తుఫాన్ వచ్చే ముందు దట్టంగా ఏర్పడే మేఘాలు?
ఆర్థ్రత
సృష్టిలో లభించే నీరు 3 రూపాల్లో ఉంటుంది. అవి..
1. ఘనరూపం- ఘనరూపంలో ఉన్న నీరు మంచు
2. ద్రవరూపం- ద్రవరూపంలో ఉన్న నీరు నీరు
3. వాయు రూపం- వాయు రూపంలో ఉన్న నీరు
నీటి ఆవిరి
-వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని లేదా వాతావరణం (గాలి)లో ఒక నిర్దిష్ట సమయంలో, ఒక ప్రాంతంలో ఉన్న నీటి ఆవిరిని ఆర్థ్రత (Humidity) అంటారు.
-కొలిచినప్పుడు మాత్రమే దీన్ని ఆర్థ్రత అని, మిగిలిన సమయాల్లో నీటి ఆవిరి అని అంటారు. ఈ నీటి ఆవిరి అనేది నీటి ప్రతిరూపమే తప్ప నీరు కాదు.
-ఇది కంటికి కనిపించదు, గాలికంటే తేలిక.
-ఇది ఆవిరి (Vapour) రూపంలోనూ, చిన్న బుడగల రూపంలో (Droplets), రేణువుల (Rystals) రూపంలో కూడా ఉంటుంది.
-వాతావరణంలో ఉన్న ఈ నీటి ఆవిరి అన్ని చోట్లా ఒకేలాగా ఉండకుండా, అక్కడున్న భౌతిక భౌగోళిక పరిస్థితులను బట్టి, రుతువులు, సమయాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది.
ఉదా: ఇది సముద్ర తీరప్రాంతాల్లో ఎక్కువగాను, ఎడారుల్లో తక్కువగాను ఉంటుంది.
-ఇది వర్షాకాలంలో ఎక్కువగాను, వేసవిలో తక్కువగాను ఉంటుంది.
-ఇది ఉదయం పూట, వర్షం కురిసిన రోజు ఎక్కువగాను, మధ్యాహ్నం, వర్షం లేనిరోజు తక్కువగాను ఉంటుంది.
-భూమధ్య రేఖా ప్రాంతంలో ఎక్కువగాను, అయన రేఖా ప్రాంతంలో తక్కువగాను ఉంటుంది.
-ఇది వాతావరణం కింది పొరల్లో ఎక్కువగా, పై పొరల్లో తక్కువగా ఉంటుంది.
వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని రెండు రకాలుగా లెక్కిస్తారు. అవి..
1. నిరపేక్ష ఆర్థ్రత (Absolute Humidity)
2. సాపేక్ష ఆర్థ్రత (Relative Humidity)
నిరపేక్ష ఆర్థ్రత
-ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉన్న తేమను యధాతథంగా చెప్పడాన్ని నిరపేక్ష ఆర్థ్రత అంటారు. దీన్ని ఘనపు సెంటీమీటర్‌కు ఇన్ని గ్రాములు అని చెబుతారు (Grams/Cubic CM) .
సాపేక్ష ఆర్థ్రత
-ఒక ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉన్న నీటి ఆవిరికి, అదే ఉష్ణోగ్రత వద్ద గాలి భరించే నీటి ఆవిరికి గల నిష్పత్తిని సాపేక్ష ఆర్థ్రత అంటారు.
-దీన్ని హైగ్రోమీటర్ అనే పరికరంతో, ఆర్థ్ర, అనార్ధ థర్మామీటర్ అనే పరికరంతో కూడా కొలవవచ్చు.
ఆర్థ్రత బదిలీ జరిగే విధానం
-గాలిలో ఉన్న తేమ ఎల్లప్పుడూ ఒకే చోట ఉండకుండా తరచూ ఒక చోటు నుంచి మరో చోటికి బదిలీ అవుతుంది.
-ఈ బదిలీ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి..
1. నేల నుంచి నీటికి, నీటి నుంచి నేలకు బదిలీ కావడం
-గాలిలో ఉన్న నీటి ఆవిరి (తేమ) ఎప్పుడూ ఒకే చోట ఉండకుండా నేల (ఖండాల) నుంచి నీటికి (సముద్రానికి), నీటి నుంచి నేలపైకి బదిలీ అవుతుంది.
2. అక్షాంశ పరంగా బదిలీ అవడం
-భూగోళంపై ఉన్న అక్షాంశ పరంగా కూడా నీటి ఆవిరి బదిలీ అవుతుంది. ఇలా బదిలీ కావడంతో పరోక్షంగా శక్తి అనేది కూడా బదిలీ అవుతుంది.
మేఘాలు
-వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి బిందువుల రూపంలో ఉండి యధేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఇలా సంచరించే నీటి ఆవిరి బిందువుకు ఎప్పుడైనా ఒక దుమ్ముకణం తటస్థపడితే, దాన్ని ఆధారంగా చేసుకుని వీటి చుట్టూ సూకా్ష్మతి సూక్ష్మమైన నీటి ఆవిరి బిందువులు అనేకం చేరడం వల్ల అది మేఘం (Cloud)గా మారుతుంది.
-నేలపై ఉన్న మేఘాన్ని పొగమంచు అని, నేలకు కొంచెం ఎత్తులో ఉన్న పొంగమంచును మేఘం అని అంటారు. అంటే భూమిపై కొంత ఎత్తులో కన్పిస్తూ ద్రవీకరణం (Condensation) చెందిన నీటి ఆవిరి ప్రతి రూపాన్ని మేఘం అంటారు.
-మేఘాల గురించి, వాటి ఆవిర్భావం, అభివృద్ధి గురించి 1802లో ఫ్రాన్స్‌కు చెందిన లామార్క్ సమగ్ర పరిశోధన జరిపారు. అందువల్ల మేఘాల పేర్లన్నీ ఫ్రెంచ్ భాషలోనే ఉంటాయి.
మేఘాలు-రకాలు
ఆకాశంలో ప్రతినిత్యం మనం చూస్తున్న మేఘాలు ముఖ్యంగా మూడు రకాలు. అవి..
1. శీతల మేఘాలు (Cold clouds)
2. ఉష్ణ మేఘాలు (Warm clouds)
3. మిశ్రమ మేఘాలు (Mixed clouds)
శీతల మేఘాలు
-మేఘాల శిరోభాగాలు 00 సెల్సియస్ (నీరు ఘనీభవించే ఉష్ణోగ్రత) కంటే తక్కువగా ఉండి, అక్కడున్న నీటి బిందువుల రూపంలో కాకుండా మంచు రేణువుల రూపంలోగాని, స్ఫటికాల రూపంలోగాని ఉంటే ఆ మేఘాలను శీతల మేఘాలు అంటారు.
ఉష్ణమేఘాలు
-మేఘం యావత్తూ 00 సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటే వాటిని ఉష్ణమేఘాలు అంటారు.
-ఈ మేఘాల్లోని నీరు బిందువల రూపంలోనే ఉంటుంది.
మిశ్రమ మేఘాలు
-ఈ మేఘాల్లోని నీరు కేవలం ఘనరూపంలోనే కాకుండా బిందువుల రూపం కూడా ఉంటుంది.
-మిశ్రమ మేఘాల నుంచే వర్షం కలుగుతుందని టార్ బెర్జిరాన్, వాన్ ఫిండేసిన్ నిర్ధారించారు.
-మేఘాలను వర్షసాధనకు కృత్రిమంగా ప్రేరేపించడం కోసం డ్రై ఐస్ గానీ, సిల్వర్ అయోడైడ్ గానీ ఉపయోగించవచ్చని గ్రాహంబెల్ టెలిఫోన్ ప్రయోగశాలకు చెందిన విన్సెంట్ షప్పర్ కనుగొన్నాడు.
-మేఘాలలోని నీటి బిందువులను ఘనీభవింపచేయడానికి 100 సెల్సీయస్ నుంచి 150 సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన డ్రై ఐస్ కణాలను, నీటి ఆవిరిని నేరుగా మంచుకణాలుగా నిక్షేపించడానికి సిల్వర్ అయోడైడ్ లవణ చూర్ణం ఉపయోగపడుతుంది.
మేఘాల వర్గీకరణ
-1840లో జర్మనీ శీతోష్ణస్థితి శాస్త్రవేత్త కేమిట్జ్, లూక్ హోవార్డ్, లామార్క్ పరిశోధనలకు తుది మెరుగులు దిద్ది మేఘాల వర్గీకరణ తయారు చేశాడు.
-ప్రకృతిలోని మేఘాలు అనేక స్వరూపాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ల్యూక్ హోవర్డ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త మేఘాల ఆకారాన్ని బట్టి మూడు రకాలుగా విభజించాడు. అవి..
1. క్యుమలస్ పోగు (Heap)
2. సిర్రస్ జడ ముంగురు (Lock of Hair)
3. స్ట్రాటస్ పొర (Stratus layer)
భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) మేఘాలను వాటి వాటి ఎత్తును బట్టి మూడు రకాలుగా విభజించింది. అవి.. 1. ఊర్ధ మేఘాలు (High clouds)
2. మధ్య మేఘాలు (Middle clouds)
3. అధోఃమేఘాలు (Lower clouds)
ఆకారం, ఎత్తు, స్వరూప స్వభావాలను ఆధారంగాచేసుకుని మేఘాలను మూడు కుటుంబాలుగా వర్గీకరించవచ్చు.
అవి.. 1. కుటుంబం-ఏ: ఉన్నత మేఘాలు
2. కుటుంబం-బీ: మధ్య మేఘాలు
3. కుటుంబం-సీ: దిగువ మేఘాలు
కుటుంబం-ఏ: ఉన్నత మేఘాలు
-ఇందులో ఉండే మేఘాలను ఉన్నత మేఘాలు అంటారు. వీటి సరాసరి ఎత్తు 6000 మీ., ఉష్ణోగ్రత 200C – 600C
-సిర్రస్, సిర్రొస్ట్రాటస్, సిర్రొ క్యుములస్ మేఘాలు ఈ కుటుంబానికి చెందినవే.
సిర్రస్ మేఘాలు
-ఇవి చాలా ఎత్తులో ఉంటాయి (సుమారు 8000-12000 మీ.)
-ఇవి పల్చగా, సున్నితంగా పట్టు కుచ్చువలె మెరుస్తూ ఉంటాయి.
-ఇవి నిర్మల వాతావరణాన్ని సూచిస్తాయి.
-అయితే తుఫాన్ వచ్చే ముందు మాత్రం ఇది చాలా దట్టంగాను, ఎక్కువగాను ఉండి త్వరత్వరగా తమ ఆకారాలను మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని చోట్ల పారదర్శకంగా ఉంటాయి. మరికొన్ని చోట్ల గుర్రంతోక వెంట్రుకలను పోలి ఉంటాయి. అందుకే దీన్ని గుర్రంతోక మేఘాలు (Mares tails) అనికూడా అంటారు.
సిర్రొ స్ట్ట్రాటస్ మేఘాలు
-ఇవి పలుచని పొరలా ఆకాశాన్ని ఆవరించి ఉంటాయి.
-ఈ పొర పల్చగా, పారదర్శకంగా ఉండటం వల్ల దీనిగుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా మనకు కన్పిస్తాయి.
-ఇవి సూర్యుని చుట్టూ, చంద్రుని చుట్టూ వలయం వలే బాగా అల్లుకుంటాయి.
-ఇది తుఫాన్ రాకకు గుర్తుగా ఉంటుంది.
సిర్రొ క్యుములస్
-ఇవి సున్నితమైన చిన్న చిన్న మచ్చల రూపంలో ఉంటాయి. అయితే సూర్యరశ్మి వీటి మీద పడినప్పుడు రంగురంగులుగా అందంగా కన్పిస్తాయి.
-ఇవి బారులు తీరి గానీ, వరుసలుగా గానీ ఏర్పడుతాయి.
-మెకెరల్ అనే అందమైన చేప పొలుసులను పోలి ఉండటంతో వీటి ఆకారాన్ని మెకెరల్ ఆకారం అంటారు. అందువల్ల మెకెరల్ పొలుసులు, గుర్రపు తోకలు ఆకాశంలో కన్పిస్తే నౌకలు తెరచాపలు దించాలి అనే సామెత ఏర్పడింది. అంటే ఆకాశం నిర్మలంగా ఉంటుందని అర్థం.
ఉదా: నింబస్ అనే పదం- వర్షం ఇచ్చే మేఘాలకు వాడటం. అంటే ఈ పదం ఎక్కడున్నా వర్షాన్ని కలుగజేస్తుంది అని అర్థం. ఉదా: క్యుములో నింబస్
ఫ్రాక్టో (Fracto) అనే పదం- అంటే గాలితో ఎగురగొట్టబడ్డ అని అర్థం. అంటే గాలివేగం వల్ల భగ్నమైన మేఘ శకలాలను ఫ్రాక్టో అనే పూర్వపదంతో సూచిస్తారు.
ఉదా: ఫ్రాక్టో క్యుములస్, ప్రాక్టో స్ట్రాటస్
ఆల్టో అనేపదం- అంటే ఎత్తయినది అని అర్థం. మామూలు కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పడే మేఘాలకు ఆల్టో అనే పదం ఉపయోగిస్తారు. ఉదా: ఆల్టో క్యుమలస్, ఆల్టో స్ట్రాటస్
-ఉష్ణోగ్రత పెరిగితే గాలి తేమను పీల్చుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు తక్కువ వర్షం కురిస్తే గాలిలో తేమ పెరిగి, దాంతో శరీరంపై చిక్కదనం ఏర్పడి అసౌకర్యంగా ఉంటుంది.
-మేఘాల పేర్లు, ఆకారం మొదలైనవి వైవిధ్యంగా ఉంటాయి. కొన్ని కొన్ని మేఘాల పేరును బట్టి వాటి లక్షణాలను, భౌతిక స్థితిని కొంతవరకు అంచనా వేయవచ్చు.
-మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోవడానికి సిలోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు