దక్షిణ భారతదేశంలో ఏకైక తొలి మహిళా పాలకురాలు ఎవరు?
మహదేవుడు (క్రీ.శ. 1195-1199)
-రుద్రదేవుడికి పుత్రులు లేనందున అతని తమ్ముడు మహదేవుడు రాజ్యానికి వచ్చాడు. ఈ విషయాన్ని ప్రతాపరుద్రుడి ఖండవల్లి తామ్రదాన పత్రం ధ్రువపరుస్తుంది.
-మహదేవుడికి సంబంధించిన రెండు శాసనాలు లభించాయి. ఒకటి క్రీ.శ. 1197 నాటి పెద్దపల్లి తాలుకాలోని సుండెల్ల గ్రామంలోనిది. రెండోది వరంగల్లు కోటలో విరిగిన శాసనం (దీనిపై తేదీలేదు).
-ఇతడు తన సోదరుడు రుద్రదేవుడి మరణానికి ప్రతీకారంగా యాదవరాజ్యంపై దండెత్తి ప్రాణాలు కోల్పోయాడు.
-ప్రతాపచరిత్ర, సోమదేవ రాజీయం లాంటి గ్రంథాల ద్వారా యాదవదేశంపై మొదటి జైతుగి పాలనాకాలంలో మహదేవుడు దండయాత్ర చేశాడని, శత్రువు రాజధానిపై జరిగిన దండయాత్రలో రాత్రిపూట ఏనుగును అధిష్టించి యుద్ధం చేస్తూ వధించబడ్డాడని తెలుస్తుంది.
-మహదేవుడి భార్య బయ్యాంబ. వీరికి గణపతిదేవుడనే కుమారుడు, వెలమ లేక మైలాంబ, కుందమాంబ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
-మహదేవుడు శైవమతస్థుడు. ఇతడికి శైవదీక్షను ఇచ్చిన గురువు ధ్రువేశ్వర పండితుడు.
-ఇతడి సేనానుల్లో విశ్వాసపాత్రుడు, మిక్కిలి సమర్థుడు రేచర్ల రుద్రుడు.
-యాదవ రాజుల చేతిలో కాకతీయ సేనలు పరాజయం పొంది, రాజ్యం సంక్షోభంలో ఉన్న క్లిష్ట తరుణంలో రేచర్ల రుద్రుడు చాకచాక్యంగా వ్యవహరించి కాకతీయుల అధికారాన్ని కాపాడాడు.
గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262)
-కాకతీయుల్లో అత్యంత పరాక్రమశాలి, గొప్పవాడైన గణపతి దేవుడు తెలుగు ప్రజలందరిని సమైక్యం చేసి కాకతీయ చక్రవర్తుల్లో అత్యంత ఎక్కువ కాలం (63 ఏండ్లు) వరంగల్ రాజధానిగా తెలంగాణ, ఆంధ్రాలను పరిపాలించాడు.
-ఇతడు ఓరుగల్లును పూర్తిగా నిర్మించి రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు.
-ఇతడికి సంబంధించిన తొలి శాసనం (క్రీ.శ. 1199 డిసెంబర్ 26 నాటిది) పెద్దపల్లి జిల్లా మంథెనలో లభించింది.
-రేచర్ల రుద్రసేనాని కృషి ఫలితంగా యాదవ రాజు జైతుగి గణపతి దేవున్ని చెరసాల నుంచి విడుదల చేయటమేకాక తన కూతురైన సోమలదేవిని ఇచ్చి వివాహం చేశాడు.
-మహదేవుడి మరణం తర్వాత గణపతిదేవుడు బందీగా ఉన్న కాలంలో అల్లకల్లోలమైన కాకతీయ రాజ్యాన్ని అంతరంగిక తిరుగుబాట్ల నుంచి కాపాడిన రేచర్ల రుద్రుడు గణపతి దేవుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. దీంతో రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యభార ధీరేయుడు కాకతీయ రాజ్య సమర్థుడు అనే బిరుదులు పొందాడు.
గణపతి దేవుడి సైనిక విజయాలు
-ఇతని 63 ఏండ్ల సుదీర్ఘ పరిపాలనా కాలంలో సేనాధిపతులు రేచర్ల రుద్రుడు, మల్యాల చౌడుడు అతని విజయాల్లో కీలకపాత్ర పోషించారు. గణపతి దేవుడు ఆక్రమించిన అన్ని రాజ్యాలను తన సామ్రాజ్యంలో ప్రత్యక్షంగా విలీనం చేయలేదు. కొన్ని రాజ్యాల పాలకులను సామంతులుగా గుర్తించాడు. మరికొందరితో వైవాహిక సంబంధాలు నెలకొల్పుకున్నాడు. ఇలా తన రాజనీతిని ప్రదర్శించాడు.
-రాజధానిలో తన పరిస్థితిని చక్కదిద్దుకున్నాక గణపతిదేవుడు తన దృష్టిని తీరాంధ్ర దేశంపై మళ్లించాడు.
-మల్యాల చౌడ సేనాని నాయకత్వంలో కాకతీయ సైన్యాలు కృష్ణానది వద్ద ఉన్న ద్వీపం లేక దీవిపై దండెత్తాయి.
-అయ్యన వంశస్థుడైన పినచోడుడి ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కాకతీయులు ఆక్రమించుకోగా, ఈ విజయానికి గుర్తుగా గణపతిదేవుడు తన సేనానికి ద్వీపలుంఠకుడు, దివి చూరకారుడు అనే బిరుదులను ఇచ్చాడు.
-క్రీ.శ. 1203 నాటి మల్యాల చౌడుని కొండపర్తి శాసనం ఈ విజయం గురించి వివరిస్తుంది.
-ఈ భూభాగాన్ని తన రాజ్యంలో కలుపుకోకుండా పినచోడుడిని సామంతునిగా చేసుకొని, ఆయన కుమార్తెలైన నారాంబ, పేరాంబలను గణపతిదేవుడు వివాహమాడాడు.
-అంతేకాకుండా పినచోడుడి కుమారుడైన జాయపను గణపతి దేవుడు గజసాహిణిగా నియమించాడు.
-ఆ రోజుల్లో తీరాంధ్ర ప్రాంతంలో అత్యంత బలమైన రాజ్యం వెలనాటి రాజ్యం. దీని పాలకుడు పృథ్వీశ్వరుడు.
-గణపతి దేవుని బావమరిది నతవాడి రుద్రుడు వేయించిన బెజవాడ శాసనం ప్రకారం తీరాంధ్ర ప్రాంతాన్ని పాలిస్తున్న పృథ్వీశ్వరుని రాజ్యంపై దండెత్తిన గణపతి దేవుని సేనలు విజయాన్ని సాధించాయి.
-ఈ దండయాత్ర కాలంలోనే కాకతీయ సేనలు ధరణికోటకు చెందిన కోటనాయకులపై దండెత్తగా వారు గణపతిదేవునికి సామంతులుగా మారారు.
-పృథ్వీశ్వరుడు గణపతిదేవుని సేనలతో ముఖాముఖి యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విజయానికి గుర్తుగా శాసనాల్లో గణపతి దేవున్ని పృథ్వీశ్వర శిరఃఖండిక క్రీడా వినోద (ప్రథ్వీశ్వరుని తల అనే బంతితో ఆడుకున్నవాడు) అని వర్ణించి ఉంది.
-క్రీ.శ. 1213 నాటి చేబ్రోలు శాసనం ప్రకారం గణపతి దేవుడు జాయపసేనాపతిని వెలనాడు పాలకుడిగా నియమించాడు.
దక్షిణ దండయాత్రలు
-నెల్లూరు ప్రభువు ఒకటో మనుమసిద్ధి మరణానంతరం అతని కుమారుడు తిక్కసిద్ధి నెల్లూరు ప్రభువు కావడానికి గణపతిదేవుడు సహకరించాడు.
-దీనికిగాను గణపతిదేవునికి తిక్కసిద్ధి పాకనాటి గ్రామాన్ని ఇచ్చాడు. దీన్ని పాలించడానికి గణపతిదేవుడు గంగాసాహినిని నియమించాడు.
-తిక్కసిద్ధి మరణానంతరం విజయగండ గోపాలుడు ఇతరుల సహాయం పొంది నెల్లూరు ప్రభువు అయ్యాడు. దీంతో తిక్కసిద్ధి కుమారుడైన రెండో మనుమసిద్ధి గణపతిదేవుడి సహాయం అర్థిస్తూ రాయబారిగా తన ఆస్థాన కవి తిక్కన సోమయాజులుని పంపించాడు.
-గణపతిదేవుడు తన సామంత భోజుడిని పంపించగా, అతను విజయగండ గోపాలుడిని ఓడించి రెండో మనుమసిద్ధిని ప్రభువును చేశాడు.
-ఇందుకుగాను రెండో మనుమసిద్ధి గణపతిదేవుడికి మోటుపల్లి ఓడరేవును ఇచ్చాడు. గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవును అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధి చేసి వర్తకుల రక్షణ కోసం మోటుపల్లి అభయశాసనం వేయించాడు.
-అంతేకాకుండా ఈ మోటుపల్లి అభయశాసనాన్ని అమలుచేయడానికి సిద్ధయదేవున్ని నియమించాడు.
గణపతిదేవుని కళింగ దండయాత్ర
-వెలనాడు, నెల్లూరు తెలుగుచోళ రాజ్యాలపై విజయాలు సాధించిన గణపతిదేవుడు గతంలో పృథ్వీశ్వరుని ఆధీనంలో ఉన్న కళింగ భూభాగాన్ని ఆక్రమించడానికి తన సైన్యాలను నడిపాడు.
-గణపతిదేవుడి సేనాధిపతి ఇందులూరి సోమయమంత్రి నేతృత్వంలో కాకతీయ సేనలు విజయం సాధించాయి. ఈ విషయాన్ని సమకాలీన రచన శివయోగసారం తెలుపుతుంది.
-ఇందులూరి సోమయమంత్రి కొలను రాష్ట్ర పాలకుడిగా నియమితులయ్యాడు.
-కళింగ దండయాత్ర కాకతీయ గణపతిదేవునికి ఆశించిన మేరకు ఫలితమివ్వలేదు. ఇదేకాలంలో గణపతిదేవుడు అక్కడి రాజ్యాధినేతలతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకున్నాడు.
-తన పెద్ద కూతురైన గణపాంబను కోటరుద్రుని కుమారుడైన మైనబేతకు, రెండో కూతురైన రుద్రమదేవిని నిడదవోలు పాలుకుడైన చాళుక్య వీరభద్రుడికిచ్చి వివాహం చేశాడు.
-చివరికి కళింగ రాజైన అనియంకభీముని అనంతరం అతని కొడుకైన మొదటి నరసింహదేవుడి కాలంలో క్రీ.శ. 1238లో సైన్యాలు కళింగ, వేంగి రాజ్యాలపై దండెత్తి పూర్తి విజయం సాధించాయి.
-పాండ్యులతో యుద్ధాలు: క్రీ.శ.1263లో పాండ్య సేనలు జటావర్మ వీరపాండ్యుని నేతృత్వంలో నెల్లూరుకు సమీపంలో ముత్తుకూర్కు చేరాయి. నెల్లూరి పాలకుడు రెండో మనుమసిద్ధికి సహాయంగా వచ్చిన గణపతిదేవుని నేతృత్వంలోని కాకతీయ సైన్యాలకు, పాండ్య సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ పోరులో నెల్లూరు ప్రభువు ప్రాణాలు కోల్పోగా, నెల్లూరు పాండ్య రాజ్యంలో భాగమైంది. ఈ విధంగా తన 63ఏండ్ల పాలనాకాలంలో ఎన్నడూ ఎరుగని పరాజయాన్ని గణపతిదేవుడు ముత్తుకూరు యుద్ధంలో చవిచూశాడు. ఈ పరాజయంతో గణపతిదేవుడు రాజ్య నిర్వహణ భారం నుంచి తప్పుకుని తన కుమార్తె రుద్రమదేవికి పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు.
-గణపతిదేవుడి బిరుదులు: ఆంధ్రాధీశుడు, సకలదేశ ప్రతిష్ఠాపనాచార్య, రాయగజకేసరి
రుద్రమదేవి (1262-1289)
-గణపతి దేవుడికి కుమారులు లేకపోవడంతో తన కుమార్తె రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు పేరుతో సింహాసనాన్ని అధిష్టిపంజేశాడు.
-రుద్రమదేవి దక్షిణ భారతదేశంలో ఏకైక తొలి మహిళా పాలకురాలు. ఈమె అత్యంత ప్రతిభావంతురాలైన పరిపాలనావేత్తగా, వీరనారిగా పేరు గడించింది.
-ఈమె పరిపాలనా విశేషాలను తెలియజేయడానికి అనేక శాసనాలు, సాహిత్యాలు ఉపకరిస్తున్నాయి. ముఖ్యంగా వెనీస్ యాత్రికుడైన మార్కోపోలో ఈమె కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించి రుద్రమదేవి శక్తి సామర్థ్యాలను, ఓడరేవు వద్ద రుద్రమదేవి చేయించిన ఏర్పాట్లను ఎంతో ప్రశంసించారు.
-రుద్రమదేవి రాజ్యానికి వచ్చిన సమయంలో రాజ్యంలో జరిగిన అలజడులను సేనాని రేచర్ల ప్రసాదిత్యుడు అణిచివేసి రుద్రమదేవికి అండగా నిలిచాడు.
-ఇతనికి రుద్రమదేవి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, రాయపితామహక బిరుదులను ఇచ్చింది.
-రుద్రమదేవికి అండగా నిలిచిన మరికొందరు అధికారులు కాయస్థ జన్నిగదేవుడు, కాయస్థ త్రిపురారి, మల్యాల గుండియనాయకుడు, మాదయనాయకుడు, మహా ప్రధాన కందర నాయకుడు మొదలైనవారు ఉన్నారు.
-ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర ప్రకారం రుద్రమదేవి సింహాసనం అధిష్టించగానే ఆమె సవితి సోదరులైన హరిహర, మురారి దేవులు తిరుగుబాటు చేశారు.
-ఈ తిరుగుబాటును రుద్రమదేవి తన సేనాధిపతుల సహాయంతో అణిచివేసింది.
-తూర్పు గాంగవంశ రాజైన మొదటి భానుదేవుడి దండయాత్రను రుద్రమదేవి సేనాధిపతులైన పోతి నాయకుడు, పోలియ నాయకుడు తిప్పికొట్టారు. దీంతో కాకతీయ, గాంగరాజ్యాల మధ్య గోదావరి నది సరిహద్దు అయింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు