India – Disaster Management | భారతదేశం – విపత్తు నిర్వహణ
విపత్తు
విపత్తు అనే పదాన్ని Disastre అనే ఫ్రెంచి పదం నుంచి గ్రహించారు.
ఇది రెండు పదాల కలయిక. Dis – bad/evil, astre – star (అంటే ప్రమాదకర నక్షత్రం) అని అర్థం.
ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్రకృతిపరమైన, మానవ తప్పిదాలవల్ల జరిగే ఆకస్మిక సంఘటనలే విపత్తులు
విపత్తుల వల్ల పర్యావరణ సమతుల్యం, సుస్థిరాభివృద్ధి దెబ్బతింటాయి.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం విపత్తులవల్ల సంభవించే నష్ట తీవ్రత మొత్తం దేశ జాతీయాదాయంలో 2 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం నష్టం వస్తుంది.
ప్రపంచంలో మొదటి విపత్తు క్రీ.పూ. 430లో ఏథెన్స్లో టైఫస్ అనే వ్యాధితో సంభవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
ఇప్పటివరకు అధిక సంఖ్యలో ప్రాణనష్టం జరిగిన విపత్తు 1556లో చైనాలో వచ్చిన భూకంపం. జనవరి 26న చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఇది వచ్చింది. దీనితో 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
విపత్తులు రకాలు
ప్రధానంగా ఐదు రకాలుగా చెప్పవచ్చు.
1.జల, వాతావరణ సంబంధిత విపత్తులు
ఉదా: సునామీ, తుఫానులు, వరదలు, వడగళ్లవాన.
2.భౌగోళిక సంబంధిత విపత్తులు
ఉదా: భూకంపాలు, ఆనకట్టలు కూలిపోవడం, తెగిపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటివి.
3.ప్రమాద సంబంధ విపత్తులు
ఉదా: అడవుల్లో కార్చిచ్చు, బాంబు పేలుళ్లు, విమాన, రహదారి ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు.
4.జీవ సంబంధ విపత్తులు
ఉదా: అంటువ్యాధులు, చీడపీడలు, పశువుల్లో రోగాలు, కలుషిత ఆహారం వంటివి.
5.రసాయన, పారిశ్రామిక, అణు సంబంధ విపత్తులు
ఉదా: అణు విపత్తులు, రసాయన, పారిశ్రామిక విపత్తులు.
-ప్రపంచంలో విపత్తుల నివేదిక ప్రకారం ఆసియా ఖండంలో సంభవిస్తున్నవి 37 శాతం. వీటివల్ల జరిగే నష్టం 49 శాతం.
-ప్రపంచంలో విపత్తులు సంభవిస్తున్న 10 దేశాల్లో భారత్ ఒకటి.
-1990 దశకాన్ని యూఎన్వో సాధారణ సభ అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది.
-భారత్‌లో విపత్తు నిర్వహణ విభాగాన్ని మొదట వ్యవసాయ శాఖలో ఏర్పాటుచేశారు. 2002లో దీన్ని హోంశాఖకు తరలించారు.
దేశంలో విపత్తులకు సంబంధించిన ముఖ్యాంశాలు
-గంగానది పరివాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి కేంద్రం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్‌ను 1972లో ఏర్పాటు చేసింది.
-సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ వాటర్ అకాడమీని పుణె నగరంలో నెలకొల్పారు.
-వరదలతో రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెట్ అథారిటీ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి.
-2008లో బీహార్‌లోని కోసి నదికి వచ్చిన వరదలతో 527 మంది మరణించారు.
-ఇటీవల బీహార్‌లో వచ్చిన వరదలతో సుమారు 1000 మందికి పైగా చనిపోయారు.
-దేశంలో 1977లో సంభవించిన వరదలతో అత్యధికంగా 11,316 మంది మరణించారు.
-నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను 1954లో ప్రారంభించారు.
-11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టారు. దీన్ని జలవనరుల శాఖ అమలు చేస్తుంది.
-పశ్చిమబెంగాల్లో గంగా పరివాహక ప్రాంతం, ఫరక్కా బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో జరుగుతున్న నేల క్రమక్షయంపై అధ్యయనం చేసి, రిపోర్టు సమర్పించిన కమిటీ
– ప్రీతమ్‌సింగ్ కమిటీ
-ఈశాన్య రాష్ర్టాల్లో వరదల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై వేసిన కమిటీ – నరేష్చంద్ర కమిటీ
-దేశంలో నదుల్లో పూడికకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేయడానికి వేసిన కమిటీ – బీకే మిట్టల్ కమిటీ
దేశంలో వరద నియంత్రణ చర్యలు
-ప్రపంచంలో అధికంగా వరదలు సంభవించే ప్రాంతాల్లో భారత్ ఒకటి. రుతుపవన వర్షపాతం, నదులు తీసుకువచ్చే మట్టి, పర్వత ప్రాంతాల్లో కోతకు గురికావడంలాంటి కారణాల వల్ల దేశంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంది.
-పదో పంచవర్ష ప్రణాళికలో వరదలు సంభవించే అవకాశం ఉన్న 45.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో రక్షణ చర్యలు చేపట్టారు. 11వ పంచవర్ష ప్రణాళికలో 2.18 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అదనంగా రక్షణ చర్యలు చేపట్టారు.
-సెంట్రల్ వాటర్ కమిషన్, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్లు దేశంలోని 62 నదుల పరివాహక ప్రాంతాల్లోని 945 ప్రదేశాల నుంచి నీరు, వాతావరణ సంబంధ సమాచారాన్ని గ్రహిస్తున్నారు.
-ఈ సమాచారాన్ని నది పరివాహక ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికల కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇలాంటి వరద హెచ్చరిక కేంద్రాలు దేశంలో 175 వరకు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో 18, కృష్ణా పరివాహక ప్రాంతంలో 9 ఉన్నాయి.
-ప్రమాద హెచ్చరిక కేంద్రాలు గంగ, దాని ఉపనదుల ప్రాంతాల్లో 87 ఉన్నాయి.
చక్రవాతాలు (సైక్లోన్లు)/తుఫాన్లు
-కుంభవృష్టి వర్షాన్ని కుమ్మరిస్తూ, సముద్రాల్లో పెద్ద ఎత్తున అలలను సృష్టిస్తూ, ఉత్తరార్ధగోళంలో అపసవ్యదిశలోనూ, దక్షిణార్ధగోళంలో సవ్యదిశలోనూ శక్తిమంతమైన గాలులతో సుడులు తిరిగే వాతావరణ అలజడినే చక్రవాతం (సైక్లోన్లు) అని పిలుస్తారు. చక్రవాతాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
-చక్రవాతాలను ఇంగ్లిష్‌లో సైక్లోన్స్ అంటారు. సైక్లోస్ అనే గ్రీకు పదం నుంచి సైక్లోన్ పదం పుట్టింది.
-సైక్లోస్ అంటే పాము మెలిక చుట్ట అని అర్థం.
-బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్లు సర్పిలాకారంగా తిరిగి అలజడిని సృష్టిస్తాయి.
-సముద్రంలోని అధిక ఉష్ణోగ్రత, అధిక సాపేక్ష ఆర్థ్రత, వాతావరణ అస్థిరతల వల్ల ఏర్పడే సంక్లిష్ట ప్రక్రియే చక్రవాతం. సముద్రంలో అధిక ఉష్ణోగ్రత వల్ల దానిపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి అన్ని వైపుల నుంచి అధిక పీడన గాలులు చేరుతాయి. ఫలితంగా వాయుగుండంగా మారి, చక్రవాత కేంద్రం (ఐ ఆఫ్ సైక్లోన్) ఆ మధ్యలో ఏర్పడుతుంది. చక్రవాత వ్యాసం కొన్ని వందల కి.మీ. ఉండగా చక్రవాత కేంద్ర వ్యాసం 20 – 30 కి.మీ.ల వరకు ఉంటుంది. చక్రవాత కేంద్ర పరిమాణం తగ్గుతున్నకొద్ది చక్రవాత బలం పెరుగుతుంది.
-దేశ భూభాగంలో 8 శాతం ప్రతి సంవత్సరం తుఫాన్ల తాకిడికి లోనవుతుంది.
-7516.6 కి.మీ. పొడవైన తీరరేఖ వెంబడి ఉన్న 13 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాలు తుఫాన్ల ప్రభావానికి లోనవుతున్నాయి.
-దేశంలో ఏర్పడే తుఫాన్లు ఉష్ణమండల తుఫానుల రకానికి చెందినవి. ఇవి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 30 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్యలో అంటే కర్కట, మకరరేఖల మధ్యప్రాంతంలో మాత్రమే ఏర్పడుతాయి.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)
-భారత పారామిలిటరీ దళాలు ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ నుంచి తీసుకొన్న ప్రత్యేక సిబ్బందితో ఈ దళాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం దేశంలో 10 విపత్తు స్పందన బెటాలియన్లు ఉన్నాయి. ఏపీలో గుంటూరులో ఒక బెటాలియన్ ఏర్పాటు చేశారు.
జాతీయ పౌర రక్షణ కళాశాల
-దీన్ని 1957లో నాగ్‌పూర్‌లో ఏర్పాటుచేశారు. విపత్తు నిర్వహణలో బాధ్యత వహించే వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు
పౌర రక్షణ డైరెక్టర్ జనరల్
-దీన్ని 1962లో హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పౌర రక్షణ కార్యకలాపాల్లో ఇది ప్రముఖ పాత్రపోషిస్తుంది.
చక్రవాతాల పేర్లు – ప్రాంతం
చక్రవాతం పేరు ప్రాంతం
టైఫూన్లు చైనా సముద్రం, పసిఫిక్, జపాన్
ట్రోఫికల్ తుఫాన్లు హిందూ మహాసముద్రం (ఉష్ణమండల తుఫాన్లు)
బుగుయియేస్ (బాగియో) ఫిలిపైన్స్
విల్లీ – విల్లీ ఆస్ట్రేలియా
హరికేన్లు అట్లాంటిక్ మహాసముద్రం, (కరేబియన్ సముద్రం)
టోర్నడోలు యూఎస్ఏ
విపత్తుకు సంబంధించిన సంస్థలు ప్రాంతం
భారత వాతావరణ శాఖ ఢిల్లీ
నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ నోయిడా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మెటీరియలాజీ పుణె
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ హైదరాబాద్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ న్యూఢిల్లీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు