తెలంగాణ భయాలే నిజమయ్యాయి ( తెలంగాణ ఉద్యమ చరిత్ర )
నెహ్రూ వ్యాఖ్యలపై విశ్లేషణ
# జనార్దన్‌రెడ్డి, స్టేట్ ఆఫ్ హైదరాబాద్ కేసులో 1951 మార్చి 16న, 1952 డిసెంబర్ 14న ఇచ్చిన రెండు తీర్పులు భారత న్యాయ చరిత్రలో ఎంతో విశిష్టమైనవి. ఇది నెహ్రూను మరింత కలవర పెట్టింది. ఐక్యరాజ్యసమితి ఏ నాటికైనా పాకిస్థాన్ ఒత్తిళ్లకు లొంగి నిజాం ఫిర్యాదుపై తీర్పు చెబితే హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రాన్ని ఇవ్వాల్సి వస్తుందని హోంశాఖలోని ఉన్నతాధికారులు, విదేశీ వ్యవహారాలు, ఐక్యరాజ్యసమితిలో భారతదేశ వ్యవహారాలు చూసే నిపుణులు, ఆంధ్ర ప్రాంత నాయకులు పదేపదే చేసిన ఒత్తిడికి లోనై హైదరాబాద్ విచ్ఛిత్తికి, తెలంగాణ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా వినకుండా ఆంధ్రలో అవశేష హైదరాబాద్ రాష్ట్రం విలీనం చేయడానికి అంగీకరించారనేది స్పష్టమవుతుంది.
రాష్ట్రం ఏర్పడిన తొలిరోజునుంచే జరిగిన అన్యాయాలు
# ఇంత స్పష్టంగా నెహ్రూ శాసనసభ్యులు, మంత్రులను ఉద్దేశించి చెప్పినా ఆయన హైదరాబాద్‌ను వదిలిపోగానే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నీలం సంజీవరెడ్డి నెహ్రూ చెప్పినదానికి పూర్తి భిన్నంగా నూటికి నూరు శాతం సంకుచితంగా, నిలువెల్లా విషం నింపుకుని తన వికృత చేష్టలకు తెరలేపారు.
# తెలంగాణ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని చూరగొనమని నెహ్రూ అంత స్పష్టంగా చెప్పినా తన కక్షపూరిత మనస్తత్వాన్ని, వివక్షాపూరిత ధోరణిని బాహాటంగానే వీరి పాలనలో అమలు చేసి తెలంగాణను ‘ఆంధ్ర వలస’గా మార్చాడు. నవంబర్ 1న 12 మంది సభ్యులతో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గం ఏర్పడింది.
# తొలి మంత్రివర్గంలోనే ఆశ్రిత పక్షపాతం, కక్షపూరిత ధోరణి ప్రజలకు తేటతెల్లమైంది. ‘తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో ఎట్టి పరిస్థితిలోనూ విలీనం చేయకూడదని గట్టిగా పోరాడి, చివరిదాకా విలీనాన్ని వ్యతిరేకించి ప్రజల పక్షాన నిలబడిన మరి చెన్నారెడ్డికి (బూర్గుల మంత్రివర్గంలో సీనియర్ మంత్రికి) మంత్రిపదవి ఇవ్వలేదు. పైగా ఆంధ్రప్రాంత సెటిలర్ అయిన వల్లూరి బసవరాజుకు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఇచ్చారు. పైగా ఆయనకు రెవెన్యూ శాఖను అప్పగించారు. తెలంగాణ నాయకులలో చీలికలు తెచ్చి, వారిని విశాలాంధ్రకు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించి, తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయడానికి ప్రధాన కారకుడు వల్లూరి బసవరాజు.
# నీలం సంజీవరెడ్డి చేసిన రెండో దుర్మార్గం తెలంగాణ ప్రాంత వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా నియమించకపోవడం, పెద్దమనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన నలుగురు ఆంధ్ర నేతల్లో నీలం సంజీవరెడ్డి కూడా ఒకరు. ఆ ఒప్పందం ప్రకారం స్పష్టంగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం నుంచి ఉంటే, తెలంగాణ వ్యక్తిని ఉపముఖ్యమంత్రిగా నియమించాలి. అయితే ఉపముఖ్యమంత్రి అనేది ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గంలో బహుశా ఆరోవేలు అయి ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నిటికీ కాదు. ఎందుకంటే పెద్దమనుషుల ఒప్పందంలో ముఖ్యమంత్రిగాని, ఉపముఖ్యమంత్రి గాని ఎవరు తెలంగాణవారైతే వారు ప్రాంతీయ మండలికి అధ్యక్షులుగా ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాంతానికి ఉపముఖ్యమంత్రి పదవి అంటూ ఇస్తే అది కేవీ రంగారెడ్డికి ఇవ్వాల్సి ఉంటుంది.
# రంగారెడ్డి చివరి దాకా విశాలాంధ్రను వ్యతిరేకించిన నాయకులు. అంతేగాక ఆంధ్రుల మోసాలు, నయవంచనల గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ప్రధాని నెహ్రూ వంటి అగ్రనేతలతోనైనా రాజీపడని నేత కేవీ రంగారెడ్డి ఉపముఖ్యమంత్రి అయితే తెలంగాణ రీజినల్ కమిటీ చైర్మన్‌గా ఆయననే నియమించాల్సి ఉంటుంది. ఆ హోదాలో ఆయన కొనసాగినంతకాలం తెలంగాణ నదీ జలాలను, నిధులను తన ఇష్టానుసారంగా ఆంధ్రకు తరలించుకుపోవడం కుదరదు.
# అదే తన అనుయాయుడైన తెలంగాణ వ్యక్తిని తెలంగాణ రీజినల్ కమిటీ చైర్మన్‌గా నియమించుకుంటే ‘వనరుల తరలింపునకు’ ఎలాంటి ఆటంకమూ ఉండదు. తన దోపిడీని ప్రశ్నించేవారుండరు. రీజినల్ కమిటీ స్థాయిని నామమాత్రమపు ‘మొక్కుబడి’ కమిటీగా దిగజార్చవచ్చుననే కుట్ర ఈ ఉపముఖ్యమంత్రి పదవిని ఎవ్వరికీ ఇవ్వకపోవడం వెనుక దాగి ఉన్నది.
తెలంగాణ రీజినల్ కమిటీ ఏర్పాటు
# పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాల ప్రకారం తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రక్షణలు (సేఫ్ గార్డ్) కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ రక్షణల ఆధారంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీ ఆర్డర్-1958 ఫిబ్రవరి 1న, 1958న భారత రాష్ట్రపతి (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ చేశారు. దీన్నే తెలంగాణ రీజినల్ కమిటీ (టీఆర్సీ)గా వ్యవహరించారు.
# చైర్మన్ ఎన్నిక: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ శాసన సభ్యుడు కే అచ్చుతరెడ్డి, కమ్యూనిస్టు శాసన సభ్యుడు రావి నారాయణరెడ్డిపై 41 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది రీజినల్ కమిటీకి తొలి చైర్మన్ అయ్యారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి తెలంగాణ శాసన సభ్యుల్లో విశాలాంధ్ర సమర్థుడైన బీవీ గురుమూర్తిని చైర్మన్‌గా ఎన్నుకోవాలని నీలం సంజీవరెడ్డి, వీబీ రాజు తదితరులు తీవ్రంగా ప్రయత్నించారు. తమ అనుచరడు రీజినల్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైతే ఆ కమిటీ స్థాయిని నామమాత్రపు కమిటీ స్థాయికి దిగజార్చవచ్చనేది వీరి ఆలోచన.
# అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ధేబర్ ఆధ్వర్యంలో మార్చి 27న తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రీజినల్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నిక నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పోటీల్లో బీవీ గురుమూర్తి పేరును మీర్ అహ్మద్ అలీఖాన్ ప్రతిపాదించగా బేతి కేశవరెడ్డి బలపర్చారు. కే అచ్చుత రెడ్డి పేరును కేవీ రంగారెడ్డి ప్రతిపాదించగా వాసుదేవ్ నాయక్ బలపర్చారు.
#రహస్య బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో కే అచ్యుత రెడ్డికి 43 ఓట్లు రాగా, బీవీ గురుమూర్తికి 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. శాసనసభలోని తెలంగాణ సభ్యులు 105 మంది కాగా వీరిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 68. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అచ్యుతరెడ్డిని పార్టీ ఎంపిక చేసింది.
# ఉపాధ్యక్ష పదవికి మాసుమా బేగం పేరును మంత్రి మెహిదీ నవాజ్ జంగ్ ప్రతిపాదించగా, డిప్యూటీ స్పీకర్ కొండా లక్ష్మణ్ బలపర్చారు. షాజహాన్ బేగం పేరును గోకా రామలింగం ప్రతిపాదించగా డీ హనుమంతరావు బలపర్చారు. అయితే షాజహాన్ బేగంకు మద్దతుగా ఎక్కువ మంది లేకపోవడంతో ఆమె పోటీ నుంచి వైదొలిగారు.
# మార్చి 31న జరిగిన తెలంగాణ రీజినల్ కమిటీ సమావేశానికి మంత్రి మెహిదీ జంగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కే అచ్యుతరెడ్డి పేరును నూకల రామచంద్రారెడ్డి ప్రతిపాదించగా హోంమంత్రి కేవీ రంగారెడ్డి, డిప్యూటీ స్పీకర్ కొండా లక్ష్మణ్ బలపర్చారు.
#ప్రతిపక్ష అభ్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు రావి నారాయణరెడ్డి పేరును స్వతంత్ర సభ్యుడు కృష్ణమాచారి ప్రతిపాదించగా కేఎల్ నరసింహారావు బలపర్చారు. మొత్తం 105 మంది సభ్యుల్లో సోషలిస్టు పార్టీకి చెందిన ఐదుగురు తటస్థంగా ఉండగా 15 మంది ఈ సమావేశానికి హాజరుకాలేదు. కే అచ్యుతరెడ్డి 63 ఓట్లు పొంది చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రావి నారాయణరెడ్డికి కేవలం 22 ఓట్లు మాత్రమే వచ్చాయి.
# వైస్ చైర్మన్ పదవికి మాసుమా బేగంను 1958, మే 16న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం చైర్మన్ కే అచ్యుతరెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఆదిలోనే ఉల్లంఘనలు
# విశాలాంధ్ర ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ మేధావులు, నాయకులు ఫజల్ అలీ కమిషన్ ముందు ఏ భయాలు, సందేహాలు అయితే వెల్లడించారో అవన్నీ ఒక్కొక్కటిగా నిజమయ్యాయి.
# ఆంధ్ర ప్రాంత నేతల ఆధిపత్య ధోరణివల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే తెలంగాణకు ఇచ్చిన హామీలకు, చేసిన వాగ్దానాలకు, రాసుకున్న ఒప్పందాలకు తిలోదకాలు ఇవ్వడం మొదలైంది.
# పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలకు 1956, ఆగస్ట్ 10న పార్లమెంట్లో హోంశాఖ సహాయ మంత్రి బీఎన్ ధాతర్ ప్రకటించిన రక్షణలకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ ప్రకటనలోని అంశాలే ఒక నోట్‌గా ఆంధ్ర శాసనసభకు అదే రోజు సమర్పించారు.
#ఈ అంశాలకు 1958, ఫిబ్రవరి 1న జారీ అయిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ (ఏపీ రీజినల్ కమిటీ ఆర్డర్-1958)లోని అంశాలకు మధ్య కూడా చాలా మార్పులు చేర్పులు చేశారు.
హైదరాబాద్ సంస్థానానికి అస్థిత్వం లేనందున ఇక ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేదనే భావనే నెహ్రూకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటువల్ల మానసిక ఆనందం కలిగించింది. విలీనాన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నెహ్రూ ఇంకా ఇలా అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులపైన, మంత్రులపైన చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇతర మంత్రి వర్గాల కంటే ఎక్కువ బాధ్యతలే ఉన్నాయి. ఇక్కడ అనేక క్లిష్ట సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అనేక విధాలా మీకిది పరీక్ష లాంటిది.మీరెంతవరకు విశాల దృష్టిని, సామరస్య కాంక్షను ప్రదర్శిస్తారో, ఇతరుల్లో ఎంతవరకు విశ్వాసాన్ని పూరిస్తారో చూడాల్సి ఉన్నది. కాంగ్రెస్‌లో మనం సంకుచిత విధానాలను, ముఠాల వ్యవహారాలను ప్రతికూలిస్తున్నాం. ఇతరుల, తన ప్రత్యర్థుల విశ్వాసాన్ని కూడా చూరగొనేవాడే గొప్పవాడు. ఇతరులతో సరిపుచ్చుకోలేనివాడే అల్పుడు. హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఇతరుల విశ్వాసాన్ని చూరగొనడానికి అందరూ ప్రయత్నించడం అవసరం. మంత్రులు, శాసనసభ్యులు విశాల దృక్పథంతో వ్యవహరించాలి. సంకుచితంగా వ్యవహరించకూడదు. బంధువర్గ పక్షపాతం, అవకాశవాదం మొదలైన స్వల్ప విషయాల గురించి నేను చెప్పడం లేదు. వాటిని నిర్మూలించాల్సిందే. ఇంతకంటే అప్రత్యక్షంగా జరిగేవాటి గురించి నేను చెబుతున్నాను.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు