Telangana history | సాహిత్య రాజకీయ చైతన్యం.. గ్రంథాలయోద్యమం
తెలంగాణ చరిత్ర
- తెలంగాణ సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా ఆధునికతతో పాటు ఆధునిక భావజాలం మొదలైంది. అది సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమాలకు వివిధ వర్గాల చైతన్యానికి దారితీసింది. రాజకీయోద్యమం, బ్రిటిష్ వ్యతిరేకోద్యమం గాను, నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతరేక ఉద్యమంగా పరిణమించింది. ఈ చైతన్యం, ఉద్యమాలు ఒకదాని తర్వాత ఒకటి రాలేదు. ఒక చలనంలో పరస్పర ప్రభావంతో ముందుకు నడిచాయి.
- తెలగు ప్రజలు ప్రాచీన మధ్యయుగంలో తమ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జరిగిన ఉద్యమ ప్రయత్నమే గ్రంథాలయోద్యమం. తెలంగాణ ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక రాజకీయ చైతన్యం తీసుకొచ్చే క్రమంలో గ్రంథాలయోద్యమం కీలక పాత్ర వహించింది. సాంస్కృతిక వికాసోద్యమంలో భాగంగా అనేక క్లబ్బులు సాహిత్య సంస్థలు సొసైటీలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమం ఆంధ్రోద్యమంలో భాగంగా తెలంగాణలో ప్రారంభమైంది. నిజాం సంస్థానంలో సాహితీ రంగానికి ఒక విశిష్టత ఉంది, ఇది ప్రజలను చైతన్యవంతులను చేసి నిజాం నిరంకుశ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకు రంగాన్ని సిద్ధం చేసింది.
- నిజాం ప్రభుత్వ పరిభాషలో గ్రంథాలయాలంటే విప్లవ సంస్థలు. ప్రభుత్వ ఆలోచనలో రాశి కంటే వాసి గల ఒక్క గ్రంథం ఎన్నో ఉద్యమాలతో సమానం. గ్రంథాలు బయటకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. ఒక గ్రంథాలయం తెరవాలన్నా వారి అనుమతి కావాల్సి వచ్చేది. గ్రంథాలయాలపై అంక్షలు విధించేవారు. నిఘా, నిర్బంధం ఉన్నప్పటికీ గ్రంథాలయోద్యమ పవనాలు వీయక మానలేదు. రహస్యంగా గ్రంథాలను పంపిణీ చేసుకొనే అలవాటు మొదలైంది.
- గ్రంథాలయాలను స్థాపించినవారు ఉన్నతవర్గాలకు చెందిన ఉదారవాదులు. ప్రజాతంత్ర భావాలు గలవారు. వీరు గ్రంథాలయ స్థాపన ద్వారా మాతృ భాషయందు అభిమానం, ఉద్యమారంభంలో విజాన వ్యాప్తి ప్రధానాశయంగా ఉన్నట్లు ప్రచారం చేస్తూ అంతర్లీనంగా రాజకీయ లక్షణాలు కలిగి ప్రభుత్వ అధికారులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు.
గ్రంథాలయోధ్యమం ప్రారంభం
- తెలంగాtspscణలో1872లో సికింద్రాబాద్‌లో సోమసుందర్ మొదలియార్ గ్రంథాలయా న్ని స్థాపించారు. ఇది హైదరాబాద్‌లోనే కాకుండా తెలుగు ప్రాంతాల్లోనే మొదటి గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు. దీన్ని 1884లో మహబూబియా కళాశాలలో విలీనం చేశారు. 1872లో ముదిగొండ శంకరాద్యులు సికింద్రాబాద్‌లోని శంకర్ మఠ్‌లో శంకరానంద గ్రంథాలయం స్థాపించారు.
- 1872లో ముదిగొండ శంకరాద్యులు సికింద్రాబాద్‌లోనే సార్వజనీక గ్రంథాలయాన్ని స్థాపించారు. 1892లో అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ స్థాపించారు. మొదట్లో ఈ గ్రంథాలయంలో అరబ్బీ, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్, సంస్కృత గ్రంథాలు మాత్రమే లభ్యమయ్యేవి. ఆంధ్రమహాసభ కృషి ఫలితంగా 1940 నుంచి ప్రాంతీయ భాషలైన కన్నడ, మరాఠీ, హిందీభాషా గ్రంథాలు కూడా ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు.
- మరాఠీ భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం కొంతమంది సంపన్నులు 1895లో భారత్ గుణ వర్థక్ సంస్థ గ్రంథాలయం శాలిబండలో ఏర్పాటు చేశారు. 1896లో బొల్లారంలో ‘ఆల్బర్ట్ రీడింగ్ రూం’ ఏర్పాటు చేశారు.
- గ్రంథాలయోద్యమానికి ఆధ్యుడు పితామహుడు కొమర్రాజు లక్ష్మణ రావు మునగాల రాజు నాయని వెంకటరంగారావు సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు. రంగారావు కొమర్రాజు లక్ష్మణరావు పరిశోధనా కృషికి అండగా నిలిచారు.
- మునగాల నాయని వెంకటరంగరావు, రావిచెట్టు రంగారావులతో కలిసి కొమర్రాజు లక్ష్మణరావు 1901లో ‘శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’ హైదరాబాద్‌లో స్థాపించారు. ఈ గ్రంథాలయం రావిచెట్టు రంగారావు స్వగృహంలో స్థాపించారు. ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి, రఘుపతి వెంకట రత్నం నాయుడు ఆనాటి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తెలుగుభాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ప్రధాన ఉద్దేశం. ఆదిరాజు వీరభద్రరాజు వంటి ప్రముఖులు ఈ గ్రంథాలయ కార్య కర్తలుగా పనిచేశారు.
- శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, తెలంగాణ గ్రంథాలయోద్యమానికి ఊపునిచ్చింది. దీని తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రంథాయాలు, సంస్థలు ఏర్పాటయ్యాయి.
- 1904లో వరంగల్‌లోని హనుమకొండలో రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, 1905లో సికింద్రాబాద్‌లో ఆంధ్రసంవర్థిని గ్రంథాలయం, శంషాబాద్‌లో బాలభారతీ నిలయ ఆంధ్రభాషా వర్తక సంఘం మొదలైనవి గ్రంథాలయోద్యమ భాగంగా తెలంగాణలో ఏర్పాటయ్యాయి.
- గ్రంథాలయోద్యమంలో కీలకపాత్ర పోషించిన మరో వ్యక్తి కోదాటి నారాయణరావు. ఇతని స్వీయ చరిత్ర ‘నారాయణ త్రయం అనే పుస్తకంలో తెలంగాణ గ్రంథాలయోద్యమం గురించి పేర్కొన్నారు.
- సమావేశాలు నిర్వహించుకునే స్వాతంత్య్రం లేని రోజుల్లో గ్రంథాలయోద్యమ విజ్ఞానోద్యమంగా కనిపించినప్పటికీ ప్రజల కళ్లు తెరిపించి, తెలుగు భాషాభిమానాన్ని కలిగించి నిజాం రాజ్యాన్ని, అధికారాన్ని ప్రశ్నించే స్థాయికి ప్రజల్ని చైతన్యవంతం చేసి కదిలించింది.
- 1910లో ఖమ్మంలో ఆంధ్రభాషా నిలయం 1913లో వరంగల్ జిల్లా మడికొండలో ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం, సికింద్రాబాద్‌లో సంస్కృత కళావర్థిని గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి.
- 1918లో హైదరాబాద్‌లో ‘రాజబహుదూర్ వెంకటరామిరెడ్డి’ చొరవతో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం ఏర్పడింది. ఈ గ్రంథాలయంలో తెలంగాణలో లభించిన తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు. సురవరం ప్రతాపరెడ్డి ఈ గ్రంథాలయానికి కార్యదర్శిగా 1924 నుంచి 32 వరకు పనిచేశారు.
- గ్రంథాలయ నిర్వహణకు గ్రంథాలయోద్యమకారులకోసం ‘తెలంగాణాంధ్రుల కర్తవ్యం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు.
- 1918లోనే నల్లగొండలో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం స్థాపించారు. దీనికి షబ్నవీసు వెంకట రామ నరసింహారావు నిర్వాహకులుగా పనిచేశారు. ఇదే ఏడాదిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పువ్వాడ వెంకటప్పయ్య అనే ఉపాధ్యాయుడు ప్రజల సహకారంతో ‘ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని’ అనే గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఇతను ‘కృషి ప్రచారిణి గ్రంథమాల’ అనే సంస్థను స్థాపించి తెలుగు పుస్తకాలను ముద్రించేవారు. దాంతో నిజాం ప్రభుత్వం ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.
- 1920లో మాడూరి రాఘవులు భాషా కల్పవల్లి అనే గ్రంథాలయం సికింద్రాబాద్‌లో, 1923లో హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో ‘బాలసరస్వతి’ గ్రంథాలయం, ఖమ్మంలో ఆంధ్రవిద్యార్థి సంఘం గ్రంథాయలం, 1923లోనే కొండా వెంకట రంగారెడ్డి తన సొంత ఖర్చులతో వేమన‘ ఆంధ్రాభాషా నిలయం స్థాపించారు.
- 1925లో హైదరాబాద్‌లో ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయం, 1926లో బి.ఎస్. వెంకట్రావు ‘ఆదిహిందూ లైబ్రరీ’ 1926లో దక్కన్ వైశ్య సంఘ గ్రంథాలయం, 1930లో మెదక్‌లో జోగిపేట గ్రంథాలయం స్థాపించారు. ఇవన్నీ తెలంగాణలో సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీర్చిదిద్దాయి.
ఆంధ్రజనసంఘం
- 1923 ఏప్రిల్ 1న మాడపాటి హన్మంతరావు కార్యదర్శిగా, బారిస్టర్ రాజగోపాలరెడ్డి అధ్యక్షుడిగా ఆంధ్రజన కేంద్ర సంఘం స్థాపించారు. గ్రంథాలయాలు, పాఠశాలల స్థాపన, తాళపత్ర గ్రంథాలను సేకరించి పరిశోధనలు జరిపి తెలంగాణ వైభవాన్ని వెలుగులోకి తేవడం, తెలుగుకు ప్రాచుర్యం కల్పించడం కరపత్రాలను ముద్రించి ప్రజలను చైతన్యవంతులను చేయడం ఈ సంఘం తన లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. ఆంధ్ర మహాసభ ఏర్పడే వరకు తెలంగాణలో సాంస్కృతిక వైజ్ఞానిక వికాసానికి ఈ సంఘం కృషి చేసింది.
- ఆంధ్రజన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారథ్యంలో ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించబడింది. కొమర్రాజు లక్ష్మణరావు మరణించిన తర్వాత ఇది లక్ష్మణ రాయ పరిశోధన మండలిగా మారింది. ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతులను వెలుగులోకి తేవడానికి అనేక శాసనాలను, తాళపత్ర గ్రంథాలను వెలికితీసింది. దీనిలో శేషాద్రి రమణకవుల కృషి కూడా ఉంది.
- 1935లో ఆదిరాజు ప్రచురించిన తెలంగాణ శాసనాలు, సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఇదే ఏడాదిలో వెలువడిన కాకతీయ సంచిక తెలంగాణ ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.
- ఆంధ్రజన సంఘం గ్రంథాలయోద్యమం విస్తరించడానికి కృషి చేసింది. నాలుగు వేల తెలుగు మీడియం పాఠశాలలు నెలకొల్పింది. తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ఆంధ్ర జన కేంద్ర సంఘం చేసిన కృషి వల్ల అనేక పత్రికలు, సాంస్కృతిక సంఘాలు ఏర్పడ్డాయి. ఆంధ్రాభ్యుదయం, సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో గొల్కొండ పత్రిక, దేశబంధు, సుజాత మొదలైన పత్రికలే ఆవిర్భవించాయి. సాహితీ సంస్థలు ఏర్పడ్డాయి.
- 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు రావినారాయణ రెడ్డి రైతు గ్రంథాలయం స్థాపించాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాధికారి టి.కె.బాలయ్య తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇతడు ఆర్మూరు తాలుకాలోని మారుమూల గ్రామాలకు ఎడ్లబండ్లపై పుస్తకాలను పంపిణీ చేసేవారు.
- నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ధర్మభిక్షం, కన్నయ్య మరికొంత మంది మిత్రుల సహకారణంతో రహస్యంగా పుస్తక భాండాగార్ను స్థాపించి దానికి అర్జున పుస్తక భాండాగార్ అనే పేరుతో నిర్వహించారు.
- ఈ పుస్తక భాండాగార్‌లో ఆర్యసమాజ్ గ్రంథాలు, గోల్కొండ పత్రిక, మీజాన్, దక్కన్, రయ్యత్, పత్రికలతో పాటు ప్రజాశక్తి, కాగడా, వాహిని, గోభూమి వంటి పత్రికలు తెప్పించేవారు. ఇది ప్టణంలో పుస్తక సంస్థగానే కాకుండా ప్రముఖ రాజకీయ, సాహిత్య చర్చలకు కేంద్రమైంది. ఉత్తమ వామపక్ష సాహితీ వేదికగా విలసిల్లింది.
విజ్ఞాన చంద్రిక మండలి
- ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి సాధించడం ప్రగతికి దోహదం చేస్తుందని గుర్తించిన కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులు 1906లో ‘విజ్ఞాన చంద్రిక మండలి’ని స్థాపించారు. ఈ మండలి కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు వ్యవహరించారు. ఈ మండలి తెలంగాణలో నవలుల పోటీ నిర్వహించింది. తెలుగు ప్రాంతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ ఇది.
- విజాన చంద్రికా మండలి తెలుగుభాషలో చరిత్ర, సాహిత్యం, విజాన శాస్ర్తాల్లో పుస్తకాలు ప్రచురించి భావ వ్యాప్తికి దోహదం చేసింది. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర పోషించింది. దేశ చరిత్రలు, పదార్థ విజ్ఞాన, రసాయన, జీవశాస్త్రలకు సంబంధించిన అనే గ్రంథాలు విజ్ఞాన చంద్రికా మండలి కృషి ఫలితంగా వెలువడ్డాయి.
- పాశ్చాత్య విజ్ఞానం ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కొమర్రాజు లక్ష్మణరావు విజాన సర్వస్వం అనే గ్రంథాన్ని రచించి విజాన శాస్ర్తాలకు సంబంధించిన అనేక విషయాలను అందులో పేర్కొన్నారు. ఇది మూడు భాగాలుగా వెలువడింది.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆంధ్ర జన సంఘానికి కార్యదర్శిగా ఎవరు పనిచేశారు? (ఎ)
ఎ) మాడపాటి హనుమంత రావు
బి) బారిస్టర్ రాజగోపాలరెడ్డి
సి) కొమర్రాజు లక్ష్మణరావు
డి) బి. ఎస్. వెంకట్రావు
2. గ్రంథాలయోద్యమకారుల కోసం, గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి రచించిన ప్రసిద్ధ గ్రంథం? (బి)
ఎ) వర్తక స్వాతంత్య్రం
బి) తెలంగాణాంధ్రుల కర్తవ్యం
సి) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
డి) ఏదీకాదు
3. 1904లో రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం పేరుతో గ్రంథాలయాన్ని ఎక్కడ స్థాపించారు? (ఎ)
ఎ) హనుమకొండ బి) సూర్యాపేట
సి) హైదరాబాద్ డి) నల్లగొండ
4. షబ్నవీసు వెంకటరామ నరసింహారావు ఏ గ్రంథాలయ నిర్వాహకులుగా పనిచేశారు? (సి)
ఎ) బాల సరస్వతి గ్రంథాలయం
బి) వేమన ఆంధ్ర భాషా నిలయం
సి) ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం
డి) ఆంధ్ర విద్యార్థి సంఘం గ్రంథాలయం
5. ముదిగొండ శంకరాధ్యులు సికింద్రాబాద్‌లోని శంకరానంద గ్రంథాలయాన్ని ఎప్పుడు స్థాపించారు. (ఎ)
ఎ) 1872 బి) 1865
సి) 1868 డి) 1885
6. రావిచెట్టు రంగారావు హైదరాబాద్‌లో విజ్ఞాన చద్రిక మండలిని ఎప్పడు స్థాపించారు? (బి)
ఎ) 1876 బి) 1902
సి) 1916 డి) 1920
7. కొమర్రాజు లక్ష్మణరావు రచించిన విజ్ఞాన సరస్వం అనే గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా వెలువరించారు? (ఎ)
ఎ) మూడు బి) నాలుగు
సి) రెండు డి) ఐదు
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు