాజ్యాంగ సవరణలోని అంశాలను ప్రశ్నించింది.
-368 నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరణ చేయడం రాజ్యాంగబద్ధమే అని 13(2) అధికరణంలోని చట్టం అనే మాట రాజ్యాంగ సవరణ చట్టానికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.
భేలాబెనర్జీ Vs బెంగాల్ (954)
-ఈ కేసులో సుప్రీంకోర్టు ఆస్తికి సంబంధించిన అంశాలపై తీర్పు ప్రకటిస్తూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రజలకు ఆ భూము ల విలువకు నష్టపరిహారం చెల్లించాలి.
-1955లో 4వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం ప్రజల ఆస్తులను (భూములను) స్వాధీనం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన అంశాలను న్యాయస్థానాల్లో సవాలు చేయరాదని పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది.
-పార్లమెంట్ 1946లో 17వ రాజ్యాంగ సవరణ ద్వారా 31 (ఏ) అధికరణానికి సవరణ చేశారు. ఈ సవరణ ద్వారా ప్రజల భూములను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా ఏ చట్టంద్వారానైనా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీలుకాదు. ఎస్టేట్ అనే పదాన్ని నిర్వచించి దాని పరిధిని పెంచి 9వ షెడ్యూల్‌కు కొత్తగా 44 చట్టాలను చేర్చారు.
సజ్జన్‌సింగ్ Vs రాజస్థాన్ (1964)
-ఈ కేసులో సుప్రీంకోర్టు ఆస్తిహక్కుకు సంబంధించిన 17వ రాజ్యాంగ సవరణ సరైనది అని, ఈ సవరణ రాజ్యాంగ బద్ధమైనదేనని ప్రకటించింది. ఈ కేసులో శంకర్‌ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోని అంశాలను కూడా పరిశీలించింది.
కేశవానంద భారతి Vs కేరళ (1973)
-కేరళలోని ఎడ్నార్మద్కు చెందిన కేశవానంద భారతి కేసులో 1969 కేరళ భూ సంస్కరణల చట్టం సాధికారతను ప్రశ్నించింది. ఈ కేసులో 14, 19(1), 26, 31, 225 అధికరణాలను ప్రశ్నించింది.
-కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ఎం సిక్రీ 10-3 తేడాతో తీర్పును ప్రకటించారు.
తీర్పులోని ముఖ్యాంశాలు
1.రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా 368 అధికరణం ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగమైనా మార్చే అధికారం భారత పార్లమెంటుకు ఉంది.
2.గోలక్‌నాథ్ కేసుకు విరుద్ధంగా ఈ తీర్పును ప్రకటించారు.
3.రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే పదాన్ని మొదటిసారి సుప్రీంకోర్టు ఉపయోగించింది.
4.పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేస్తే అది రాజ్యాంగ మౌలిక లక్షణాలకు లోబడి ఉండాలి.
5.భూమిక (ప్రవేశిక) రాజ్యాంగంలో అంతర్భాగమని, అది ఒక పవిత్రమైన అంశమని ఈ తీర్పులో ప్రకటించారు.
-ఈ కేసులో మౌలిక లక్షణం అని పేర్కొన్నప్పటికీ వాటిని స్పష్టంగా వివరించలేదు.
-అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 31(డీ) అధికరణం చేరుస్తూ పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణను కోర్టులో సవాల్ చేయరాదని సుప్రీంకోర్టు అధికార పరిధి తగ్గించి పార్లమెంట్ అధికార పరిధిని పెంచింది (దేశ ద్రోహ చర్యల నివారణ శాసనాలకు రాజ్యాంగ రక్షణ).
-1978లో 43వ రాజ్యాంగ సవరణ ద్వారా 31(డీ) అధికరణం రద్దు చేసి సుప్రీంకోర్టుకు ఉన్న పూర్వ అధికార పరిధిని పునరుద్ధరించారు.
-మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జయప్రకాశ్ నారాయణ ఆశయాల మేరకు సామ్యవాదంలో భాగంగా 1978లో ఆస్తిహక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. ఆస్తిహక్కుకు సంబంధించిన 31 అధికరణం, స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కులోని 19 (1ఎఫ్) క్లాజ్ – అధికరణాలు 3వ భాగం నుంచి తొలగించి రాజ్యాంగంలో 12వ భాగంలో 300 (ఏ) అధికరణంగా చేర్చారు.
-ప్రాథమిక హక్కుల్లో 31 అధికరణం తొలగించినప్పటికీ చేర్చబడిన ఏ, బీ, సీ క్లాజ్లు అమల్లో ఉన్నాయి.
-1979, జూన్ 20 నుంచి ఆస్తిహక్కు ప్రాథమిక హక్కు గా అమలులో లేదు. అది కేవలం చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, రాజ్యాంగపరమైన హక్కు మాత్రమే కాని ప్రాథమిక హక్కు మాత్రం కాదు.
-ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడంతో ప్రస్తుతం 6 రకాల ప్రాథమిక హక్కులు మాత్రమే 3వ భాగం అమలులో కొనసాగుతున్నాయి.
మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
-ఈ కేసులో సుప్రీంకోర్టు కేశవానంద భారతి తీర్పును సమర్థించింది. న్యాయసమీక్ష అధికారం హరించే 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్వరూపంలో భాగమే అని ప్రకటించింది.
-ఎంవీ పైలీ ప్రాథమిక హక్కులను వ్యక్తి స్వేచ్ఛకు పట్టుగొమ్మలుగా, ప్రవర్తనా నియమావళిగా, భారత ప్రజాస్వామ్యానికి జవసత్వాలను అందించే దృఢత్వానికి పునాది లాంటివి అని వ్యాఖ్యానించాడు.
ప్రాథమిక విధులు – ప్రాముఖ్యం
భారత ప్రభుత్వం పౌరుల వద్ద నుంచి ఆశించే బాధ్యతలే ప్రాథమిక విధులు. ప్రాథమిక హక్కులు – విధులు పరస్పర ఆధారాలు. అవి ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి. హక్కులు లేని విధులు బానిసత్వానికి దారితీస్తాయి. విధులు లేని హక్కులు అరాచకానికి దారితీస్తాయి. ప్రాథమిక విధులు నిత్యం పౌరుల బాధ్యతలను గుర్తు చేస్తూ వారు బాధ్యతాయుతంగా వ్యవహరించేటట్టు సహాయపడుతాయి. ఇవి వ్యక్తుల మధ్య ఉద్రిక్తతలను నివారించి శాంతి, స్థిరత్వాలను ప్రసాదిస్తాయి. వీటిని అమలు చేయడం వల్ల సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న (సమైక్యత, సమగ్రత, & పర్యావరణ) అనేక సమస్యలను పరిష్కరింపచేయవచ్చు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి బాధ్యతారాహిత్య చర్యలకు పాల్పడేవారికి, సంఘం వ్యతిరేక శక్తులకు ఇవి హెచ్చరికగా పనిచేస్తాయి. మూఢవిశ్వాసాలతో కునారిల్లే మన భారత సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో, అభివృద్ధిపథంలో మునుముందుకు నడిపిస్తాయనడంలో సందేహం లేదు.
గోలక్‌నాథ్ Vs పంజాబ్ కేసు (1964)
-పంజాబ్‌లో హెన్నీ గోలక్‌నాథ్ అనే వ్యక్తి ఎక్కువ మొత్తంలో భూమిని సంపాదించాడు. ఆ రాష్ట్రం సెక్యూరిటీస్ ఆఫ్ ల్యాండ్ టెన్యూర్ యాక్ట్ ప్రకారం గోలక్నాథ్కు చెందిన 418 ఎకరాలు అదనపు భూమిగా ప్రకటించి ఆ ప్రాంత అడిషనల్ కమిషనర్ ఉత్తర్వు ద్వారా స్వాధీనం చేసుకుంది.
-1952లో అడిషనల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆర్థిక సంఘం పేర్కొన్నది.
-గోలక్‌నాథ్ మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు 14, 19 నిబంధనల ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ సమ్మతం కాదని, 1, 4, 17వ రాజ్యాంగ సవరణలను న్యాయస్థానంలో సవాల్ చేశారు.
-గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు రెండు ప్రధాన విషయాలను పరిశీలించింది. అవి
1.368 అధికరణం ప్రకారం పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలదా?
2.పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించవచ్చా? ఒకవేళ సవరణ చేస్తే అది చట్టబద్ధమేనా?
తీర్పు- ముఖ్యాంశాలు
1.సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు 6-5 తేడాతో తీర్పును 1967 సంవత్సరంలో ప్రకటించారు.
2. రాజ్యాంగంలో పొందుపర్చిన 3వ భాగంలోని ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని ప్రకటించింది.
3.1, 4, 17 రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ విరుద్ధమే కాని చెల్లుబాటవుతాయి.
4.సుప్రీంకోర్టు ఇంతకుముందు ప్రకటించిన శంకర్‌ప్రసాద్, సజ్జన్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పులను 137 నిబంధన ప్రకారం వెనక్కు తీసుకోవచ్చు.
5.ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.
-గోలక్‌నాథ్ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు.
-1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 368 నిబంధన ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగమైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని రాజ్యాంగ సవరణ చేశారు. 13వ అధికరణం కూడా పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయవచ్చునని ప్రకటించారు. ఈ రాజ్యాంగ సవరణ గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సవరణ తటస్థం చేసింది.
-1971లో 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 31 అధికరణాన్ని సవరణ చేస్తూ నష్టపరిహారం అనే పదానికి బదులు 31 (సీ) అధికరణంలో మొత్తం (Amount) అనే పదాన్ని చేర్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు