ఆధునిక యుగంలోకి హైదరాబాద్ సాలార్జంగ్ సంస్కరణలు
తరతరాలుగా సంప్రదాయకమైన పాలనలో అవినీతి పెచ్చుమీరి ఆర్థికంగా చితికిపోయిన హైదరాబాద్ రాజ్యంలో మొదటి సాలార్జంగ్ జమానా మొదలవటంతోనే విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొన్నాయి. ఆధునిక భావాలున్న మొదటి మొదటిసాలార్జంగ్ హైదరాబాద్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అనేక సంస్కరణలు మొదలుపెట్టారు. దాంతో రాజ్యం ఆధునిక యుగంలోకి అగుడుపెట్టింది. మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలపై నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత మొగల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమై క్షీణదశ ప్రారంభమైంది. ఆ పరిస్థితుల్లో మొగల్ చక్రవర్తులతో దక్కన్ సుబేదారుగా నియమించబడ్డ నిజాం ఉల్ ముల్క్ దక్కన్లో 1724లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పర్చకున్నాడు. ఈ రాజ్యానికి మూల పురుషుడైన నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా అనే బిరుదుతో పాలించినందువల్ల ఈ వంశానికి అసఫ్‌జాహీ వంశం అని పేరు వచ్చింది. ఇతని అసలు పేరు మీర్ ఖమ్రుద్దీన్. రెండో నిజాం అలీఖాన్ కాలం నుంచి వీళ్లు నిజాంలుగా పిలవబడ్డారు. ఆసఫ్ జాహీ వంశంలో తొలిపాలకుడు నిజాం ఉల్ ముల్క్ నుంచి చివరి పాలకుడు ఉస్మాన్ అలీఖాన్ వరకు మొత్తం ఏడు మంది రాజులు 224 ఏండ్ల కాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం ఉల్ ముల్క్ 1724లో స్థాపించిన హైదరాబాద్ రాజ్యం 1948 వరకు కొనసాగింది. హైదరాబాద్ రాజ్య విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు. 1881 నాటికి రాజ్య జనాభా 98,45,594. హైదరాబాద్ రాజ్యం ప్రధానంగా మూడు ప్రాంతాల కలయిక. అవి 1. మరాఠ్వాడ, 2. తెలంగాణ 3. కర్ణాటక ప్రాంతాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలోని 562 సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానమే అతిపెద్దది. ఇది 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది.
-నిజాం పరిపాలనా వ్యవస్థలో దివాన్ లేదా ప్రధానమంత్రి పదవికి విశిష్ట స్థానం ఉంది. నిజాంల వద్ద ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరిలో అత్యంత సమర్థుడు మొదటి సాలార్జంగ్. 1829లో బీజాపూర్‌లో జన్మించిన సాలార్జంగ్ మదీనాకు చెందిన షేక్ ఉమర్ కర్మాన్ సంతతికి చెందినవాడు. నాలుగో నిజాం నసీరుద్దౌలా పరిపాలనా కాలంలో అతని దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన సిరాజ్ ఉల్ ముల్క్ 1853లో మరణించడంతో అతని స్థానంలో అతని మేనల్లుడు మొదటి సాలార్జంగ్ను బ్రిటిష్ రెసిడెంట్ సలహామేరకు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. సాలార్జంగ్గా పిలువబడే మొదటి సాలార్జంగ్ అసలు పేరు నవాబ్ తురబ్ అలీ ఖాన్. సాలార్జంగ్ అనేది అతనికి బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన బిరుదు. 30 ఏండ్ల పాటు 1853-1883 వరకు ముగ్గురు నిజాం కింద సమర్థంగా పనిచేసిన ఘనత సాలార్జంగ్ది. నాలుగో నిజాం నసీరుద్దౌలా, ఐదో నిజాం అప్జలుద్దౌలా, ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్.
-మీర్ మహబూబ్ అలీఖాన్ మూడేండ్ల వయసులోనే ఆరో నిజాంగా బాధ్యతలు చేపట్టాడు. దీంతో నిజాంకు పద్దెనిమిదేండ్లు వచ్చేవరకూ మొత్తం పాలనా బాధ్యతలను సాలార్జంగ్ నిర్వహించాడు. సాలార్జంగ్ తన కూతురిని మహబూబ్ అలీఖాన్కిచ్చి వివాహం చేసి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. సాలార్జంగ్ దివాన్ కాకముందే ఇంగ్గిష్ అధికారి డైటన్ వద్ద పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇతడు ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నాటికి వయస్సు కేవలం 24 మాత్రమే. ప్రధానమంత్రి పదవి చేపట్టక ముందు సాలార్జంగ్ మెదక్ తాలూక్దారుగా పనిచేసిండు. రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా ఆయన నిర్వహించిన అనుభవం తర్వాత కాలంలో ప్రధానమంత్రిగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడ్డాయి. తన సంస్కరణలను ఆచరణలో పెట్టడానికి ఒకవైపు నిజాం రాజుల అనుమతిని మరోవైపు బ్రిటిష్‌వాళ్ల సూచనలు, సలహాలు పొందుతూ నిజాం-బ్రిటిష్ సంబంధాలను సమన్వయపరుస్తూ తన సంస్కరణల ప్రక్రియను కొనసాగిస్తూ నిజాం రాజ్య వ్యవస్థను సాలార్జంగ్ పునరుజ్జీవింపచేశాడు.
-సాలార్జంగ్ 1853 నుంచి 1883 వరకు ముగ్గురు నిజాంల వద్ద ప్రధానిగా పనిచేశాడు.
-1829 నుంచి 1857- నాలుగో నిజాం మీర్ పర్ఖుందా అలీ ఖాన్ నసీరుద్దౌలా
-1857 నుంచి 1869- ఐదో నిజాం మీర్ తహ్నియత్ అలీఖాన్ అఫ్జలుద్దౌలా
-1869 నుంచి 1911- ఆరో నిజాం మహబూమ్ అలీ ఖాన్
-సాలార్జంగ్ దివాన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి హైదరాబాద్ రాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మొదటి అసఫ్‌జా నిజాం-ఉల్-ముల్క్ తన స్వతంత్రతను ప్రకటించుకున్న తర్వాత మరాఠాలకు చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులను చెల్లించడానికి నిరాకరించిండు. దాంతో నిజాంకు మరాఠాలకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. చివరిగా 1728లో పాల్కేర్ యుద్ధంలో నిజాం ఓడిపోవడంతో మరాఠాలకు ఇవ్వాల్సిన పన్ను బకాయిలను పెద్ద మొత్తంలో చెల్లించాల్సివచ్చింది. ఇక 1766లో రెండో నిజాం అలీఖాన్ బ్రిటిష్ వాళ్లతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా ఉత్తర సర్కారు జిల్లాలైన శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్, చీకాకోట్ ప్రాంతాలను దుబాషి కొండ్రేగుల జోగిపంతులు మధ్యవర్తిత్వంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వదులుకోవాల్సి వచ్చింది. వాటితోపాటు 1788లో గంజాం నుంచి గుంటూరు వరకు గల తీరాంధ్ర ప్రాంతాన్ని ఆంగ్లేయులకు స్వాధీనపర్చాల్సి వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, నిజాం అలీఖాన్ మధ్య కుదిరిన సైన్యసహకార పద్ధతిని అనుసరించి బ్రిటిష్ సైన్యం పోషణకు అయ్యే ఖర్చులను భరించడానికి బదులుగా నిజాం అలీఖాన్ 1800లో రాయలసీమ జిల్లాలైన బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వదులుకోవాల్సి వచ్చింది.
ఈ ప్రాంతాలు క్రమంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి పోవడంలో నిజాం ప్రభుత్వం ఆదాయం తగ్గిపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు, సంస్థల నుంచి నిజాంకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నిజాం తన రాజ్యంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే నిమిత్తం బ్రిటిష్ వర్తక సంస్థ అయిన పామర్ అండ్ కంపెనీ నుంచి రుణాన్ని పొందాడు. ఈ సంస్థ స్థాపకుడు విలియం పామర్. ఇతడు 1799 నుంచి 1812 వరకు నిజాం సైన్యంలో పనిచేశాడు. పదవీ విరమణ తర్వాత పామర్ అండ్ కంపెనీ అనే వర్తక సంస్థను ప్రారంభించాడు. నిజాం ప్రభుత్వం ఈ సంస్థ నుంచి అధిక వడ్డీకి పెద్ద మొత్తంలో లక్షలాది రూపాయలను రుణంగా తీసుకుంది. ఈ వర్తక సంస్థ ప్రైవేట్ వ్యక్తుల నుంచి 12 శాతం వడ్డీకి డబ్బు తీసుకుని 25 శాతం వడ్డీకి అప్పులిచ్చేది. దీంతో నిజాం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. 1820లో హైదరాబాద్ రెసిడెంటుగా నియమితుడైన లార్డ్ మెట్కాఫ్ 6 శాతం వడ్డీతో ఈస్ట్ ఇండియా కంపెనీనుంచి నిజాంకు రుణమిప్పించి పామర్ కంపెనీ నుంచి రుణ విముక్తుడ్ని చేశాడు. 1851 నాటికి బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీకి నిజాం బాకీ 70 లక్షలకు చేరుకుంది. ఈ అప్పుల బారి నుంచి బయటపడటం కోసం నిజాం 1853లో బీరార్, ఉస్మానాబాద్, రాయ్‌చూర్ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించిండు. వీటికి తోడు తరుచుగా జరిగిన మైసూరు, మహారాష్ర్ట యుద్ధాలవల్ల నిజాంలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజాం సొంత ఖర్చులకు కుడా డబ్బులు లేక తన భూములను, వజ్రాలు, నగలను రోహిల్లా వడ్డీ వ్యాపారస్తుల వద్ద తాకట్టు పెట్టి అప్పులు జేశాడు. దీనికితోడు ఉద్యోగుల్లో అవినీతి పెరిగి రాజ్యంలో శాంతిభద్రతలు కరువై దోపిడీ, దొంగతనాలు అధికమై పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. వీటన్నింటిని పరిశీలించి హైదరాబాద్ రాజ్యం ఇబ్బందులను తొలగించి, సంస్కరణలకు శ్రీకారం చుట్టి హైదరాబాద్ రాజ్యాన్ని ప్రగతిపథంలోనిలబెట్టేందుకు సాలార్జంగ్ తీవ్రంగా ప్రయత్నించి విజయం సాధించాడు. హైదరాబాద్ రాజ్యానికి శాంతిభద్రతలు కల్పించి దాన్ని ఆర్థికంగా పటిష్టపర్చడం సాలార్జంగ్ ప్రధాన లక్ష్యం. నిజాం రాజ్య పరిస్థితుల్ని మెరుగుపరచడానికి అతడు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. వాటిలో పాలనా, ఆర్థిక, రెవెన్యూ, న్యాయ, పోలీసు, విద్యా సంస్కరణలు ముఖ్యమైనవి.
పాలనా సంస్కరణలు
-సాలార్జంగ్ ప్రధాని అయిన తర్వాత పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. 1867లో హైదరాబాద్ రాజ్యాన్ని 5 డివిజన్లుగా విభజించాడు. అవి 1. పశ్చిమోత్తర డివిజన్ 2. పశ్చిమ డివిజన్ 3. దక్షిణ డివిజన్ 4. ఉత్తర డివిజన్ 5. తూర్పు డివిజన్.
-ప్రతి డివిజన్ కింద మూడు, నాలుగు జిల్లాలుండేవి. పశ్చిమోత్తర డివిజన్ ముఖ్య కేంద్రం ఔరంగాబాద్. పశ్చిమ డివిజన్ ముఖ్య కేంద్రం బీదర్, దక్షిణ డివిజన్ ముఖ్య కేంద్రం గుల్బార్గా, ఉత్తర డివిజన్ ముఖ్య కేంద్రం పఠాన్‌చెరువు, తూర్పు డివిజన్ కేంద్రం భువనగిరి. ఈ డివిజన్లను సుబాలు అనేవారు. వాటి అధికారులను సుబేదార్లు లేదా సదర్ తాలూకాదార్లు అనేవారు. డివిజన్ల కింద ఉన్న జిల్లాలపై అతని అజమాయిషి కొనసాగేది. డివిజన్లలో వీరికి రెవెన్యూ, సివిల్, క్రిమినల్, అధికారాలుండేవి. ప్రతి సదర్ తాలూకాదారు కింద ఇద్దరు సహాయకులుండేవారు. ఒకరు రెవెన్యూ అంశాలను పరిశీలిస్తే, మరొకరు న్యాయ అంశాలను పరిశీలించేవారు. రెవెన్యూ విషయాల్లో రెవెన్యూ మంత్రి సూచనల మేరకు, న్యాయపరమైన అంశాల్లో న్యాయశాఖా మంత్రి సూచనల మేరకు వీళ్లు నడుచుకునే వాళ్లు. డివిజన్ల అనంతరం జిల్లాల పాలన ముఖ్యమైంది.
నిజాం రాజ్యంలో ఉన్న జిల్లాలు 1. ఔరంగాబాద్ 2. పర్బని 3. నాందేడ్ 4. ఇందూరు (నిజామాబాద్) 5. భీడ్ 6. బీదర్ 7. మెదక్ 8. ఎలగందుల (కరీంనగర్) 9. నల్దుర్గ్ 10. షోలాపూర్ 11. తూర్పు రాయ్‌చూర్ 12. పశ్చిమ రాయ్‌చూర్ 13. ఖమ్మం (వరంగల్ నాటి ఖమ్మం జిల్లాలో భాగం) 14. నల్లగొండలు. 1880లో ఈ పద్నాలుగు జిల్లాలకుతోడు నాగర్‌కర్నూల్, గుల్బర్గాలను జిల్లాలుగా ఏర్పాటుచేయడంతో మొత్తం దివానీ జిల్లాల సంఖ్య 16కు చేరుకుంది. ఈ జిల్లాలపై అధికారులుగా తాలూకాదారులను నియమించేవారు. తాలూకాదారు జిల్లాలో ప్రభుత్వ ఆదాయ వ్యయాలను శిస్తు వసూళ్లను ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన ఆదాయాలను పర్యవేక్షించేవారు. వీరికి సివిల్ క్రిమినల్ కేసుల వ్యాజ్యాలను పరిష్కరించే అధికారాలుండేవి. ప్రతి తాలూకాదారుకు సహాయపడేందుకు గుమస్తాలు, న్యాయ, రెవెన్యూ కోశాధికారులతోపాటు ఆమ్లా అనే క్లర్కులుండేవారు. వీరు జిల్లాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను రికార్డు చేసేవారు. జిల్లాలను అనేక తాలూకాలుగా విభజించారు. 1881 నాటికి తాలూకాల సంఖ్య 107కి చేరింది. ఔరంగాబాద్ జిల్లాలో 8, బీడ్‌లో 7, పర్బవీలో 6, బీదర్‌లో 5, నాందేడ్‌లో 8, నల్‌దుర్గ్‌లో 7, రాయ్‌చూర్‌లో 5, రాయ్‌చూర్ పశ్చిమలో 4, షోలాపూర్ 4, గుల్బర్గా 6, ఇందూర్ 9, మెదక్ 5, ఎలగందుల 7, ఖమ్మం 9, నల్లగొండ 5, నాగర్‌కర్నూల్ 8, ఉపజిల్లా సిర్పూర్ తాండూర్‌లో 3, అత్రాఫ్ బల్దిలో 1 తాలూకా ఉండేది. తాలూకా అధిపతులుగా తహసీల్దార్లుండేవారు. వీరు తాలూకాల్లో రెవెన్యూ, న్యాయ, పోలీసు విధులను నిర్వహించేవారు. వీరికి పాలనలో తోడ్పడటానికి గుమస్తాలు, రెవెన్యూ అధికారులుండేవారు.
తాలూకాల పిదప నగరాలు ముఖ్యమైనవి. వీటి పాలనను కొత్వాల్ నిర్వహించేది. ఇతడు పోలీస్ శాంతిభద్రతలను సమీక్షించేవాడు. కొత్వాల్ నగరంలో ముఖ్యపోలీస్ అధికారి. నగరాల్లో ఇతనికి రెవెన్యూ ఆదాయ వసూళ్లకు ప్రత్యేకాధికారాలుండేవి. న్యాయ వ్యవస్థ సమీక్షకు అధికారాలుండేవి. పరిపాలనలో గ్రామం ప్రధానమైంది. గ్రామాల్లో పట్వారీ, మాలీపటేల్, పోలీస్ పటేల్, తలారీలు, దేడ్లను నియమించేవారు. భూమి శిస్తుకు సంబంధించిన విషయాలను పట్వారీ, మాలీపటేళ్లు, గ్రామ శాంతిభద్రతలను పోలీస్ పటేల్, గ్రామ కాపలా, ఇతర సేవలను తలారీలు, దేడ్లు గ్రామ చావిడి దగ్గర నిర్వహించేవారు. పరిపాలన మొత్తం ప్రధాని చేతులమీద నడిచేది. ప్రధానిని దివాన్ లేదా రిజెంట్ అని పిలిచేవారు. పరిపాలనలో ప్రధానికి ఉపప్రధాని, బ్రిటిష్ రెసిడెంట్, ఆర్థికమంత్రి, ముఖ్యమైన శాఖాధిపతులు సలహాలు ఇచ్చేడివారు. బ్రిటిష్ రెసిడెంట్ కేవలం రాజకీయ, ఆర్థిక విషయాల్లో మాత్రమే సలహాలిచ్చేవాడు. సమర్థవంతమైన పరిపాలనను అందించడానికి నాడు పరిపాలన వ్యవస్థను 14 శాఖలుగా విభజించారు. అవి.. 1. న్యాయశాఖ, 2. రెవెన్యూ శాఖ, 3. పోలీస్ శాఖ, 4. ప్రజా పనుల శాఖ, 5. విద్యాశాఖ, 6. వైద్యశాఖ, 7. పురపాలక శాఖ, 8. సైనిక శాఖ, 9. ఆర్థిక శాఖ, 10. తపాలా శాఖ, 11. రైల్వే టెలిగ్రాఫ్ శాఖ, 12. నిజాం వ్యక్తిగత భూముల శాఖ (సర్ఫేఖాస్) 13. రాజకీయ శాఖ, 14. న్యాయ చట్టాల శాఖ ఈ 14 శాఖల్లో 7 శాఖలు న్యాయ, రెవెన్యూ, పోలీస్, ప్రజా పనులు, విద్యా, వైద్య పురపాలక శాఖలకు ప్రత్యేక మంత్రులుండేవారు. మంత్రులను సదర్-ఉల్-మిహం అని అనేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామిని సాలార్జంగ్ నియమించాడు. ఇతను 1876-83 వరకు ఆ పదవిలో కొనసాగాడు. ప్రభుత్వ కార్యక్రమాలను ఈ 14 శాఖల ద్వారా నిర్వహించేవారు. దీంతో నిజాం రాజ్యంలో పరిపాలనా వ్యవస్థ క్రమబద్ధతను సంతరించుకుంది.
-సాలార్జంగ్ పాలనా సంస్కరణల్లో భాగంగా తొలుత నియమించబడ్డ వివిధ శాఖామాత్యులు.
-రెవెన్యూ శాఖామాత్యులు- నవాబ్ ముఖరం ఉద్దౌలా బహద్దూర్
-న్యాయ, జైళ్ల శాఖామాత్యులు- బషీరుద్దౌలా బహద్దూర్
-పోలీస్ శాఖామాత్యులు- శంషేర్ జంగ్ బహద్దూర్
-ప్రజా పనుల శాఖామాత్యులు- షాహబ్ జంగ్ బహద్దూర్
-వీరి నియామకంతో అస్తవ్యస్తంగా ఉన్న పాలనా యంత్రాంగం నిజాం రాజ్యంలో క్రమంగా క్రమబద్ధీకరణ సంతరించుకుంటూ వచ్చింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు