Indian Geography | ఆదర్శవంతం.. తెలంగాణ వ్యవసాయ విధానం
హిందూ మహాసముద్రంలో భారతదేశ వ్యూహాత్మక ఉనికి ప్రాముఖ్యాన్ని తెలియజేయండి?
- హిందూ మహాసముద్ర భాగం భారతదేశ దృష్టిలో వ్యూహాత్మకంగా, వనరుల పరంగా, అంతర్జాతీయ వాణిజ్య దృష్ట్యా ఎంతో కీలకమైంది.
- ప్రపంచ భూభాగంలో 17.5 శాతం ఆక్రమించి 70.5 మిలియన్ల చ.కి.మీ.ల విస్తీర్ణాన్ని కలిగి, ప్రపంచంలోని 35 శాతం జనాభా ఆవాసంగా ఉన్న మహాసముద్రం.
- హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా భారతదేశానికి ఉన్న ప్రాముఖ్య అంశాలు
1) వ్యూహాత్మక ఉనికి - ఈ సముద్రంలో ఉన్న అనేక చిన్న, పెద్ద దీవులు సమాచార వ్యవస్థ పరంగా అత్యంత కీలకమైంది. ఈ దీవుల్లో సైనిక, వైమానిక, నౌకాస్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా తీరంలో ఉన్న ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాలపై అదుపును సాధించడానికి వీలవుతుంది.
- హిందూ మహాసముద్రం వాణిజ్య, ఇంధన సరఫరాకు నిత్య స్థావరంగా మారినందున, అసంప్షన్ దీవులు, మాల్దీవులు, అగాలెగా దీవులు, శ్రీలంక వంటి చిన్న ద్వీప దేశాలకు ప్రాముఖ్యం పెరిగింది. భారతదేశం కోసం ఈ ద్వీప దేశాలు ఈ ప్రాంత భౌగోళిక, రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో, సముద్ర భద్రత క్రమాన్ని నిర్ధారించడంలో అపారమైన వ్యూహాత్మక ఉనికిని కలిగి ఉన్నాయి.
2) ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యం - ఇక్కడి మానవ వనరులను, విశాల మార్కెట్లను దక్కించుకొని అక్కడ తమ స్థావరాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక ఉనికిని కలిగిన దీవులను ఆక్రమించుకునేందుకు పారిశ్రామిక దేశాలు ప్రయత్నించడంతో హిందూ మహాసముద్రానికి ప్రాముఖ్యం పెరిగింది.
- ప్రపంచంలోని చమురు నిల్వల్లో 16.8 శాతం, సహజ వాయువు నిల్వల్లో 27.9 శాతం హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే ఉన్నాయి. అలాగే 35.5 శాతం ఇనుప ఖనిజ నిల్వలు, బంగారం ఉత్పత్తిలో 17.8 శాతం వాటాను కలిగి ఉంది. దాదాపు 28 శాతం మత్స్య సంపదకు నిలయంగా ఉంది.
- ఈ మహాసముద్రంలోని సముద్ర సమాచార మార్గాలు, చోక్ పాయింట్స్ (Choke Points) దేశ ఇంధన భద్రతను, ఆర్థిక పరిపుష్టతను పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.
- ప్రపంచంలోని 80 శాతం చమురు వ్యాపారం చోక్ పాయింట్లు అయిన మలక్క, హార్మోజ్, బాబ్-ఎల్-మాండేబ్ వంటి జలసంధుల ద్వారానే జరుగుతుంది.
3) వనరుల పరంగా ప్రాముఖ్యం - భారతదేశం మధ్య హిందూ మహాసముద్రాన్ని అన్వేషించడానికి ప్రత్యేక హక్కులను 1987లో పొందింది. అప్పటి నుంచి 4 మి.చ.మైళ్లను అన్వేషించి రెండు మైనింగ్ సైట్లను స్థాపించింది. 2014లో ‘ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ హిందూ మహాసముద్ర శిఖరం’ ప్రాంతంలో మైనింగ్ కోసం లైసెన్సులను జారీ చేసింది.
- భారతదేశం పశ్చిమతీరం, అండమాన్ సముద్రం వంటి ప్రాంతాల్లోని ఖండతీరపు అంచుల్లో విస్తృతమైన చమురు-సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ లభ్యమవుతున్న విస్తారమైన ఖనిజ సంపద అంతర్జాతీయ ఘర్షణలకు కారణమవుతుంది.
- ప్రాంతీయ సముద్ర భద్రతా వ్యవస్థ లేనందున ఈ వనరులు, సముద్ర మార్గాలపై నియంత్రణ కోసం ఇటీవల బలమైన దేశాల మధ్య ముఖ్యంగా భారత్, చైనా మధ్య పోటీ ఎక్కువైంది. ఈ పరిణామం దక్షిణ చైనా సముద్రంలో కన్పించే విధంగా భవిష్యత్తులో రాజకీయ ఉద్రిక్తతలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరగవచ్చు అనే సందేహాలు కలుగుతున్నాయి.
ముగింపు - పై అంశాలను చూస్తే బహుళ ప్రాముఖ్యం ఉన్న హిందూ మహాసముద్రం భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల పరంగా కీలక స్థానాన్ని ఆక్రమించనుందని తెలుస్తుంది. ఈ విషయంలో ఇది 1914లో స్పైక్ మ్యాన్ రూపొందించిన అంచుల భూమి (Rim Land) సిద్ధాంతాన్ని ధ్రువపరుస్తున్నట్లు పైన తెలిపిన పరిణామాలు నిరూపిస్తున్నాయి.
తెలంగాణలో చిన్న నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేసే ‘మిషన్ కాకతీయ పథకం’ లక్ష్యాలు దాని ప్రభావాన్ని వివరించండి?
- కాకతీయుల కాలంలో వెల్లివెరిసిన చెరువులు, కుంటలు లాంటి చిన్న నీటిపారుదల రంగం ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత చర్యల వల్ల పూర్తిగా దెబ్బతిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల రంగ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం కోసం తీసుకువచ్చిన పథకమే మిషన్ కాకతీయ.
- తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా పీఠభూమి స్థలాకృతిలో ఉన్నందున రాష్ట్రం గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదీ జలాలను పంట భూములకు వినియోగించలేకపోతున్నాం. అందువల్ల గత వంద సంవత్సరాల నుంచి వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా చెరువులే కేంద్రంగా ఉన్నాయి.
లక్ష్యాలు
1) గతంలో ఉన్న చెరువులను, వాటి వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం మేరకు నిల్వ చేసుకునే విధంగా పునరుద్ధరించడం
2) కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో చిన్న నీటిపారుదల రంగానికి కేటాయించిన 225 టీఎంసీల నీటిని వినియోగించుకోగలిగితే రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు.
3) ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనపు భూ సేకరణ అవసరం లేకుండా చిన్న నీటిపారుదల రంగం ద్వారా నీరు అందించవచ్చు.
4) దీని కింద చేపట్టే చేపల పెంపకం ద్వారా వీటి మీద ఆధారపడిన వారికి ఉపాధి, ఆర్థిక భద్రతను కల్పించవచ్చు.
సాంస్కృతిక అంశాలు - తెలంగాణ పండుగలన్నీ చెరువులతో ముడిపడి ఉన్నందున సమాజం మొత్తం సంఘటితం కావడానికి, సమష్టి జీవనం కొనసాగించడానికి చెరువులే కేంద్రంగా ఉన్నాయి.
- రాష్ట్ర పండుగైన బతుకమ్మ పండుగ, కట్ట మైసమ్మ పండుగ, తీజ్ పండుగ, శ్రావణ మాసంలో జరుపుకొనే వనవాస పండుగలు, ప్రకృతి ఆరాధన ఈ పథకంలో కనిపిస్తుంది.
- ఇస్రో-నాబార్డ్, బిట్స్ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ హైదరాబాద్ సంస్థలు మిషన్ కాకతీయ పథకానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి.
ప్రభావం - ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పంట సాగు విస్తీర్ణత, దిగుబడి, రసాయన ఎరువుల వాడకం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై ‘నా బ్యాన్స్’ సంస్థ సర్వే నివేదికను విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
1) భూగర్భ జలాల్లో సగటు పెరుగుదల 2013-14లో 6.91 మీటర్లు ఉండగా 2016-17లో 9.02 మీటర్లకు పెరిగింది. దీంతో పాటు అంతకుముందు 15 శాతం ఎండిపోయిన బావులు, బోరుబావులు పునరుజ్జీవం చెందాయి.
2) 2016 ఖరీఫ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది.
3) వ్యవసాయ ఆధారిత ఆదాయంలో 47.5 శాతం ఆదాయం పెరిగినట్లు అంచనా వేశారు.
4) చెరువుల నుంచి తొలగించిన మట్టిలో రసాయన ఎరువుల వాడకం 35 శాతం నుంచి 50 శాతానికి తగ్గినట్లు కనిపించింది.
5) చెరువు ఆయకట్టు పనిలో కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం, చెరువుల్లో చేపల పెంపకం, 2013-14తో పోలిస్తే 2016-17లో 36 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. - నీతి ఆయోగ్ విడుదల చేసిన సమగ్ర యాజమాన్య సూచికలో రాష్ట్రం నీటివనరుల పునరుద్ధరణలో దేశంలో మొదటి స్థానంలో ఉంది.
భారతదేశ ఆర్థికాభివృద్ధికి రైల్వేలు జీవనాడిగా ఉన్నాయి. అయితే రైల్వేల ప్రైవేటీకరణ వల్ల ఎదురయ్యే సవాళ్లు, ప్రయోజనాలు, నష్టాలను విశ్లేషించండి?
- దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో ప్రధాన చోదకాలుగా ఉండే రైల్వేల ప్రారంభం దేశంలో 1853 నుంచి జరిగింది. ప్రస్తుతం దేశంలో రైల్వేలు రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా భారత ప్రభుత్వం యాజమాన్యంలో నిర్వహిస్తున్నారు.
- బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఆపరేటర్ల ప్రవేశాన్ని, రైల్వే సేవలను అందించడానికి అనుమతించడం ద్వారా రైలు పరిశ్రమను సరళీకృతం చేయాలని సిఫారసు చేసింది.
ప్రయోజనాలు
1) ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అందించబడతాయి.
2) ప్రయాణికులు, సరకు రవాణాకు సంబంధించి టికెట్, సరకు రవాణా చార్జీలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
3) ప్రైవేట్ భాగస్వామ్యం మెరుగైన జవాబుదారీతనం, పర్యవేక్షణకు దారితీస్తుంది. ఇది రైల్వేల్లో పెరుగుతున్న ప్రమాదాలను నియంత్రించి, ప్రయాణికులకు భద్రతను కల్పించగలదు.
నష్టాలు
1) ప్రైవేటీకరణ వల్ల లాభదాయకంగా లేని, తక్కువ జనాదరణ ఉన్న ప్రాంతాల్లో రైల్వే మార్గాల తొలగింపునకు దారితీస్తుంది. అందువల్ల ఇది కనెక్టివిటీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గ్రామీణ-పట్టణాల మధ్యగల అంతరాలను మరింత పెంచుతుంది.
2) ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యం కారణంగా రైల్వే చార్జీలు పెరిగి తక్కువ ఆదాయ వర్గాలకు రైల్వేలను అందుబాటులో లేకుండా చేస్తుంది.
3) జవాబుదారీతనం ఉండదు, భారతీయ రైల్వేల ప్రైవేటీకరణ సులభం కాదు. ఎందుకంటే ఇది దేశంలోని ప్రతి భాగాన్ని కవర్ చేస్తుంది. 24X7 గంటలు నడుస్తుంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
1) తక్కువ వ్యయంతో కూడిన రైల్వే రవాణా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. అలాంటి వ్యవస్థను ప్రైవేటీకరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
2) రైల్వేలను ఆధునీకరించడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రైవేట్ రంగంలో సామాజిక వ్యయాలను త్వరితగతిన పునరుద్ధరణ చేయడానికి చర్యలు తీసుకోవచ్చు. తద్వారా రైల్వేల వనరులు మెరుగ్గా అందించబడి, ఎప్పటికప్పుడు కావాల్సిన సౌకర్యాలు అప్‌గ్రేడ్ చేయబడతాయి. - రైల్వేలను పూర్తిగా ప్రైవేటీకరణ చెందించకుండా, బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసుల్లో సూచించిన విధంగా నాన్-కోర్ ఫంక్షనింగ్ పనులైన క్యాటరింగ్, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, గృహనిర్మాణం, నిర్మాణం, మౌలిక సదుపాయాల నిర్వహణ మొదలైన వాటిని ప్రైవేటీకరించవచ్చు.
తెలంగాణ వ్యవసాయ విధానం ఎందువల్ల దేశంలోనే వివిధ రాష్ర్టాల్లో ఒక ఆదర్శవంతమైన విధానంగా కీర్తించబడుతుందో చర్చించండి?
- తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని, రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రోత్సాహక, సబ్సిడీలతో కూడిన లాభదాయక పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది.
- ముఖ్యంగా పంట వేసే సమయం నుంచి పంట కోసే సమయం వరకు తర్వాత పంట అమ్మే వరకు పలు రకాలైన పథకాలను రూపొందించడమైంది.
రైతుబంధు
1) పంట పెట్టుబడి కోసం రైతాంగం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించకుండా రైతన్నలను ఆదుకోవడానికి ప్రభుత్వం 2018 మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించింది.
2) రాష్ట్రంలోని ప్రతి రైతుకు సంవత్సరానికి వానాకాలం, యాసంగి పంటలకు ఎకరానికి రూ.8,000 ఆర్థిక సాయం అందిస్తుండగా, ప్రస్తుతం దీన్ని రూ.10,000లకు పెంచారు.
3) ఈ పథకం కారణంగా రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మంది రైతు కుటుంబాలు పంట పెట్టుబడిని సాయంగా పొందుతున్నారు.
ఉచిత విద్యుత్ సరఫరా
1) 2016, ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ రంగానికి 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. 2018, జనవరి 1 నుంచి రాష్ట్రంలోని వ్యవసాయదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను అందిస్తున్నారు.
2) రాష్ట్రంలో ప్రస్తుతం 25.63 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా అందుతుంది.
రైతు బీమా పథకం - 2018, ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో 18-60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా కవరేజీ అందజేస్తున్నారు.
పావలా వడ్డీ, వడ్డీలేని పంట రుణాలు - ప్రభుత్వం రైతులందరికీ సంవత్సరంలోపు చెల్లించినట్లయితే రూ.లక్ష వడ్డీలేని పంటరుణాలను మంజూరు చేస్తుంది. 1 నుంచి 3 లక్షల వరకు 25 పైసల వడ్డీతో పంటరుణ వస్తువులను కల్పించింది.
రుణ విముక్తి పథకం - 2014, మార్చి 31 నాటికి రూ.లక్ష రుణ బకాయి ఉన్న రైతులకు రుణ మాఫీ చేసింది.
రైతు సమన్వయ కమిటీ - రైతాంగ సమస్యలను చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతుల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది
రైతు ఉత్పత్తి సంఘాలు - ఉపాంత, సన్నకారు రైతాంగం ఉత్పత్తి సంఘాల ద్వారా పంటలను విక్రయించి, వారి సమస్యలను పరిష్కరించుకోవడం వీటి ముఖ్య విధి.
1) రైతాంగ సాగుకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను అందించడం
2) ధాన్యం ప్రాసెసింగ్, మార్కెట్‌కు చేరవేయడంలో
సహాయపడటం
3) స్వయం సహాయక మహిళా బృందాలతో రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయడం
4) 2016, ఏప్రిల్ 14న రాష్ట్రంలోని 5 వ్యవసాయ మార్కెట్లను ‘ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ పథకం’తో ప్రారంభించారు. అవి నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ (బడేపల్లి), హైదరాబాద్ (మలక్‌పేట), నల్లగొండ (తిరుమలగిరి), రాష్ట్రంలో ప్రస్తుతం 57 మార్కెట్లలో ఈ పథకం అమలవుతుంది.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Previous article
RIMC – TSPSC | ఆర్ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలు
Next article
Groups Special | భూకంపం.. భయానక విపత్తు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు