హైదరబాద్ రాష్ట్రం లో తొలి ఎన్నికలు
బూర్గుల ప్రభుత్వం ముల్కీ విషయంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 1952, సెప్టెంబర్ 7న నియమించిన ఈ ఉపసంఘంలోని సభ్యులు
1. మెహదీ నవాజ్ జంగ్
2. కేవీ రంగారెడ్డి
3. డాక్టర్ మెల్కోటే
4. పూల్‌చంద్ గాంధీ
బూర్గుల మంత్రిమండలి
1. దిగంబరరావు బిందు – హోంశాఖ
2. జీఎస్ మెల్కోటే – ఆర్థికశాఖ
3. అన్నారావు – స్థానిక పరిపాలన
4. మర్రి చెన్నారెడ్డి – పౌరసరఫరాలు, వ్యవసాయశాఖలు
5. జగన్నాథరావు – న్యాయశాఖ
6. దేవిసింగ్ చౌహాన్ – గ్రామీణాభివృద్ధి శాఖ
7. పూల్‌చంద్ గాంధీ – విద్య, ఆరోగ్య శాఖలు
8. వీబీ రాజు – కార్మిక, ప్రణాళిక, సమాచార శాఖలు
9. మెహదీ నవాజ్‌జంగ్ – పబ్లిక్ వర్క్స్
10. శంకర్ డియో – సాంఘిక సంక్షేమ శాఖ
11. కొండా వెంకట రంగారెడ్డి – ఎక్సైజ్, కస్టమ్స్, అటవీ శాఖలు
12. వినాయక్‌రావ్ విద్యాలంకార్ – పరిశ్రమలు
13. గోపాలరావు ఎగ్బోటే – విద్య, స్థానిక సంస్థలు
-పైవారే కాకుండా మరో 8 మందిని అదనంగా మంత్రులుగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి బూర్గులతో కలిసి మొత్తం మంత్రివర్గం సంఖ్య 22.
-కొత్తగా చేరినవారిలో సంగెం లక్ష్మీబాయి, ఎంఎస్ రాజలింగం, పీ హనుమంతరావు తదితరులున్నారు.
-ఈ ఎన్నికల్లో పీడీఎఫ్‌కు ప్రతిపక్ష హోదా దక్కగా ఆ పార్టీ నాయకుడు మరఠ్వాడకు చెందిన వీజీ దేశ్‌పాండే ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు పాలన 1952, మార్చి 6 నుంచి 1956, అక్టోబర్ 13 వరకు కొనసాగింది.
-కాశీనాథరావు వైద్య స్పీకర్‌గా పంపనగౌడ సక్రప్ప (స్వతంత్ర) డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మాడపాటి హన్మంతరావు హైదరాబాద్ నగర మేయర్‌గా ఉన్నారు.
-మంత్రివర్గంలో చేరిన వీబీ రాజు ఆంధ్రుడు కావడం విశేషం. ఆయన ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్ధిరపడ్డారు.
-ఈ ప్రభుత్వ హయాంలో 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడింది.
తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైనది. ఎంతో ఉత్కృష్టమైనది. నిజాం రాజుల పాలనలో రాజుల అణచివేత విధానాలకు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు మొదలు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేవరకు ప్రతి ఘట్టం ఎంతో మహత్తరమైనది. అయితే, ఈ ఉద్యమాల చరిత్రను ఎన్నడూ ఒక క్రమపద్ధతిలో అక్షరబద్ధం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా రాజుల పాలన అంతమైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం కొద్దికాలమే మనుగడలో ఉండటం, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడి ఆంధ్రుల ఆధిపత్యం పెరిగిపోవటంతో తెలంగాణ ఉద్యమాల చరిత్ర మరుగన పడిపోయింది. ఆ చరిత్రను నేటి తెలంగాణ సమాజం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే టీఎస్పీఎస్సీ గ్రూప్స్ నూతన సిలబస్‌లో తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం పేరుతో ప్రత్యేక పేపర్‌ను చేర్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయినది మొదలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ముఖ్యమైన సంఘటనలను నిపుణ పాఠకుల కోసం వరుస క్రమంలో అందిస్తున్నాం.
-1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. హైదరాబాద్ రాష్ట్రానికి తొలుత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అది ఏర్పాటు కాలేదు. కానీ ఇతర రాష్ట్రాలతోపాటే హైదరాబాద్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరపాలని నెహ్రూ ప్రభుత్వం నిర్ణయించింది.
-16 జిల్లాల్లో 142 అసెంబ్లీ నియోజకవర్గాలను తెలంగాణ, మరఠ్వాడ, కర్ణాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిలో 33 ద్విసభ్య నియోజకవర్గాలు అంటే ఈ 33 స్థానాల్లో ఒక రిజర్వు ప్రతినిధి, ఒక జనరల్ ప్రతినిధి ఎన్నికవుతారు.
-తెలంగాణ ప్రాంతంలోని 8 జిల్లాల్లో 79 నియోజకవర్గాలు 22 ద్విసభ్య స్థానాలు నిర్ణయమయ్యాయి. అంటే మొత్తం 101 మంది శాసనసభ్యులు ఎన్నికవుతారు. దీని ప్రకారం 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌తోపాటు సోషలిస్టు పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ (కమ్యూనిస్టులపై నిషేధం ఉన్నందున ఈ పేరుతో ఎన్నికల్లో పాల్గొన్నారు), పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి.
-తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా కాంగ్రెస్, పీడీఎఫ్‌లు పోటీపడ్డాయి. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం (నిజాం వ్యతిరేక పోరాటం) కారణంగా పీడీఎఫ్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే 16 జిల్లాల హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇందుకు మరఠ్వాడ ప్రస్తుత కర్ణాటక ప్రాంతాలు సహకరించాయి.
-కాంగ్రెస్ పక్ష శాసనసభ నాయకునిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా 1952, మార్చి 6న హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికైన తొలి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.
-బూర్గుల కాకుండా మరో 13మంది మంత్రులతో కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయించారు రాజ్‌ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్.
నెహ్రూ కాలంలో తెలంగాణ ఉద్యమాలు
-హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనం నాటికి ఉర్దూ అధికార భాషగా ఉంది. చాలామంది ఉద్యోగులు, అధికారులకు ఉర్దూ తప్ప మరే భాష రాదు.
-ఈ కారణంగా విలీనం అనంతరం సాగిన జేఎన్ చౌదరి మిలటరీ పాలన, వెల్లోడి పౌరపాలన సమయంలో వారు ఇంగ్లిష్ వచ్చినవారిని ఇతర ప్రాంతాల నుంచి రప్పించడం ప్రారంభించారు.
-ఉన్నతాధికారులు కూడా పరిపాలన సజావుగా సాగడానికి ఇంగ్లిష్ వచ్చినవారే అవసరమని భావించారు. దీంతో హైదరాబాద్‌కు ఆంధ్రోళ్ల రాక, తిష్టవేయడం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఉన్న వనరులు, భూసంపదపై వారి కన్నుపడింది. వచ్చిన ఒక వ్యక్తి మరో నలుగురు చుట్టాలను రప్పించడం ప్రారంభించాడు. దీంతో రోజురోజుకు వారి సంఖ్య పెరిగింది.
-తెలంగాణ వారంటే చదువురానివారని చులకనగా చూడటం, అవహేళన చేయడం ప్రారంభించారు. లంచగొండితనాన్ని కూడా వాళ్లే ప్రారంభించారు. దొంగ ముల్కీ సర్టిఫికెట్లు సంపాదించి తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టడం మొదలుపెట్టారు.
-ఈ వలసల కాలంలోనే నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది.
నాన్ ముల్కీ గోబ్యాక్- 1952
-హైదరాబాద్ సంస్థానంలో భాష, చదువు అర్హత పేర్లతో స్థానికేతరుల (నాన్ ముల్కీలు) రాక పెరిగింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. బూర్గుల ప్రభుత్వం ఏర్పడకముందే (1953) సెక్రటేరియట్లో స్థానికేతరులు తిష్టవేశారు. ఇది జిల్లాలకు కూడా పాకింది.
-తొలుత వరంగల్ విద్యార్థులు 1952, జూన్ 26 నాన్ ముల్కీ గోబ్యాక్ అని ఆందోళన ప్రారంభించారు. ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్ అని కూడా ఈ ఆందోళనకు పేరు. దాదాపు ఐదు రోజులపాటు నిరసనలు, ధర్నాలు కొనసాగాయి. దొంగ ముల్కీలను పట్టుకోవాలని, వారిపై విచారణ చేయాలని ఆస్థానంలో స్థానికులను (ముల్కీలను) నియమించాలని వారి డిమాండ్. ఆగస్టు 7న వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఈ నిరసనలు జరిగాయి.
-ఈ ఉద్యమానికి ముందుగా స్పందించిన వ్యక్తి జీ రామాచారి. ఆయన గుల్బర్గా జిల్లా చించోలి శాసనసభ్యుడైన లాయక్ అలీ (అప్పటి ప్రధాని) దగ్గర పనిచేశారు. న్యాయవాది, రచయిత. మిలటరీ పరిపాలన సలహా సంఘం సభ్యునిగా పనిచేశారు. ఆయన 1952 ఆగస్టులో హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించారు. నాన్ ముల్కీలు పోవాలని నినాదం ఇచ్చారు.
-దీంతో విద్యార్థులకు అండ దొరికింది. ఈలోగా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడింది.
-1952, ఆగస్టు 8న వరంగల్ జిల్లా మానుకోట (నేటి మహబూబాబాద్) విద్యార్థులు వీధుల్లో ప్రదర్శన జరిపారు. ఈ వరుస సంఘటనలతో ప్రభుత్వం స్పందించింది. ముల్కీ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈలోగా వరంగల్‌లో ఒక సభలో మాట్లాడిన బూర్గుల విద్యార్థులు ఆవేశాలకు లోనుకావద్దని పిలుపునిచ్చారు. కానీ ఆ పిలుపు పనిచేయలేదు.
-ఆగస్టు 26న హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో కూడా విద్యార్థులు సమ్మె చేశారు. ముల్కీ ఉద్యమం ఇతర ప్రాంతాలకు పాకింది.
-మంత్రివర్గంలో ఉన్న మామా అల్లుళ్లు కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు ఆడిస్తున్న నాటకంగా భావించిన బూర్గుల ప్రభుత్వం విద్యార్థులు, ఉద్యమకారులపై కఠిన చర్యలకు పూనుకుంది.
-హైదరాబాద్‌లో జరిగిన ఒక ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 4న ఈ సంఘటన జరిగింది. సిటీ కాలేజీ విద్యార్థుల ర్యాలీ ఇది. కాల్పుల్లో అక్కడికక్కడే ఒక విద్యార్థి చనిపోగా, చాలామంది గాయపడ్డారు.
-పోలీస్ కాల్పులపై పింగలి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో న్యాయవిచారణ సంఘం వేసింది ప్రభుత్వం. విద్యార్థులు శాంతించినా వారి మనసుల్లో నాన్‌ముల్కీల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది.
ఆంధ్ర రాష్ర్టావతరణ
-మద్రాసు ప్రావిన్సులో కొనసాగుతున్న తెలుగువారు (నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు, ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ జిల్లాలు) తమకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాలని 1920 నుంచి డిమాండ్ చేశారు. కానీ రకరకాల కారణాలవల్ల అది వాయిదా పడింది.
-రాయలసీమవారు కోస్తా జిల్లాలవారిని నమ్మకపోవడం ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారింది. తమను మద్రాసులోనే ఉంచాలని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలవారు కోరారు. అయితే 1937లో మద్రాసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.
-మద్రాసులో స్థిరనివాసం ఉన్న ఆంధ్రపత్రిక అధినేత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు రాయలసీమ, కోస్తా వారి మధ్య సయోధ్యకు పూనుకున్నారు.
-ఆయన గృహంపేరు శ్రీబాగ్. నాగేశ్వరరావు పంతులు కోస్తా, రాయలసీమ నాయకులను తమ ఇంట్లో సమావేశపర్చి సయోధ్య కుదుర్చారు. రెండు వర్గాలమధ్య ఒప్పందం కుదిరింది. దీన్నే శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. (1937 నవంబర్ 16).
-కానీ 1946లో తిరిగి ఎన్నికలు, 1947లో స్వాతంత్య్రం రావడం, 1950లో భారత్ రిపబ్లిక్‌గా అవతరణ ఈ కారణాల వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తిరిగి వాయిదా పడింది.
-నిజాం రాజు లొంగిపోయాడు కాబట్టి ముందు ఆంధ్రరాష్ట్రం సాధించుకుంటే తర్వాత తెలుగువారు పేరుతో హైదరాబాద్‌ను కలుపుకోవచ్చుననే దురాలోచన ఆంధ్రా నాయకుల మనసుల్లో ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్టులు తమ బలం పెరుగుదల కోసం విశాలాంధ్ర ఆలోచన చేశారు.
-ఈ క్రమంలో 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందుకోసం ఎస్కే ధార్‌తో కమిటీ వేశారు. ధార్ కమిటీ నెగెటివ్‌గా నివేదిక ఇచ్చింది. దీంతో ఆంధ్రలో కలకలం రేగింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయం పరిశీలనకు 1949 జవహర్లాల్ నెహ్రూ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వల్లభాయ్ పటేల్‌లతో కమిటీ వేశారు. దీన్నే జేవీపీ కమిటీ అంటారు. ఈ కమిటీ తన రిపోర్టును 1949, ఏప్రిల్ 6న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సమర్పించింది.
-ఈ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదని రిపోర్టులో పేర్కొంది. కానీ ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసింది.
-పొట్టి శ్రీరాములు 1952, అక్టోబర్ 19న ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. 58 రోజుల దీక్ష అనంతరం ఆయన కోరిక (మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం) తీరకుండా 1952 డిసెంబర్ 15న మరణించారు. ఈ దీక్ష అనంతర పరిణామాలతో చివరకు 1952, డిసెంబర్ 19న ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు సుముఖమని నెహ్రూ ప్రకటించారు. 1953, అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
ఫజుల్ అలీ కమిషన్- 1953 (ఎస్ఆర్సీ)
-తెలంగాణ (హైదరాబాద్ స్టేట్), ఆంధ్రరాష్ట్ర ప్రజల్లో ఏర్పడ్డ భాష భావన (ముఖ్యంగా ఆంధ్రుల ఒత్తిడి)తో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నెహ్రూ 1953, డిసెంబర్ 29న పార్లమెంటులో ప్రకటించారు. ఫజుల్ అలీతోపాటు హృదయనాథ్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్‌లు ఈ కమిషన్‌లో సభ్యులు. హోంమంత్రి ఈ కమిషన్‌కు పర్యవేక్షకులు. తొలి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సీ)ను ఏర్పాటు చేయడానికి భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనతోపాటు పలు ఇతర కారణాలున్నాయి.
మొదటి ఎస్సార్సీ లక్ష్యాలు
-పోలీసులు, గవర్నర్ల వ్యవస్థను అంతమొందించడం.
-రాజ్ప్రముఖ్ల (పెద్ద సంస్థానాల్లో) వ్యవస్థను అంతమొందించడం.
-1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలను మూడు విభాగాలుగా ఏర్పాటు చేయడం.
ఎస్సార్సీ ఫలితం
-ఏడాదిన్నరపాటు ఫజల్ అలీ కమిషన్ తమకు అప్పగించిన కార్యక్రమంపై కసరత్తు చేసింది.
-1955, జూన్ 30లోగా నివేదిక అందించాల్సి ఉండగా మరో మూడు నెలలు పొడిగించారు. 1955, సెప్టెంబర్ 30న కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం మూడు విభాగాల సరిహద్దులును కమిషన్ పునర్నిర్వచించింది.
-ఆ ప్రకారం 1956లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బొంబాయి, బీహార్, జమ్ముకశ్మీర్, కేరళ, మద్రాసు, మైసూరు, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాలు రద్దయ్యాయి.
-అండమాన్, నికోబార్ దీవులు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, పాండిచ్చేరి, త్రిపుర, మణిపూర్‌లు కేంద్రపాలిత ప్రాంతాలయ్యాయి.
ఆంధ్ర, హైదరాబాద్ రాష్ర్టాలపై ఎస్సార్సీ అభిప్రాయం
-ఎస్సార్సీ నివేదికలోని 100వ పేజీ నుంచి 111వ పేజీ వరకు ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలపై కమిషన్ తన అభిప్రాయాలను పొందుపర్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టాలి. మరఠ్వాడా ప్రాంతాలను బొంబాయిలో, కన్నడ మాట్లాడే ప్రాంతాలను మైసూరులో కలపాలి. బీదర్‌ను హైదరాబాద్‌లో కలిపి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
-ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాల ప్రజలమధ్య సజాతీయత లేదని పేర్కొంది. ఐదేళ్లపాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సూచించింది. అయితే ఈ సూచనను కేంద్రం తిరస్కరించింది.
విశాలాంధ్ర, తెలంగాణ వాదనలపై కమిషన్ వివరాలు తెలంగాణ వాదనలు, పేరా నంబర్లు.
-375 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూల వాదనలు అంత తేలిగ్గా కొట్టిపారెయ్యలేనివిధంగా ఉన్నాయి.
-376 : ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది. తెలంగాణతో పోలిస్తే వారి తలసరి ఆదాయం తక్కువ. మరోవైపు తెలంగాణలో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ. తెలంగాణలో భూమి పన్ను ఆదాయం ఎక్కువ. మద్యంపై ఏటా రూ. 5 కోట్ల ఆదాయం వస్తున్నది. రెండు ప్రాంతాల మధ్య ఆదాయంలో తేడాకు ఇది ప్రధాన కారణం. ప్రగతిపథంలో ఉన్న తెలంగాణకు ఈ ఏకీకరణ వల్ల ఎలాంటి పాలనాపరమైన లాభం ఉండదు.
-377: భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో తెలంగాణను పట్టించుకోరని కూడా తెలంగాణ వాసుల భయం. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులమీద తమ స్వతంత్ర నీటి వినియోగ హక్కులు పోతాయని వారి భయం. అందువల్ల తెలంగాణవారు ఇష్టపడలేదు.
-378: కోస్తాకు చెందిన ఆధునికులు దోపిడీ చేస్తారేమోనన్న అనుమానం విద్యాపరంగా వెనుకబడిన తెలంగాణ ప్రజల్లో నెలకొంది. విశాలాంధ్ర ఏర్పాటు వ్యతిరేకతకు ఇది ఒక ముఖ్య కారణం.
హైదరాబాద్‌ను దాటితే తెలంగాణ దారుణంగా వెనుకబడి ఉంది.
-379: తెలంగాణ తనకు తాను మనగలిగిన సుస్థిర రాష్ట్రం అవుతుందని తెలంగాణవాసుల నమ్మకం. ఈ ప్రాంత రెవెన్యూ వసూళ్లు రూ.17 కోట్లు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు తెచ్చిన అప్పులకు కొంత వడ్డీ చెల్లించాల్సి ఉన్నా కొత్త తెలంగాణ రాష్ట్రానికి భారీ లోటు ఏమీ ఉండదు. ఆదాయం, ఖర్చు సమానమయ్యే అవకాశం ఉంది. మిగులు బడ్జెట్ కూడా చూపించవచ్చు. పలు కారణాలతో దీన్ని సమర్థించవచ్చు.
-380: 1952 ఏప్రిల్ నాటి ఆర్థిక సంఘం సూచనలతో హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైన తెలంగాణ చెప్పుకోదగ్గ స్థాయి లబ్ధి పొందింది. పన్ను వసూళ్ల అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
-385: గమనంలో ఉంచవలసిన విషయం ఏమిటంటే ఆంధ్రరాష్ట్రం ఇటీవలే ఏర్పాటైంది. మార్పు దశలో ఒత్తిడి నుంచి ఇంకా కోలుకోలేదు. అందువల్ల ఈ సమయంలో ఆంధ్ర, తెలంగాణను కలిపితే కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉంది.
-386: ఈ అంశానన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మేం (కమిషన్) అవగాహనకు వచ్చాం. ఆంధ్ర, తెలంగాణలో ఉమ్మడి ప్రయోజనార్థం ప్రస్తుతానికి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలి. ఆంధ్రలో విలీనం అంశం 1961 ఎన్నికల అనంతరం ఏర్పడే హైదరాబాద్ శాసనసభ చూసుకుంటుంది. 2/3 మెజారిటీతో విలీనానికి అనుకూలంగా ఉంటే అప్పుడు దాన్ని అమలుచేయాలి.
-389: ప్రస్తుతానికి హైదరాబాద్ రాష్ట్రం కొనసాగుతుంది. మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, బీదర్ జిల్లాలు ఉంటాయి. ఆంధ్రరాష్ట్రంలోని మునగాల హైదరాబాద్ రాష్ట్రంలో ఉంటుంది.
విశాలాంధ్ర వాదన
-371: తెలంగాణతో కూడిన విశాలాంధ్ర ఏర్పడితే కలిగే లాభాలు చెప్పుకోదగ్గవిగా ఉంటాయి. విస్తృతమైన సాగుభూమి, 3.2 కోట్ల జనాభా, భారీస్థాయిలో జల, ఇంధన వనరులు, తగినంత ఖనిజ సంపద, విలువైన ముడి ఖనిజంతో కూడిన రాష్ట్రం అవతరిస్తుంది. అత్యంత కష్టసాధ్యమైన ఆంధ్రరాష్ట్ర రాజధాని సమస్య తీరుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు విశాలాంధ్ర రాజధానిగా సరిపోతాయి.
-372: మరోలాభం కృష్ణా, గోదావరుల నదుల అభివృద్ధి ఏకీకృత నియంత్రణలోకి వస్తుంది. తెలంగాణ అనే ఒక స్వతంత్ర రాజకీయ పరిధిని తొలగించగలిగితే తూర్పు పరీవాహక ప్రాంతంలో సాగునీటి ప్రణాళిక అమలు మరింత వేగవంతమవుతుంది.
-373: ఆంధ్రరాష్ట్రంలో బొగ్గులేదు. సింగరేణి ద్వారా సరఫరా చేయవచ్చు.
-ఫజల్ అలీ కమిషన్‌లో పేర్కొన్న భయాలన్నీ తెలంగాణ పట్ల నిజమయ్యాయి. విశాలాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడి తెలంగాణ సర్వనాశనమయింది. తెలంగాణ విద్యలో వెనుకబడిన కారణంగా ఉద్యోగాలన్నీ ఆంధ్రావారు తన్నుకుపోయారు. నిధులు సరిగా ఇవ్వని కారణంగా తెలంగాణలో ఆశించినంత అభివృద్ధి 1956 తర్వాత జరుగలేదు.
-తెలంగాణ నీటి విషయంలో దోపిడీకి గురైంది. ఒక్క శ్రీరాంసాగర్ తప్ప గోదావరి నదిపై దాదాపు 40 ఏండ్లపాటు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. తెలంగాణ వారి భూములన్నీ ఆంధ్రావారి కబ్జాలోకి వెళ్లిపోయాయి.
నెహ్రూ వ్యతిరేకత
-విశాలాంధ్ర ఏర్పాటును ప్రధాని నెహ్రూ తొలుత వ్యతిరేకించారు. కానీ ఆంధ్రావారి ఒత్తిడి, లాబీయింగ్ కారణంగా, తెలంగాణ నాయకులు ముఖ్యంగా అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఒప్పుకున్న కారణంగా విశాలాంధ్ర ఏర్పడింది. 1961 వరకు తెలంగాణ రాష్ట్రం ఉంచాలన్న ఫజల్ అలీ కమిషన్ నివేదికను కేంద్రం తిరస్కరించింది. ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు ఎన్నో విధాల ప్రయత్నించి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యేలా చూసుకున్నారు. చివరకు 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
విశాలాంధ్ర భావన పుట్టుక
-ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ తెలంగాణతో కూడిన ఆంధ్రరాష్ట్రం తమ ధ్యేయమని ప్రకటించింది. 1938లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకటవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
-విశాలాంధ్ర పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఈయన విశాలాంధ్ర పత్రికని స్థాపించి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథాన్ని రాశారు.
-1940లో కడవ కోటిరెడ్డి విశాలాంధ్ర అవసరమన్నారు. 1949, నవంబర్ 26న విజయవాడలో విశాలాంధ్ర సభ జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావు దీన్ని ఏర్పాటు చేశారు. 1951 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలో కాళేశ్వరరావు విశాలాంధ్రను ప్రస్తావించాడు. సభలో విశాలాంధ్ర ప్రస్తావనపై ప్రధాని నెహ్రూ విమర్శించారు.
-తెలంగాణ ప్రజలు ఒప్పుకోనిదే ఇది జరగదని అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎస్కే పాటిల్ చెప్పారు. తెలంగాణ ప్రజలు సమర్థిస్తేనే విశాలాంధ్ర స్థాపన జరుగుతుందని పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ వ్యాఖ్యానించారు. అయితే అప్పటి ఆంధ్రా నాయకులు తమ పట్టు వీడలేదు.
-1950లో వరంగల్‌లో మొదటి విశాలాంధ్ర సభను కాంగ్రెస్ నాయకుడు టీ హయగ్రీవాచారి నిర్వహించారు. ఈ సమావేశానికి టంగుటూరి ప్రకాశం పంతులు హాజరయ్యారు. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని ఈ సభలో తీర్మానించారు. ఈ సభకు హైదరాబాద్ నుంచి కోదాటి రాజలింగం, టీఎస్ మూర్తి మొదలైనవారు హాజరయ్యారు.
-1950లో నిజామాబాద్‌లో స్టేట్ కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఈ సభలో కొందరు నాయకులు విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించారు.
-భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు 1953లో హైదరాబాద్‌లో జరుగగా తెలంగాణ కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి మొదలైనవారు ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సమర్థించారు. బూర్గుల రామకృష్ణారావు, ముందుముల నరసింగరావు, పాగ పుల్లారెడ్డి విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించారు. ఆంధ్రా నాయకులు తెలంగాణ నాయకులను మేనేజ్ చేస్తూ విశాలాంధ్ర ఏర్పాటు ఆవశ్యకత అవకాశాలను పెంచుకుంటూ వచ్చారు.
-1954లో జరిగిన ఒక సభలో మాడపాటి హనుమంతరావు మాట్లాడుతూ విశాలాంధ్ర వాదన, తెలుగువాళ్లు ఏకం కావడమనేది 50 ఏండ్లనాటిదని చెప్పారు.
-రెండో విశాలాంధ్ర, మహాసభ మహాకవి శ్రీశ్రీ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగింది.
-ఈ సమావేశంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు స్వామి రామానందతీర్థ, ఆనాటి డిప్యూటీ మేయర్ మీర్ మహమ్మద్ ఆలీఖాన్ కమ్యూనిస్టు నాయకుడు ముగ్దూం మొహినొద్దీన్, కాంగ్రెస్ నాయకులు ముందుముల నర్సింగరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆర్య సమాజ్ నాయకులు పండిట్ నరేంద్రజీ, సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావులు విశాలాంధ్ర అంశాన్ని బలపర్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు