నిజాం రాజ్యంలో తెలంగాణ అభ్యుదయం-ప్రముఖుల కృషి
తెలంగాణ చరిత్రలో 20వ శతాబ్దం ప్రథమ పాదం మూఢాచార సంప్రదాయాలతో నిద్రాణంగా ఉన్న జాతిని మేల్కొలిపిన మహానుభావులు ఎందురో ఉన్నారు. ఒకవైపు దేశ స్వాతంత్య్ర పోరాటం నడుస్తూ ఉంటే భారతదేశ గత చరిత్ర వైభవాన్ని పొగుడుతూ, స్వదేశీ ఉద్యమాన్ని నూతన ఒరవడిలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి అనేక మంది కవులు, రచయితలు, సాహితీ వేత్తలు, సాహిత్య పోషకులు ఎంతో కృషి చేశారు. అలాంటి వారిలో కొమర్రాజు లక్ష్మణరావు, నడిగూడెం రాజా నాయని వెంకట రంగారావులు ప్రప్రథములు. 1905లో నల్లగొండ జిల్లా ఏర్పడితే, 1959లో మునగాల-నల్లగొండ జిల్లాలో కలపబడింది. సంస్థానం పేరు మునగాల, కేంద్రం-నడిగూడెం.
-తెలంగాణలో ఎంతోమంది జమీందార్లు, జాగీర్దార్లు, ముఖ్తేదార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు ఉన్నారు. అందులో కొందరు సాహిత్య సంస్కృతి అన్న విషయాలపై మక్కువ చూపారు. అందులో ప్రముఖులు మునగాల రాజా నాయని వెంకట రంగారావు బహదూర్ ఒకరు. రాజాగారి పూర్వీకులు కీసర్ వారు. కీసర లచ్చమ్మరావు సంతానం లేక రంగారావును దత్తత తెచ్చుకొన్నారు. వీరి స్వగ్రామం నెల్లికుదురు (మానుకోట తాలూకా) వరంగల్. రంగారావు 1877లో రాఘవరెడ్డి గోపెమ్మలకు జన్మించారు. రంగారెడ్డి గారికి నరసింహారెడ్డి, అప్పారెడ్డి ఇద్దరు అన్నలు, వరదారెడ్డి అను తమ్ముడు, చూడమ్మ, సింగమ్మ ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మునగాల పరగణా పేరుతో మునగాల జమీందారు అయ్యారు. అసలు కేంద్రం నడిగూడెం. దీని పూర్వపట్టణంగా కొంతకాలం సిరిపురం గ్రామం ఉండేది.
-మునగాల పరగణా పేరు బ్రిటిషు సంస్థానంలో ఉన్నప్పటికీ నిజాం రాజ్యం చేత చుట్టబడి ఉండేది.
-మునగాల పరగణాలో 40 గ్రామాలు ఉండేవి. వీటి వల్ల జమీందార్ ఆదాయం సుమారు ఐదారు లక్షల వరకు ఉండేది. బ్రిటిషు వారికి వీరు ప్రతి ఏటా 90 వేల రూపాయలు పేష్కష్ చెల్లించేవారు. నాయని వెంకట రంగారావు చిన్నప్పటి నుంచి కూడా భారత, భాగవతాది గ్రంథాలెన్నింటినో చదివాడు. ఆంగ్లం, ఉర్దూ, సంస్కృతం విద్యలను అభ్యసించాడు. ఎఫ్ఏ (ఇంటర్) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ధైర్యం, దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వీరిలో ఎక్కువ. స్వామి వివేకానంద, బిపిన్ చంద్రపాల్, దాదాబాయి నౌరోజీ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి వారితో వీరికి ప్రత్యక్ష పరిచయాలు ఉండేవి. వీరి సంస్థానంలో ఆయుర్వేదశాల, ఖద్దరు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమలను స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించారు.
సాహిత్య సేవ
-స్వయంగా బహుభాషా పరిశోధకులు, చరిత్ర పరిశోధకులైన కొమర్రాజు గారు వీరి దివాన్‌గా పనిచేయడం వల్ల వీరికి సాహితీ సేవ చేసే అవకాశం లభించింది.
-1901లో కొమర్రాజు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని స్థాపించగా వీరు పోషించారు.
-హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని 1901, సెప్టెంబర్ 1న స్థాపనకు కారుకులైన వారిలో వీరు ఒకరు. దీనికి మొదట 5 ఏండ్ల వరకు కార్యదర్శిగా పనిచేశారు. అధ్యక్షులుగా 1920-40 సంవత్సరాల మధ్య పనిచేశారు.
-శ్రీవిజ్ఞాన చంద్రికా పరిషత్తు, నారాయణగూడ-బాలికా పాఠశాలకు వీరు ఆర్థిక సహాయం అందించారు.
-చిలుకూరి వీరభద్రరావుగారు రాసిన ఆంధ్రుల చరిత్ర, గొల్లపూడి సీతారామశాస్త్రిగారి వేదగ్రంథాలు వీరి సహాయంతోనే అచ్చయ్యాయి.
-కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారి పేరుతో పరిశోధన మండలి స్థాపితమై తద్వారా తెలంగాణలో అనేక శాసనాలను ప్రచురించడానికి వీరి ఆర్థిక సహాయం తోడైంది.
-వీరి ఆస్థాన కవులుగా శ్రీకోదాటి గోపాల్‌రావు ఉండేవారు.
-ఆదిపూడి సోమనాధరావుగారు రచించిన శ్రీకృష్ణదేవరాయ చరిత్రను రాజుగారికి అంకితమిచ్చారు. దీని పీఠికలో రాజావారి, నాయని వంశ చరిత్రను తెలిపారు.
-ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగానికి వీరు ఉపకార వేతనం ఇచ్చేవారు.
-మద్రాస్ విశ్వవిద్యాలయం కూడా వీరి చేత విరాళం పొందింది.
-గాంధీగారు 1929లో పర్యటించినపుడు ఖద్దరు నిధి నిమిత్తం రూ. 1000 విరాళం ఇచ్చారు.
-మునగాల పరగణాలోని సుమారు 10 గ్రామాల్లో ప్రాచీన దేవాలయాలను బాగుచేయించారు. నిత్య పూజాది కైంకర్యములకు ఇనాంలిచ్చి అభివృద్ధి చేశారు. నడిగూడెంలో ఉన్న సారంగేశ్వరాలయం, రేపాలలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సిరిపురంలోని కోదండరామాలయం, రంగనాయకస్వామి ఆలయాలు మొదలైనవి కలవు.
-రాజాగారు వారి కుమారులకు ముద్దుగా టోగో, నాగీ అనే పేర్లు పెట్టుకొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆదిపూడి సోమనాథరావుగారిని పురమాయించి జపాన్ చరిత్రను రాయించారు.
-మద్రాస్ యూనివర్సిటీ వారు గెలెత్తి అనే పాశ్చాత్యుని చేత ఆంగ్ల వ్యాఖ్యానంలో-రోమన్ లిపిలో నిర్మించిన తెలుగు-ఇంగ్లిషు నిఘంటువు ప్రచురణకు రాజాగారు ఆర్థిక సహాయం అందించారు.
-రాజాగారు విరాళాలు ఇచ్చిన సంస్థలు తెలుగు పాఠశాల, ఇది శ్రీకృష్ణ దేవరయాంద్ర భాషానిలయం అనుబంధం. కాశీ విశ్వవిద్యాలయం, హృశికేశంలోని ఆంధ్రాశ్రమం, గుంటూరులోని శారదానికేతనం, హైదరాబాద్‌లోని నారాయణగూడ బాలికోన్నత పాఠశాల, బందరు జాతీయ కళాశాల, రామకృష్ణ మిషన్, వివేకానంద కళాశాల, రెడ్డి జనసంఘం, కృష్ణ-గుంటూరు విశ్వబ్రాహ్మణ మహాజన సంఘం, పుస్తక బంఢాగారం, కాకినాడలోని ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల, చెన్నైలో ఆర్య భారదీ గ్రంథమాలిక, బందర్లో సరస్వతీ గ్రంథమాలిక మొదలైన సంస్థలకు శ్రీరాజాగారు ఎంతోకాలం ఆర్థిక సహాయాన్ని అందించారు.
-ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రథమ చారిత్రక కావ్యం అనదగిన ముసలమ్మ మరణం (కట్టమంచి రామలింగారెడ్డి రచన), ఆదిపూడి సోమనాథ రావుగారి శ్రీకృష్ణదేవరాయ చరిత్రము, దుబ్బాక రాజశేఖర శతావధాని శివభారతము, తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారి మహాత్మకథ, శంఖవరం రాఘవాచార్యుల విశ్వనాథవిజయము, బాడాల రామకవి గారి కృష్ణకథా విపంచి, చేబ్రోలు చినబ్రహ్మయ్య కవిగారు రాసిన విశ్వదాభిరమము మొదలైనవన్నీ వీరి ఆర్థిక సహాయంతో వెలువడినవే.
-శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం 1901, సెప్టెంబర్ 1న కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, పాల్వంచ సంస్థానాధీశులు పార్థసారధి అప్పారావుగారు, మునగాల రాజా నాయని వీఆర్ గారి సహకారంతో వెలువడింది. ఇందులో మైలవరపు నరసింహశాస్త్రి, ఆదిపూడి సోమనాథరావు గార్ల సహకారం కూడా ఉంది. ఈ గ్రంథాలయం తెలంగాణలో ఆంధ్రోద్యమానికి కేంద్రస్థానమైంది. ఉర్దూ తప్ప మిగతా భాషలను ముఖ్యంగా తెలుగును పైకి రానివ్వని నిజాం రాజు ఫర్మానాల విషమ పరిపాలనలో, అప్పటి పరిస్థితుల్లో స్థాపించబడిన ఈ గ్రంథాలయం తెలంగాణలోని అన్ని ఉద్యమాలకు నిలయమైంది. మహా కవుల వర్ధంతి, జయంతులు, సాహిత్య సప్తాహలు, సమకాలీన సత్కవులకు సత్కారాలు, సన్మానాలు, అఖిలాంధ్ర కవి సమ్మేళనాలు, హరికథా కాలక్షేపాలు, కూచిపూడి భాగవత ప్రదర్శనలు, సంగీత కచేరీలు, గ్రంథాలయ సభలే కాకుండా అనేక సాంస్కృత సమావేశాలు ఈ గ్రంథాలయంలో జరిగి తెలంగాణ ప్రజలను జాగృత పరిచాయి.
-మునగాల రాజావారు వరంగల్‌లో రాజరాజనరేంద్ర గ్రంథాలయాన్ని కూడా నెలకొల్పారు. ఇంకా తెలంగాణ శాసనాలు అనే అపూర్వ పరిశోధక గ్రంథాలు-విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి పక్షాన వెలిసినవే. రాజావారు ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు.
-కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారి మరణానంతరం వారి జ్ఞాపకార్ధంగా రాజావారు ఆంధ్రాయూనిర్సిటీలో చరిత్ర పరిశోధనకై ఒక ఎండోమెంట్ నిధిని ఏర్పాటు చేశారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం శ్రీరాజాగారి ప్రేరణవల్లే ఏర్పడింది. ఇది దక్షిణ భారతదేశంలో మొదటి విజ్ఞాన సర్వస్వం. రాజావారి సహాయంతోనే విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి ప్రచురించిన గ్రంథాల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారి ఆర్థశాస్త్రం, కేవీ లక్ష్మణరావుగారు రాసిన హిందూ మహా యుగం, మహమ్మదీ యుగం, ఆచంగ లక్ష్మీపతి గారి జీవశాస్త్రం, మనికొండ సత్యనారాయణగారి బౌద్ధ మహాయుగం, దుగ్గిరాల రాఘవ చంద్రయ్యగారి విజయనగర సామ్రాజ్యం, చిలుకూరి వీరభద్రరావుగారి విజయనగర సామ్రాజ్యం, చిలుకూరి వీరబద్రరావుగారి ఆంధ్రుల చరిత్ర మొదలైన గ్రంథాలన్నీ రాజావారి సహాయ సహకారాలతో అచ్చయ్యాయి.
-శ్రీనాయని వెంకట రంగారావు గారి మిత్రమండలిలో కొందరు జాతీయోద్యమంలో పాల్గొన్నవారే. కొందరు సహాధ్యాయులు కూడా అట్టివారిలో శ్రీభోగరాజు పట్టాబి సీతారామయ్య, శ్రీ అయ్యదేవర కాళేశ్వర్రావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కోపల్లె హన్మంతరావు, దేశిరాజు పెదబాపయ్య, (కృష్ణాపత్రిక నడిపిన) ముట్నూరి కృష్ణారావు, మొదలైనవారు నాగపూర్ విశ్వవిద్యాలయంలోనూ, మారిస్ కళాశాలలోనూ, లేదా సెలవుల్లో బందరు వచ్చినప్పుడు మిత్రమండలిలోని సభ్యులే. ఇందులో కొమర్రాజు లక్ష్మణరావుగారు కూడా లేకపోలేదు.
-తర్వాత అయ్యదేవర మునగాల జమీందార్ రాజకీయ సలహదారుగా, న్యాయవాదిగా కూడా పనిచేశారు. అలాగే గ్రంథాలయోద్యమ పితామహుడైన గాడిచర్ల హరి సర్వోత్తమరావు, జాతీయ పతాకాన్ని తయారుచేసి గాంధీ ప్రశంసలు పొందిన పింగళి వెంకయ్య, జాతీయోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆయుర్వేద పండితులుగా ప్రసిద్ధిపొందిన ఆచంట లక్ష్మీపతి, బహుగ్రంథకర్త ఆదిపూడి సోమనాథరావు, తెలంగాణ ప్రథమ వైతాళికుడని చెప్పదగిన రావిచెట్టు రంగారావు, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న రాజా బహద్దూర్ వెంకట్రాంరెడ్డితోనూ, ఆంధ్రపితామహ మాడపాటి హన్మంతరావుతోనూ, వరంగల్‌లో జాతీయవాదులైన మాదిరాజు రామకోటేశ్వర్రావుతో, ఆయుర్వేద పండితులు శతవధాని, శ్రీమాన్ వేదాల తిరుమల రామానుజస్వామి, సన్నిహిత సంబంధాలు ఉండేవి.
చివులూరి – లక్ష్మీనరసింహాచార్యులు
తెలంగాణలో మరుగున పడిన కవి పండితులు ఎందరో ఉన్నారు. అటువంటి మహానుభావుల్లో చివులూరి లక్ష్మీనరసింహచార్యులు ఒకరు. పాండిత్యానికి డిగ్రీలు కొలమానం కాదని నిరూపించారు. 1916లో జన్మించారు. చలమాచార్యులు, రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు. వీరు సంస్కృతాంధ్ర, హిందీ, ఉర్దూ భాషలు నేర్చారు. కవిత్వం, పౌరోహిత్యం ఇతని వృత్తి. వీరు గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహసభల్లో, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు, గ్రంథాలయోద్యమాన్ని నడిపిన కోదాటి నారాయణరావుతో పనిచేశారు. కొంతకాలం రేడియో ఆర్టిస్టుగా పనిచేశారు. మంచి సంగీత విద్వాంసులు. హరికథా విద్వాంసులు. ఒక వెయ్యికిపైగా హరికథలు చెప్పారు. వీరిది నడిగూడెం మండలం సిరిపురం గ్రామం. రచనలు – 1. భానుడు రాసిన స్వప్నవాసవ దత్తను 1986లో గేయనాటికగా రాశారు. 2. క్షీరవాహిని పద్యకావ్యంలో పాలేరు నది చుట్టూ ఉన్న శివాలయాల చరిత్ర రాయబడింది. 3. ఎగిరేపళ్లాలు (నవల), మునగాల సంస్థాన చరిత్ర 4. శ్రీరేపాల వేణుగోపాల శతకం (1988) 5. తెరువరి (గేయనాటకం), 6. గణపతి విజయం (హరికథ), 7. విక్రాంతి (గీతకావ్యం) 8. ముదిగొండ లక్ష్మీనృసింహ సుప్రభాతం (సంస్కృతం 1980), 10. ముదిగొండ లక్ష్మీనరసింహ స్తోత్ర నక్షత్రమాల, 11. రేపాల లక్ష్మీనృసింహ శతకం, 12. భ్రమర్ కీటకం (పద్యాలు) మొదలైనవి వీరి రచనలు. కోదాటి నారాయణరావు రాసిన చిన్ననాటి జ్ఞాపకాలులో తన చిన్న నాటి స్నేహితుడిగా పేర్కొన్నారు. వీరి కవితలను విశ్వనాథ సత్యనారాయణ మెచ్చుకొని మునగాలలో 1966 జూలై 30న సన్మానం కోసం వచ్చి చివులూరికి కూడా సన్మానం చేసి వెళ్లినట్లుగా తెలుస్తుంది. కవి సామ్రాట్ చేత సన్మానించబడిన ఘనులుగా ఆ రోజుల్లో అందరూ అనుకునేవారు. ఈయన ఇటీవలనే కాలధర్మం చెందారు. వీరి శతజయంతి సంవత్సరం 2016 కవి, గాయకులు, హరి కథకులు, సంగీతజ్ఞులు, భక్తులు, పండితులు, తపస్వి, పురోహితులు, దేశభక్తులు, గ్రంథాలయోద్యమ కార్యకర్త, నటులు (గ్రామ వెలుగు నాటకంలో నటించారు). ఆంధ్రమహసభ కార్యకర్త, సహృదయులు, మానవతావాది, నమ్రత కలవారైన వీరు తెలంగాణ కవుల్లో ఒకరు. ఈయన పెద్ద కుమారుడు వైద్యుడు. ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు