If only I knew the heritage | వారసత్వాన్ని తెలుసుకొంటేనే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బ్రిటిష్ వలస పాలనకాలంలో ప్రారంభమైన సివిల్ సర్వీస్ నియామకాలు నేటికీ కొనసాగుతున్నాయి. అకడమిక్ విద్యలో ఎంత జ్ఞానమున్నా.. అది సమాజానికి ఎంత మేరకు ఉపయోగపడుతుందన్న అంశానికే అధిక ప్రాధాన్యతనిస్తూ పోటీ పరీక్షల సిలబస్‌ను రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత కీలకమైన IAS, IPS, IFS లాంటి అఖిల భారత సర్వీసులతోపాటు, ఇతర ఉన్నత ఉద్యోగాల నియామకానికి సంబంధించిన సిలబస్‌లో భారత స్వాతంత్య్రోద్యమానికి పెద్దపీట వేశారు. భారతీయ సామాజిక పరిణామ క్రమంలో ప్రాచీన కాలంలో బలమైన హిందూ ధార్మిక శాస్ర్తాల, సిద్ధాంతాల ఆధారంగా సమాజం కొనసాగింది. మధ్యయుగం నాటికి విదేశీ పాలకులు దేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని పరిపాలించారు. ఆధునిక యుగంలో బ్రిటిష్ వలసపాలకులు ఆధునిక పాలనా వ్యవస్థను రూపొందించి.. భారతీయ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
-భారత ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం రాజ్యంగం ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఉద్యోగ నియామకాలను చేపడుతున్నది.
స్వాతంత్య్రోద్యమం
-యూపీఎస్సీ నూతనంగా రూపొందించిన సిలబస్‌లో జనరల్ స్టడీస్‌లో భారత స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే ఉద్యోగులకు ఈ దేశంపట్ల ఎలాంటి అవగాహన, ఆలోచన, పరిజ్ఞానం ఉండాలన్న విషయం అర్థమవుతుంది.
-సాధారణంగా ప్రతి ఉద్యమం మౌలిక లక్ష్యం సమాజంలో సంస్కరణలు తెచ్చి అనేక సమస్యలకు రాజ్యాంగ పరిష్కార మార్గాలను చూపించే విధంగా ఒత్తిడి తేవడం. అదేవిధంగా ఉన్న వ్యవస్థను మార్చి నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇలాంటి నేపథ్యంలోనే జరిగిన భారత స్వాతంత్య్రోద్యమం గురించి సిలబస్‌లో ప్రత్యేకంగా పేర్కొన్నారు.
గతమెందుకు?
-భారత స్వాతంత్య్రోద్యమం పూర్తయి దాదాపు ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ ఈ ఉద్యమం గురించి లోతుగా అధ్యయనం చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఈనాటి భారతదేశం ఒకప్పుడు ఏ విధంగా విధ్వంసానికి గురైంది? లక్షలాది మంది దశాబ్దాల పోరాటాల ఫలితంగా, వేలాది మంది త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? భవిష్యత్‌పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలన్న సందేశం, హెచ్చరిక ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమాజంపట్ల శాస్త్రీయ అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా గతంలో ఎన్ని బాధలు అనుభవించాం, ఏ విధంగా నష్టపోయాం అన్న విషయాలపట్ల అవగాహన ఉంటేనే ప్రస్తుతమున్న సమాజంపట్ల సామాజిక బాధ్యత పెరుగుతుంది. వ్యక్తి తన జీవితకాలంలో ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు అవమానాల నుంచి ఏవిధంగానైతే గుణపాఠాలు నేర్చుకుని భవిష్యత్‌లో ఎంత జాగ్రత్తగా ఉండాలని భావిస్తాడో.. అదేవిధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ స్పృహను కలిగి ఉండటం తప్పనిసరి.
-1773 చార్టర్ చట్టం మొదలుకొని 1947 భారత స్వాతంత్య్ర చట్టం వరకు బ్రిటిష్ వలసపాలన జరిగిన విధానం భారత రాజ్యాంగ రూపకల్పనకు ఆధారమైంది. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయమైనదిగా చెప్పవచ్చు.
ఏపీపీఎస్సీ సిలబస్‌లోనూ
-ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం సిలబస్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణకు దారితీసిన సంఘటనల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంతేగాక 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా.. ప్రస్తుతం ఏపీపీఎస్సీ రూపొందించిన సిలబస్‌లో నాటి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రోద్యమంతోపాటు, 2014లో తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన సంఘటనల గురించి పేర్కొన్నారు.
-ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల ఏర్పాటుకు సంబంధించిన అంశాల గురించి రెండు రాష్ర్టాల అభ్యర్థులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలన్న విషయాన్ని రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు గుర్తించాయి.
తెలంగాణ ఉద్యమం
-తమ సాంఘిక వ్యవస్థలో ఇతరుల జోక్యానికి, సంస్కృతిపై ఆధిపత్యానికి, ఆర్థిక దోపిడీకి, వివక్షతకు వ్యతిరేకంగా ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు సంఘటితంగా పోరాడటాన్ని సామాజిక ఉద్యమం అంటారు. ఈ ఉద్యమాలు ప్రధానంగా ప్రజల్లో వ్యవస్థపట్ల గల అసంతృప్తిని, దోపిడీని నిరసిస్తూ సామాజిక మార్పును కోరేవిధంగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఇది స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 తో సహా, ఎస్ఐ తదితర పోటీ పరీక్షలన్నింటిలో తెలంగాణ ఉద్యమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు.
-తెలంగాణ ఉద్యమం ఒక అస్థిత్వ పోరాటం. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కుట్రతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యింది. ఒప్పంద సంతకాల సిరా తడి ఆరకముందే ఉల్లంఘనలు మొదలయ్యాయి. చివరకు సొంతగడ్డపై పరాయివారిగా, రెండవ తరగతి పౌరులుగా జీవించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలన్నింటికి ఏకైక పరిష్కార మార్గంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై తెలంగాణ ఉద్యమం దశాబ్దాలపాటు ప్రజాస్వామ్య బద్ధంగా, అహింసా మార్గంలో కొనసాగింది.
ఉద్యమ చరిత్ర సుదీర్ఘం
-పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక ప్రత్యేక పేపర్‌గా ప్రవేశపెట్టడంపట్ల మొదట్లో కొంతమంది అపోహపడ్డారు. ఉద్యమం ముగిసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇక ఉద్యమం గురించి చర్చ ఎందుకన్నవారు కూడా ఉన్నారు. అయితే ప్రపంచంలో బలమైన ఉద్యమాలుగా పరిగణించబడుతున్న ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవాల గురించి ఆయా దేశాలేగాక ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. నాటి సమాజం తన సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలను కొనుగొన్నదన్న విషయాలను నేటి తరానికి పాఠ్యాంశాల రూపంలో అందిస్తున్నారు. ఇదే పరంపరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సిలబస్‌లో తెలంగాణ ఉద్యమం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నది.
బలమైన సామాజిక ఉద్యమం
-తెలంగాణ ఉద్యమాన్ని బలమైన సామాజిక ఉద్యమంగా పరిగణిస్తారు. యావత్ తెలంగాణ సమాజం సుదీర్ఘకాలంపాటు ప్రత్యక్షంగా పాల్గొని చేసిన ఉద్యమం ఇది. 1946-51 మధ్య కాలంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం ఆసియాలోనే రెండో అతిపెద్ద పోరాటంగా పరగిణించబడింది. ఇదే స్ఫూర్తితో 1969 నుంచి 2014 వరకు సుదీర్ఘ కాలంపాటు జరిగిన తెలంగాణ ఉద్యమం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు.
-రాజకీయాలకు, మతాలకు, కులాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనడమేగాక ఆత్మ బలిదానాలకు సైతం పాల్పడటం, పూర్తి ప్రజాస్వామ్య, అహింసాయుత మార్గాన్ని ఎంచుకున్నందుకు తెలంగాణ ఉద్యమాన్ని బలమైన సామాజిక ఉద్యమంగా సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఉద్యమ అవగాహన ఏ మేరకు ఉపయోగం?
-సాధారణంగా ఉద్యమం అనగానే ఒక భావోద్వేగ పూరితమైన, వ్యతిరేకతతో కూడుకున్న అంశంగా భావిస్తారు. అయితే వాస్తవంగా పరిశీలిస్తే సామాజిక ఉద్యమంగా కొనసాగిన తెలంగాణ ఉద్యమం.. భవిష్యత్ తెలంగాణ సమాజానికి అనేక గుణపాఠాలను నేర్పింది. ఈ శాస్త్రీయ అవగాహన పరిపాలనలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
-1948 నుంచి 1970 వరకు తెలంగాణ భావన ఎలా మొదలయ్యింది? ఏ విధంగా తెలంగాణ తన అస్థిత్వం కోసం పోరాటం మొదలుపెట్టింది? అన్న అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో నిజాం కాలంలో జరిగిన అన్యాయం, ముల్కీ ఉద్యమం వంటివి ఆనాడు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందన్న విషయాలను వివరిస్తాయి. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, మేధావులు ఉద్యోగుల పాత్ర వంటివి నేటి తరానికి తప్పనిసరిగా తెలియాల్సిన అంశాలు.
-ఇప్పటికైనా తెలంగాణలో ఉద్యోగాల విషయంలో పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశంతో.. ఆరు సూత్రాల పథకం, ఆర్టికల్ 371 (డి), రాష్ట్రపతి ఉత్తర్వులు వంటి అంశాలను సిలబస్‌లో చేర్చారు.
రాజకీయ అవగాహన కూడా
-రాజకీయాలు అనగానే ఉద్యోగులు వాటికి చాలా దూరంగా ఉండాలన్న ఒక భావన, అపోహ ఒకప్పుడు ఉండేది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు 42 రోజులపాటు చేసిన సకలజనుల సమ్మె దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ఉద్యోగుల ఒత్తిడితోనే తెలంగాణపట్ల ప్రభుత్వంలో మార్పు వచ్చిందన్న విషయాన్ని గమనించాలి.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన నక్సలైట్ ఉద్యమం, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం వంటి రాజకీయ అంశాలు రాష్ట్రంలో అనేక మార్పులకు కారణమయ్యాయి. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించిన రాజకీయ పార్టీల విధానాలు, చివరకు రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలపై అభ్యర్థులకు అవగాహన తప్పనిసరి.
అస్తిత్వ పోరాటం
ప్రతి జాతికి ఒక అస్థిత్వం, ఉనికి ఉంటుంది. దీన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాటం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఈ పోరాటాల గురించి తప్పనిసరిగా పేర్కొనడంవల్ల.. భవిష్యత్‌లో సమాజాన్ని నడిపించే ఉద్యోగ బృందానికి సమాజంపట్ల అవగాహన, సామాజిక బాధ్యతలను పెంచినట్లవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ విషయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అందుకే రాబోయే నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే తెలంగాణ నిరుద్యోగులు.. తెలంగాణ ఉద్యమం గురించి మరింత లోతైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం తప్పనిసరి. ప్రతి ఇంటర్వ్యూలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చర్చ తప్పనిసరిగా ఉంటుంది.
గ్రూప్-2లో ప్రశ్నల స్వరూపం
-తెలంగాణ ఉద్యమం గురించి అభ్యర్థులకు లోతైన అవగాహన తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశాన్ని సిలబస్‌లో పేర్కొనడమేగాక.. తదనుగుణంగా ఈ మధ్య జరిగిన గ్రూప్-2, పేపర్-4లో ఉద్యమ అవగాహనకు సంబంధించిన ప్రశ్నలను ఎక్కువ సంఖ్యలో ఇచ్చారు.
ఉదా:
1. తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లో మనం విదేశీయులమవుతాం. అక్కడికి వెళ్లాలంటే మనకు పాస్‌పోర్ట్ కావాలి అన్న రాజకీయ నాయకుడు ఎవరు?
n 2009 ఎన్నికల సమయంలో నంద్యాల సభలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
2. తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలను సూచించింది. వాటిలో మొట్టమొదటిది ఏది?
n ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి సంబంధించి యాథాతథ స్థితిని కొనసాగించాలి.
3. 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా? – వరంగల్
4. పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు? – నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్
5. ఆరు సూత్రాల పథాకానికి చట్టబద్దత కల్పించడానికి చేసిన రాజ్యాంగ సవరణ? – 32వ సవరణ
6. తెలంగాణ మహాసభ లక్ష్యం ఏమిటి?
– దళిత బహుజన రాజ్యస్థాపన
7. ఒక ఓటు రెండు రాష్ర్టాలు అని తీర్మానించిన భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది? – 1998
8. 1980వ దశకంలో మా తెలంగాణ అనే వార్తా పత్రికను ప్రారంభించిన సంస్థ ఏది?
– తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు
9. 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ సభ ఎక్కడ జరిగింది? – జలదృశ్యం
10. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం?
– పోలీసు అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా
పరిగణించడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు