Telangana History | స్వాతంత్య్ర ప్రియులు ఆధిపత్యంపై ఎక్కు పెట్టిన విల్లులు
19, 20 శతాబ్దాల్లో ఆదివాసీ, గిరిజన ప్రజల జీవితాల్లో వచ్చిన అనూహ్యపరిణామాల్లో భాగంగా నిర్మల్ ప్రాంతంలో గోండు-రోహిల్లాల తిరుగుబాటు వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరంలో అంతర్భాగంగానే బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సాగినప్పటికీ ఇది తదనంతర గిరిజన, గిరిజనేతర ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. ఆ క్రమంలోనే 1935-40 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా నిజాం, బ్రిటిష్ ప్రభుత్వాలకు, వడ్డీవ్యాపారులు, పట్టేదార్లకు వ్యతిరేకంగా కుమ్రంభీం నాయకత్వంలో జోడేఘాట్ గిరిజన ఉద్యమం విజయవంతగా నిర్వహించారు.
రామ్‌జీ గోండు తిరుగుబాటు
- 1769లో హైదరాబాద్ దక్కన్ రాజధాని ఔరంగబాద్ నుంచి హైదరాబాద్‌కు మారిన తర్వాత వారి రాజ్యాన్ని హైదరాబాద్ రాష్ట్రమని, దక్కన్ ప్రాంతమని పిలవడంతోపాటు ఆ రాజులను అసఫ్జాహీలని, నిజాంలని పిలిచేవారు. ఆనాడు బీరార్ సుబాలో ఆదిలాబాద్ జిల్లా ఉండేది. మొదటగా పలు రాజకీయ పరిణామాలను ఆసరాగా చేసుకొని గోండులు ‘మాణిక్ఘఢ్’ కోటను హస్తగతం చేసుకున్నారు. ఇది రాజ్యానికి వ్యతిరేకంగా గోండులు సాధించిన మొదటి విజయం.
- ఫలితంగా గోండు రాజులు పూర్వస్థానమైన సిరిపూర్ ప్రత్యక్షంగా అసఫ్‌జాహీ నిజాం పాలకుల చేతుల్లోకి వెళ్లింది. అయితే 1853లో నిజాంకు (ఈస్టిండియా కంపెనీ) బ్రిటిష్‌వారికి మధ్య జరిగిన సంధి ఒప్పందం ప్రకారం బీరార్ సుబా బ్రిటిష్‌వారి పాలనలోనికి వచ్చింది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 1853 నుంచి 1860 సంవత్సరాల మధ్య ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ తదితర ప్రాంతాల్లో గోండులు, రోహిల్లాలు రామ్జీగోండు హాజీ రోహిల్లాల నాయకత్వంలో తిరుగుబాటును ప్రారంభించారు. వీరికి తాంతియాతోపే వంటి నాయకుల సహాయ సహకారాలు అందేవి. దానితో రామ్‌జీ గోండు-హాజీరోహిల్లాలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1857 నాటికి మరాఠా, తెలుగు, రోహిల్లా, గోండు సైన్యాలను తయారు చేసి, వారికి సాయుధ శిక్షణనిచ్చి ఆదిలాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను విముక్తి చేసి నిర్మల్ రాజధానిగా కొద్దికాలం పాటు స్వతంత్రంగా పాలించారు.
- మొత్తంగా 1000 మందితో పటిష్ట సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
- వెంటనే బ్రిటిష్‌వారు తమ సైన్యాన్ని, నిజాం సైన్యాన్ని పెద్ద సంఖ్యలో నిర్మల్ ప్రాంతానికి పంపించి రోహిల్లాలను, గోండులను వేధించి చిత్రహింసలకు గురిచేశారు. కానీ గెరిల్లా యుద్ధ నైపుణ్యంగల రామ్జీగోండు సైన్యాలు కొంత మంది బ్రిటిష్ సైన్యాలను పలుచోట్ల ఓడించి చంపినప్పటికీ ఇంగ్లిష్, నిజాం సైన్యాల సంఖ్య అధికంగా ఉండటంతో గోండుల సైన్యం వీరోచితంగా పోరాడి ఓడిపోయారు. నిజాం, బ్రిటిష్ సైన్యాలు రామ్జీగోండు, హాజీరోహిల్లాలతో పాటు వారి అనుచరు లను దాదాపు 1000 మందిని బంధించాయి. రామ్జీగోండుతో సహా చేతికి చిక్కిన వారందరినీ బ్రిటిష్ అధికారులు నిర్మల్‌లోని ఖజానా చెరువుగట్టున దాదాపు 1000 ఊడలు గల పెద్ద మర్రి చెట్టుకు ఊడకొక్కరి చొప్పున 1000 మందిని ఉరి తీశారు.
- ఆనాటి నుంచి ఆ చెట్టును వెయ్యి ఉరిల మర్రి అని నిర్మల్ ప్రాంత ప్రజలు పిలుస్తుంటారు. వారి స్మృతి చిహ్నంగా నేటికి అక్కడి ప్రజలు గౌరవసూచకంగా పూజిస్తారు.
- నిర్దిష్టమైన ఆధారం ప్రకారం రామ్‌జీ గోండును ఉరితీసింది 1857 ఏప్రిల్ 9. ఇది నిజమైతే 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో ఒక తొలి ఘట్టాన్ని నిర్వహించింది రామ్‌జీ గోండు అని చెప్పాలి. అతని మరణానంతరం అతని అనుచరులు 1860 వరకు తమ తిరుగుబాటును విజయవంతంగా నిర్వహించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం.
- చివరికీ రామ్‌జీ గోండు హాజీరోహిల్లాలు సాగించిన వీరోచితమైన తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటులో అంతర్భాగంగా నడిచినప్పటికీ స్వాతంత్య్ర ప్రియులైన గోండులు, ఇతర గిరిజనులు తమపై స్థానికేతరులు చెలాయిస్తున్న అధికార ఆధిపత్యాన్ని సహించరని ఈ పోరాటం ప్రపంచానికి తెలియజేసింది.
కుమ్రంభీం ప్రతిఘటనోద్యమం-1938-40
- గిరిజన గోండు వీరులైన కుమ్రంభీం నాటి నిజాం హైదరాబాద్ రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్(జనగామ) డివిజన్లోని జోడేఘాట్ సంకేపల్లి అనే గిరిజన గూడెంలో 22 అక్టోబర్ 1901న జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కుమ్రం చిన్నూ, సోమ్బాయి.
- ఆసిఫాబాద్ ప్రాంతమంతా హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏలుబడిలో ఉండేది. ముఖ్యంగా జోడేఘాట్ ప్రాంతంలోని గోండులు, కోలాములు, పరధాన్లు, తోటీలు, నాయక్ పోళ్లు అనే గిరిజనులు ఆడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. అయితే వారు రాజ్యం ప్రత్యక్ష నియంత్రణలో లేకపోవడంతో ఆదివాసుల భూములు పరిరక్షణ పేరుతో నిజాం ప్రభుత్వం 1917లో తెచ్చిన అటవీ చట్టం గిరిజనుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించడమే కాకుండా అనేక పరిమితులు, అనేక పన్నులు విధించింది. ఈ చట్టం ప్రకారం గిరిజనులు అడవుల్లో తమ పశువులను మేపుకుంటే బంచెరాయి పన్ను, అడవి నుంచి కలప తెచ్చుకుంటే దుంపపట్టి, ఇంకా ఘర్ పట్టి, నాగర్ పట్టి, ఫసల్ పట్టి, చౌబీనా వంటి ఇతర పన్నులను కూడా గిరిజనులు ప్రభుత్వానికి చెల్లించవలసి వచ్చింది. అడవులే ఆదాయ, ఆర్థిక వనరుగా వాడుకొని జీవించడమే తప్ప పైసలను వాడటం తెలియని గిరిజనులు అటవీ చట్టం అమలు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- దీనికి తోడు 1918లో మొదటి తహసిల్ ఆఫీస్ ఏర్పడి అటవీ, రెవెన్యూ పరమైన పన్నుల వసూలుకు శ్రీకారం చుట్టింది. 1935లో సిర్పూర్ పేపర్ మిల్లు ఏర్పడింది. దీని అవసరాల కోసం విశాల అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకుంది. చేసేది లేక చాలామంది గోండు గిరిజనులు ఫ్యాక్టరీ కార్మికులుగా మారిపోయారు.
- దీనికి తోడుగా గిరిజనేతరులైన మరాఠా, తెలుగు, ముస్లింలు అధికారుల అండదండలతో మోసపూరితమైన వడ్డీవ్యాపారులతో గోండులు, కోలాముల భూములను కబ్జాచేయడమే కాక, గిరిజనులపై కేసులు బనాయించి ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేసేవారు. ఇదంతా గమనిస్తున్న కుమ్రంభీం పరిష్కారం వెతుకుతున్న సమయంలో తండ్రి మరణంతో కుటుంబం సంకెపల్లి నుంచి సుర్దాపూర్‌కు వలసపోయింది.
- ఈ సమయంలోనే కుమ్రం తన స్నేహితుల ద్వారా దోపిడీ వర్గాలకు ఎదురునిలిచి పోరాడిన గోండు రాజుల వీరత్వాన్ని, బిర్సాముండా తిరుగుబాటును, రామ్‌జీ గోండు ధీరత్వాన్ని, అల్లూరి సీతారామరాజు అమరత్వాన్ని తెలుసుకొని గోండు ప్రజలకు ఏదైన మంచి చేయాలనే ద్రృఢనిశ్చయానికి వచ్చాడు. పంటను కోసుకునే సమయంలో పట్వారీ లక్షణరావు, సిద్ధిఖీ అనే ముస్లిం పట్టాదారులు వచ్చి ఆ భూములు తమవని చెప్పడంతో జరిగిన ఘర్షణలో సిద్ధిఖీ చనిపోయాడు. ఈ సంఘటన భీం జీవితం లో తీవ్ర పరిణామాలకు కారణమైంది. కానీ అడవి పోడు వ్యవసాయమే ఏకైక జీవనాధారంగా బతుకుతున్న గిరిజనుల్లో చావోరేవో అనే నిర్ణయానికి, ఐక్యతకు ఈ సంఘటన గట్టి పునాదిని వేసింది.
- సిద్ధిఖీ మరణంతో జరగబోయే పరిణామాలను ఊహించిన కొమ్రంభీం మిత్రుడు కొండల్‌తో కలిసి మహారాష్ట్రలోని బల్లార్షాకు వెళ్లాడు. నెలరోజులు పనిచేసిన తర్వాత అక్కడ నుంచి చంద్రపూర్ వెళ్లి సామాజిక స్పృహ కలిగిన విఠోబా అనే ఒక యజమాని దగ్గర ప్రింటింగ్‌ప్రెస్‌లో పనిచేశాడు. ఆ క్రమంలోనే చదవడం, రాయడం నేర్చుకున్నాడు. విఠోబా ద్వారా చాలా ప్రభావితుడయ్యాడు. ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ముద్రిస్తున్నారనే కారణంతో విఠోబాను బ్రిటిష్ అధికారులు అరెస్టు చేయడంతో భీం అక్కడి నుంచి తప్పించుకొని అస్సాం పారిపోయి అక్కడ టీ తోటల్లో పనికి చేరాడు. అక్కడ ఐదేళ్లు పనిచేసి బ్రిటిష్ అధికారులు సాగించే దుర్మార్గమైన అణచివేతకు వ్యతిరేకంగా కూలీలను కూడగట్టి వారికి నాయకత్వం వహించాడు. అక్కడ నిరంకుశుడైన ఒక మేస్త్రీని కూలీలు చంపేయడంతో అక్కడ నుంచి తప్పించుకొని తన గొండు ప్రజలకోసం పాటు పడాలనే సంకల్పంతో తిరిగి జోడేఘాట్‌కు వచ్చాడు.
- భీం తిరిగి వచ్చిన విషయం అన్ని గిరిజన గూడెల్లో తెలిసింది. భీం చదువుకొని తెలివిమీరినట్లు గోండులు, కోలాములు భావించారు. అప్పటికీ పట్టేదార్లు, పోలీసుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలంతా అసంతృప్తితో రగులుతున్నారు.
- తెలుగు, మరాఠీ, ఉర్దూ, భాషలు తెలిసిన భీమ్ కాకన్ గూడెం పెద్ద లచ్చుపటేల్కు చాలా దగ్గరయ్యాడు. గతంలో 12 ఎకరాల పోడు వ్యవసాయ భూమి విషయంలో జనగామ అమీన్‌సాబ్ పెట్టిన కేసు నుంచి లచ్చు పటేల్‌ను గెలిపించడంతో గోండు, కోలాము గూడేల్లో కుమ్రం భీం పలుకుబడి బాగా పెరిగిపోయింది.
- ఆ రోజుల్లో సుర్దాపూర్ ప్రాంతంలో ఉన్న తన బంధువులతోపాటు గోండు, కోలాం గూడేల్లో గిరిజనులు జల్-జంగల్-జమీన్ (నీళ్లు-అడవులు- భూములు) అనే నినాదంతో ప్రభుత్వాధికారులను ఎదిరించి పోడు వ్యవసాయం చేసుకొందామని వారిని సంఘటిత పరిచాడు. పోడు భూములు సిద్ధం చేసుకొని ఎక్కడికక్కడే 12 గోండు గూడేలను ఏర్పాటు చేశాడు.
1) బాబేఝరీ 2) జోడేఘాట్
3) చల్‌బరిడి 4) గోగిన్మోవాదం
5) టోయికన్మోవాదం
6) భీమన్‌గొంది 7) కల్లేగామ్
8) మురికి లొంక 9) అంకుశాపూర్
10. నర్సాపూర్ 11) దేమ్డిగూడ
12) పట్నాపూర్ - ఈ 12 గూడేల పరిధిలో దాదాపుగా 300 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజనులు కుమ్రంభీం నాయకత్వంలో ఆక్రమించుకొని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సాగుచేస్తున్నారని రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు ప్రకటించారు.
- అంతే కాకుండా గిరిజనులకేమైన అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజెప్పుకోవడానికి కొంతకాలం గడువిచ్చారు. కానీ, నిరక్షరాస్యులైన గోండు గిరిజనులకు ఇవేమి తెలియక ఆ భూములను సాగు చేస్తుండటంతో అధికారులు కేసులు పెట్టారు. గిరిజనులు కుమ్రంభీం మద్దతుతో ప్రభుత్వ కేసులను లెక్కచేయక కొంత మంది అధికారులతో ఘర్షణ పడి గాయ పడ్డాడు. పరిస్థితి విషమించిందని గ్రహించిన ఆసిఫాబాద్ తాలూక్దార్ కుమ్రంభీంతో చర్చలు జరిపారు. భీంకు ఎన్ని ఆశలు చూపించిన 12 గూడేలపై స్వతంత్ర అధికారం(మావెనాటె-మావెరాజ్) కావాలని డిమాండ్ చేశాడు. దానితో చర్చలు విఫలమయ్యాయి.
- ఇదే విషయంలో తమ గిరిజనులకు అటవీ భూముల మీద హక్కులు కావాలని, తమ ప్రాంతం మీద స్వేచ్ఛాధికారాలుండాలని భీమ్ అనేకసార్లు ఉత్తరాలు నిజాంకు పంపాడు. అయినా ఎటువంటి జవాబు రాలేదు. దాంతో స్వయంగా వెళ్లి తమ సమస్యలను నిజాంకు చెప్పుకోవాలని ఒక ఉత్తరంతో హైదరాబాద్ వెళ్లాడు. అధికారులు, రాజ్య ప్రధానమంత్రి గాని భీం చెప్పే విషయాన్ని వినకపోగా గట్టిగా మదలించారు.
- నిజాం దర్శనం కాక నిరాశతో తిరిగి వచ్చిన కుమ్రంభీమ్, జోడేఘాట్‌లో అధికారులు, పోలీసులు సృష్టించిన బీభత్సాన్ని తట్టుకోలేక, యుద్ధమే శరణ్యమని భావించి తన 12 గూడేల గిరిజనులను సమావేశపరచి సంప్రదాయక ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని పోరాటానికి పిలుపునిచ్చాడు. 12 గ్రామాలు విముక్తి చెందినట్లు ప్రకటించి, తన పోరాట కేంద్రంగా జోడేఘాట్‌ను ఎంచుకున్నాడు. వెంటనే భీం గోండు, కోలాం, పరధాన్, తోటి, నాయకపోడు గిరిజనులతో సైన్యాన్ని తయారుచేసుకొని యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు.
- ఈ సమయంలో భీంను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు సాయుధ గోండు సైనికులు చితకబాదారు. అంతేగాకుండా కుమ్రంభీం నాయకత్వంలో గోండు రాజ్యం పాలన ప్రారంభమైందని
తన రాజ్యంలో కాలుమోపితే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించి పంపారు. - వెంటనే నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భీంతో చర్చించడానికి సబ్ కలెక్టర్‌ను పంపించాడు. పన్నెండు గ్రామాలకు పట్టాలిస్తాం కానీ రాజ్యాధికారం ఇవ్వలేమని ప్రకటించాడు.
- జోడేఘాట్ పరిస్థితులు చేజారుతున్న సమయంలో కుమ్రంభీం దగ్గర పనిచేసిన కుర్దుపటేల్ను ప్రభుత్వ అధికారులు లొంగదీసుకున్నారు. అతని ద్వారా 12 గ్రామాల ప్రజలు జోడేఘాట్‌లో సమావేశమవుతున్నారని తెలుసుకున్నారు. 1940 సెప్టెంబర్ 1న ఊరి పొలిమేరలో సమావేశమైన ప్రజలను ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాదాపు 300 మంది నిజాం సైనికులు చుట్టిముట్టారు. పడుకున్న వారిని, పరిగెడుతున్న వారిని జోడేఘాట్ లోయలోని నెయ్కప్పి జలపాతం దగ్గర, కారియేట్ గుండం దగ్గర కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో భాగంగానే కుమ్రంభీమ్ కూడా నిజాం సైనికులతో హోరాహోరీగా పోరాడుతూ వారి తూటాలకు బలై అమరుడయ్యాడు.
- ఈ కాల్పుల్లో కుమ్రం భీంతో సహా అతని అనుచరులు 9 మంది చనిపోయారని, గాయపడిన 13 మందిలో మరో ఆరుగురు చనిపోయారని ప్రకటించింది. కానీ దాదాపు 140 మంది వరకు అమరులై ఉంటారని కొంతమంది నిపుణుల అంచనా.
- ఈ ఘటన తర్వాత గోండుల పరిస్థితి అధ్యయనానికి ఒక కమిటీని నిజాం వేశాడు. కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు ‘దస్తుర్-ఉల్-అమల్’ చట్టాన్ని తీసుకువచ్చారు. ముఖ్యంగా కుమ్రంభీమ్ పోరాట ఫలితంగా డా. బి.ఆర్ అంబేద్కర్ ఆదివాసుల భూమి రక్షణకు రాజ్యాంగంలో 5వ, 6వ షెడ్యూల్లో నిబంధనలను పొందుపరిచారు. దీని ఫలితంగానే తర్వాత కాలంలో దేశంలో 1/70 చట్టం కూడా వచ్చింది.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
Previous article
STPI Recruitment | ఎస్టీపీఐలో టెక్నికల్ స్టాఫ్ పోస్టులు
Next article
INTER ENGLISH | Jr. INTER ENGLISH MODEL PAPER
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు