Indian History | రౌలత్ సత్యాగ్రహం.. మొదటి దేశవ్యాప్త ఉద్యమం
రౌలత్ సత్యాగ్రహం
- దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న విప్లవ కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేక చర్యలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1919లో రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారెంట్ లేకుండా దేశంలో ఎవరినైనా నిర్బంధించడానికి, ఇళ్లను సోదా చేయడానికి, ఆస్తులను జప్తు చేయడానికి బ్రిటిష్ అధికారులకు అధికారం ఉంది.
- నిందితులను ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ జరిపే పద్ధతిని కూడా ఈ చట్టం కల్పించింది.
- రౌలత్ చట్టం భారత ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేసింది.
- రౌలత్ చట్టాన్ని విరమింపజేసుకోవాలని గాంధీజీ చట్టానికి వ్యతిరేకంగా 1919 మార్చి 30న సత్యాగ్రహ ఉద్యమానికి పిలుపునిచ్చారు. కానీ తర్వాత దీన్ని మార్చి 30 నుంచి ఏప్రిల్ 6కు మార్చారు. ఈ తేదీ అందరికీ తెలియకపోవడం వల్ల మార్చి 30న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు నిర్వహించారు.
- గాంధీ నాయకత్వంలో జరిగిన మొట్టమొదటి దేశ వ్యాప్త ఉద్యమం రౌలత్ సత్యాగ్రహం.
- ఈ ఉద్యమంలో హిందువులు, ముస్లింలు కలిసి పాల్గొన్నారు.
- ఢిల్లీలో ఆర్యసమాజ నాయకుడు స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో ఉద్యమం జరగడమే కాకుండా, ఆయన జామా మసీదులో హిందూ, ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు.
- ఏప్రిల్ 6న దేశమంతటా నిరసన దినాన్ని పాటించారు. ఈ ఉద్యమంతో గాంధీ భారతజాతి మొత్తానికి నాయకత్వం వహించినట్లయ్యింది. తదనంతర కాలంలో గొప్ప నాయకుడు కావడానికి ఈ ఉద్యమం తోడ్పడింది.
- పంజాబ్‌లో సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ నాయకత్వం వహించారు.
- అలాగే గాంధీ ఈ సమయంలో 1919లో సత్యాగ్రహ సభను ఏర్పాటు చేశారు.
- మద్రాస్‌లో టీవీకే మొదలియార్, శివసుబ్రహ్మణ్యం ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
- ఈ విధంగా ఈ ఉద్యమం దేశమంతా, పట్టణ ప్రాంతాల్లో మధ్య తరగతి వర్గం, శ్రామికులు కలిసి చేపట్టారు. ఈ నేపథ్యంలో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన.
జలియన్ వాలాబాగ్ ఉదంతం
- రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహంలో పంజాబ్‌లో 1919, ఏప్రిల్ 9న పంజాబ్ నాయకులైన సత్యపాల్, కైలాసనాథ్ కిచ్లూలను ప్రభుత్వం అరెస్టు చేసింది. పంజాబ్‌లో గాంధీ పర్యటించడాన్ని నిషేధించింది.
- ఈ అరెస్టుకు వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ మైదానంలో సత్యాగ్రహ ఉద్యమ నాయకులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
- ఈ సభకు సుమారు 10 వేల మంది హాజరయ్యారు.
- సభ ప్రారంభం కాగానే అక్కడికి జనరల్ డయ్యర్ సైన్యంతో వచ్చి ప్రశాంతంగా ఉన్న ప్రజలపై ఎటువంటి హెచ్చరికలు చేయకుండా నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించాడు. ఈ సంఘటనలో వందలాది మంది మరణించారు.
- రౌలత్ సత్యాగ్రహ సందర్భంగా దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ గాంధీని కలవరపెట్టింది. ప్రజలు ఇంకా అహింసాయుత సత్యాగ్రహానికి సిద్ధం కాలేదని, రౌలత్ సత్యాగ్రహ ఉద్యమాన్ని 1919, ఏప్రిల్ 18న గాంధీ నిలిపివేశారు.
- జలియన్ వాలాబాగ్‌లో జరిగిన మారణకాండ దేశంలో ప్రతి ఒక్కరూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు.
- జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘సర్ నైట్‌హుడ్’ బిరుదును త్యజించారు.
- ఆఫ్రికాలో బోయెర్ యుద్ధం సందర్భంగా బ్రిటిష్ వారు గాంధీకి ఇచ్చిన కైజర్ ఇ హింద్ బిరుదును ఆయన వెనక్కిచ్చేశారు.
- జలియన్ వాలాబాగ్ దురంతాలను గురించి విచారణ జరపడానికి ప్రభుత్వం హంటర్ కమిషన్‌ను నియమించింది.
- ఈ కమిషన్ జలియన్ వాలాబాగ్ మారణకాండలో కేవలం 379 మంది మరణించినట్లు పేర్కొనగా, భారత జాతీయ కాంగ్రెస్ సుమారు 1200 మంది మరణించారని 3500 మందికి పైగా గాయపడ్డారని నిర్ణయించింది.
ఖిలాఫత్ ఉద్యమం (1919)
- మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీని ఇంగ్లండ్ ఓడించడంతో టర్కీ సుల్తాన్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు బ్రిటిష్ వారి హస్తగతం అయ్యాయి. దీంతో టర్కీ ఇంగ్లండ్‌తో ఒడంబడిక కుదుర్చుకోవడం వల్ల టర్కీ సుల్తాన్ ఖలీఫా (మతాధిపతి) అధికారం కోల్పోయాడు.
- ఈ పరిణామం భారతదేశంలోని ముస్లింలను కలవరపరిచింది. దీనికి వ్యతిరేకంగా భారతదేశంలోని ముస్లింలు ఉద్యమాన్ని నడిపారు. దీన్నే ఖిలాఫత్ ఉద్యమం అని అన్నారు.
- టర్కీ సుల్తాన్ హోదా, అధికారాలు మొదటి ప్రపంచ యుద్ధ పూర్వస్థాయికి పునరుద్ధరించడమే ఖిలాఫత్ ఉద్యమ లక్ష్యం.
- అలీ సోదరులు (షౌకత్ అలీ, మహ్మద్ అలీ), మౌలానా ఆజాద్, హాకిన్, అజ్మల్ ఖాన్ నాయకత్వంలో 1919, మార్చిలో అఖిల భారత ఖిలాఫత్ సంఘం ఏర్పడింది.
- 1919, అక్టోబర్ 17న ఖిలాఫత్ దినంగా పాటించారు.
- ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీ బలపరిచి హిందూ, ముస్లింల మధ్య సఖ్యత సాధించడానికి ఖిలాఫత్ ఉద్యమాన్ని ఒక మంచి అవకాశంగా భావించి, ఈ ఉద్యమంలో హిందువులు పాల్గొనాలని ప్రచారం చేశారు.
- ఖిలాఫత్ ఉద్యమ లక్ష్యాన్ని సాధించడానికి అహింసాయుత సహాయ నిరాకరణ మార్గాన్ని పాటించాలని గాంధీ కోరారు.
- ఖిలాఫత్ ఉద్యమం గాంధీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమానికి దారితీసింది.
- రౌలత్ సత్యాగ్రహ ఉద్యమంగా ఖిలాఫత్ ఉద్యమం కూడా భారత స్వాతంత్య్రోద్యమానికి గాంధీ నాయకత్వం వహించడానికి తోడ్పడింది.
- ఈ సమయంలోనే కొన్ని రైతు, కార్మిక సంఘాలు ఉద్భవించాయి.
- 1920 జంషెడ్పూర్ లేబర్ అసోసియేషన్‌ను ఎస్ఎన్ హల్దార్ మరియర, బోమేష్ చక్రవర్తి స్థాపించారు.
- 1920లో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఏర్పడింది.
- ఈ ఏఐటీయూసీకి మొదటి ప్రెసిడెంట్‌గా లాలాలజపతి రాయ్, వైస్ ప్రెసిడెంట్‌గా బాప్టిస్టా, సెక్రటరీగా దివాన్ చమన్ లాల్ ఎన్నికయ్యారు.
- అహ్మదాబాద్, మజ్దూర్ మహాజన్‌ను గాంధీ ఏర్పాటు చేశారు.
- ఉత్తరప్రదేశ్ కిసాన్ సభను ఇంద్ర నారాయణ్ ద్వివేది 1918లో ప్రారంభించారు.
- అలాగే 1920లో ఔధ్ (అవధ్) కిసాన్ సభను బాబా రామచంద్ర, జవహర్లాల్ నెహ్రూ, గౌరీ శంకర్ మిశ్రా ప్రారంభించారు.
సహాయ నిరాకరణోద్యమం (1920)
- దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో సహాయ నిరాకరణోద్యమం మొదటిదని చెప్పవచ్చు.
- జలియన్ వాలాబాగ్ ఘటనపై హంటర్ కమిటీ వెల్లడించిన నివేదికను ఇంగ్లండ్ పార్లమెంట్ ఆమోదించడంతో భారతీయుల్లో బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత తీవ్రతరమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా ఉద్యమాన్ని నిర్వహించాలన్న ఆలోచనా ఫలితమే సహాయ నిరాకరణోద్యమం.
- ఈ ఉద్యమం లాంఛనంగా 1920, ఆగస్ట్ 1న ప్రారంభమయ్యింది. అదే రోజు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరణించారు. ఈ ఉద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని కలకత్తాలో 1920, సెప్టెంబర్‌లో జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో ఆమోదించింది.
- సహాయ నిరాకరణోద్యమం రెండు భాగాలుగా జరిగింది. మొదటిది బహిష్కరణ కార్యక్రమాలు, రెండోది నిర్మాణాత్మక కార్యక్రమాలు.
- చాలా మంది ఈ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి పాల్గొన్నారు. ముఖ్యంగా న్యాయవాదులు మోతీలాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, చిత్తరంజన్ దాస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం, రాజగోపాల చారి న్యాయవాద వృత్తిని వదిలి ఉద్యమంలో పాల్గొన్నారు.
- ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, పంజాబ్, ఆంధ్రా ప్రాంతాల్లో ఈ ఉద్యమానికి మద్దతుగా రైతు ఉద్యమాలు జరిగాయి.
- తిలక్ స్మారక నిధి తరఫున కోటి రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ఉద్యమం సందర్భంగా విరాళాలు వసూలు చేశారు.
- ఖద్దర్ వస్ర్తాల తయారీకి గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు. అస్పృశ్యతను ఖండిస్తూ మద్యపాన నిషేధాన్ని ఈ ఉద్యమంలో ప్రచారం చేశారు.
- ఢిల్లీలో జామియా మిలియా, కాశీ విద్యాపీఠం, గుజరాత్, బీహార్లలో విద్యాపీఠాలు ఆంగ్ల విద్యావిధానానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు.
- బెంగాల్లో ఈ ఉద్యమానికి సేన్ గుప్తా, సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోయారు.
- సీఆర్ దాస్ భార్య బసంతీదేవి జైలుకెళ్లారు.
- ఈ విధంగా ఉధృతంగా జాతీయోద్యమం జరుగుతున్న సమయంలో భగవాన్ అహిర్ అనే వ్యక్తిని చౌరీచౌరా పోలీస్ స్టేషన్ పరిధిలో విచక్షణారహితంగా కొట్టి చంపగా, ప్రజలు 1922, ఫిబ్రవరి 5న చౌరీచౌరా పోలీస్ స్టేషన్ (ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా)పై సుమారు 50 మంది దాడి చేసి 22 మంది పోలీసులను సజీవ దహనం చేశారు. ఈ సంఘటనతో కలత చెందిన గాంధీ ఫిబ్రవరి 12న బార్డోలిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
- కానీ లాలాలజపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ ఈ సందర్భంగా గాంధీ నిర్ణయాన్ని విమర్శించారు.
- ప్రజా చైతన్యం పరాకాష్టకు చేరుకున్న సమయంలో వెనుదిరిగి ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని ‘జాతీయ విపత్తు’గా సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
- ఒక్కచోట జరిగిన తప్పునకు యావత్తు దేశాన్ని గాంధీ శిక్షించాడని నెహ్రూ అభిప్రాయపడ్డారు.
- ఈ పద్ధతిని ఆసరాగా తీసుకొని గాంధీని అరెస్ట్ చేసి, ప్రభుత్వం పట్ల అవిధేయతను వ్యాప్తి చేస్తున్నాడనే నేరాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆరోపించింది. విచారణ జరిపిన పిదప గాంధీకి ఆరేండ్ల కారాగార శిక్షను విధించింది.
- ఈ సమయంలో భారతదేశంలో ప్రధానంగా రెండు అంశాలు జరిగాయి. ఒకటి పంజాబ్‌లో అకాలీ ఉద్యమం కాగా, మరొకటి దేవాలయ ప్రవేశ ఉద్యమం.
- పంజాబ్‌లోని దేవాలయాలన్నీ ఉదాసి, సిక్కు మహంతుల చేతిలో ఉండేవి. వీరు దేవాలయ సొమ్ముతో అత్యంత ధనవంతులుగా ఉండేవారు.
- వీరు గదర్ పార్టీ వాళ్లను ఆదరించరాదని హుకుం జారీచేయడమే కాకుండా జలియన్ వాలాబాగ్ దురంతానికి కారణమైన జనరల్ డయ్యర్‌ను సన్మానించారు. దీంతో ఈ సిక్కు పూజారులైన మహంతులకు వ్యతిరేకంగా కఫ్తార్ సింగ్ జబ్బార్, బాబా కరెక్ట్ సింగ్ నాయకత్వంలో అకాలీ ఉద్యమాన్ని ప్రారంభించారు.
- చివరకు ప్రభుత్వం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీని 1925లో ఏర్పాటు చేసింది. దీంతో దేవాలయాలపై మహంతుల అధికారాలన్నీ పోయాయి.
- 1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశంలో దేవాలయాలకు అన్ని వర్గాల ప్రజలను అనుమతించాలనే తీర్మానం ప్రవేశపెట్టారు.
మాదిరి ప్రశ్నలు
1. గాంధీజీ నాయకత్వంలో జరిగిన మొట్టమొదటి దేశవ్యాప్త ఉద్యమం?
1) సహాయ నిరాకరణ ఉద్యమం
2) రౌలత్ సత్యాగ్రహం
3) చంపారన్ సత్యాగ్రహం
4) ఖిలాఫత్ ఉద్యమం
2. కింది వాటిలో సరైనవి?
1) జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సర్ నైట్ హుడ్ బిరుదును త్యజించారు
2) మహాత్మాగాంధీ తన కైజర్ ఇ హింద్ బిరుదును త్యజించారు
3) 1 4) 1, 2
3. ఖిలాఫత్ దినంగా పాటించినది?
1) 1919, ఏప్రిల్ 6
2) 1919, మార్చి 30
3) 1919, అక్టోబర్ 17
4) 1919, సెప్టెంబర్ 17
4. 1920లో అవధ్ కిసాన్ సభను స్థాపించినది?
1) బాబా రామచంద్ర
2) జవహర్లాల్ నెహ్రూ
3) గౌరీశంకర్ మిశ్రా 4) పై అందరూ
5. జామియా మిలియా, కాశీ విద్యాపీఠాలను ఏ ఉద్యమ కాలంలో స్థాపించారు?
1) సహాయ నిరాకరణ ఉద్యమం
2) ఖిలాఫత్ ఉద్యమం
3) స్వదేశీ ఉద్యమం
4) శాసనోల్లంఘన ఉద్యమం
6. ‘ఒక్క చోట జరిగిన తప్పునకు యావత్తు దేశాన్ని గాంధీ శిక్షించాడని’ అని వ్యాఖ్యానించింది?
1) సుభాష్ చంద్రబోస్
2) జవహర్లాల్ నెహ్రూ
3) లాలాలజపతి రాయ్
4) అనీ బీసెంట్
7. బెంగాల్లో సహాయ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించింది?
1) సుభాష్ చంద్రబోస్ 2) సేన్ గుప్తా
3) చిత్తరంజన్ దాస్ 4) 1, 2
జవాబులు
1-2, 2-4, 3-3, 4-4, 5-1, 6-2, 7-4
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు