The amendment | ఢిల్లీని ఎన్సీఆర్గా మార్చిన సవరణ?
భారత ప్రజాస్వామ్యానికి మూలమైన రాజ్యాంగానికి అవసరానికి అనుగుణంగా అనేక సవరణలు జరిగాయి. కాలంతోపాటు మారుతున్న అవసరాలు, డిమాండ్లను తీర్చేందుకు ఈ సవరణలు ఉపయోగపడ్డాయి. వాటిలో కొన్ని నిపుణ పాఠకులకోసం..
50వ సవరణ చట్టం
-ఈ చట్టం 1984, సెప్టెంబర్ 11న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 33(Sub)ను సవరించారు.
-దీనిద్వారా సాయుధదళాల ప్రాథమికహక్కులను నియంత్రించే అధికారం పార్లమెంటుకు కల్పించారు. ఇది రాష్ర్టాల ఆస్తులను కాపాడే సాయుధ దళాలు, రహస్య సమాచార సేకరణ సాయుధ దళాలు, రక్షక దళాలు, వాటికి సంబంధించిన బ్యూరోలు, వ్యవస్థల కోసం పనిచేసేవారు లేదా వాటికి సంబంధించినవారికి వర్తిస్తుంది.
51వ సవరణ చట్టం
-దీన్ని 1984లో చేశారు. అయితే 1986, జూలై 16న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 330, 332 ప్రకరణలను సవరించారు.
-అస్సాంలోని స్వయం పాలిత ప్రాంతంలో ఉన్న షెడ్యూల్డ్ జాతులకు తప్ప, ప్రతి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు, జాతులకు పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రకరణ 300ను సవరించారు.
-332వ ప్రకరణను సవరించడం ద్వారా అస్సాం స్వయంపాలిత ప్రాంతాల్లో తప్ప అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్ర శాసనసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించారు.
52వ సవరణ చట్టం
-ఇది 1985, మార్చి 1న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 101, 102, 190, 191 ప్రకరణలు, 10వ షెడ్యూల్‌ను సవరించారు.
-10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీల ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేర్చారు.
53వ సవరణ చట్టం
-దీన్ని 1986లో చేశారు. 1987, ఫిబ్రవరి 20న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 1వ షెడ్యూల్‌కు సవరణ చేశారు. దీంతోపాటు ప్రకరణ 371-జీ చేర్చారు.
-ఈ చట్టం ద్వారా మిజోరం ప్రాంతాన్ని దేశంలో 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఉండే సామాజిక, మత పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ర్టానికి కొన్ని ప్రత్యేక హక్కులను ప్రకరణ 371-జీలో పొందుపర్చారు.
54వ సవరణ చట్టం
-ఈ చట్టం 1986, ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా రెండో షెడ్యూల్‌ను, 125, 221 ప్రకరణలను సవరించారు.
-రెండో షెడ్యూల్లోని పార్ట్-డీని సవరించి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జీతాలను, హైకోర్టు జడ్డీల జీతభత్యాన్ని పెంచారు.
-ప్రకరణ 125, 221లో జీతభత్యాలకు సంబంధించిన మార్పులు చేశారు.
55వ సవరణ చట్టం
-దీన్ని 1986లో చేశారు. 1987, ఫిబ్రవరి 20న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 1వ షెడ్యూల్‌ను సవరించి, 371హెచ్ ప్రకరణను పొందుపరిచారు.
-కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను 24వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. 371 హెచ్ ప్రకరణను చేర్చడం ద్వారా ఆ రాష్ర్టానికి ప్రత్యేక హక్కులు కల్పించారు.
56వ సవరణ చట్టం
-ఇది 1987, మే 30న అమల్లోకి వచ్చింది.
-1వ షెడ్యూల్‌ను సవరించి, 371ఐ ప్రకరణను చేర్చారు.
-గోవాను 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతోపాటు, ప్రకరణ 371ఐలో ఆ రాష్ర్టానికి సంబంధించిన ప్రత్యేక హక్కులు పొందుపరిచారు.
57వ సవరణ చట్టం
-ఇది 1987 సెప్టెంబర్ 21న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 332ను, 22వ భాగాన్ని సవరించారు.
-332వ ప్రకరణను సవరించడం ద్వారా అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయాల్లో షెడ్యూల్డ్ జాతుల సీట్ల రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సవరణ 2000 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
58వ సవరణ చట్టం
-దీన్ని 1987లో చేశారు. అదే ఏడాది డిసెంబర్ 9న అమల్లోకి వచ్చింది.
-394ఏ ప్రకరణను చేర్చారు. ఇందులో హిందీలోకి అనువదించిన రాజ్యాంగానికి, అసలు రాజ్యాంగానికి ఉన్న హోదా ఉంటుందని పేర్కొన్నారు.
59వ సవరణ చట్టం
-ఇది 1988, మార్చి 30న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 21, 352, 356, 358 ప్రకరణలకు సవరణలు చేయగా, 359ఏ ప్రకరణను కొత్తగా పొందుపర్చారు.
-పంజాబ్‌లో రాష్ట్రపతిపాలన కాలపరిమితిని రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచారు. అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు రద్దుచేశారు.
60వ సవరణ చట్టం
-ఇది 1988, డిసెంబర్ 20న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 276ను సవరించారు.
-దీనిద్వారా రాష్ట్రప్రభుత్వాలు విధించే వృత్తిపన్నును పెంచారు.
61వ సవరణ చట్టం
-ఈ చట్టాన్ని 1988లో చేశారు. 1989, మార్చి 28న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 326వ ప్రకరణను సవరించారు.
-ఓటుహక్కు కనీస వయోపరిమితిని 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు.
62వ సవరణ చట్టం
-ఇది 1989, డిసెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చింది.
-ప్రకరణ 334ను సవరించారు.
-షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు, ఆంగ్లో ఇండియన్లకు లోక్‌సభ, శాసనసభల్లో రిజర్వేషన్లను మరో పదేండ్ల వరకు పెంచారు.
63వ సవరణ చట్టం
-దీన్ని 1989లో చేశారు. 1990, జనవరి 6న అమల్లోకి వచ్చింది. ఇందులో 359ఏ ప్రకరణను రద్దు చేయగా, 356వ ప్రకరణను సవరించారు.
-అంతర్గత కల్లోలాల కారణంగా పంజాబ్‌లో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కును సస్పెండ్ చేయకుండా ఉండటానికి 359ఏ ప్రకరణను రద్దు చేశారు.
64వ సవరణ చట్టం
-ఇది 1990, ఏప్రిల్ 16న అమల్లోకి వచ్చింది.
-356వ ప్రకరణను సవరించి పంజాబ్‌లో రాష్ట్రపతిపాలనను మరో 6 నెలలపాటు పొడిగించారు.
65వ సవరణ చట్టం
-దీన్ని 1990లో చేశారు. 1992, మార్చి 12న అమల్లోకి వచ్చింది. ఇందులో ప్రకరణ 338ని సవరించారు.
-ఈ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించి జాతీయ కమిషన్‌గా మార్చారు. అంతకుముందున్న స్పెషల్ ఆఫీసర్ అనే పదాన్ని జాతీయ కమిషన్‌గా మార్చారు.
66వ సవరణ చట్టం
-ఇది 1990, జూన్ 7న అమల్లోకి వచ్చింది. ఇందులో 9వ షెడ్యూల్‌ను సవరించారు.
-రాష్ర్టాలు చేసిన భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో ఆ చట్టాల సంఖ్య 257కు పెరిగింది.
67వ సవరణ చట్టం
-ఇది 1990, అక్టోబర్ 4న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 356(4)వ ప్రకరణను సవరించారు.
-దీనిద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను గరిష్టంగా నాలుగేండ్లకు పెంచారు.
68వ సవరణ చట్టం
-1991, మార్చి 12న అమల్లోకి వచ్చింది.
-356(4)వ ప్రకరణను సవరించి పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను గరిష్టంగా ఐదేండ్లకు పెంచారు.
69వ సవరణ చట్టం
-దీన్ని 1991లో చేశారు. 1992, ఫిబ్రవరి 1న అమల్లోకి వచ్చింది.
-239ఏఏ, 239ఏబీ ప్రకరణలను చేర్చారు.
-239ఏఏ ప్రకరణ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని జాతీయ రాజధాని ప్రాంతంగా పరిగణిస్తారు.
-దాని పరిపాలకుడ్ని లెఫ్టినెంట్ గవర్నర్‌గా పిలుస్తారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి ఒక శాసనసభ ఉంటుంది.
-జాతీయ రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రకరణ 239ఏబీ వివరిస్తుంది.
70వ రాజ్యాంగ సవరణ
-ఈ చట్టానికి 1991, డిసెంబర్ 21న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ చట్టం 1992లో అమల్లోకి వచ్చింది.
-ఇందులో 54వ ప్రకరణ, 239ఏఏ ప్రకరణలను సవరించారు.
-దీనిద్వారా ఢిల్లీ, పాండిచ్చేరి అసెంబ్లీ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల గణంలో భాగస్వామ్యం కల్పించారు.
71వ సవరణ చట్టం
-ఇది 1992, ఆగస్టు 31న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 8వ షెడ్యూల్‌ను సవరించారు.
-ఇందులో కొంకణి, మణిపురి, నేపాలి భాషలను రాజ్యాంగలో చేర్చారు. దీంతో గుర్తింపు పొందిన భాషల సంఖ్య 15 నుంచి 18కి చేరింది.
72వ సవరణ చట్టం
-ఈ చట్టం 1992, డిసెంబర్ 5న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 332 ప్రకరణను సవరించి దానికి 3బీ క్లాజు (332 (3బీ))ను చేర్చారు.
-ఈ సరవణ ద్వారా త్రిపుర శాసనసభలో గిరిజనులకు 20 స్థానాలు కేటాయించారు.
73వ సవరణ చట్టం
-ఈ సవరణ బిల్లుకు 1992లో పార్లమెంటు ఆమోదం తెలిపింది.
-1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
-ఇందులో 280 ప్రకరణను సవరించి కొత్తగా 280 (3బీబీ) క్లాజును చేర్చారు. దీంతోపాటు 243 ప్రకరణను, 243ఏ-243ఓ వరకు, 11వ షెడ్యూల్‌ను కొత్తగా చేర్చారు. 9వ భాగంలో ద పంచాయత్స్ అని పొందుపర్చారు.
-పంచాయతీ సంస్థలకు దేశమంతా ఒకే మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ, వాటికి రాజ్యాంగబద్ధత కల్పించారు.
74వ సవరణ చట్టం
-ఈ చట్ట సవరణ బిల్లును 1992లో పార్లమెంటు ఆమోదించింది. ఇది 1993, జూన్ 1న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 280 ప్రకరణను సవరించి 280 (3సీ)ని కొత్తగా చేర్చారు. దీంతోపాటు ప్రకరణలు 243పీ నుంచి 243జెడ్, 243జెడ్ఏ నుంచి 243జెడ్జీ వరకు పొందుపర్చారు.
-12వ షెడ్యూల్‌ను కొత్తగా చేర్చారు. దీంతోపాటు 9ఏ భాగంలో The Municipalities అని పొందుపర్చారు.
-ఈ చట్టం ద్వారా నగరపాలక సంస్థలకు దేశమంతా ఒక మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ వాటికి రాజ్యాంగబద్ధత కల్పించారు.
75వ సవరణ చట్టం
-ఇది 1994, మే 15న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 323వ ప్రకరణను సవరించారు. దీనిద్వారా రాష్ట్రస్థాయిలో Rent Tribunalsకు అవకాశం కల్పించారు.
76వ సవరణ చట్టం
-ఈ చట్టం 1994, ఆగస్టు 31న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 9వ షెడ్యూల్‌ను సవరించారు.
-విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 69 శాతం పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టానికి న్యాయసమీక్ష పరిధి నుంచి మినహాయింపునిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చారు.
77వ సవరణ చట్టం
-ఇది 1995, జూన్ 17న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 16వ ప్రకరణను సవరించి 16 (4ఏ) క్లాజును చేర్చారు.
-షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు.
78వ రాజ్యాంగ సవరణ
-ఈ సవరణ చట్టం 1995, ఆగస్టు 30న అమల్లోకి వచ్చింది.
-ఇందులో 9వ షెడ్యూల్‌ను సవరించారు. దీనిద్వారా బీహార్, కర్ణాటక, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు సంబంధించి 27 భూ సంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో ఈ షెడ్యూల్లో చట్టాల సంఖ్య 284కు పెరిగింది.
79వ సవరణ చట్టం
-ఈ రాజ్యాంగ సవరణ బిల్లును 1999లో పార్లమెంటు ఆమోదించింది. ఇది 2000, జనవరి 25న అమల్లోకి వచ్చింది.
-334 ప్రకరణను సవరించారు. దీనిద్వారా ఎస్సీ, ఎస్టీలకు, ఆంగ్లో ఇండియన్లకు లోక్‌సభలో, రాష్ర్టాల శాసనసభల్లో రిజర్వేషన్ల కాలపరిమితి పదేండ్లపాటు పొడిగించారు.
80వ రాజ్యాంగ సవరణ
-దీనికి 1999లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. 2000, జూన్ 9న అమల్లోకి వచ్చింది.
-దీనిద్వారా 268, 269 ప్రకరణలను సవరించి, 272వ ప్రకరణను తొలగించారు.
-10వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయడానికి ఈ సవరణలు చేశారు. సుంకాల రూపంలో కేంద్రానికి లభించే స్థూల రాబడిలో 29 శాతాన్ని రాష్ర్టాలకు కేటాయించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?