Telangana History | శాతవాహనుల వాణిజ్యం.. ఎండ్లబండ్లే ఆధారం
తెలంగాణ చరిత్ర
శాతవాహనులు
- వివిధ సాక్ష్యాధారాల సహాయంతో శాతవాహనుల పాలన క్రీ.పూ. 271లో ప్రారంభమై క్రీ.శ. 174లో అంతమయ్యిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్ర అనే పదం మొదట ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. మత్స్య, వాయు, విష్ణు, భాగవత పురాణాల్లో ఆంధ్రుల ప్రశస్తి ఉంది. కొన్ని పురాణాలు ఆంధ్రులను ఆంధ్రభృత్యులని పేర్కొన్నాయి. వారు మొదట మౌర్య సామ్రాజ్యంలో సేవకులుగా (భృత్యులుగా) ఉన్నా, తర్వాత స్వతంత్రులై రాజ్యాన్ని స్థాపించారు.
శాతవాహనుల చరిత్రకు ఆధారాలు
- మత్స్య, వాయు, బ్రహ్మాండ, భాగవత పురాణాలు
- శర్వవర్మ- కాతంత్ర వ్యాకరణం (సంస్కృత భాష)
- గుణాడ్యుడు- బృహత్కథ (ప్రాకృత భాష)
- హాలుడు- గాధాసప్తశతి మొదలగు రచనలు
- పురావస్తు తవ్వకాల్లో నాణేలు, శాసనాలు ప్రతిమలు లభించాయి. ఇతర ఆధారాలు
- నాగానిక- నానాఘాట్ శాసనం
- గౌతమీబాలశ్రీ- నాసిక్ శాసనం
- ఖారవేలుడు- హాతిగుంఫా శాసనం
- రుద్రదమనుడు- జునాఘడ్/గిర్నార్ శాసనం
విదేశీసాహిత్య ఆధారాలు
- గ్రీకు అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
- ప్లీనీ- నేచురల్ హిస్టరీ
- హుయాన్‌త్సాంగ్- సీ-యూ-కీ
- శాతవాహన వంశాన్ని స్థాపించినది శ్రీముఖుడు. శాతవాహనుడు మూలపురుషుడిగా ప్రసిద్ధి. ఈ వంశంలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడు. చివరివాడు మూడో పులోమావి. వీరు ధాన్యకటకం, పైఠాన్/ ప్రతిష్ఠానపురం రాజధానులుగా చేసుకుని పాలన కొనసాగించారు. వీరి రాజభాష/అధికార భాష ప్రాకృతం
శాసనాలు
- నానాఘాట్ శాసనం – నిగమసభల గురించి తెలుపుతుంది.
- నాసిక్ శాసనం – శ్రమణుల గురించి తెలుపుతుంది.
- మ్యాకదోని శాసనం – గుల్మిక గురించి తెలుపుతుంది.
- రాజలాంచనం- సూర్యుడు
- మతం- జైనం, హైందవం
- రెండో పులోమావి/వాసిష్టీపుత్ర పులోమావి ధరణికోట/ధాన్యకటకం నిర్మించారు.
రాజకీయ చరిత్ర
- మత్య్స పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు.
శ్రీముఖుడు
- ఇతని సమకాలికుడు అశోకుడు. రామ అనే బిరుదు ఉంది. (ఈ బిరుదు అశోకుడు ఇచ్చాడని డీసీ సర్కార్ అభిప్రాయం). ఇతని తండ్రి శాతవాహనుడు (ఇతని పేరు మీదనే శాతవాహన వంశం అనే పేరు వచ్చింది). మొదట జైన మతం తర్వాత వైదిక మతానికి మారాడు. ఇతని నాణేలు కోటిలింగాల (కరీంనగర్) వద్ద లభ్యమయ్యాయి. ఈ నాణేల్లో ఇతని పేరు ‘సిరిచిముక శాత’ అని ఉంది. శ్రీముఖుడు రణగోభద్ర, రణగోస్వామి నాణేలు వేయించాడు.
కృష్ణుడు (కణ్హుడు)
- కన్హేరి, నాసిక్ గుహలను తవ్వించాడు. ఇతని కాలంలో భాగవత మతం దక్కన్లో ప్రవేశించింది. నాసిక్‌లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం ‘ధర్మ మహామాత్య’ అనే అధికారులను నియమించాడు.
మొదటి శాతకర్ణి
- శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు మొదటి శాతకర్ణి. ధన రూపంలో వెండి నాణేలు (కర్షాపణాలు) బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇతని గురించి నాగానిక వేసిన నానాఘాట్ శాసనం (ప్రాకృత భాష) తెలుపుతుంది. 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేసిన తొలి శాతవాహన రాజు. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి నాణేలపై ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించాడు. ఖారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించినట్లు తెలిపే శాసనాలు హాతిగుంఫా శాసనం, గుంటుపల్లి శాసనం.
బిరుదులు: ఏకవీర, శూర (నానాఘాట్ శాసనం తెలుపుతుంది), అప్రతిహత చక్ర, దక్షిణాపథపతి, మహన్ (మత్స్యపురాణం), మల్లకర్ణి (మత్స్యపురాణం)
పూర్ణోత్సుంగుడు/వేదశ్రీ శాతకర్ణి
- ఇతని కాలంలో కళింగ ఖారవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు.
శాతకర్ణి-2
- ఇతడు అత్యధికంగా 56 సంవత్సరాలు పరిపాలించాడు. కణ్వవంశ సుశర్మను ఓడించి పాటలీపుత్రాన్ని జయించాడు. సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. శక, యవన, పహ్లవులను అణిచివేశాడు. ఖారవేలుడు వేయించిన హాతిగుంఫా శాసనంలో ఇతను ‘పిథుండ’ నగరాన్ని ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇతని శాసనం సాంచీలో ఉంది. రాజశ్రీ శాతకర్ణి అనే బిరుదు కలవాడు. ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్టపుత్ర ఆనంద.
కుంతల శాతకర్ణి
- ఇతడి కాలంలో సంస్కృతం అధికార భాషగా మారింది. ఇతని భార్య ‘మలయవతి’ కర్తరి అనే కామక్రీడ వల్ల మరణించింది. సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణం రాసిన శర్వవర్మ, పైశాచీప్రాకృత భాషలో బృహత్మథ రచించిన గుణాడ్యుడు ఇతని ఆస్థాన కవులు. గుణాడ్యుడి బృహత్కథ విష్ణుశర్మ పంచతంత్రం రచించడానికి ఆధారమైంది. శర్వవర్మ, గుణాడ్యుడి మధ్య సవాలు వివరించిన గ్రంథం కథాసరిత్సాగరం. దీన్ని సోమదేవ సూరి రచించాడు.
హాలుడు
- శాతవాహన రాజుల్లో 17వ వాడు. ఇతను ప్రాకృతంలో ‘గాథాసప్తశతి’ అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఇందులో 700 శృంగార కథలు కలవు. ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అంటారు. కుతూహలుడు ఇతని కాలంలో ‘లీలావతి పరిణయం’ అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ఈ గ్రంథం ప్రకారం హాలుడు శ్రీలంక రాకుమారిని ద్రాక్షారామంలో వివాహం చేసుకున్నాడు. కవి వత్సలుడు అనే బిరుదు కలవాడు. ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు.
గౌతమీపుత్ర శాతకర్ణి
- తల్లి పేరును జతపర్చుకునే సంప్రదాయం ఇతని కాలం నుంచి ప్రారంభమైంది. శాతవాహనుల్లో అతి గొప్పవాడు. ఇతని విజయాల గురించి నాసిక్ శాసనం తెలుపుతుంది. ఇతని కాలం నుంచే శాలివాహన శకం (క్రీ.శ. 78) ప్రారంభమైంది. క్షహరాటవంశంలో గొప్పవాడైన నహపానుడిని ఓడించి, అతని నాణేలను పునఃముద్రించినట్లు జోగల్తంబిలో ఆధారాలు లభించాయి. దీనికిగాను క్షహరాట వంశ నిరవశేషకార అనే బిరుదు పొందాడు. బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనల భూమిని దానం చేశారు. ఇతని నాణేలు కొండాపూర్, పెదబంకూరులో లభించాయి.
బిరుదులు: త్రిసముద్రలోయ పీతవాహన దక్షిణ సముద్రాధీశ్వర, శకయవన పహ్లవ నిఘాదన, ద్విజకుల వర్ధన, ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్థన, వర్ణ సాంకర్య నిరోధక, ఏకశూరుడు, బెణాకటక స్వామి.
వాసిష్టీపుత్ర రెండో పులోమావి
- ఇతని బిరుదు క్షుత్రప. ఇతను రుద్రదమనికను వివాహం చేసుకున్నట్లు జునాఘడ్/డిర్నార్ శాసనం తెలుపుతుంది.
యజ్ఞశ్రీ శాతకర్ణి
- ఇతని కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడింది. ఆచార్య నాగార్జునుడు ఆస్థాన కవిగా ఉండేవాడు. శ్రీపర్వతం/నాగార్జున కొండపై ఆచార్య నాగార్జునుడికి పారవత విహారం నిర్మించాడు. 2 తెరచాపల నౌక బొమ్మ గల నాణేలు ముంద్రించాడు. త్రిసముద్రాదీశ్వరుడు అనే బిరుదు కలవాడు. చిన గంజాం శాసనం వేయించాడు. సుహృల్లేఖ గ్రంథం యజ్ఞశ్రీ శాతకర్ణిపై ఆచార్య నాగార్జునుడు రచించాడు.
విజయశ్రీ శాతకర్ణి
- శ్రీపర్వతం/నాగార్జున కొండ దగ్గర విజయపురి పట్టణం నిర్మించాడు.
3వ పులోమావి
- మ్యాకదోని శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి తెలుపుతుంది. వాసిష్టీపుత్ర శాంతమూలుడు తిరుగుబాటు చేయడం వల్ల రాజ్యాన్ని వదిలి బళ్లారి పారిపోయి పరిపాలించాడు.
పరిపాలన వ్యవస్థ
- పరిపాలనలో మౌర్యులను అనుసరించారు. నాసిక్ శాసనం వీరి పరిపాలన గురించి తెలుపుతుంది. శాతవాహనులు రాజ్యాన్ని ఆహార, విషయ, గ్రామంగా విభజించారు. వీరి పరిపాలనా పద్ధతి వికేంద్రీకృత వారసత్వ రాజరికంగా ఉండేది. గ్రామాధికారిణి గ్రామణి అనేవారు. ఎక్కువ గ్రామాలను కలిపి ‘గుల్మి’ అని పిలిచేవారు. దీనికి అధిపతిగా గుల్మికుడు ఉండేవాడు. పట్టణ పరిపానలకు నిగమ సభ ఉండేది. భట్టిప్రోలు శాసనం నిగమ సభ గురించి తెలుపుతుంది. కులపెద్దలను గుహపతులు అని పిలిచేవారు. శాతవాహన సామంత రాజ్యాలను జనపదాలు అని పిలిచేవారు. రాజ్యపాలనలో సలహాలు ఇవ్వడానికి అమాత్యులు ఉండేవారు. అమాత్యులకు వంశపారంపర్యంగా హక్కు లేదు. తరచుగా వీరిని బదిలీ చేస్తారు.
సైనిక వ్యవస్థ
- శాతవాహనుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయ భూములకు నీరు అందించే శ్రేణి ఉదక యంత్రికుల శ్రేణి. భూమిని దానం చేసే విధానాన్ని భారతదేశంలో మొదటగా వీరే మొదలుపెట్టారు. రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమిశిస్తు పంటల్లో 1/6వ వంతుగా ఉంది. రజ్జుగాహక అనే అధికారి భూములు కొలిచేవాడు. పంటల్లో రాజు భాగాన్ని దేయమేయం / రాజభాగం అంటారు. రాజుకు చెందిన సొంత భూమిని రాజకంబేట/రాజక్షేత్రం అంటారు. శాతవాహనుల కాలంలో చేతి వృత్తి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. చేతివృత్తులపై కురుకర పన్ను విధించేవారు. వృత్తి సంఘాలను శ్రేణులు అని పిలిచేవారు. వీరి కాలంలో 18 రకాల శ్రేణులు ఉండేవి.
నాణేలు:
- శాతవాహనులు ముద్రించిన నాణేలు- సీసం (అత్యధికంగా ముద్రించారు), పొటీన్, వెండి, బంగారం
- పొటీన్ అనేది మిశ్ర లోహం
- ఒక బంగారు నాణెం = 35 కర్షాపణాలకు సమానం అవుతుంది.
వ్యాపారం – వాణిజ్యం
- శాతవాహనుల కాలం నాటి విదేశీ వ్యాపారం, వ్యాపార కేంద్రాలు, రేవుల గురించి తెలిపే గ్రంథం- పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
- వ్యాపారస్థులను వణిజులు అని పిలిచేవారు.
- దేశీయ వాణిజ్యం ఎక్కువగా ఎడ్లబండ్ల ద్వారా జరిగేది.
- వ్యాపారం వస్తుమార్పిడి (బార్టర్ సిస్టం) పద్ధతిలో జరిగింది.
- వర్తక సంఘాలు విద్దాంక నాణేలు ముద్రించేవారు
- వడ్డీ వ్యాపారం ఎక్కువగా జరిగేది. 12 శాతం వడ్డీని వ్యాపారస్థులు వసూలు చేసేవారు. ఈ విషయం రుషబదత్తుని నాసిక్ శాసనం తెలుపుతుంది.
- శాతవాహనుల కాలంలో రోమ్ దేశంతో ఎక్కువ వ్యాపారం చేసేవారు. రోమ్ దేశ బంగారం ఇండియాకు తరలిపోతుందని ప్లీనీ తన నేచురల్ హిస్టరీలో పేర్కొన్నాడు.
- తెలంగాణలో రోమన్ నాణేలు లభ్యమైన ప్రాంతాలు – సూర్యాపేట, ఏలేశ్వరం
- విదేశీ వ్యాపారం పశ్చిమ కోస్తా ఓడరేవుల నుంచి అధికంగా జరిగేది.
- భరుకచ్చ కంటే ముందు శాతవాహనుల ప్రధాన రేవు పట్టణం -కళ్యాణ్
ప్రధాన వాణిజ్య కేంద్రాలు
గూడూరు- సన్నని బట్టలకు
వినుకొండ- లోహ పరిశ్రమకు
పల్నాడు- వజ్ర పరిశ్రమకు
ప్రతిష్టానపురం- తగర, జౌళి పరిశ్రమలు
విదిశ- దుస్తులు, దంతపు పనులకు ప్రసిద్ధి
సాంఘిక వ్యవస్థ
- శాతవామనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.
- కింది వర్ణ ప్రజలకు ఉన్నత వర్ణ హోదా కల్పించిన వ్రతం- హిరణ్య గర్భవ్రతం
- శాతవాహనులు బ్రాహ్మణులు. ఆంధ్రలో బ్రాహ్మణులకు పన్ను లేని గ్రామాలను దానం చేసిన రాజులు శాతవాహనులు.
- పితృస్వామ్య ఉమ్మడి కుటుంబం ఉండేది. సమాజంలో స్త్రీలకు ఉన్నత స్థానం కల్పించారు.
- గౌతమి బాలశ్రీ భద్రాయన కొండపై బౌద్ధ విహారాల కోసం విరాళం ఇచ్చింది.
మత వ్యవస్థ
- బ్రాహ్మణ, బౌద్ధ, జైన మతాలు ఆంధ్రలో ప్రవేశించాయి.
- వైదిక మతం: కన్హుడి కాలంలో భాగవత మతం దక్షిణ భారత దేశంలోకి ప్రవేశించింది. గాధాసప్తశతి శివుడి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. భారత్‌లో అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం (చిత్తూరు)లో ఉంది. మొదటి శాతకర్ణి గోవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు నానాఘాట్ శాసనం
తెలుపుతుంది. - జైన మతం: శాతవాహన స్థాపకుడు సిముఖుడు మొదటి జైన మతాభిమాని. ఈ విషయం కరీంనగర్ జిల్లా మునులగుట్ట వద్ద లభించిన నాణేల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కనిపించే ఏకైక జైన స్థావరం కొలనుపాక (నల్లగొండ).
- బౌద్ధమతం: శాతవాహనులు బౌద్ధమతాన్ని ఆదరించారు. తెలంగాణలో ధూళికట్ట, తిరుమలగిరి, ఫణిగిరి, రామిరెడ్డిపల్లిలో బౌద్ధ కేంద్రాలు ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమతంలో మహాయానం, మాధ్యమిక వాదం, శూన్యవాదం ప్రవేశపెట్టాడు. సుహృల్లేఖ గ్రంథాన్ని ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితమిచ్చాడు. నాగార్జునుడు మహాచైత్యుకుల ప్రధాన శాఖలైన పూర్వ శైల చైత్యకులు, అపరశైల చైత్యకులు, ఉత్తర శైల చైత్యకులు, రాజగిరిక చైత్యకులు, సిద్దార్థక చైత్యకుల గురించి తన గ్రంథంలో ప్రచారం చేశాడు.
- ఇతనికి రెండో బుద్ధుడు, ఇండియన్ ఐన్‌స్టీన్ అనే బిరుదులున్నాయి.
విద్య - నాగార్జునుడి సుహృల్లేఖ ప్రతి విద్యార్థిచే వల్లే వేయబడుతుందని చైనా
యాత్రికుడు ఇత్సింగ్ తెలియజేశాడు. - ధాన్య కటక విశ్వవిద్యాలయం ఆధారంగా
టిబెట్‌లోని లాసా విశ్వ విద్యాలయం ఏర్పడింది. - తొలి తెలుగు పదాలు- అత్త, అద్దం, పొట్ట. వీటిని హాలుడు గాధాసప్తశతి గ్రంథంలో ప్రస్తావించాడు.
ప్రధాన ఓడరేవు కేంద్రాలు
తూర్పుతీరం పశ్చిమ తీరం
కోడూరు భరుకచ్చ (బ్రోచ్)
మైసోలియా సోపార
ఘంటసాల చౌల్
కోరంగి మండగోర, కళ్యాణ్
జీవీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు