Indian History | ‘భిల్ సేవా మండల్’ సంస్థను స్థాపించింది ఎవరు?
మార్చి 15వ తేదీ తరువాయి..
కమ్యూనల్ అవార్డు
- రెండో రౌండ్ టేబుల్ సమావేశం విఫలమవడంతో బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్ట్ 16న ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలనే కమ్యూనల్ అవార్డు పేరుతో ప్రకటించారు. ఇందులో భాగంగా దళితులకు 71 ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. దీన్ని అంబేద్కర్ సమర్థించగా, గాంధీ దీనికి వ్యతిరేకంగా 1932, సెప్టెంబర్ 20న ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ అవార్డులోని అంశాలు: ముస్లిం, సిక్కు, యూరోపియన్ వర్గాలకు సీట్లు కేటాయించడం - ఆ సీట్లకు ఆయా వర్గాలకు చెందినవారు మాత్రమే ఓటు వేస్తారు (ప్రత్యేక నియోజకవర్గాలు).
- దళిత వర్గాలకు (నేటి షెడ్యూల్డ్ కులాలు) కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరచడం జరుగుతుంది.
- ప్రత్యేక నియోజక వర్గాల వారు సాధారణ నియోజక వర్గాల్లో కూడా ఓట్ చేయగలుగుతారు.
- వాణిజ్య పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు.
- ప్రతినిధుల ఎన్నిక చాంబర్స్ ఆఫ్ కామర్స్ వంటి సంఘాల ద్వారా జరుగుతుంది.
పూనా ఒడంబడిక (1932, సెప్టెంబర్ 24)
- ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన గాంధీ ఆరోగ్యం విషమించడంతో మదన్ మోహన్ మాలవీయ, సీ రాజగోపాలచారి, బాబు రాజేంద్ర ప్రసాద్, ఎంసీ రాజా ల ప్రోద్బలంతో అంబేద్కర్ జైలులో ఉన్న గాంధీని కలిసి అతనితో పూనా ఒడంబడికను చేసుకున్నారు.
- ఈ ఒప్పందం ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలకు బదులు ఉమ్మడి నియోజకవర్గాలు ప్రవేశపెట్టారు. అంటే దళితులకు రాష్ట్ర శాసనసభలో మొదట కేటాయించిన 71 సీట్లు 147కి పెంచారు. అదేవిధంగా కేంద్ర సభలో మొత్తం సీట్లలో 18 శాతం సీట్లు కేటాయించారు. దీంతో 1932, సెప్టెంబర్ 26న గాంధీ నిరాహారదీక్ష విరమించారు. ఈ ఒప్పందం అమలుకు ‘నా ప్రాణాన్ని పణంగా పెట్టానని’ హరిజన సోదరులకు గాంధీ చెప్పారు.
హరిజన యాత్ర - ఈ వివాదానికి కారణమైన అస్పృశ్యత సూత్రానికి వ్యతిరేకంగా గాంధీ వార్ధా ఆశ్రమం నుంచి 1933, నవంబర్ 7 నుంచి 1934, జూలై 24 వరకు ‘హరిజన యాత్ర’ను చేపట్టి, హరిజన సేవక్ సంఘ్‌ను ఏర్పాటు చేశారు.
- ఈ సంఘ్ గతంలో 1932లో స్థాపించిన అఖిల భారత హరిజన సంఘం నుంచి పేరు మార్చబడింది.
- ఈ సంఘం కార్యకలాపాలను జీడీ బిర్లా, ఏవీ థక్కర్ (ధక్కర్ బాపా)లకు అప్పగించారు.
- ధక్కర్.. భిల్ సేవా మండల్ అనే సామాజిక సంస్థను స్థాపించారు.
- 1934లో గాంధీ దేశవ్యాప్తంగా అహింసను బోధించడానికి, అస్పృశ్యతను రూపుమాపడానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
- మళ్లీ 1936లో క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించారు.
3వ రౌండ్ టేబుల్ సమావేశం
- 1932, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 25 వరకు బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఓటింగ్ అర్హత, రాష్ర్టాల ఆర్థిక వనరుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, లేబర్ పార్టీ పాల్గొనలేదు. కేవలం 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. ఈ సమావేశ ఫలితంగానే భారత ప్రభుత్వ చట్టం-1935 రూపుదాల్చింది.
సిఫారసులు - మహిళలకు ఓటు హక్కు కల్పించడం
- రాష్ర్టాల శాసనసభ్యులు సమాఖ్య ఎగువ సభ ప్రతినిధులను ఎన్నుకోవడం
అఖిల భారత సోషలిస్టు పార్టీ - ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సంపూర్ణానంద్ ఈ పార్టీకి రూపకల్పన చేయగా, 1934 పాట్నా సమావేశంలో ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, అచ్చుత్ పట్వర్ధన్, యూసఫ్ మెహరాలీ, మిన్ను మాసాని లు స్థాపించారు. దీనికే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని పేరు. ఆచార్య నరేంద్రదేవ్ ఈ పార్టీకి మొట్టమొదటి కార్యదర్శిగా వ్యవహరించారు. సోషలిస్ట్ పార్టీ సిద్ధాంతం విప్లవ జాతీయతత్వం, మార్క్స్ శాస్త్రీయ సామ్యవాదాల కలయిక.
బాంబే మ్యానిఫెస్టో
- జవహర్లాల్ నెహ్రూ, ఇతరుల సామ్యవాద సూత్రాలకు వ్యతిరేకంగా బొంబాయిలోని కొంతమంది వ్యాపారులు విడుదల చేసిన మ్యానిఫెస్టో ఇది. ఇందులో ఎన్ శక్లత్ లాలా, పురుషోత్తందాస్ ఠాకూర్ దాస్, చమన్ లాల్ సెతల్వాడ్, ఫిరోజ్ సెత్నీ, ఖవాస్ జీ జహంగీర్, వాల్చంద్ హీరాచంద్, ధారీమ్ సి ఖతౌ, ఏడీ ష్రాఫ్ వంటి వ్యాపారులు ఉన్నారు.
1937 ఎన్నికలు - ఈ ఎన్నికలు 1935 చట్టాన్ని అనుసరించి 1937లో జరిగాయి. 11 రాష్ర్టాల్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 రాష్ర్టాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, మిగిలిన 3 రాష్ర్టాల్లో ముస్లింలీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 1585 సీట్లకు నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ 716, జిన్నా నాయకత్వంలోని ముస్లింలీగ్ 106 సీట్లను గెలుచుకుంది.
విమోచన దినం (డిసెంబర్ 22) - రెండో ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైంది. ఎన్నుకోబడిన మంత్రివర్గాలను సంప్రదించకుండానే నాటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్ గో భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. ఈ రోజును (డిసెంబర్ 22) అప్పటి ముస్లిం లీగ్ అధ్యక్షుడు జిన్నా విమోచన దినం (డే ఆఫ్ డెలివరెన్స్)గా అభివర్ణించారు.
1939 ఐఎన్‌సీ సమావేశం - 1938లో జరిగిన హరిపుర (గుజరాత్) కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 1939లో జరిగిన త్రిపుర సమావేశంలో గాంధీ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి అయిన పట్టాభిని బోస్ ఓడించారు. దీంతో ‘ఇది పట్టాభి కంటే ఎక్కువగా నా ఓటమి’ అని గాంధీ ప్రకటించారు.
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయడానికి గాంధీ తిరస్కరించడంతో బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఫార్వర్డ్ బ్లాక్ అనే నూతన పార్టీని స్థాపించారు. దీంతో రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆగస్టు ప్రతిపాదన (1940) - జాతీయ కాంగ్రెస్ పూనా తీర్మానానికి స్పందిస్తూ ‘లార్డ్ లిన్లిత్ గో’ 1940, ఆగస్టు 8న ఒక ప్రతిపాదన చేశారు. దీన్నే ఆగస్టు ప్రతిపాదన అంటారు. దీని ప్రకారం..
1) యుద్ధానంతరం ఇండియాకు అధినివేశ ప్రతిపత్తి కల్పించడం
2) భారతీయులకు రాజ్యాంగ రచన హక్కును కల్పించడం
3) వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలోని సభ్యుల సంఖ్యను 8 నుంచి 12కు పెంచడం
4) సంస్కరణల్లో భాగంగా అల్పసంఖ్యాక వర్గాల డిమాండ్‌కు తగిన ప్రాముఖ్యం ఇవ్వడం
5) రక్షణ, ఆర్థిక, హోంశాఖలు మినహా మిగతా శాఖలన్నింటిని భారతీయులకు ఇవ్వాలి. - 1940, ఆగస్టు 21న జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్ధాలో సమావేశమై ఆగస్టు ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ ప్రతిపాదనను ‘తలుపునకు కొట్టిన మేకులా మృతప్రాయమైనది’గా నెహ్రూ అభివర్ణించగా, ‘రొట్టెముక్క అడిగితే రాయి ఇచ్చాడు’ అని గాంధీ బ్రిటిష్ తీరుపై విమర్శించాడు.
వ్యక్తిగత సత్యాగ్రహం - జాతీయ ప్రభుత్వం ఏర్పాటు, యుద్ధానంతరం స్వాతంత్య్రం ప్రకటించడం, పత్రిక స్వేచ్ఛ వంటి జాతీయ కాంగ్రెస్ డిమాండ్లను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో గాంధీ వ్యక్తి సత్యాగ్రహం చేస్తూ ప్రజాపోరాటం చేయాలని నిర్ణయించారు. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సత్యాగ్రహాలను (25,000) నియమించింది. వీరు తమకు కేటాయించిన ప్రాంతాల నుంచి ఢిల్లీ వరకు ప్రజల్లో పత్రిక స్వేచ్ఛ పట్ల చైతన్యాన్ని కలిగించాలి. దీనికే చలో ఢిల్లీ ఉద్యమం అని కూడా పేరు. ఈ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని 1940, అక్టోబర్ 17న మహారాష్ట్రలోని వార్ధాలో గల పల్షనార్ అనే గ్రామం నుంచి గాంధీ ప్రారంభించారు.
1) మొదటి సత్యాగ్రహి: వినోబాభావే మహారాష్ట్రలోని పవనార్ అనే ప్రదేశం నుంచి ప్రారంభించారు. రామన్ మెగసెసే అవార్డు (ఏషియాన్ నోబెల్) పొందిన మొదటి భారతీయుడు. వినోబాభావే వర్గ రహిత సమాజ నిర్మాణ ఉద్దేశంతో సర్వోదయ సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. భూదానోద్యమం (1951), గో హత్య నిర్మూలనకు కృషిచేశాడు. చనిపోయిన తర్వాత 1983లో భారతరత్న పొందారు.
2) రెండో సత్యాగ్రహి: జవహర్లాల్ నెహ్రూ
3) మూడో సత్యాగ్రహి: బ్రహ్మదత్ - గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహ నిర్ణయాన్ని సీ రాజగోపాలచారి, అరుణా అసఫ్ అలీ వ్యతిరేకించారు.
క్రిప్స్ రాయబారం - బ్రిటిష్ ప్రభుత్వం 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయ సహకారం, మద్దతును పొందడానికి 1942 మార్చిలో చేసిన ఒక ప్రయత్నమే క్రిప్స్ రాయబారం. విన్స్టన్ చర్చిల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నాయకుడిగా లార్డ్ పెథిక్ లారెన్స్, ఏవీ అలెగ్జాండర్ సభ్యులుగా 1942, మార్చి 11న ఈ రాయబారం ప్రారంభమైంది.
- క్రిప్స్ మిషన్‌లో సభ్యులుగా కేవలం బ్రిటిష్వారికే అవకాశం ఇచ్చారు.
క్రిప్స్ మిషన్ ఏర్పాటుకు గల కారణాలు - పెరుగుతున్న జపాన్ ప్రాబల్యం
- భారతీయులు క్రమంగా చైతన్యవంతులుగా మారడం
- కాంగ్రెస్ స్వభావం మారుతూ ఉండటం
- రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతుండటం
- తేజ్ బహదూర్ సప్రూ తదితరులు జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం ఇవ్వాల్సిందిగా చర్చిల్‌కు విజ్ఞప్తి చేయడం.
- చియాంగ్ కై షేక్ ఒత్తిడి.
క్రిప్స్ మిషన్ లక్ష్యాలు - భారతదేశంలో స్వయం పాలనను ప్రభుత్వాన్ని వీలైనంత తొందరలో ఏర్పాటు చేయడం.
- అధినివేశ ప్రతిపత్తి ఉన్న ప్రభుత్వ ఏర్పాటు
- పరిస్థితులు చక్కదిద్దుకున్న వెంటనే రాజ్యాంగ సభను స్థాపించాడు.
- ఈ రాజ్యాంగాన్ని ఏ సంస్థానమైనా అంగీకరించకపోతే వారు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
- రాజ్యాంగ రూపకల్పనలో రెండు దశలున్నాయి.
ఎ) డొమినియన్ రాజ్యాంగ రూపకల్పన. దీని కోసం ముందుగా సంస్థానాల్లో చట్ట సభల కోసం ఎన్నికల నిర్వహణ.
బి) రెండో దశలో దిగువ సభ సభ్యులు రాష్ర్టాల ప్రతినిధులతో కలిసి ఓ ఎలక్టోరల్ కాలేజీగా ఏర్పడి రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకోవాలి. ఈ రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య మొత్తం ఎలక్టోరల్ కాలేజీ సంఖ్యలో 1/10కి మించరాదు. - ఈ క్రిప్స్ రాయబారం 1942, మార్చి 23న ఢిల్లీని చేరుకుంది. గాంధీ దీన్ని వ్యతిరేకించగా, సీ రాజగోపాలచారి, జిన్నా స్వాగతించారు. కాంగ్రెస్ తరఫున జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ క్రిప్స్ రాయబారంతో చర్చలు జరపడానికి ఎంపికయ్యారు.
క్రిప్స్ ప్రతిపాదనలు - భారత్‌కు యుద్ధానంతరం అధినివేశ ప్రతిపత్తి లభిస్తుంది.
- రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేయయబడుతుంది.
- కామన్వెల్త్ నుంచి విడిపోయి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని పొందే అవకాశం కల్పించబడుతుంది.
- వైస్రాయ్ నేతృత్వంలోని కార్యనిర్వాహక మండలిలో భారతీయ సభ్యుల సంఖ్యను పెంచడం.
- వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో రక్షణ శాఖ తప్పించి మిగతా అన్ని శాఖలు భారతీయులకు బదిలీ చేయబడతాయి. ఐఎన్‌సీ క్రిప్స్ ప్రతిపాదనను తిరస్కరించింది.
మాదిరి ప్రశ్నలు
1. 1937లో 11 రాష్ర్టాల్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రాష్ర్టాల సంఖ్య?
1) 9 2) 8 3) 10 4) 7
2. ‘రొట్టె ముక్క అడిగితే రాయి ఇచ్చాడు’ అని గాంధీ బ్రిటిష్ వారిని ఏ సందర్భంగా విమర్శించారు?
1) 1940-ఆగస్టు ప్రతిపాదన
2) కమ్యూనల్ అవార్డు
3) గాంధీ-ఇర్విన్ ఒప్పందం
4) క్రిప్స్ రాయబారం
3. క్రిప్స్ మిషన్ ఏర్పాటుకు గల కారణాలు?
1) రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతుండటం
2) పెరుగుతున్న జపాన్ ప్రాబల్యం
3) కాంగ్రెస్ స్వభావం మారుతూ ఉండటం
4) పైవన్నీ
4. అన్ని (మూడు) రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన నాయకులు?
1) బీఆర్ అంబేద్కర్
2) మహ్మద్ అలీ జిన్నా 3) అక్బర్ హైదరీ
4) పై అందరూ
5. కింది వాటిలో సరైనవి?
1) 1940, అక్టోబర్ 17న వ్యక్తిగత సత్యాగ్రహాన్ని గాంధీ వార్ధాలోని పల్లనార్ గ్రామం నుంచి ప్రారంభించారు
2) మొదటి సత్యాగ్రహి వినోబాభావే కాగా రెండో సత్యాగ్రహి జవహర్లాల్ నెహ్రూ
3) 1 4) 1, 2
6. గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహ నిర్ణయాన్ని వ్యతిరేకించింది?
1) రాజ గోపాలచారి
2) అరుణా అసఫ్ అలీ
3) 1, 2 4) 1
7. క్రిప్స్ రాయబారం సందర్భంగా భారత్‌ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు?
1) అబ్రహం లింకన్ 2) రూజ్వెల్ట్
3) ట్రూమన్ 4) హెర్బర్ట్ హూవర్
8. క్రిప్స్ రాయబారాన్ని ‘ఒక దివాలా తీసిన బ్యాంక్‌కు ముందస్తు తేదీ వేసిన చెక్కు’గా వర్ణించింది?
1) మహాత్మాగాంధీ
2) జవహర్లాల్ నెహ్రూ
3) సుభాష్ చంద్రబోస్
4) సీ రాజగోపాలచారి
9. కింది వాటిలో సరైనవి?
1) క్రిప్స్ రాయబారాన్ని గాంధీ వ్యతిరేకించారు
2) క్రిప్స్ రాయబారాన్ని రాజగోపాల చారి, జిన్నా స్వాగతించారు
3) క్రిప్స్ రాయబారంతో చర్చలు జరపడానికి కాంగ్రెస్ తరఫున జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎంపికయ్యారు 4) పైవన్నీ
10. కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు రాష్ట్ర శాసనసభలో 71 సీట్లు కేటాయించగా పూనా ఒడంబడిక ప్రకారం ఎన్ని కేటాయించారు?
1) 147 2) 98
3) 56 4) 61
సమాధానాలు
1-2, 2-1, 3-4, 4-4, 5-4, 6-3, 7-2, 8-1, 9-4, 10-1.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు