భిన్నభాషల సమ్మిళిత భారత్

అధికార భాషలు (official languages)
భారతదేశం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు గల ప్రజాస్వామ్య దేశం. దేశంలోని వివిధ జనాభా సమూహాలు విభిన్న భాషలను మాట్లాడుతారు. అందుకే భారతదేశ భాషను ‘భారత భాష ప్రతి కొన్ని కిలోమీటర్లకు నీళ్లవలే మారుతుంది’ (Indian Languages Changes every few Kilometers just like Water) అని పేర్కొంటారు. రాజ్యాంగంలో 22 అధికార భాషలను పేర్కొనగా, కేంద్ర ప్రభుత్వం సమాచార ప్రసారం కోసం హిందీ, ఇంగ్లిష్ భాషను మాధ్యమంగా (Languages of Communication) ఉపయోగిస్తుంది.
- రాజ్యాంగంలోని 17వ భాగంలోని ఆర్టికల్ 343 నుంచి 351 వరకు అధికార భాషల గురించి తెలియజేస్తాయి.
- రాజ్యాంగంలో 17వ భాగాన్ని 4 అధ్యాయాలుగా విభజించారు.
1. మొదటి అధ్యాయం- కేంద్రంలో అధికార భాష (Languages of the Union )
2. రెండో అధ్యాయం- ప్రాంతీయ భాషలు
3. మూడో అధ్యాయం- సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో, శాసనాల్లో ఉపయోగించే భాష
4. నాలుగో అధ్యాయం- ప్రత్యేక ఆదేశాలు

Nlere
కేంద్రంలో అధికార భాష (Languages of the Union )
- ఆర్టికల్ 343 (1) ప్రకారం కేంద్రప్రభుత్వ అధికార భాష-భారతదేశ చరిత్రలో ఎక్కువగా ఉపయోగించిన దేవనాగరి లిపి (Devanagari script)లో ఉన్న హిందీని కేంద్రప్రభుత్వ అధికార భాషగా పేర్కొంటారు.
- 343 (2) ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15సంవత్సరాల (1965) వరకు కేంద్రప్రభుత్వ అధికారిక వ్యవహారాలు ఇంగ్లిష్‌లోనే కొనసాగాయి. అయితే అదే సమయంలో కేంద్ర అధికారిక వ్యవహారాల్లో ఇంగ్లిష్తో పాటు హిందీ భాషను అంతర్జాతీయ రూపంలో ఉన్న భారతీయ అంకెలతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న భారతీయ అంకెలను కూడా ఉపయోగించుటకు రాష్ట్రపతి ఒక ఉత్తర్వు జారీచేయవచ్చు.
- ఆర్టికల్ 343 (3) పైన పేర్కొన్న ఆర్టికల్‌లో 15 సంవత్సరాల కాల వ్యవధిని పార్లమెంట్ చట్టం ద్వారా కొనసాగించవచ్చు. (హిందీ, ఇంగ్లిష్ భాషలు )
- ఆర్టికల్ 344 (ఎ)- అధికారిక భాషా కమిషన్, అధికారిక భాషపై పార్లమెంటరీ కమిటీ.
- 344 (1)- రాష్ట్రపతి అధికారిక భాషా కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చు. దీనిలో ఒక చైర్మన్‌తో పాటు, 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషలకు చెందిన వ్యక్తులను సభ్యులుగా నియమించవచ్చు.
నోట్: బీజీ ఖేర్ ఆధ్వర్యంలో 1955లో ఈ కమిషన్ ఏర్పడగా, 1956లో రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. దీన్ని 1957లో ఏర్పాటైన గోవింద్ వల్లభ్ పంత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేసింది. - 344 (1) ప్రకారం 1960లో మరొక కమిషన్‌ను రాష్ట్రపతి నియమించాల్సి ఉంది. కానీ అలాంటి కమిషన్ ఏదీ ఏర్పాటు చేయలేదు. తర్వాత కాలంలో పార్లమెంట్ 1963లో అధికారభాషా చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం 1965 తర్వాత కూడా అన్ని కేంద్ర పాలనా వ్యవహారాల్లో, పార్లమెంట్ కార్యకలాపాల్లో హిందీతో పాటు ఇంగ్లిష్ వాడుకను కొనసాగించేందుకు వీలు కలిగింది. అంతేకాకుండా ఈ చట్టం ఆంగ్లభాష వాడుక కాలపరిమితిని నిరవధికంగా పెంచింది. తర్వాత కాలంలో కొన్ని సందర్భాల్లో హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా కచ్చితంగా వినియోగించాలని సూచిస్తూ 1967లో ఈ చట్టానికి సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో, అదే విధంగా కేంద్రానికి, రాష్ర్టాలకు, రాష్ర్టాలకు-రాష్ర్టాలకు మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లిష్ భాషలోనే కొనసాగాలి.
నోట్- భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదాను కల్పించలేదు. - రాష్ర్టాలకు తమ అధికారిక భాషను నిర్ణయించుకొనే అధికారం ఉంది.
- ఆర్టికల్ 344 (2)- కింది అంశాలకు సంబంధించి రాష్ట్రపతికి సిఫారసు చేయడం కమిషన్ విధి.
ఎ. కేంద్ర అధికారిక వ్యవహారాల్లో హిందీ వాడుకను క్రమంగా పెంపొందించుట.
బి. కేంద్ర పాలనా వ్యవహారాలన్నింటిలో లేదా ఒక్కొక్కదానిలో ఆంగ్లభాషా వినియోగాన్ని తగ్గించుట నియంత్రించుట.
సి. ఆర్టికల్ 348లో చెప్పిన అన్ని ప్రయోజనాలు లేదా కొన్ని ప్రయోజనాల్లో ఉపయోగించాల్సిన భాష. (సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చట్టాలు, బిల్లుల్లో ఉపయోగించవలసిన భాష)
డి. కొన్ని నిర్దిష్ట అంశాలకు సంబంధించి కేంద్రప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఉపయోగించవలసిన అంకెలు.
ఇ. కేంద్ర పాలనా వ్యవహారాల్లో ఉపయోగించాల్సిన అధికార భాష, కేంద్ర-రాష్ర్టాల మధ్య వ్యవహారాల్లో ఉపయోగించాల్సిన అధికార భాష, రాష్ర్టాల మధ్య వ్యవహారాల్లో ఉపయోగించాల్సిన అధికార భాషకు సంబంధించి రాష్ట్రపతి భాషా కమిషన్‌ను కోరిన ఇతర అంశాలు. - ఆర్టికల్ 344 (3)- భారత పారిశ్రామిక, సాంస్కృతిక, శాస్త్రీయ పురోగతి దృష్ట్యా ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి హిందీయేతర ప్రాంతాల (Non-Hindi Spea king Areas) ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ 344 (2) ప్రకారం రాష్ట్రపతికి సలహా ఇవ్వాలి.
- ఆర్టికల్ 344 (4)- అధికార భాషా కమిటీ ఏర్పాటు.
- ఆర్టికల్ 344 (5)- భాషా కమిటీ విధి భాషా కమిషన్ చేసిన సిఫారసులను పరీక్షించి వాటిని రాష్ట్రపతికి నివేదించడం.
ప్రాంతీయ భాషలు ( Regional Languages)
l ఆర్టికల్ 345- రాష్ర్టాల అధికార భాష లేదా భాషల గురించి తెలియజేస్తుంది. రాష్ర్టాలు వ్యవహారికంలో ఉన్న ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ భాషలను గాని లేదా హిందీని గాని తమ అధికారిక వ్యవహారాల్లో అధికార భాషగా స్వీకరిస్తూ శాసనాన్ని చేయవచ్చు. అయితే ఆర్టికల్స్ 346, 347కు లోబడి ఈ శాసనాన్ని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ అధికార భాషను నిర్ణయించుకునేంతవరకు ఆ రాష్ట్ర అధికారిక వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతాయి.
l ఆర్టికల్ 346- ఉత్తరప్రత్యుత్తరాల కోసం ఒక రాష్ట్రం, కేంద్రం మధ్య లేదా ఒక రాష్ట్రం, మరొక రాష్ట్రం మధ్య అధికార భాష.
l ప్రస్తుతం కేంద్ర అధికార వ్యవహారాల్లో అధీకృతంగా ఏ భాష ఉపయోగించబడుతుందో అదే భాషను కేంద్ర-రాష్ట్ర వ్యవహారాల్లో, రాష్ర్టాల మధ్య వ్యవహారాల్లో ఉపయోగించాలి (అంటే ఇంగ్లిష్).
l ఒకవేళ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలు తమ మధ్య వ్యవహారాల కోసం హిందీ భాషను అధికార భాషగా నిర్ణయించుకొంటే ఆ రాష్ర్టాలు తమ మధ్య వ్యవహారాల కోసం హిందీని ఉపయోగించుకోవచ్చు.
ఉదా: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్
l ఆర్టికల్ 347- ఒక రాష్ట్ర జనాభాలో ఒక విభాగానికి చెందిన ప్రజలు (Section Of people) మాట్లాడే భాషకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు.
l ఒక రాష్ట్ర జనాభాలో గణనీయ సంఖ్యలోని ప్రజలు తాము మాట్లాడే భాషను ఆ రాష్ట్రంలో అధికారికంగా గుర్తించాలని రాష్ట్రపతిని కోరితే, ఆ కోరిక సరైనదేనని రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఆ భాషను రాష్ట్రం మొత్తానికి గాని లేదా కొంత భాగానికి గాని అధికారికంగా గుర్తించాలని ఆదేశించవచ్చు. మైనారిటీల భాషాపరమైన ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిబంధన ఉపకరిస్తుంది.
l రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తించిన భాషలు (22)
l మౌలిక రాజ్యాంగంలో 14 భాషల ప్రస్తావన ఉంది. కానీ కాలానుగుణంగా వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా 2022 ఫిబ్రవరి నాటికి 22 భాషలకు ఈ సంఖ్య పెరిగింది.
న్యాయస్థానాల్లో (సుప్రీంకోర్టు, హైకోర్టు) ఉపయోగించే భాష
l ఆర్టికల్ 348- ఈ అంశాలకు సంబంధించి ఇంగ్లిష్ అధికార భాషగా కొనసాగుతుంది. (ఒక వేళ పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే మారవచ్చు)
l సుప్రీంకోర్టు, హైకోర్టుల అన్ని ప్రొసీడింగ్స్
l పార్లమెంటులో ప్రవేశపెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్, బై-లాస్, బిల్లులు, ఆర్డినెన్స్‌లు.
l రాష్ర్టాల శాసనసభల్లో ప్రవేశపెట్టిన బిల్లులు.
l అయితే రాష్ట్రపరిపాలన వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు సాధారణ న్యాయ వ్యవహారాలకు సంబంధించి హిందీగాని, లేదా ఇంకో భాషను ఉపయోగించుటకు సంబంధిత రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి ముందస్తు అనుమతిని అడగవచ్చు. ఇదే సందర్భంలో హైకోర్టు వెలువరించే తీర్పులకు, డిక్రీలకు, ఆర్డర్లకు ఇది వర్తించదు. అంటే ఈ సందర్భంలో ఇంగ్లిష్ మాత్రమే కొనసాగుతుంది.
ప్రత్యేక ఆదేశాలు
l అసెంబ్లీకి సంబంధించిన బిల్లులు, చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్, బై-లాస్, ఆర్డినెన్స్‌లు ఇంగ్లిష్‌తోపాటు ఇతర భాషల్లో ఉండవచ్చు.
l ఉదా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చట్టాలు తెలుగులో ప్రచురించడం.
l ఆర్టికల్ 350- బాధిత వ్యక్తులు తమ గ్రీవెన్స్ అర్జీలను ఎవరైనా అధికారికి లేదా అథారిటీకి ఇచ్చేటప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏదైనా ఒక భాషలో సమర్పించవచ్చు. ఆ అర్జీ అధికారిక భాషలో లేదని ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదు.
l ఆర్టికల్ 350 (ఎ)- భాషాపరమైన మైనారిటీలకు ప్రాథమిక విద్యను వారి మాతృభాషలోనే అందించడం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల బాధ్యత. దీనికోసం అవసరమైన ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేయవచ్చు.
l ఆర్టికల్ 350 (బి)- భాషాపరమైన మైనారిటీ వ్యవహారాల కోసం ఒక స్పెషల్ ఆఫీసర్‌ను రాష్ట్రపతి నియమించవచ్చు. ఆ అధికారి నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే దాన్ని రాష్ట్రపతి పార్లమెంటుకు, రాష్ర్టాల శాసన సభకు పంపుతారు.
ప్రాచీన భాష హోదా (Classical Language Status)
l మొదటిసారిగా 2004లో 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రాచీన భాష హోదా అనే ప్రస్తావనను తెరపైకి తీసుకువచ్చింది.
l ప్రాచీన భాష హోదాను కల్పించడం కోసం కింద పేర్కొన్న ప్రాతిపదికలను ఆధారంగా తీసుకుంటారు.
l 1500-2000 సంవత్సరాల నుంచి సంబంధిత భాష ప్రతులు, పుస్తకాలు, రికార్డు చేయబడిన చరిత్ర కలిగి ఉండాలి.
l ప్రాచీన భాష, సాహిత్యం, ఆధునిక భాషకు భిన్నంగా ఉండవచ్చు. కొంత అవిచ్ఛిన్నత ఉండవచ్చు.
l ఆ భాషను మాట్లాడేవారు కొన్ని తరాల నుంచి సాహిత్యం, ప్రతులను తమ విలువైన వారసత్వ సంపదగా భావిస్తూ ఉండాలి.
l ఆ భాష, మరొక భాషా సమూహం నుంచి అరువు తెచ్చుకున్నదై ఉండరాదు. అంటే సంబంధిత భాషకు సొంత సాహిత్య, సంప్రదాయాలు ఉండాలి.
l ఫిబ్రవరి 2022 నాటికి 6 భాషలకు ప్రాచీన హోదా కల్పించారు
ప్రాచీన భాష హోదా-ప్రయోజనాలు
l ఆ భాషకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేస్తారు.
l ప్రతి సంవత్సరం ఆ భాషాభివృద్ధికి తోడ్పడిన, తోడ్పడుతున్న ఇద్దరు స్కాలర్స్‌కు అంతర్జాతీయ అవార్డ్‌ను అందిస్తారు.
l కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రాచీన భాషలకు చెందిన కొన్ని ‘ప్రొఫెషనల్ చైర్స్’ ను యూజీసీ ఏర్పాటు చేస్తుంది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు