1969 ఉద్యమం తర్వాత..తెలంగాణలో సంఘటనలు,పర్యవసానాలు
ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణను కలిపి 1956లో బలవంతంగా విశాలాంధ్రను ఏర్పాటుచేసిన క్షణం నుంచి తెలంగాణపై ఆంధ్ర పెత్తనం పెరుగుతూ వచ్చింది. 1969 నాటికి తెలంగాణవాదులపై అణచివేత తారాస్థాయికి చేరటంతో మొదటిసారి తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. దోపిడీని నిసరిస్తూ తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించిన ఉద్యమాన్ని వలస పాలకులు అధికార బలంతో అణచివేశారు. అందుకు కొందరు తెలంగాణ ఉద్యమ నాయకుల వ్యక్తిగత స్వార్థపూరిత నిర్ణయాలు కూడా తోడు కావటంతో ఉద్యమం చల్లారిపోయింది. అయితే, ఆ ఉద్యమం తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు జరిగాయి. వాటి వరుసక్రమం నిపుణ పాఠకుల కోసం..
తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా పాల్వంచ వేదికయ్యింది. పాల్వంచ థర్మల్‌పవర్ స్టేషన్లో తెలంగాణ ప్రాంతం వారిని కాకుండా ఆంధ్రకు చెందిన ఉద్యోగులను ఎక్కువ మందిని తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రామదాసు ఈ అన్యాయాలను నిలదీశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసులు పెట్టి నానా హింసకు గురిచేశారు.
ఆ తరువాత 1969, జనవరి 9న పాల్వంచలోని గాంధీచౌక్ వద్ద రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా ప్రజలు నిరసనలు, ర్యాలీలు తీశారు. ఖమ్మం జిల్లాలో మొదలైన ఆందోళన క్రమంగా నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు పాకింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు సర్వసభ్య సమావేశం నిర్వహించాయి. జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పాటయ్యింది. జనవరి 15 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే హైదరాబాద్‌లో కొందరు ప్రముఖులు సమావేశమై తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో దీక్ష చేపడుతున్న రవీంద్రనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణ వేడెక్కింది. జనవరి 16న విద్యార్థులు హైదరాబాద్‌లో ఊరేగింపు తీశారు. తెలంగాణ మొత్తం నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. దీంతో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి తాత్కాలికంగా వేడిని తగ్గించడానికి 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించారు.
1) ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల లెక్క తేల్చడం.
2) తెలంగాణ మిగులు నిధుల లెక్క తేల్చడం.
1969 జనవరి 21న జీవో 36ను ప్రభుత్వం విడుదల చేసింది. 1969 ఫిబ్రవరి 28లోపు నాన్‌ముల్కీలను వెనక్కి పంపుతామని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టంగా చెప్పింది.
ఒకవైపు తెలంగాణ రక్షణ కోసం జీవోలు ఇస్తూ మరోవైపు సీఎం బ్రహ్మానందరెడ్డి కుట్రలు పన్నారు. ఆయన ప్రోత్సాహంతో 1969 జనవరి 31న జీవో 36కు వ్యతిరేకంగా హైకోర్టులో తెలంగాణ ఉద్యోగినులు రిట్ దాఖలు చేశారు. తమ భర్తలు ఆంధ్రోళ్లని, జీవో 36ను అమలు చేస్తే తమ కుటుంబాలు ఇబ్బంది పడతాయని వాదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుమార్ లలిత్ అనే అధికారితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మార్చిలోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 4500 మంది ఆంధ్ర ఉద్యోగులు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పనిచేస్తున్నారని చెప్పింది.
1969 ఫిబ్రవరి 3న హైకోర్టు తీర్పు వెల్లడించింది. జీవో 36 రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది.
1969 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు జీవో 36 అమలు నిలిపేయాలని స్టే ఇచ్చింది.
కోర్టుల తీర్పులు, ప్రభుత్వ కుట్రలు తెలంగాణ ఉద్యమకారులకు కోపాన్ని తెప్పించాయి.
1969, ఫిబ్రవరి 20న హైకోర్టు మరో తీర్పు ఇచ్చింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమే అన్నది. జీవో 36ను సమర్థించింది. అయితే అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాల్లో చేరిన ఆంధ్ర ఉద్యోగులను వెనుకకు పంపొద్దని ఆ పోస్టులకు సమానంగా తెలంగాణ కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని ఆదేశించింది.
1969 ఫిబ్రవరి 28న ముల్కీ నిబంధనలు మరో ఐదేండ్లు పొడిగించడానికి వీలు కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించింది.
దీక్ష చేపట్టిన రవీంద్రనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో 17 రోజుల తర్వాత విద్యార్థి నాయకుడు వెంకట హైమారెడ్డి చొరవతో దీక్ష విరమించారు. కానీ తెలంగాణ శాంతించలేదు.
జనవరి 24న సదాశివపేటలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శంకర్ అనే యువకుడు గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
జనవరి 30న గజ్వేల్‌లో జరిగిన కాల్పుల్లో నర్సింహులు అనే విద్యార్థి చనిపోయాడు.
1969 ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది. అధ్యక్షుడిగా మదన్మోహన్ ఎన్నికయ్యాడు.
1969 మార్చి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో ఒక సమావేశం జరిగింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటాన్ని టీ పురుషోత్తమరావు ఆవిష్కరించారు.
1969 మార్చి 28న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు అసహనానికి గురయ్యారు. ఆ రోజే బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వాంఛూ అధ్యక్షతన కమిటీని వేసింది. ఆంధ్ర పాలకుల తీరుకు నిరసనగా అదే రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు.
1969 ఏప్రిల్ 11న జస్టిస్ భార్గవ కమిటీని ప్రభుత్వం నియమించి కుమార్ లలిత్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై విచారణ చేయమంది. కమిటీల మీద కమిటీలు తెలంగాణ ప్రజలకు ఆగ్రహం కలిగించాయి. ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమంలోకి వచ్చారు.
1969 ఏప్రిల్ 11లోగా తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆదిరాజు వెంకటేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా ఆమోదించారు.
సికింద్రాబాద్‌లోని అంజలి టాకీస్ చౌరస్తా వద్ద బూరుగు మహదేవ్ హాలులో కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర సమైక్యతను కోరుతూనే తెలంగాణ రక్షణలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమ నాయకులను ఉద్యమాన్ని విమర్శించింది. తెలంగాణవాదులకు కమ్యూనిస్టులకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేస్తే 27 మందికి దెబ్బలు తగిలాయి. తెలంగాణవాదులను పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. తెలంగాణవాదుల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్‌లో సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యేలు అచ్యుతరెడ్డి, టీ అంజయ్య, మాణిక్‌రావు, హషీమ్ పాల్గొన్నారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. ఉద్యమ తీవ్రత ఢిల్లీకి చేరింది. ఇందిరాగాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, నూకల రామచంద్రారెడ్డి, జే చొక్కారావు హాజరయ్యారు. ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడానికి అష్టసూత్ర పథకాన్ని రూపొందించింది.
1969 ఏప్రిల్ 12న పార్లమెంటులో అష్టసూత్ర పథకం ప్రకటించింది.
అష్టసూత్రాలు
1) ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీయడానికి ఉన్నతాధికారి సంఘం ఏర్పాటు.
2) కోల్పోయిన తెలంగాణ నిధులు సమకూర్చాలి.
3) తెలంగాణప్రాంత అభివృద్ధికి సీఎం అధ్యక్షతన ప్రణాళికలు రూపొందించాలి.
4) ప్రణాళిక సంఘం సలహాదారు అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు.
5) కమిటీలో అధికారులకు ఎక్కువ అధికారాలను ఇచ్చారు.
6) తెలంగాణలో ఉద్యోగాలు స్థానికులకే చెందాలి.
7) తెలంగాణ ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం.
8) తెలంగాణ అభివృద్ధికి కేంద్రం శ్రద్ధ వహిస్తుంది.
ఈ పథకం తెలంగాణవాదులను సంతృప్తిపర్చలేకపోయింది. తెలంగాణలో నిరసనలు కొనసాగాయి. దీంతో అష్టసూత్ర పథకం అమల్లోకి రాలేదు.
1969 ఏప్రిల్ 21న మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ ప్రకటన చేసి ఉద్యమంలోకి వచ్చాడు.
తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మదన్మోహన్ పదవి నుంచి తప్పుకోవడంతో 1969 మే 22న అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యాడు.
1969 మే 25న మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులో జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం బ్రహ్మానందరెడ్డి ప్రసంగం ఉద్రేకాలను రెచ్చగొట్టింది. సీఎం తిరిగి హైదరాబాద్ వస్తుంటే అడుగడుగునా నిరసన తెలిపారు. ఆ రోజు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.
1969 మే 26న కాల్పులకు నిరసనగా సామూహిక సత్యాగ్రహాలు కొనసాగించింది తెలంగాణ ప్రజాసమితి.
సీఎం బ్రహ్మానందరెడ్డి ఎన్జీవో నాయకుడు కేఆర్ ఆమోస్‌ను డిస్మిస్ చేసి ఉపాధ్యాయ సంఘాన్ని రద్దు చేశాడు.
ప్రభుత్వం సమ్మెలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంలో చంచల్‌గూడ జైల్లో సత్యాగ్రహ ఖైదీలకు ఆంధ్రా ఖైదీలకు గొడవ జరిగింది. సత్యాగ్రహ ఖైదీలను పరామర్శించడానికెళ్లిన తెలంగాణ సమితి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ వార్త తెలంగాణ అంతటా వ్యాపించింది.
1969 మే 1న గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడానికెళ్లిన నాయకులపై కూడా పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు కాల్పులు జరిపితే 20 మంది ఉద్యమకారులు చనిపోయారు.
1969 జూన్ 2న ప్రభుత్వ దమనకాండకు నిరసనగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ సంపూర్ణంగా జరిగింది.
1969 జూన్ 3న గూండాయిజం వ్యతిరేక దినం జరపాలని తెలంగాణ ప్రజాసమితి నిర్ణయించింది. ఉద్యమ మంట ఢిల్లీకి చేరింది. ఢిల్లీ నుంచి సీఎంకు పిలుపు వచ్చింది.
1969 జూన్ 4న హైదరాబాద్ యుద్ధభూమిగా మారింది. పోలీసులు అనేకచోట్ల కాల్పులు జరిపారు. అనేకమంది తెలంగాణవాదులు చనిపోయారు. హైదరాబాద్ నగరమంతా కర్ఫ్యూ విధించారు. ఆ రోజు సాయంత్రం ప్రధాని ఇందిరాగాంధీ విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. అధికారులు, తెలంగాణ నాయకులతో ప్రధాని పరిస్థితిని సమీక్షించారు. తాత్కాలికంగా ఉద్యమాన్ని ఆపండి, ఉదయం తాను ఆఫ్ఘనిస్థాన్ వెళ్లాల్సి ఉందని, తిరిగి వచ్చాక అన్ని విషయాలు చర్చిస్తానని చెప్పారు. అదే రోజు రాత్రి 3 గంటలకు ప్రధాని ఢిల్లీ తిరిగి వెళ్లిపోయారు. రోజురోజుకు ఉద్యమం మరింత ఉధృతమైంది.
1969 జూన్ 7న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు.
ఎన్జీవోలు 1969 జూన్ 11 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. సమ్మె చరిత్రాత్మకంగా 35 రోజులు కొనసాగింది. కేంద్రం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ప్రజాసమితి నిర్ణయించింది. సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ చేయాలని, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు.
ఈలోపు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ వెళ్లి మొరార్జీదేశాయ్, చవాన్లతో చర్చించారు. చర్చలు విఫలమయ్యాయి. ఎంపీలు రాజీనామాకు సిద్ధం కావడంతో ప్రధానికి చికాకు కలిగించింది. వీరు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు.
పీడీ యాక్టు కింద అర్ధరాత్రి చెన్నారెడ్డిని, 8మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. తెలంగాణ అంతటా నిరసనలు, బంద్‌లు జరిగాయి. ఆగస్టు 25న తెలంగాణ ఉద్యమ నాయకులను విడుదల చేయమని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో వారు బయటకు వచ్చారు.
సెప్టెంబర్ నుంచి ఉద్యమ తీవ్రత తగ్గింది. అప్పటి వరకు ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న చెన్నారెడ్డి రాష్ట్రం సాధించడంకంటే సీఎంని మార్చడం లక్ష్యంగా పనిచేశారు. సెప్టెంబర్ 18న ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని వైద్య విద్యార్థులు నిర్ణయించారు.
చెన్నారెడ్డి తాను ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చాక ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపేద్దామని చెప్పారు. చెన్నారెడ్డి కుట్ర పూరితంగానే ఉద్యమాన్ని నీరుగార్చుతున్నాడని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో 9 నెలలు ఉధృతంగా నడిచిన ఉద్యమం చల్లారింది.
తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష పదవి నుంచి చెన్నారెడ్డిని తొలగిస్తున్నట్లు డిసెంబర్ 6న సదాలక్ష్మిలతోపాటు మరో ముగ్గురు ప్రకటన చేశారు. కానీ ఈ ప్రకటన మీద 58 మందిలో నలుగురు సభ్యులు మాత్రమే సంతకాలు చేశారు. దీంతో ఇది వీగిపోయింది.
1971లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెన్నారెడ్డి ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చాడు. ఇందుకు కాంగ్రెస్ సహకరించింది.
1971లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీ నుంచి 10 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. గెలిచి ఆరు నెలలు దాటకముందే తెలంగాణ ప్రజాసమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో తెలంగాణవాదుల్లో అసంతృప్తి రగిలింది. దీన్ని చల్లార్చడానికి ఇందిరాగాంధీ పంచసూత్ర పథకం రూపొందించారు.
పంచసూత్ర పథకం -1971
1) ముల్కీ నిబంధనలు తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసీల్దార్, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజినీర్ పదవులకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
2) ముల్కీ రక్షణలు హైదరాబాద్‌కు 1977 వరకు, తెలంగాణ ప్రాంత జిల్లాలకు 1980 వరకు అమలవుతాయని చెప్పారు.
3) ఉద్యోగాల్లో ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
4) సాంకేతిక, వృత్తిపరమైన విద్యాలయాల్లో తెలంగాణవారు అదనంగా కొన్ని స్థానాలు పొందడం.
5) జంటనగరాల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల పోలీసులు ఉం టారు. ఇది నామమాత్రపు పథకంగానే మిగిలింది. అసలు ఈ పథకం అమల్లోకే రాలేదు.
1971 సెప్టెంబర్ 30న మొదటిసారిగా పీవీ నర్సింహారావుకు సీఎం బాధ్యతలు అప్పగించారు. అప్పటికి 14 ఏండ్లపాటు ఆంధ్రోళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 1975 వరకు చెన్నారెడ్డి ఎన్నికల్లో పాల్గొనవద్దని కోర్టు షరతు ఉండటంతో సీఎం పదవికి పోటీపడలేదు.
1972లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో సారి పీవీ నర్సింహారావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
1972 ఫిబ్రవరి 14న హైకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని తీర్పునిచ్చింది. సీఎం పీవీ నర్సింహారావు తెలంగాణ రక్షణలను కాపాడాలని సంకల్పించి హైకోర్టు తీర్పును తిరిగి పరిశీలించాలని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు పంపాడు.
1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. 1958లో నియమావళి పేరుతో కేంద్రప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దుచేసింది. నిజాం కాలంనాటి ముల్కీ శాసనం అమల్లో ఉన్నట్లే అనేది తీర్పు సారాంశం. దీంతో 1972 అక్టోబర్ 18న ఆంధ్రప్రాంత నాయకులు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యమ నిర్వహణకు ప్రజాపరిషత్ ఏర్పాటు చేసుకున్నారు. ముల్కీ రూల్స్ రద్దయితేనే కలిసుంటామని బ్లాక్‌మెయిలింగ్ చేశారు. పీవీ నర్సింహారావుని పదవి నుంచి తప్పించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇందిరాగాంధీ సూచన మేరకు 1973 జనవరి 11న పీవీ నర్సింహారావు సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏ ప్రాంతం వారికి పదవి ఇచ్చినా సమస్యలు తలెత్తుతాయని ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రావాళ్లను సంతృప్తిపర్చడానికి ఇందిరాగాంధీ 1973 సెప్టెంబర్ 21న ఆరు సూత్రాల పథకం ప్రకటించారు.
610 జీవోలోని అంశాలు
1976 అక్టోబర్ 18 నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా 5, 6 జోన్లలో నియమితులైన వారిని 1986 మార్చి 31 నాటికి వెనుకకు పంపి వారి స్థానంలో తెలంగాణవారిని నియమించాలి.
శ్రీరాంసాగర్, జూరాల, శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్టు పనుల్లో ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపాలి.
సచివాలయం, హైదరాబాద్ కేంద్రం, వివిధ డిపార్ట్మెంట్ల అధిపతుల కార్యాలయాల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలి.
బోగస్, లోకల్ సర్టిఫికెట్ల కింద నియమితులైన తెలంగాణేతరులపై చర్యలు తీసుకోవాలి.
నిబంధనకు వ్యతిరేకంగా జరిగిన ప్రమోషన్లు, నియామకాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలి.
మొదలైన అంశాలతో ఈ జీవో జారీ చేశారు. కానీ ఈ జీవోను అమలు చేయలేదు. దీంతో తెలంగాణ ఉద్యోగులు అసహనానికి లోనయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష రోజురోజుకు బలపడి 1985 ఫిబ్రవరి 27న తెలంగాణ జనసభ ఆవిర్భవించింది. సత్యనారాయణ అధ్యక్షతన సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. రాజీవ్‌గాంధీ హాజరై మాట్లాడారు.
1987లో తెలంగాణ ప్రజా సమితి మళ్లీ ఆవిర్భవించింది. ఈసారి వరంగల్‌కు చెందిన భూపతి కృష్ణమూర్తి అధ్యక్షతన ప్రాణం పోసుకుంది.
1989 రాష్ట్ర శాసనసభ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మర్రి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా రాజశేఖర్‌రెడ్డి కార్యక్రమాలు మొదలుపెట్టారు. హైదరాబాద్ పాతబస్తీలో గొడవలు జరిగాయి. అవి మతకలహాలుగా రూపాంతరం చెంది హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించారు.
ఆంధ్ర కుట్రలు ఫలించి 1990 డిసెంబర్ 17న చెన్నారెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆంధ్ర నాయకుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంగా నియమించింది. ఈయన మంత్రివర్గంలో కూడా వైఎస్‌కు మంత్రి పదవి లభించలేదు. మెడికల్, డెంటల్ కాలేజీలకు అక్రమంగా అనుమతులిచ్చాడనే అభియోగంతో 1992 అక్టోబర్ 9న ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీవ్‌గాంధీ మరణంతో పీవీ నిర్సింహారావును ప్రధాని పీఠం వరించింది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 1992 అక్టోబర్ 9నే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తరువాత ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ సీనియర్ నాయకులకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. అప్పుడు జానారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తెలంగాణవాదాన్ని వినిపించి 1990లో తెలంగాణ ఫోరం ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా జానారెడ్డి ఎన్నికయ్యారు.
జానారెడ్డి నాయకత్వంలో 1992 సెప్టెంబర్‌లో పీవీ నర్సింహారావుకు తెలంగాణవాదం వినిపిస్తూ వినతిపత్రం అందించారు.
1992లో ఓయూ విద్యార్థుల రూపంలో తెలంగాణ ఆకాంక్ష బలంగా వినిపించింది. 1992లో పెద్ద ఉద్యమం జరిగింది. విద్యార్థులు తెలంగాణ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఈ ఆర్గనైజేషన్ వెలుగులోకి తెచ్చింది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి డిసెంబర్ 12న ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కుటుంబ కలహాల వల్ల తొమ్మిది నెలలు కూడా గడవకుండానే రామారావు ప్రభుత్వం కూలిపోయింది.
1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ నుంచి ఇంద్రారెడ్డి బయటకు వచ్చి 1997లో జై తెలంగాణ పార్టీ పెట్టారు. ఉత్సాహంగా తెలంగాణ విజయయాత్రలు మొదలుపెట్టారు. ప్రజలు ఆదరించారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులు కూడా ఆయనకు మద్దతిచ్చారు. కానీ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి జై తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ప్రజలకు తెలంగాణ నినాదం వినిపించే నాయకుల మీద నమ్మకం పోయిం ది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు.
1998 మార్చిలో లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 12 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చింది.
1997 చివరలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రకటించారు.
1998లో చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు బీజేపీ అనుకూలమని కాకినాడలో తీర్మానం చేసింది.
1999లో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు.
బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, తెలంగాణ రాష్ర్టాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటు ఆలోచనను మానుకోవాలని బీజేపీకి చంద్రబాబు బ్లాక్మెయిల్ చేసి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు.
ఎప్పటినుంచో ముఖ్యమంత్రి పదవి కోసం కాచుక్కూర్చుకొని ఉన్న వైఎస్ తెలంగాణ అంశంతో చంద్రబాబుని ఇరుకునపెట్టాలని, తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న నాయకులకు మద్దతిచ్చారు. సోనియాగాంధీకి 38 మంది కాంగ్రెస్ నాయకులతో తెలంగాణ ఏర్పాటు గురించి వినతిపత్రం సమర్పించారు.
1999లో చిన్నారెడ్డి కన్వీనర్‌గా తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటయ్యింది. తెలంగాణ ప్రజలు ఆదరించారు. తెలంగాణ జిల్లాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశా. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై కూడా చిన్నారెడ్డి గొంతు విప్పారు.
1973 ఆరు సూత్రాల పథకం
1) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళిక బోర్డు ఏర్పాటు.
2) రాజధానిలో ఉన్నత వసతులు కల్పించాలి.
3) ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే అవకాశం కల్పించాలి.
4) ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను నియమించాలి.
5) ఫిర్యాదులను పరిష్కరించే రీతిలో రాజ్యాంగ సవరణ అవసరమైతే ఆ అధికారం రాష్ట్రపతికి ఉండాలి.
6) ముల్కీ నిబంధనలు, ప్రాంతీయ కమిటీ రద్దు.
ఈ ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించింది. ఆరు సూత్రాల్లోని 5వ సూత్రం ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి 371 డి అధికరణం చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణను చట్టబద్ధమైనదిగా ధృవీకరిస్తూ 1975 అక్టోబర్ 18న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విడుదలయ్యింది.
ఈ పథకం ద్వారా తెలంగాణకి ఇచ్చిన హామీలన్నీ రద్దయ్యాయి.
ఈ ఉత్తర్వులను అనుసరించి రాష్ర్టాన్ని ఆరు జోన్లుగా విభజించారు.
ఆంధ్రప్రాంతాన్ని 1, 2, 3 జోన్లుగా, రాయలసీమను 4వ జోన్‌గా, తెలంగాణను 5, 6 జోన్లుగా విభజించారు.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌తో ఆంధ్రలో ఉద్యమం చల్లారిం ది. 1973 డిసెంబర్ 10న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన ఎత్తివేసింది.
1973 డిసెంబర్ 10న కొత్త సీఎంగా జలగం వెంగళరావు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఆంధ్రకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు.
1977 జూన్ నుంచి మార్చి వరకు ఇందిరాగాంధీ దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ సమీకరణ వల్ల వెంగళరావు ఇందిరాగాంధీకి దూరమయ్యారు.
1978 మార్చి 6న మర్రి చెన్నారెడ్డికి ఇందిరాగాంధీ సీఎం బాధ్యతలు అప్పగించారు. ఆంధ్ర నాయకుల ఫిర్యాదులతో ఆయనను పదవి నుంచి తప్పించారు. 1980 అక్టోబర్ 11న టంగుటూరి అంజయ్య సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు.
1982 మార్చి 21న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలంగాణ నాయకుడు సీఎంగా ఉండటం ఆంధ్రవాళ్లు భరించలేకపోయారు. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇందిరాగాంధీకి పంపారు. చివరికి ఇందిరాగాంధీ అంజయ్యను పదవి నుంచి తొలగించి, 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకట్రామ్కు సీఎం పదవిని కట్టబెట్టారు.
ఎన్టీఆర్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సాధించింది. 1983 జనవరి 9న ఎన్టీఆర్ సీఎం అయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి ఆంధ్రప్రాంతం వాళ్లకు ప్రయోజనకరమైన అంశాలను అమలు చేశారు. తెలంగాణ వారికి న్యాయం చేయాలని ఎన్జీవోల వినతులకు సీఎం రామారావు స్పందించి జయభారత్‌రెడ్డి నాయకత్వాన ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని 1984లో నియమించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 59 వేల మంది స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించినట్లు ఈ కమిటీ తేల్చింది. ఈ నివేదిక మీద సీఎం రామారావు చర్యలు తీసుకోడానికి ప్రయత్నించగా కొంతమంది ఆంధ్ర నాయకులు అడ్డుపడ్డారు. ఆంధ్ర అధికారులు సాగదీయాలనే ఉద్దేశంతో మరో కమిటీ వేసి నిగ్గు తేల్చాలని సీఎంకు సలహా ఇచ్చారు. దీంతో రామారావు మరో ఐఏఎస్ అధికారికి వీ సుందరేశన్‌తో ఏకసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ సిఫారసులతో రామారావు ప్రభుత్వం 1985 డిసెంబర్ 30న జీవో 610ని జారీచేసి 1986 మార్చి 31లోపు ఈ జీవో అమలు కావాలని పేర్కొన్నారు.
5వ జోన్ జిల్లాలు
వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం
6వ జోన్ జిల్లాలు
మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్,మహబూబ్‌నగర్, నల్లగొండ
తెలంగాణ ప్రజల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో జీవో 610 అమలును పరిశీలించడానికి 2001 జూన్ 5న జీఎం గిర్గ్లానీ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి ప్రభుత్వ శాఖలు సహకరించలేదు. 2001 అక్టోబర్ 6న గిర్గ్లానీ కమిటీ ప్రభుత్వానికి తొలి నివేదిక అందజేసింది.
1975 నుంచి 2001 మధ్యన 8 రకాల 126 ఉల్లంఘనలు జరిగాయని కమిటీ ప్రకటించింది. ఈ కమిటీ తన తుది నివేదికను 2004 సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి అందజేసింది.
గిర్గ్లానీ కమిటీ నివేదికను పరిశీలించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి నాలుగేండ్లు సాగదీశారు. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం వినిపిస్తే చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ పార్టీ పురుడుపోసుకుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు