జిలాబంది విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు ?
అప్పుల్లో ఉన్న నిజాం రాజ్యాన్ని ఒడ్డుకు చేర్చిన ధీరుడు మొదటి సాలార్జంగ్. అస్తవ్యస్తంగా ఉన్న పాలనా వ్యవస్థను సక్రమమైన దారిలో పెట్టి, సంస్కరణలకు ఆధ్యుడిగా నిలిచిన వ్యక్తి మొదటి సాలార్జంగ్. పరిపాలన, న్యాయ, రెవెన్యూ సంస్కరణలను ప్రవేశపెట్టి అన్ని రంగాల్లో హైదరాబాద్ రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి మొదటి సాలార్జంగ్. ఆయన అసలు పేరు మీర్ తురబ్ అలీఖాన్. హైదరాబాద్ సంస్థాన చరిత్రలో ఒక విశిష్టమైన పాలకుడు. మేధావి, సమర్థుడు, పరిపాలనాదక్షుడు, గొప్ప సంస్కరణాభిలాషి, గొప్ప స్వాప్నికుడు. దూరదృష్టిగల ప్రధానమంత్రి. హైదరాబాద్ రాజ్యం ఇతని సంస్కరణల ఫలితంగా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది.
-ముగ్గురు నిజాంల కాలంలో అంటే నాసిరుద్దౌలా క్రీ.శ. 1853 నుంచి 1857 వరకు, అఫ్జల్-ఉద్- దౌలా కాలంలో క్రీ. శ 1857 నుంచి 1869 వరకు, అలాగే మహబూబ్ అలీఖాన్ కాలంలో క్రీ. శ 1869 నుంచి 1883 వరకు దివాన్ (ప్రధానమంత్రి)గా పని చేశాడు. తన 30 ఏండ్ల పాలనలో నిజాం రాజ్యంలో నెలకొన్న సమస్యలను రూపుమాపడానికి అనేక సంస్కరణల్ని ప్రవేశపెట్టాడు. హైదరాబాద్ రాజ్యం ఆధునీకరణకు మార్గాన్ని సుగమం చేశాడు. హైదరాబాద్ రాజ్యాన్ని గొప్ప సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దడానికి బాటలు వేసిన దార్శనికుడు సాలార్జంగ్. లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందినవ్యక్తి సాలార్జంగ్. మొదటి సాలార్‌జంగ్‌కు సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి ఆంతరంగిక కార్యదర్శిగా పని చేశాడు. టీఎస్పీఎస్సీ పరీక్షల సిలబస్‌లో సాలార్జంగ్ సంస్కరణల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అందువల్ల గ్రూప్-1, 2 అభ్యర్థులు సాలార్జంగ్ సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
-సాలార్జంగ్ నిజాం రాజ్యాన్ని పునరుజ్జీవింప చేశాడని విలియం డార్ఫీ అభిప్రాయపడ్డాడు. దీన్నిబట్టి సాలార్జంగ్ చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. రెండో అసఫ్ జా కాలం మొదలుకొని మహబూబ్ అలీఖాన్ వరకు మొదటి సాలార్జంగ్ దివాన్ పదవిని చేపట్టాడు. సంస్కరణలు ప్రారంభించే నాటి వరకు కూడా నిజాం పాలకులు పరిపాలనను నిర్లక్ష్యం చేశారు. రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు ప్రభుత్వానికి అప్పులివ్వడం, తాలూక్దార్లు, జాగీర్దార్లు రైతులపై అధిక శిస్తు భారం మోపడం, నిజాం పాలకుల నిర్లక్ష్యం, పరిపాలనా వైఫల్యం మొదలైన పరిస్థితులన్నీ హైదరాబాద్ సంస్థానంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణాలుగా చెప్పవచ్చు.
చిన్న వయస్సులో దివాన్
-హైదరాబాద్ రాజ్యంలో ప్రధానమంత్రులుగా పని చేసి న వారిలో గొప్పవాడు మొదటి సాలార్జంగ్. దివాన్ (ప్రధానమంత్రి) పదవి చేపట్టే నాటికి అతని వయస్సు 24 ఏండ్లు మాత్రమే. చిన్న వయస్సులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టడమే కాకుండా, దాన్ని అతిసమర్థవంతంగా నిర్వహించి, రాజ్య ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి బాటలు వేసి మేధావుల నుంచి ప్రశంసలు పొందిన ఘనుడు మొదటి సాలార్జంగ్. తత్ఫలితంగా హైదరాబాద్ రాజ్య ఖ్యాతి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచానికి వ్యాపించింది.
నిజాం రాజ్యంలోని పరిస్థితులు
-మొదటి సాలార్జంగ్ దివాన్ పదవిని చేపట్టకముందు హైదరాబాద్ సంస్థానంలో అలజడులు, ఆర్థిక సం క్షోభం, అశాంతి మొదలైన పరిస్థితులుండేవి. నాడు పరిపాలనా వ్యవస్థ కూడా సరిగ్గాలేదు. నిజాం అలసత్వంతో హైదరాబాద్ రాజ్యంలోని అధికారుల్లో అవినీతి, లంచగొండితనం పెరిగాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. నిజాం అప్పు తీర్చలేదనే నెపంతో క్రీ.శ 1853లో బీరారును ఆక్రమించుకున్నారు బ్రిటీష్ వారు.
ఫలితంగా రాజ్యానికి ఆదాయవనరులు తగ్గి, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజాం తన భూముల్ని విలువైన ఆభరణాల్ని రోహిల్లా, అరబ్ వ్యాపారుల వద్ద తాకట్టుపెట్టి 3 కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చాడు. రైతుపై శిస్తుభారం, దోపిడీలు, దౌర్జన్యాలు, శాంతిభద్రతల కరువు, లంచగొండి అధికారులు, కమీషన్ ఏజెంట్లు మొదలైన వాటిని అరికట్టడంలో పరిపాలనా యంత్రాంగం విఫలమైంది. సైనికుల్లో క్రమశిక్షణ లోపించడం, ఉద్యోగాల్లో అవినీతి, లంచగొండితనం పెరగడం మొదలైన కారణాలతో హైదరాబాద్ సంస్థానపు ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని గ్రహించిన మొదటి సాలార్జంగ్ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముఖ్యంగా పాలనారంగాన్ని గాడిలో పెట్టడానికి అనేక సంస్కరణల్ని చేపట్టాడు.
సాలార్జంగ్ సంస్కరణలు
-హైదరాబాద్ రాజ్య ఖజానాకు ఆదాయాన్ని పెంపొందించాలనే ఆలోచనతో ముందుగా తన సంస్కరణల్ని రెవెన్యూశాఖలో ప్రారంభించాడు.
జిలాబంది విధానం
-నాడు అనేక మంది తాలూకాదార్లు అవినీతిపరులు. రైతుల నుంచి ముక్కుపిండి బలవంతంగా శిస్తు వసూ లు చేసి ప్రభుత్వానికి తక్కువ శిస్తును చెల్లించేవారు. అయితే దీన్ని సంస్కరించే ఉద్దేశంతో క్రీ.శ 1865లో జిలాబంది విధానాన్ని సాలార్జంగ్ ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం రాష్ర్టాన్ని 14 జిల్లాలుగా విభజించాడు. జిల్లా పాలకుడు అవల్ తాలూకాదారు (ప్రథమ తాలూకాదారు). ఈ తాలూకాదారును బ్రిటీష్ వారి పరిపాలనాకాలంలోని జిల్లా కలెక్టర్‌తో సమానంగా పరిగణించవచ్చు. ఇద్దరు దోయం తాలూకాదార్లు (అంటే సబ్ కలెక్టర్లు) అవల్ తాలూకాదారుకు పరిపాలనలో సహాయపడేందుకు నియమించబడ్డారు. అలాగే ప్రతి జిల్లా ను మూడు లేదా నాలుగు తాలూకాలుగా విభజించా రు. దీని పై అధికారి తాలూకాదారు (తహసీల్దారు)
రెవెన్యూబోర్డు ఏర్పాటు
-తాలూకాదారుల పనితీరును గమనించి, పర్యవేక్షించడానికి మజ్లిస్-ఇ- మాల్గజారి (రెవెన్యూబోర్డు) అని పిలవబడే పరిపాలనా సంస్థను ఏర్పాటు చేశాడు.
సెంట్రల్ రెవెన్యూ బోర్డు
-క్రీ.శ. 1867లో రెవెన్యూబోర్డు స్థానంలో సెంట్రల్ రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఇంతకుముందు 14 జిల్లాల్ని పునర్వ్యవస్థీకరించి 17 జిల్లాల్ని ఏర్పాటు చేశాడు. అదే విధంగా ఐదు డివిజన్లు లేక ప్రాంతీయ విభాగాలున్నాయి. (అవి ఉత్తర, పశ్చి మ, తూర్పు, దక్షిణ, వాయువ్య ప్రాంతీయ భాగాలు). సదర్ తాలూకాదారు (బ్రిటీష్ కాలంలోని రెవెన్యూ కమిషనర్‌తో సమానం).
ప్రాంతీయ విభాగం పాలకుడు
-భూసర్వే, సెటిల్మెంట్ ప్రకారం భూసారాన్ని అనుసరించి, భూమిశిస్తు నిర్ణయించాడు. రైతులకు భూమిపై యాజమాన్యపు హక్కుల్నిచ్చి రైతులకు రక్షణను కల్పించారు. ఈ విధంగా అంతకుముందు ఉన్న బలవంతపు వసూళ్లను నిషేధించి, రైతులకు భరోసా కల్పించి, రైతులతో ప్రత్యక్ష సంబంధాలను ప్రభుత్వం ఏర్పర్చుకుంది.
క్షేత్రస్థాయిలో శిస్తు వసూలు
-వంశపారంపర్యంగా వచ్చే అధికారుల్ని కిందిస్థాయిల్లో కొనసాగించి వారి ద్వారా శిస్తు వసూలు చేశారు. గ్రామంలో పటేల్ వంశపారంపర అధికారి. గ్రామ లెక్కలు చూసే వ్యక్తి పట్వారీ. వీరికి రుసుము అనే పేరుతో భూమిని శిస్తులో వాటా ఇవ్వబడేది. కొన్ని గ్రామాల్ని కలిపి వలయాలు (సర్కిళ్లు)గా ఏర్పాటు చేసి వాటిని దేశ్పాండ్యల ఆధీనంలో ఉంచారు.
ఇతర ఆదాయ మార్గాలు
-ప్రభుత్వానికి రావాల్సిన భూమిశిస్తును జాగ్రత్తగా వసూలు చేయడంతోపాటు, వాణిజ్య పన్నులు, స్టాంపులపై పన్నులు, అడవులు, పోస్టల్‌శాఖ, ఆబ్కారీ, స్థానిక ఎగుమతులు, దిగుమతులు, పెష్కాస్, నజరానాలు మొదలైన వివిధ రూపాల్లో వచ్చే ఆదాయ మార్గాలపై దృష్టి కేంద్రీకరించి, రాజ్య ఆర్థిక అభివృద్ధికి ఇతోధికంగా సాలార్జంగ్ కృషి చేశాడు.
హాలీసిక్కా
-ఇది సాలార్జంగ్ ప్రవేశపెట్టిన కొత్త నాణెం. ఇది రూపాయి నాణెం. కొత్త నాణేల్ని ముద్రించి, విడుదల చేయుడం కో సం హైదరాబాద్‌లో కేంద్ర ద్రవ్యముద్రణాలయాన్ని నెలకొల్పాడు. జిల్లాల్లోని టంకశాలలను రద్దు చేశాడు. ద్రవ్యస్థిరీకరణలో భాగంగా ఈ నాణేల ముద్రణను ప్రవేశపెట్టాడు. నాణేల ముద్రణాంశాన్ని ప్రభుత్వ గుత్తాధిపత్యం కిందకు తెచ్చిన ఘనుడు సాలార్జంగ్.
స్టాంపు పేపర్ కార్యాలయం
-క్రీ. శ 1861లో స్టాంప్ పేపర్ కార్యాలయం స్థాపించాడు. ఈ స్టాంపు పేపర్లను కోర్టు వ్యవహారాలకు, దరఖాస్తులకు, ఒప్పంద పత్రాలకు వినియోగిస్తారు.
ఆర్థిక- రెవెన్యూ సంస్కరణలు
-సాలార్జంగ్ సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైనవి రెవెన్యూ సంస్కరణలు అని చెప్పవచ్చు. నిజాం కాలం లో దివానీ, జాగీర్, సర్ఫేఖాస్ అనే పాలనా రెవెన్యూ పద్ధతులు లేదా వ్యవస్థలుండేవి. సర్పేఖాస్, జాగీర్లలో మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువ. పాలనా వ్యవస్థ సరిగ్గా ఉండేది కాదు. అవినీతిపరులైన తాలూకాదారులను, మధ్యవర్తుల్ని తొలగించాడు. తక్కువ వేతనానికే కొత్త తాలూకాదారుల్ని నియమించాడు. వీరంతా ప్రభుత్వానికి విధేయులుగా ఉండేవారు. అంతకుముందు తాలూకాదారుల్ని మంత్రులు నియమించేవారు. వారు ప్రభుత్వానికి రావాల్సిన శిస్తును వసూలు చేసేవారు. వారికి రూపాయిలో రెండు అణాలు లేదా వసూలు చేసిన మొత్తంలో 1/8వ వంతును వేతనంగా చెల్లించేది ప్రభుత్వం.
అయితే తాలూకాదార్లు శిస్తు వసూలుకు ఎక్కువగా సైనికుల్ని ఉపయోగించి, వసూలైన శిస్తుకంటే వసూలు చేయడానికి అధిక ఖర్చు అయిందని, మోసపూరిత లెక్కలు చూపించి, వసూలైన మొత్తాన్ని చాలా సందర్భాల్లో తాలూకాదారులే అనుభవించేవారు. ప్రభుత్వం అప్పులు చేయడానికి ఇది కూడా ఒక కారణం. అందుకే అలాంటి అధికారుల్ని సాలార్జంగ్ తొలగించాడు. ఇలాంటి కమీషన్ పద్ధతిలో పనిచేసే లంచగొండి, అవినీతి అధికారుల్ని తొలగించి వారిస్థానంలో కేవలం ప్రభుత్వ జీతంతో మాత్రమే పనిచేసే తాలూకాదారుల్ని నియమించి పారదర్శకతను నెలకొల్పాడు. వీరికి సహాయపడటానికి ప్రభుత్వ జీతంతో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగుల్ని కూడా నియమించింది.
-నోట్: క్రీ.శ. 1855లో రెవెన్యూ కాంట్రాక్టర్ల పద్ధతిలో నియమించబడ్డ తాలూకాదారుల్ని రద్దు చేశారు.
న్యాయ సంస్కరణలు
-న్యాయ వ్యవస్థకు సంపూర్ణ స్వేచ్ఛ కల్పించి, న్యాయ పరిపాలనను పర్యవేక్షించే నిమిత్తం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో న్యాయ సచివాలయాన్ని స్థాపించాడు. న్యాయ సంస్కరణలో భాగంగా మున్సిఫ్, మీర్ ఆదిల్ అనే న్యాయాధికారులను నియమించాడు. ఈ అధికారులు మహాకాయ-ఇ- సాదర్ (హైకోర్టు) హైదరాబాద్ ఆధీనంలో పని చేసేవారు. ప్రధాన న్యాయమూర్తి నాజిమ్, మజ్లిస్-ఇ- మురఫా అనే సుప్రీం న్యాయకౌన్సిల్ హైకోర్టుపైన ఉన్న అప్పీలు న్యాయస్థానం. ఈ సుప్రీంకౌన్సిల్లో నిజాంకు ఉన్నత సలహాదారులుండేవారు. బుఓంగ్ దివాని అదాలత్, దివానీ అదాలత్ అనే రెండు పౌర న్యాయస్థానాలుండేవి. మతసంబంధ అంశాలు విచారణ జరిపే నిమిత్తం మహాకాయ-ఇ- సదరత్ మహమ్మదీయ న్యాయశాస్త్రం ప్రకారం నడిచే దార్- ఉల్- ఖాజీ కోర్టులుండేవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు