క్షుణ్ణంగా చదివితేనే.. పాలిటీపై పట్టు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భారీ సంఖ్యలో గ్రూప్ – II ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈసారి ఎలాగైన ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చాలామంది నిరుద్యోగులు ఆశతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి కలలు నిజమవ్వాలంటే ప్రతీ అంశంపై పట్టు సాధించడం తప్పనిసరి. గ్రూప్ – II పరీక్షలో అభ్యర్థులు మంచి మార్కులు తెచ్చుకోవడానికి పేపర్ – II తోడ్పడుతుంది. ఇందులో ఇండియన్ పాలిటీకి 75 మార్కులు, తెలంగాణ హిస్టరీకి 75 మార్కులు ఉంటాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించి గత ప్రశ్న పత్రాలను పరిశీలించి క్రమబద్ధంగా అధ్యయనం చేస్తే 68 నుంచి 73 మార్కులు సులభంగా సాధించవచ్చు.
పాలిటీ సిలబస్‌ను ఐదు చాప్టర్లుగా విభజించారు. అవి..
చాప్టర్ I
భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, రాజ్య విధాన
ఆదేశిక సూత్రాలు
వివరణ: ఈ అంశాలన్నింటిపై పట్టు సాధించాలంటే మొదట రాజ్యాంగ పరిణామక్రమం, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ విశిష్ట లక్షణాలు అనే టాపిక్స్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి. అయితే మొదటి చాప్టర్‌పై అవగాహన ఉంటేనే విగతా అంశాలపై పట్టు సాధించవచ్చు.
మాదిరి ప్రశ్నలు
1. రష్యా విప్లవం (1917) భారత రాజ్యాంగంలోని పీఠికకు ఏ భావాలను సమకూర్చింది? ( సీ )
ఏ) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
బీ) హోదా, అవకాశ సమానత్వం
సీ) సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
డీ) భావ వ్యక్తీకరణ, ప్రకటన స్వేచ్ఛ
2. ఆదేశిక సూత్రాలు సామాజిక విప్లవానికి సంబంధించిన అంశాలు అని ఎవరు పేర్కొన్నారు? ( బీ )
ఏ) ఎర్నెస్ట్ బార్కర్
బీ) గ్రాన విల్లే ఆస్టిన్
సీ) హెచ్‌యూ కామత్
డీ) డా.బీఆర్ అంబేద్కర్
3. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం రిజర్వేషన్లు కల్పించిన అధికరణ ఏది? ( ఏ )
ఏ) 16(4)ఏ బీ) 15(3) సీ) 16(3) డీ) 17
ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగా గుర్తించాలంటే అధికరణలు, షెడ్యూళ్లు, భాగాలు, ఆధునికకాలంలో చేసిన రాజ్యాంగ సవరణలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా అధ్యయనం చేయాలి.
చాప్టర్ II
ఈ అధ్యాయంలో భారత సమాఖ్య విశిష్ట లక్షనాలు, కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య శాసనపరమైన ఆధికారాల విభజన, శాసన పరమైన, కార్య నిర్వహణ పరమైన న్యాయపరమైన వ్యవస్థల పాత్రలు అనే అంశాలు ఉంటాయి.
వివరణ: ఈ చాప్టర్ మొదటి అద్యాయం కంటే పెద్దదిగా కనిపించినా కొంచెం సులభంగా అవగాహన చేసుకోవచ్చు. భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు. కానీ సమాఖ్య భావనలు కనిపిస్తాయి. అందుకే భారతదేశం ఒక సమాఖ్య అంటారు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వంలోని మూడు భాగాలు అంటే కార్యనిర్వహణ శాఖలో.. కేంద్రంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రి మండలి (ప్రధానమంత్రి), రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి. ఈ అంశాలను పుస్తక జ్ఞానంతో కాకుండా వర్తమాన అంశాల ఆధారంగా అభ్యసించాలి. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, కేంద్ర రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న సంబంధాల వంటి అంశాలను పూర్తిగా అద్యయనం చేయాలి.
ప్రాక్టీస్ ప్రశ్నలు
1. క్రిమినల్ చట్టాలు ఏ జాబితాలో ఉన్నాయి? ( సీ )
ఏ) రాష్ట్ర జాబితా బీ) కేంద్ర జాబితా
సీ) ఉమ్మడి జాబితా డీ) ఏదీ కాదు
2. రాష్ర్టాల మధ్య వర్తక వాణిజ్య ఒప్పందాలు
ఏ అధికరణంలో పొందుపర్చారు..? ( బీ )
ఏ) 264 అధికరణం నుంచి 300 ఏ వరకు
బీ) 301 నుంచి 307 అధికరణం వరకు
సీ) 301 నుంచి 314 అధికరణం వరకు
డీ) 245 నుంచి 255 అధికరణం వరకు
3. పార్టీ ఫిరాయింపుల చట్టంపై నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? ( డీ )
ఏ) రాష్ట్రపతి బీ) ప్రధానమంత్రి
సీ) ఎన్నికల కమిషన్ డీ) సభాధ్యక్షుడు
చాప్టర్ III
ఇందులో సమాజ వికాస ప్రయోగం – మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ – 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు
వివరణ: ఈ టాపిక్‌పై ఇటీవలి గ్రూప్ – IIలో 12 నుంచి 16 ప్రశ్నలు, పంచాయతీ కార్యదర్శి పరీక్షలో సుమారు 72 ప్రశ్నలు వచ్చాయి. ఈ అధ్యాయంలో అభివృద్ధి కార్యక్రమాలు, బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, 73, 74 రాజ్యాంగ సవరణలు అనే అశాలను క్షుణ్ణంగా అభ్యసనం చేయాలి.
మాదిరి ప్రశ్నలు
1. పట్టణ ప్రభుత్వాల్లో వార్డు కమిటీలను ఎంత జనాభాకు ఏర్పాటు చేస్తారు? ( సీ )
ఏ) 40 వేలు బీ) 2 లక్షలు సీ) 3 లక్షలు డీ) 10 లక్షలు
2. పంచాయతీరాజ్ సంస్థలకు 29 అధికారాలు కల్పించే రాజ్యాంగ అధికరణం ఏది? ( డీ )
ఏ) 243 W బీ) 243 I సీ) 243 K డీ) 243 G
3. రాజకీయ పక్షాలు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఏ కమిటీ సిఫారసు చేసింది? ( బీ )
ఏ) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
బీ) అశోక్ మెహతా కమిటీ
సీ) బీపీఆర్ విఠల్ కమిటీ
డీ) ఎల్ఎమ్ సింఘ్వీ కమిటీ
చాప్టర్ IV
ఈ అధ్యాయంలో భారతదేశంలో సంక్షేమ యం త్రాంగం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల వారికి రక్షణలు, ఎస్సీ, ఎస్టీ నేర అకృత్యాల చట్టాలు, కమిషన్లు వంటి తదితర అంశాలు ఉంటాయి.
వివరణ: ఎస్సీ, ఎస్టీ కమిషన్లు పనిచేసే విధానం, వారికి కల్పించిన రాజ్యాంగ రక్షణలు, ఓబీసీ మహిళా కమిషన్లు, మానవ హక్కుల కమిషన్లు, వాటి చట్టబద్ధత, కమిషన్ చైర్మన్లు మొదలైనవాటిని వర్తమాన అంశాల ఆధారంగా అధ్యయనం చేయాలి.
మాదిరి ప్రశ్నలు
1. జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? ( సీ )
ఏ) జస్టిస్ ఎస్ రాజేంద్రబాబు
బీ) జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్ సీ) జస్టిస్ రంగనాథ్ మిశ్రా
డీ) జస్టిస్ ఆవుల సాంబశివరావు
2. క్రిమిలేయర్ ప్రస్తావన ఉన్న కేసు ఏది? ( డీ )
ఏ) కేశవానంద భారతీ కేసు బీ) చంపక దొరై రాజన్ కేసు సీ) ఉన్నికృష్ణన్ కేసు డీ) ఇందిరా సహీని కేసు
3. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్‌ను 338 (ఏ) అధికరణం చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? ( డీ )
ఏ) 52వ రాజ్యాంగ సవరణ
బీ) 61వ రాజ్యాంగ సవరణ
సీ) 86వ రాజ్యాంగ సవరణ
డీ) 89వ రాజ్యాంగ సవరణ
చాప్టర్ V
ఇందులో ఏక సభ, ద్విసభ, శాసన వ్యవస్థలు, విధులు, జవాబు దారి సంక్షోభాలు, శాసన వ్యవస్థ పతనం వంటి అంశాలు ఉన్నాయి.
వివరణ: ఈ అధ్యాయంపై పట్టు సాధించాలంటే పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలు, లోక్‌పాల్, లోకాయుక్తా, కేంద్ర విజిలెన్స్ సంఘం, అవి పనిచేసే విధానంపై దృష్టి కేంద్రీకరించాలి.
మాదిరి ప్రశ్నలు
1. భారతదేశంలో మొదటి శాసన మండలిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ( ఏ )
ఏ) 1853 చార్టర్ చట్టం
బీ) 1861 కౌన్సిళ్ల చట్టం సీ) 1909 చట్టం
డీ) 1919 మాంటింగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం
2. అవినీతిపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? ( సీ )
ఏ) ఎల్ఎం. సింఘ్వీ కమిటీ
బీ) మోరార్జీ దేశాయ్ కమిటీ సీ) కే సంతానం కమిటీ
డీ) పీవీ రాజమన్నార్ కమిటీ
3. లోకాయుక్త చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఏది? ( బీ )
ఏ) మహారాష్ట్ర బీ) ఒడిశా
సీ) ఆంధ్రప్రదేశ్ డీ) కర్ణాటక
చదవాల్సిన పుస్తకాలు
– పౌరశాస్త్రం – ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్య పుస్తకం, తెలుగు అకాడమీ పుస్తకం
– భారత ప్రభుత్వం రాజకీయాలు – డిగ్రీ రెండో సంవత్సరం, తెలుగు అకాడమీ పుస్తకాలు
– భారతదేశ పరిపాలన – డిగీ రెండో సంవత్సరం, తెలుగు అకాడమీ పుస్తకాలు
– భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రభుత్వాలు – తెలుగు అకాడమీ పుస్తకాలు
– Introduction To The Constitution of India – DD బసు
– Our Parliment – సుభాష్ కశ్యప్
గమనిక:
ఒక్కసారి చదవగానే అన్నీ తెలిసినట్లే అనిపించడంమే ఇండియన్ పాలిటీ ప్రత్యేకత. అందువల్ల ప్రతి ఒక్కరూ నాకు అన్నీ తెలుసు అనే భావనతో సులభమైన ప్రశ్నలకు తప్పులు చేసి ఉద్యోగానికి దూరమవుతున్నారు. అలా చేయకుండా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా చదివి, అవగాహన చేసుకుంటే విజయం మిమ్మల్నే వరిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు