కాకతీయుల సాంఘిక పరిస్థితులు..
తెలంగాణ కేంద్రంగా దక్కన్ ప్రాంతాన్నంతా పాలించిన రాజవంశాల్లో కాకతీయ వంశం ప్రధానమైనది. కాకతీయుల పాలనలో యావత్ తెలుగు నేల సర్వతోముఖాభివృద్ధి చెందింది. సాంస్కృతికంగా, ఆర్థికంగా, పరిపాలనాపరంగా కాకతీయులు వారి తర్వాతి తరాలకు మార్గదర్శకులుగా నిలిచారు. కాకతీయ యుగంలో సామాజిక వ్యవస్థ హిందూ ధర్మాల పునాదులపై సంపూర్ణంగా స్థిరత్వాన్ని సాధించింది. వర్తక వాణిజ్యాలు, అంతర్జాతీయ వాణిజ్యం ఉచ్ఛదశకు చేరాయి. తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన కాకతీయుల పాలన, నాటి సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ పరిస్థితులపై టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలో ఎక్కువగానే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాకతీయుల కాలంనాటి సాంఘిక పరిస్థితులపై నిపుణ పాఠకులకోసం ఈ కథనం..
కాకతీయులు అనులోమ, విలోమ వివాహ పద్ధతులను అనుసరించారు. కాకతీయ రుద్రమదేవి రెండో కూతురు ఇందులూరి అన్నయమంత్రి అనే బ్రాహ్మణున్ని వివాహం చేసుకుంది. గణపతి దేవునికి చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు ఉంది. వీరి కాలంలో బలిజ, సాతాని, వెలమ వంటి కొత్త కులాలు ఆవిర్భవించాయి. రెడ్డి, వెలమ, కమ్మ, తెలగ కులాలు ఈ కాలంలో గట్టిపడ్డాయి. కాకతీయుల శాసనాల్లో కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, అక్కలవారు (కంసాలి), సాలెవారు, మంగలి, కుమ్మరి, కమ్మరి, బోయ, రుంజలు, పిచ్చకుంట్లవారు, బవని, మేదర, గాండ్ల మొదలైన కులాల పేర్లు శాసనాల్లో కన్పిస్తున్నాయి. కాకతీయ రాజులు వీరశైవ, వీరవైష్ణవ మతాలను పోషించి వాటి ద్వారా సాంఘిక సమానత్వాన్ని సాధించాలని చూశారు. కానీ అది సాధ్యం కాలేదు. పైగా శైవమతం వల్ల సమాజంలో లింగాయతులు, బలిజలు, పెరిక జంగాలు, తంబళ్లు వంటి మొదలైన కొత్త కులాలు పుట్టాయి.
అలాగే వైష్ణవంలో సాతానులు, నంబులు, దాసర్లు, శైవంలో చాకలి, మంగలి, మాల, మాదిగ జాతుల వారు ఉన్నారని బసవపురాణం చెబుతున్నది. మల్కాపురం శాసనం ప్రకారం అన్ని కులాల వారికి, చివరికి చెండాలురకు కూడా సహపంక్తి భోజనాలు, అన్న, వస్త్ర దానాలు సమానంగా ఉన్నాయి. విశ్వబ్రాహ్మణులు మొదట జైనులు తరువాత వీరశైవంలో చేరారు. గణపతి దేవచక్రవర్తి నియోగ బ్రాహ్మణులను కరణీకం వృత్తిలో స్థిరపడేట్లు చేశాడనీ, గోపరాజు రామప్రధాని అనే మంత్రి సలహాపై కరణాలుగా నియమించాడని తెలుస్తోంది. మార్కోపోలో ప్రకారం కాకతీయుల కాలం నుంచే ఓరుగల్లులో పూటకూళ్లిల్లు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజులు-వివాహాలు
-గణపతి దేవుని భార్య సోమలదేవికి ఇద్దరు కుమార్తెలు (రుద్రమ, గణపాంబ). రుద్రమను నిడదవోలు వీరభద్రునికి, గణపాంబను ధరణికోట బేతరాజుకిచ్చి వివాహం చేశాడు.
-రుద్రమ తన కుమార్తె రుయ్యమను అన్నయ అనే బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసింది.
-సాంఘిక దురాచారాలు: బాల్య వివాహాలు, వరశుల్కం, నిర్బంధ వైధవ్యం, జూదం, పాచికలాట, దేవదాసీ, బలి ఇచ్చి స్త్రీని పెండ్లి చేసుకోవడం, సతి, బసివినీ వ్యవస్థ (శైవం), మద్యపానం, కోళ్లు, పొట్టేళ్ల పందాలు మొదలైనవి. ఇంకా పాములాటలు కూడా ఉన్నాయి.
కుల సంఘాలు:
కాకతీయ సమాజంలో కుల సంఘాలు ఉండటం ఒక ప్రధాన లక్షణం. ఈ కుల సంఘాలను సమయము అంటారు. మహాజనులు (బ్రాహ్మణ), నకరము (వైశ్య) మొదలైనవి. గ్రామాల్లో అష్టాదశ కులాలవారు, ద్వాదశ వృత్తుల వారు ఉండేవారు. వారు కరణం, కాపు, తలారి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, శెట్టి, పురోహితుడు, వడ్రంగి, చాకలి, మంగలి, చర్మకారుడు మొదలైనవారు.
-తిరునాళ్లలో: కాకతీయుల పాలనాకాలంలో అనేక జాతరలు జరిగేవి. నాటకాలు, హరికథలు, కోలాటాలు, జక్కుల యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, రంగులరాట్నాలు వీరికాలం నుంచే సమాజంలో ప్రవేశించాయి. అంతేగాక వీరశైవ మతస్థులు నిప్పుగుండాల్లో నడవటం, కండలు కోసుకోవడం, తలలు నరుక్కోవడం, కత్తులు, ఈటెలు పాతిన పాతర్లలో నడవటం ఒక ఆచారంగా ఉండేది.
–స్త్రీల అలంకరణ: కాళ్లకు పసుపు లేపనం, పారాణి, పెదవులకు యావక రసం పూసుకోవడం, పండ్లకు చిక్కాపొడి, అవాంఛిత రోమాలు పోవడానికి సుసుర ఖేట్ వాడటం, పెండ్లయిన ఆడవారి మెడలో తాళి, నల్లపూసల దండ, కాళ్లకు మెట్టెలు, అందెలు, ముక్కుకి ముక్కెరలు, ముంజేతికి మురుగులు, మోచేతులకు దండ కడియాలు, నడుముకు వడ్డాణాలు, సంపన్న స్త్రీల మెడలో ముత్యాల హారాలు, పుడకల పట్టెడ, రోమ్ నాణేలతో మెడలో కాసుల పేర్లు, తాటంకాలుగా పిలువబడిన హారాలు, చైనా అద్దాలు వాడేవారు. మార్కోపోలో ప్రకారం సన్నని సాలెగూడు వంటి దారాల పోగులవలె ఉండే వలువలను స్త్రీలు ధరించేవారని తెలుస్తున్నది.
-వస్ర్తాలు: బసవ పురాణ కర్త సోమనాథుడు 20 రకాల వస్త్రధారణల గురించి రాశాడు. అవి వెంజావళియు, జయరంజియు, మంచుపుంజంబులు, మణిపట్టు, భూతిలకము, శీవన్నియము, మహఛీనీ, భావ తిలకం, పచ్చని పట్టు, రాయశేఖరం, రాయవల్లభుడు, వాయు మేఘము, గజవాళము, గండవాడము, గావులు, సరిపట్టు, మస్లిన్ వస్ర్తాలు, అద్దకాలు
-వివాహాలు: కాకతీయుల కాలంలో వివాహాలు నాలుగు రోజులు జరుగుతుండేవి. మేనమామ కూతురును వివాహం చేసుకునే ఆచారం ఉంది. రాజ కుటుంబాల్లో వివాహం జరిగేటప్పుడు రాజ్యమంతటా ఉత్సవాలు జరిగేవి. తలంబ్రాలు పోయడం, ఊరేగింపు ఆచారం ఉంది. సామాన్యుల వివాహాలు, పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఒప్పుకోవడాన్ని ముద్రారోహణం అంటారు. ముద్రారోహణం అంటే కన్య శిరస్సుపై పూలు ఉంచడం. వివాహానంతరం వసంతోత్సవాలుండేవి.
-మూఢనమ్మకాలు: అంజనం వేయడం, శకునాలు పాటించడం, భూత ప్రేతాలపై నమ్మకాలు, పాపభీతి, ఒట్లు వేయించడం (అప్పు తీసుకున్నావారిని ఇచ్చినవారు చుట్టూ గుండ్రని గీత గీసి రుణం తీర్చమనీ, లేదా ఎవరినైనా జామీనుగా చూపించేదాకా కదలనిచ్చే వారుకాదని మార్కోపోలో రాశాడు). గ్రామ దేవతలకు బలి ఇవ్వడం మైదలైనవి ఉన్నాయి. ముస్లిం రచనల ప్రకారం దక్షిణ దేశపు స్త్రీలు ఆవుపేడతో ఇల్లు అలికే ఆచారం కలదనీ, దానివల్ల చీడ పీడ, భూత, ప్రేతాలు రావని నమ్మేవారు.
-రాజవంశీయులు-దినచర్యలు: చక్రవర్తులు, సామంతరాజులు, మంత్రులు, సేనానులు, రెండు పూటల స్నానం చేసేవారు. అభ్యంగన స్నానం వారానికి ఒకసారి, వివిధ పుష్పాలతో కాచిన నూనెను తలకు పట్టించి స్నానం చేసేవారు. నలుగుపిండి (పసుపు, ఉప్పు) వాడేవారు. అభ్యంగన స్నానానికి వాడిన నూనెను గేదంగి, చంపకం, పున్నాగ, జాజి వేసి కాచేవారు. ఆ నూనెతో శరీర మర్ధన చేసేవారు. నలుగు పిండిలో కోష్టము, తక్కలము, ముస్తలు, మాచిపత్రి, నందివర్దనం, వాయింట, మాంసి, మొట్ట తామర దుంపలు మొదలైనవాటిని నీడలో ఎండబెట్టి తులసి, యాలకులు, నిమ్మ, ఆర్ద్రకం ఆకులు, లోద్ర, లవంగాలు, శ్రీ గంధం, కొత్తిమీర, జాజికాయలను కలిపి పొడిచేసి, కంది, పెసర, మినుము, బియ్యం కలిపి విసిరిన పిండితో గంధక చూర్ణాల పొడి, చావంచ గింజల పొడిలను కలిపి నలుగు పిండిని తయారుచేసుకునేవారు.
-వ్యభిచార వృత్తి: ఢిల్లీ సుల్తాన్ ఉలుఘ్ ఖాన్ ప్రకారం ఓరుగల్లులో బోగం వీధి ఉన్నట్లు తెలుస్తోంది. రాజ అంతఃపురంలో, దేవాలయాల్లో వీరు నృత్యం చేసేవారు. ఓరుగల్లులో జార ధర్మాసనం, వేశ్యలకు సమాజంలో గౌరవ స్థానం ఉండేది. ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తె మాచల్దేవికి ఆనాటి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉండేది.
-ఇతర అంశాలు: వైష్ణవ మతస్థులు దేవదాసీలను శైవమతస్థులు బసవనీరాండ్రి ఆచారాలు ప్రవేశపెట్టారు. రుద్రమదేవి స్త్రీలకు ప్రసూతి ఆస్పత్రులు, శిశువుల ఆరోగ్యశాలలు కట్టించింది.
ఆర్థిక పరిస్థితులు
కాకతీయుల కాలంనాటి ఆర్థికపరిస్థితులను గురించి మార్కోపోలో, అమీర్ఖుస్రో, అబ్దుల్లా వాసఫ్ రచనల వల్ల తెలుస్తోంది. వీరికాలంలో తెలంగాణ సిరిసంపదలతో తులతూగినట్లుగా అర్థమవుతోంది.
-వ్యవసాయం: ఎన్నో నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటలు, కాలువలు, బావులు తవ్వించారు. వ్యవసాయ భూములపై మొదటి పెత్తనం రాజులది కాగా, తరువాత వ్యక్తిది. ఆరోజుల్లో వరి, గోధుమ, జొన్న, మక్కజొన్న, కొర్రలు, తైదలు, ఆవాలు, ఆముదం, నీలిమందు, నువ్వులు, పెసలు, కందులు, చెరకు, సజ్జలు, ఉలవలు, మినుములు, పత్తి, అల్లం, పసుపు, ఉల్లి మొదలైన పంటలను పండించారు. పశుసంపద పుష్కలంగా ఉండేది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గొర్రెల సమూహాలు కాకతీయుల రాజ్యంలో ఉన్నాయని మార్కోపోలో తన రచనల్లో పేర్కొన్నాడు. బెల్లం, నూనె గానుగలు ప్రతి గ్రామంలో ఉండేవి. ద్రాక్షా సారాయి తయారు చేసేవారు. పెద్దినాయకుడు-అంబదేవుని అనుచరుడు భూమిని సర్వే చేయించి కొలిపించాడు.
–పరిశ్రమలు: నేత, నూలు, కమ్మరి, తాపీ, తెలీలు, నగలు చేసేవారు. చర్మకారులు, కుమ్మరి, రత్నం కంబళ్లు, మఖమల్ వస్ర్తాలు, ఇనుము, రాగి లోహ పరిశ్రమలు, చలువరాయి, సున్నపురాయి, ఉప్పుతయారీ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వద్ద కూన సముద్రంలో శ్రేష్టమైన ఇనుము దొరికేది. ప్రపంచ ప్రసిద్ధమైన డెమాస్కస్ కత్తుల తయారీకి ఈ ఇనుమును ఉపయోగించేవారు. వరంగల్లో నేసే ఉన్ని తివాచీల ప్రసక్తి క్రీడాభిరామంలో ఉంది. అయోధ్య నుంచి కరాచీ పోయే దారి వరంగల్ మీదుగా ఉండేదని కేతన తన ఆంధ్రభాషా భూషణంలో రాశాడు.
–వర్తక వాణిజ్యాలు: దేశీ, నానాదేశీ, పరదేశీ వంటి వర్తకులుండేవారు. ఎద్దుల వీపులపై గోనె సంచుల్లో రవాణా చేసే వర్గం పెరికలు ఉండేవారు. అల్లం వ్యాపారిని అల్లంశెట్టి అని, మిరియాల వ్యాపారం చేసే వారిని మిరియం శెట్టి అని పిలిచేవారు. వాతావరణం అనుకూలించక నడిసంద్రంలో ప్రయాణించే ఓడలు కొండలకు ఢీకొని సరుకు ఒడ్డుకు చేరితే అక్కడి సామంత రాజులు ఆ సరుకును స్వాధీనం చేసుకొని నావికులను హింసించేవారు. దీనికి గణపతి దేవుడు అభయ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. మార్కోపోలో మోటుపల్లిని మెట్టల్ అని, మట్టుపల్లి అని పిలిచేవాడు.
-రేవులు: మోటుపల్లి గ్రామంలోని వీర భద్రస్వామి ఆలయం ఎదరుగా ఉన్న శిలామండప స్తంభంపై చెక్కించబడిన శాసనం శాలివాహన శకం 1162లో (1244-45కు సమానం) క్రోధినామ సంవత్సరంలో గణపతిదేవుడు వేయించిన అభయ శాసనం నా ప్రాణంకన్నా సాహసికులైన నా ప్రజల రక్షణే నాకు ప్రీతిపాత్రం అన్నాడు. సముద్ర వ్యాపారులపై ఇష్టంతో కొత్త పన్నులు తీసివేశాడు. స్థానిక పన్నులను కృష్ణశుల్కం అనేవారు.
–ఎగుమతులు: వక్కలు, పువ్వులు, ధాన్యం, నూలు, తమలపాకులు, మంచిగంధం, హారతి కర్పూరం, ముత్యాలు, పన్నీరు, దంతం, జవ్వాది, పునుగు, కర్పూర తైలం, పగడాలు, అత్తరు, లోహాలు.
–దిగుమతులు: చైనాసిల్క్, చైనా కర్పూరం, గులాబీ అత్తరు, అరబ్ గుర్రాలు, రాగి, తగరం, సీసం, లోహాలు, పట్టు, నూలు, పగడం, సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, పోకలు.
-దొంగతనాలు: దేశం అంతటా దట్టమైన అడవులు విస్తరించి ఉండటంతో నాడు డొంకల్లో, అటవీ కాలిదారుల్లో దొపిడీ దొంగలు కాపుకాసి ఉండేవారు. దీంతో వ్యాపారులు గుంపులుగా వెళ్లేవారు. వీరిని బిడారులు అంటారు. ఎడ్లు, గుర్రాలు, గాడిదలు సరుకులను మోసేవి. వ్యాపారుల వెంట 100 మంది పనివారుండేవారు.
–విదేశీ వాణిజ్యం: ఇండోనేషియా, జావా, సుమిత్రా, చైనా, బర్మా, మలయా, జపాన్ దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది. వస్తు మార్పిడిలో మాడి రూక, టంక వంటి నాణేలు వాడేవారు. గ్రామీణ ప్రాంతాల్లో వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉంది. కొన్ని చోట్ల పావు మాడ, అర్ధమాడ, పరక మాడ, చిల్లర నాణేలు వాడుకలో ఉండేవి.
-ఒక పెరిక నూనె – రెండు వీసములు
-లక్ష పోక కాయలకు – పావు వీసం
-నేయి, బండి ధాన్యం – రెండు వీసమములు
-తులం చందనానికి – ఒక ఫలం
-వీశె పగడాలకు- ఒక చిన్నం
-కాకతీయుల కాలంలో వడ్డీ వ్యాపారం కూడా ఉంది. వడ్డీరేటు 12 శాతం మించరాదని విజ్ఞానేశ్వరం గ్రంథం తెలుపుతోంది. వీరభద్రేశ్వరుడికి దానం చేసిన అనేక రకాల వస్తువులపై పన్నుల రేట్లను గురించి గణపతి దేవుని వరంగల్ శాసనం ద్వారా తెలుస్తోంది.
ఇతర విశేషాలు
-కాకతీయ రాజులు, సామంతులు, మంత్రులు, రాణులు, అడవులను నరికించి కొత్త గ్రామాలను నిర్మించారు. గణపవరం, మాచవరం, రుద్రవరం, తాడిపల్లి, బయ్యారం, ధర్మకీర్తి పురం, కొత్తగూడెం, మంథెన, కాళేశ్వరం, అచ్చంపేట, బేతవోలు, ప్రోలేనిగూడెం, ముప్పవరం వంటి గ్రామాలను ఈ విధంగానే నిర్మించారు.
-ప్రభుత్వ ఉద్యోగులందర్నీ భట్టారకులనేవారు. వీరు భట్టారని యోగాధిపతి పర్యవేక్షణలో పనిచేసేవారు.
-ఆర్జి పెట్టుకుంటే పన్నును వెండుకోల్వరి, మగ్గం పన్నును అచ్చుత్తరి, గానుగ పన్నును సెక్కుక్కడమై, బెల్లంవండితే పన్ను, విప్పపువ్వు పన్ను ఇరుప్పుకట్టే, చెరువులో చేపలు పడితే పన్ను ఎరిమిన్ పట్టం దుకాణాలపై పన్నులు ఉండేవి. ఇంకా మంచి ఎద్దు, ఆవు పై పన్ను, గ్రామ తలారికి ఇచ్చే పడికావల్ పన్ను ఉండేవి.
-చట్టవిరుద్ధంగా వసూలు చేస్తున్న పన్నులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పుట్టిమాడ పన్నును ధన రూపంలో వసూలు చేసేవారు. దేవకార్యాల కోసం మగము అని వసూలు చేసేవారు.
-బందెల దొడ్లపన్ను, ఇల్లరి, పుల్లరి, తలారి పన్ను, అమ్మకపు సుంకం, ఉప్పు పన్ను మొదలైనవి అమల్లో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు