బస్తర్లో రెండో కాకతీయ సామ్రాజ్యం
1323 తర్వాత కాకతీయ చరిత్ర
అది 1323 సంవత్సరం. ఢిల్లీ సుల్తాన్ కరౌనా జాతికి చెందిన ఘియాజొద్దీన్ తుగ్లక్ తన కుమారుడు జునాఖాన్ లేదా ఉల్గ్ఖాన్ (మహ్మద్ బిన్ తుగ్లక్ ) చేతిలో ఓడిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు బందీగా వెళుతున్న సమయం. అంతర్గత.. బాహ్య శత్రువు దాడులను ఎదుర్కొని
‘శత్రువులను చీల్చి చెండాడిన వీరుల వంశం..
కుప్పకూలిపోయిందన్న వేదన కావచ్చు!
ధీరుడు.. భీరుడుగా మారలేని ఆత్మగౌరవం కావచ్చు!!
తన ప్రాణంకన్నా అభిమానం ఆత్మాభిమానమే కావచ్చు!!
ముఖ్యమని భావించి శతృవులకు తన పార్దీవ దేహమే మిగలాలనే మొండితనం కావచ్చు.. ఫలితం ఆత్మహత్య’
# ఢిల్లీకి బందీగా వెళ్తున్న ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కాకతీయ వంశం అంతరించి పోయిందన్న చరిత్రనే ఇప్పటి వరకు మనం చదువుకుంది. పిల్లలకు తరగతి గదిలో బోధిస్తూ వస్తున్నది.
చరిత్రలో ఉన్నది ఏమిటి?
# 1323 తర్వాత కాకతీయ సామ్రాజ్యం ఛిన్నాభిన్నమైం ది. బహమనీలు వచ్చి ఓరుగల్లును తమ రాజ్యంలో కలుపుకున్నారని, అనంతరం రెడ్డిరాజులు, పద్మనాయకులు వంటి సామంతరాజుల ఏలుబడిలో కాకతీయ సామ్రాజ్యం ముక్కలైందనీ.. అనంతరం కుతుబ్ షాహీల చరిత్ర తదుపరి నిజాంల హయాం చివరికి ఆపరేషన్ పోలో, స్వతంత్ర తెలంగాణ ఇదే మనం చదువుకున్నాం.
అసలు ఏం జరిగింది?
#కాకతీయుల వీరత్వం, రుద్రమ్మ ధీయుక్తి ఎక్కడికీ పోలేదు. ప్రతాపరుద్రుడి మరణం తదుపరి ఏడాదే కాకతీయుల పరిపాలనా కౌశలం కొత్త చివుళ్లు పోసుకున్నది.
# అసలు ప్రతాపరుద్రుడు నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా! అతని మరణంతో కాకతీయ సామ్రాజ్యం అంతం కాలేదా? దీనికి సమాధానాలు చరిత్రకారులు పేర్కొనక పోయినప్పటికీ మన ముందు రెండు తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయి. దానికి ఇప్పటి చరిత్రకారులు ఏ సమాధానాలు చెప్తారో మరి..?
తిరుగులేని సాక్ష్యాలు ..
# 1940లో నాటి బ్రిటిష్ -ఇండియా ప్రభుత్వం ‘మెమోరాండం ఆన్ ది ఇండియన్ స్టేట్స్ 1940’ అనే పుస్తకంలో కాకతీయ చివరిరాజు ప్రతాపరుద్రుడి మరణం తర్వాత అతని వారసులు బస్తర్ జిల్లాలోని ‘దంతేవాడ’లో రెండో కాకతీయ మహా సామ్రాజ్యం అన్నమ దేవుడు (ప్రతాపరుద్రుని సోదరుని కుమారుడు) 13 వేల చ.కి.మీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసి ఆరువందల సంవత్సరాల పాటు 20 మంది కాకతీయ రాజులు పరిపాలించినట్లు వివరించబడినది. నాటి ప్రభుత్వం ప్రకటించిన ఆ పుస్తకంలోని వివరాలు యథాతథంగా …..
BASTAR: The Ruling Family of Bastar state claim descent from Annam Deo, brother of Pratap Rudra, the most brilliant Ruler of the Kakatiya Dynasty.
Who lost his life and kingdom in a battle with the moghuls early in the 14th century. Annam Deo who came from ’Warangal in the Deccan, established himself in the village of Bastar’. In the eighteenth century the capital was removed to ’Jagdalpur’. After years of hostilites between Bastar and Jeypore, the state came under the influence of the Bhonslas and it passed to the British Gover-nment in 1853.
#ఇది తొలి సాక్ష్యం .. ఇక రెండోదాని గురించి చూస్తే.. రెండో కాకతీయ సామ్రాజ్యంలోని మహారాజ ప్రవీర్ చంద్రభంజ్ దేవ్ (మధ్యప్రదేశ్ ) కాకతీయ అని పేర్కొం టూ సుప్రీంకోర్టు విడుదల చేసి పత్రం (ఇది 1960, నవంబర్ 18న సుప్రీంకోర్టు ధ్రువీకరించింది)
పై రెండు ఆధారాలు తిరుగులేని సాక్ష్యాలు..
# ఇంక మనం ప్రతాపరుద్రుని మరణంతో కాకతీయ సా మ్రాజ్యం అంతం.. అని పాఠ్యాంశాల్లో చెప్పడం ఎంతవరకు సమంజసం? మన రాష్ట్రంలో, మన ప్రభుత్వ హయాంలోనైనా కాకతీయుల రెండో మహాసామ్రాజ్యాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి వాస్తవమైన అంశాలను తెలియజేస్తే.. వాస్తవ చరిత్రను మనం ముందుతరాల వారికి అందించిన వారసులం అవుతాం.
బస్తర్ పాలకులు కాకతీయులే!
# ఎక్కడి ఓరుగల్లు. ఎక్కడి బస్తర్ (ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం) మన కాకతీయ రాజులకు చివర దేవుడు అని ఉంటుంది. ఇక్కడి రాజులకు భంజ్ ఉంటుంది. 1940లో బ్రిటీష్ వారు ప్రకటించిన ‘ది ఇండియన్ స్టేట్స్’ పుస్తకంలో కాకతీయులే ఈ గంజ్ రాజ్య వంశీయులు అని చెప్పింది. ఆచార్య ఎన్ జీ రంగా రాసిన ‘కాకతీయనాయక్స్’ అనే పుస్తకంలో కూడా కాకతీయ రెండో రాజ్యం బస్తర్ లో తిరిగి మొదలైందనే ధ్రువీకరణ కన్పిస్తుంది. ప్రతాపరుద్రుని మరణానంతరం బస్తర్ జయపూర్ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లిపోయిన అన్నమదేవుడు ఆయన అనుచరులు అక్కడ చిత్రకూట్ రాజధానిగా బలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని ‘రంగా’ పుస్తకంలో కన్పిస్తుంది. తూర్పు కనుమల్లోని ఎత్తయిన పర్వత సానువుల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ రాజ్యం ఉండటం వల్ల బ్రిటిష్ పాలకులు జయించలేకపోయారు. దాంతో బస్తర్ పాలకులు పాక్షిక స్వయం ప్రతిపత్తి హోదా కల్పించారు. దీంతో 600 సంవత్సరాల పాటు బస్తర్ లో కాకతీయలు రెండో సామ్రాజ్యం కొనసాగించారని’ ఆచార్య రంగా తన పుస్తకంలో పేర్కొనడం గమనార్హం.
# 1940 నాటికి బస్తర్ సామ్రాజ్యం 13.62 చ.కి. మైళ్లు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ బస్తర్ కాంకేర్ నారాయణపూర్ జిల్లాలను.. బస్తర్ జోన్ గా చెప్తారు.
ఆదివాసుల ఆరాధ్యుడు ప్రవీర్ చంద్ర భంజ్ కాకతీయ
# 1947 వరకు రాజుగా ఉన్న ప్రవీర్ చంద్రభంజ్ కాకతీయను 1966లో భారతప్రభుత్వం కాల్చిచంపింది. బస్తర్ జిల్లాలో వలసవాదుల భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా 1966లో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. దీనికి ప్రవీర్ చంద్రభంజ్ దేవ్ నేతృత్వం వహించారు. గిరిజనులను ఏకంచేసి పోరాడారు. కానీ తిరుగుబాటును భారతప్రభుత్వం అణిచివేసింది. 1966 మార్చి 25న పోలీస్ చర్యలో భాగంగా ఆయనను బంధించి జగదేవ్ పూర్ ప్యాలెస్ మెట్లపైనే కాల్చిచంపింది భారత ప్రభుత్వం. అన్నమదేవుడు ఈ వంశంలో 23వ రాజు. కమల్ చంద్రభంజ్ దేవ్ ప్రస్తుతం మహారాజు హోదా లో ఉన్నారు. లండన్ లో విద్యాభ్యాసం చేసిన కమల్ భంజ్ ప్యాలెస్ లోనే ఉంటూ.. ఈమధ్య రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం జగదేవ్ పూర్ లోని రాజప్రసాదం చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది.
# కాకతీయ చరిత్రను తిరిగి రచించి, కాకతీయులు నిర్మించిన ఓరుగల్లును, వేయి స్తంభాలగుడిని, లక్నవరం సరస్సును, రామప్పదేవాలయాన్ని వారసత్వ సంపదలు గా గుర్తించి ప్రపంచం గర్వించదగ్గ రీతిలో ఉత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలదే.
#ఈ మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు పట్టాభిషేకం జరిగి 500 ఏళ్లు అయిన సందర్భంగా ఉత్సవాలకు ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. ఇటీవల కాకతీయ ఉత్సవాలకు (వేయిస్తంభాల గుడి 800 సంవత్సరాలు. రామప్పదేవాలయం 850 సంవత్సరాలు అయిన సందర్భంగా) ప్రభుత్వం కేటాయించినది కోటి రూపాయలు మాత్ర మే. అసలు కాకతీయ ఉత్సవాలు జరిగినట్లుగా ఓరుగల్లు వాసులకే తెలియదు. అంటే ప్రభుత్వం ఏరీతిలో ఉత్సవాలను నిర్వహించిందో అర్థం అవుతుంది. ఇప్పటికైనా మన ప్రభుత్వం మన ఆత్మగౌరవం పేరుతో మన ఉత్సవాలను రూ. 800 కోట్లతో ఖర్చుచేసి ఘనంగా ప్రపంచం అబ్బురపడేవిధంగా నిర్వహిస్తుందని ఆశిద్దాం..!
బస్తర్ రాజులు వీరే…
# 1324-1369 అన్నమదేవ్
# 1369-1410 హామీర్ దేవ్
#1410-1468 భాయితాయ్ దేవ్
#1468-1534 పురుషోత్తమ్ దేవ్
# 1680-1709 దిక్బాల్ దేవ్
# 1709-1721 రాజ్ పాల్ దేవ్
# 1721-1731 మామా
# 1731-1774 దళ్ పత్ దేవ్
#1774 దర్గావుదేవ్
# 1774-1777 అజ్మర్ సింగ్ దేవ్
# 1777-1819 దర్గావుదేవ్(రెండోసారి)
#1819… వివరాలు లేవు
#1830-1853 భోపాల్ దేవ్
# 1853-1891 భాయ్ రాందేవ్
# 1891-1921 రుద్రప్రతాప్ దేవ్
#1922-1936 మహారాణి ప్రపుల్ల కుమారీదేవి.
# 1936-1947 ప్రవీర్ చంద్రభంజ్ దేవ్ (భారతప్రభుత్వం గుర్తింపు పొందిన రాజు)
#విజయ్ చంద్రభంజ్ దేవ్ (గుర్తింపు పొందిన రాజు)
#భరతచంద్రభంజ్ దేవ్ (గుర్తింపు పొందిన రాజు)
#కమల్ చంద్రభంజ్ దేవ్ (ప్రస్తుత రాజవంశీయుడు)
ఓరుగల్లుపై 3వ దాడి
#1316 సంవత్సరంలో అల్లావుద్దిన్ ఖిల్జీ మరణం తర్వాత దక్షిణ భారత రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. దేవగిరి రాజ్యంలో రామచంద్రదేవుని అల్లుడు హరిపాలదేవుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ప్రతాపరుద్రుడు కూడా కప్పం కట్టడం నిలిపివేశాడు. ముబారక్ ఖిల్జీ సుల్తాన్ కాగానే స్వాతంత్య్రం ప్రకటించిన దక్షిణ దేశ రాజ్యాలను తిరిగి తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవడానికి దండయాత్రలకు పూనుకున్నాడు. తానే స్వయంగా దేవగిరిపై దండెత్తి హరపాలదేవుడ్ని యుద్ధంలో సంహరించి దేవగిరి రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్ లో కలిపాడు. తర్వాత ముబారక్ ఖిల్జీ వరంగల్ పై 3వ దండయాత్ర చేశాడు. ఖుస్రూ అనే సమర్థుడైన సైన్యాధిపతిని ముబారక్ ఖిల్జీ ఓరుగల్లుపై రాజ్యంపైకి పంపించాడు.
# ఖుస్రూఖాన్ కాకతీయ సరిహద్దుకు చేరగానే ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించమని కబురు చేశాడని కప్పం చెల్లించటానికి అభ్యంతరం లేదని, ఢిల్లీ మార్గంలో దొంగల బెడద ఎక్కువగా ఉన్నందున తాను కప్పం పంపలేదని, అంతేగాని వేరే ఉద్దేశం లేదని, కప్పంతోపాటు ఖుస్రూఖాన్ కు బహుమతులుకూడా పంపగలమని సందేశం పంపి, వెంటనే కప్పం, ఇతర బహుమతులు పంపాడని, అందుకు సంతోషించిన ఖుస్రూఖాన్ సుల్తాన్ ఆజ్ఞ ప్రకారం ఒక ఛత్రాన్ని, వజ్రాలు పొదిగిన కత్తిని ప్రతాపరుద్రునికి పంపాడని ఇస్సామి రాశాడు. వారు ఇద్దరూ పరస్పర విరుద్ధంగా రాసినప్పటికీ ఖుస్రూఖాన్ ప్రతాపరుద్రున్ని లొంగదీసి కప్పం వసూలు చేశాడని, కాకతీయరాజ్యంపై తిరిగి ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని నెలకొల్పాడని భావించవచ్చు.
ఢిల్లీలో తుగ్లక్ పాలన
# ప్రతాపరుద్రుడు కంపిలి రాజ్యంపై పోరాడుతున్న సమయంలో ఢిల్లీ రాజకీయాలు మారడంతో ఖిల్జీ వంశం పతనమై ఘియాజొద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. (ముబారక్ ఖిల్జీ సేనాని ఖుస్రూఖాన్ సుల్తాన్ ను హత్యచేసి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇది సహించని ఢిల్లీ సర్దారులు అతన్ని వధించి ఘియాజోద్దీన్ తుగ్లక్ ఆధ్వర్యంలో తుగ్లక్ వంశం అధికారంలోకి వచ్చింది)
# ఈ అధికార మార్పిడితో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ కు కప్పం కట్టడం మానివేశాడు. ప్రతాపరుద్రున్ని లొంగదీసుకోవడానికి, కప్పం తిరిగి వసూలు చేసుకో వడానికి తన కుమారుడైన ఉల్గుఖాన్ ను ఘియాజొద్దిన్ తుగ్లక్ ఓరుగల్లుపైకి పంపించాడు. (కప్పం కట్టడం మానివేసినందునే ఈ దాడి జరిగిందని పెరిస్టా అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు). ఉల్గుఖాన్ తోపాటు అబురీజా అనే మరొక సేనాని నాయకత్వంలో కోటగిరిపై దాడి చేశాడు. ప్రతాపరుద్రుడు ఈ దాడులను ఎదుర్కొని ముస్లిం సైన్యాలను ఓడించి తరిమివేశాడు.
# ఉల్గుఖాన్ తొలి దండయాత్ర విఫలమవడంపై ముస్లిం చరిత్రకారులు అనేక కారణాలు పేర్కొన్నారు. ఉల్గుఖాన్ ఓరుగల్లులో ఓడిపోయి దేవగిరి పారిపోయాడని బరౌని రాశాడు. కొటగిరిని ముట్టడించే సమయంలో ముస్లిం సేనాధిపతి అబూరిజాఖాన్ ఉల్గుని రక్షించి ఢిల్లీ పారిపోయారని ఇస్సామి వర్ణించాడు. మొదటిసారి ప్రతాపరుద్రుని చేతిలో ఓడిపోయిన ఉల్గూఖాన్ ఢిల్లీకి పోయి అదనపు సైన్యంతో తిరిగి రెండోసారి ఓరుగల్లును ముట్టడించాడు. ప్రతాపరుద్రున్ని ఓడించి బంధీగా చేసి ఖాదర్ ఖాన్ , ఖ్యాజహజి అను అమీరుల ఆధిపత్యంలో ఢిల్లీకి పంపగా ప్రతాపరుద్రుడు అవమానభారంతో మార్గమధ్యలోనే నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా క్రీ.శ 1323లో ప్రతాపరుద్రుని మరణంతో ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా అస్తమించిపోయింది. కానీ ఓరుగల్లులో అస్తమించిన కాకతీయ సామ్రాజ్యం ‘బస్తర్ ’లో వెలుగొందిన వైనాన్ని చరిత్ర విస్మరించింది.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్ .
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు