ప్రాంతీయ అసమానతలు ప్రత్యేక ఉద్యమాలు
తమ సాంఘిక వ్యవస్థలో ఇతరుల జోక్యానికి, సంస్కృతిపై పెత్తనం వహించడానికి, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు సంఘటితమై పోరాటం చేయడాన్ని సామాజిక ఉద్యమం అంటారు. సామాజిక ఉద్యమాలు ప్రధానంగా సామాజిక దోపిడీ, వివక్షతలను వ్యతిరేకిస్తూ మార్పును కోరేవిధంగా ప్రారంభమవుతాయి. ప్రజల అసంతృప్తి, పరాయీకరణవాదం, ప్రాంతీయ స్వయంప్రతిపత్తికి ఏవిధంగా కారణమవుతాయో ఈ ఉద్యమాలు వివరిస్తాయి.
ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాల స్వభావం
తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలనే బలమైన కోరిక, ఇతర ప్రాంతాల పాలకుల ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం, తమ వనరులు తమకే దక్కాలన్న బలమైన ఆకాంక్ష, తమ సంస్కృతి, భాష జీవన విధానాన్ని ఇతరులు ప్రభావితం చేయరాదనే లక్ష్యంతో ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు తమ అస్తిత్వాన్ని, గుర్తింపును కాపాడుకోవడం కోసం, ప్రాంతీయంగా స్వయంప్రతిపత్తిని కోరుకుంటూ ఉద్యమిస్తారు. ప్రాంతీయ స్వయంప్రతిపత్తి అనేది ఒక ప్రాంత (జాతి/వర్గ) ప్రజల సహజమైన కోరికగా మొదలై చివరకు ప్రత్యేక దేశం/రాష్ర్టాన్ని సాధించుకొనే దిశగా ఉద్యమిస్తారు.
స్వాతంత్య్రానంతరం భారతదేశంలో జరిగిన సామాజిక ఉద్యమంలో ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు అత్యంత బలమైన క్రియాశీలమైనవి. ముఖ్యంగా ఖలిస్థాన్ , నాగా , జార్ఖండ్ , ద్రవిడియన్, తెలంగాణ ఉద్యమాలు ప్రాంతీయ స్వయంప్రతిపత్తి అవసరాన్ని, ఆవశ్యకతను తెలిపే ప్రయత్నం చేశాయి. ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు తమ ప్రాంత పాలనలో ఇతర ప్రాంతాల వారి జోక్యాన్ని వ్యతిరేకిస్తూ తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలని, తమ వనరులు, ఉద్యోగాలు మొదట స్థానికులకే దక్కాలని కోరుకుంటాయి.
కారణాలనేకం
భారతదేశం భౌగోళికంగా, వనరులపరంగా, జనాభా పరంగా (కులం/మతం/వర్గం) జీవనవిధానపరంగా వైవిధ్యాన్ని కలిగి ఉండటం. ప్రతి ప్రాంతం ఒక విశిష్టమైన సంస్కృతి, చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉండటం వల్ల సహజంగానే ప్రతి ప్రాంతం స్వయంప్రతిపత్తిని కోరుకుంటుంది. బ్రిటిష్ వలసపాలన కాలంలో బ్రిటిష్ ఇండియా ప్రాంతాలతో పాటు సుమారు 562 సంస్థానాలు ప్రత్యేకమైన పాలనా విభాగాలుగా కొనసాగాయి. స్వాతంత్య్రానంతరం వీటిని భారతదేశంలో విలీనం చేసి అఖండ భారతాన్ని నిర్మించారు. అయితే రాజకీయంగా ఈ విలీనం దేశ పాలనకు అత్యవసరమైనప్పటికీ అనంతర కాలంలో ప్రాంతీయ స్వయంప్రతిపత్తి భావన తిరిగి వెలుగులోకి వచ్చింది.
సహజ కారణాలు
భౌగోళికంగా భారతదేశం భిన్నత్వాన్ని కలిగి ఉన్నది. ఈ భిన్నత్వం ప్రాంతీయ అసమానతలకు కారణమై ప్రాంతీయ స్వయంప్రతిపత్తికి దారితీసింది.
కులవ్యవస్థ, మతం, జీవనవిధానం, సంస్కృతి, సంప్రదాయాలు వేర్వేరుగా ఉండటం
భాషపరమైన వైవిధ్యం విభిన్న చారిత్రక నేపథ్యాలు
మానవ కారణాలు
ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి జరగకపోవడం
వివక్షాపూరిత పాలన వల్ల స్థానిక ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకకపోవడం
క్రమమైన, సమగ్రమైన అభివృద్ధి జరగకపోవడం
రాజకీయాధికారంలో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లభించకపోవడం
సహజ వనరుల పంపిణీ వివక్షపూరితంగా కొన్ని ప్రాంతాలు/వర్గాలు అనుకూలంగా ఉండేవిధంగా జరగడం
ఆయా ప్రాంతాల్లో స్థానికేతరులు రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకొని, వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాల పట్ల పూర్తిస్థాయి శ్రద్ధ కనబర్చకపోవడం
నిధుల కేటాయింపు, ఖర్చు విషయంలో అన్ని ప్రాంతాలకు ఏకరీతి న్యాయం జరగపోవడం
భినత్వాన్ని గౌరవించే విశాల దృష్టి లోపించడం
స్థానిక ప్రజలు ఆ ప్రాంతం పట్ల ఎక్కువ భావోద్వేగాన్ని కలిగి ఉండటం
ఖలిస్థాన్ ఉద్యమం
ఉత్తర భారతదేశంలో సిక్కు మతస్తులు నివసించే పంజాబ్‌తో పాటు దాని పరిసర రాష్ర్టాల్లో సిక్కులు నివసించే ప్రాంతాలన్నింటిని కలిపి ఖలిస్థాన్ పేరుతో ప్రత్యేక సార్వభౌమాధికార రాజ్యాన్ని/దేశాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో 1970వ దశకంలో వేర్పాటువాద ఉద్యమంగా ఖలిస్థాన్ ఉద్యమం ప్రారంభమైంది. స్వరాజ్య సిద్ధాంత ప్రాతిపదికన ముస్లింలకు పాకిస్థాన్ ఏర్పాటుచేసిన మాదిరిగానే సిక్కు మతస్తులకు ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో హింసామార్గంలో దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. నిజానికి 1946 నుంచే ఈ డిమాండ్ ఉన్నప్పటికీ స్వాతంత్య్రానంతరం ఇది కనుమరుగైంది. అయితే రాష్ర్టాల పునర్విభజనలో భాగంగా సమైక్య పంజాబ్‌ను పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలుగా విభజించారు. ఈ విభజనలో సిక్కులు కూడా విభజింపబడ్డారు. మత ప్రాతిపదికన తిరిగి ఏకమవడం కోసం ఖలిస్థాన్ పేరుతో ఉద్యమించారు.
నేపథ్యం
స్వాతంత్య్రానంతరం పంజాబ్‌లో వచ్చిన రెండు ప్రధాన మార్పులను ఖలిస్థాన్ ఉద్యమ నేపథ్యంగా భావించవచ్చు.
సిక్కు ప్రాంతాలన్నింటినీ పంజాబ్ రాష్ట్రంగా ఏర్పర్చడంతో అప్పటివరకు మత ప్రధాన సంస్థగా, సిక్కు ప్రయోజనాలను పరిరక్షించే సంస్థగా ఉన్న అకాళీదళ్ (1920) లౌకికవాద రాజకీయ పార్టీగా మారిపోయింది. ఫలితంగా ఆధిపత్య పోరాటం బయలుదేరి అంతర్గత విభేదాలు ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. సంప్రదాయ సిక్కు వర్గాలతో పాటు ఇతర వర్గాల మద్దతు కోసం అకాళీదళ్ ప్రయత్నించడం సిక్కువర్గాలను ఆందోళనకు గురిచేసింది.
హరితవిప్లవం ప్రభావం వల్ల సమాజంలో ఆర్థికంగా బలపడిన నూతన ధనిక, వ్యవసాయ పెట్టుబడిదారీ వర్గం ఆవిర్భవించి రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రయత్నించింది. అంతేకాకుండా ఈ విప్లవం ప్రభావంతో బలపడిన వ్యవసాయ మధ్య తరగతి వర్గాలు సంప్రదాయ సంస్కృతి స్థానంలో వస్తు సంస్కృతి పాశ్చాత్య భావనల, పరంపలు, వినియోగదారీ ప్రవర్తనకు కారకాలయ్యాయి. వీటికి తోడు అన్నిరంగాల్లో అవినీతి సామాజిక దురాచారాలు, మత్తుమందు వినియోగం పెరిగిపోవడంతో సంప్రదాయ సిక్కు మతానికి భంగం కలుగుతున్నట్లు అనిపించడంతో పాటు ఈ రుగ్మతలన్నీ సిక్కుమత మనుగడకు సవాలు వంటివి. వీటిని ఎదుర్కోడానికి ఏకైక మార్గం ఖలిస్థాన్ రాజ్య ఏర్పాటు తప్పనిసరి అనే భావన క్రమంగా బలపడింది. మొత్తంగా చూస్తే సాంఘిక వ్యవస్థలో సిక్కు మతస్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లు వారు భావించడం, హరితవిప్లవం ఫలితాలు అన్నివర్గాలకు అందకపోగా ఆర్థిక అంతరాలను మరింత పెంచింది. వీటికితోడు రాజకీయ పార్టీలు సిక్కు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఉదాసీనంగా ఉండటం వంటివి ఖలిస్థాన్ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చాయి.
ఉద్యమం స్వభావం
ఖలిస్థాన్ ఉద్యమం 1946లో ప్రారంభమైనప్పటికీ 1970, 1980 దశకాల్లో ప్రమాదస్థాయికి చేరుకుంది. 1971లో జగత్సింగ్ చౌహన్, 1978లో దళ్ ఖల్సాలు ఖలిస్థాన్ ఉద్యమ ప్రచారాన్ని వ్యాపార ప్రకటనలతో, కరపత్రాలతో ప్రారంభించారు. బల్బీర్సింగ్సంధూ ఖలిస్థాన్ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి హోదాలో ఖలిస్థాన్ ఏర్పాటైనట్లు ప్రకటించడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటుచేసి ఖలిస్థాన్ కరెన్సీని, పాస్‌పోర్టులను కూడా విడుదల చేయడం జరిగింది. అనంతరం 1977లో సిక్కు ఉగ్రవాదిగా ఉన్న బింద్రన్‌వాలే దందమీతక్సల్ అనే సంస్థను చేజిక్కించుకోవడంతో ఖలిస్థాన్ ఉద్యమం హింసాత్మకంగా మారింది. బింద్రన్‌వాలే స్వర్ణ దేవాలయాన్ని తన కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా ఎంచుకున్నాడు.
ఆపరేషన్ బ్లూస్టార్ దాడిలో బింద్రన్‌వాలే మరణించాడు. అయితే దీనికి ప్రతికారంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీని హతమర్చారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ ద్వారా సిక్కు, ఉగ్రవాదులను హతమార్చినప్పటికీ బలాట తీర్మానం (1968), ఆనందపూర్ సాహెబ్ తీర్మానం (1973) పేరుతో అకాళీలు భారత సమాఖ్య వ్యవస్థలో స్వయంప్రతిపత్తి కావాలనే డిమాండ్లు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.
జార్ఖండ్ ఉద్యమం
గిరిజన ఉద్యమాల్లో అత్యంత బలమైనదిగా పేర్కొన్న జార్ఖం డ్ ఉద్యమం బ్రిటిష్ వలస పాలన కాలంలోనే ప్రారంభమై స్వాతంత్య్రానంతరం కూడా దాదాపు ఐదు దశాబ్దాలపాటు సుదీర్ఘంగా కొనసాగి చివరకు 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.
బీహార్ దక్షిణ భాగమైన జార్ఖండ్ ప్రాంతం దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 2.80 శాతం ఉన్నప్పటికీ, దేశ మొత్తం ఖనిజ సంపదలో దాదాపు 28 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఖనిజ వనరుల కోసం బ్రిటిష్ వలస పాలన కాలంలో అన్వేషణ మొదలై, చివరకు ఖనిజ వనరులను గుర్తించి వాటి ఆధారంగా పరిశ్రమలను, ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి జరిగిన ప్రయత్నాలు గిరిజనుల జీవనాన్ని ప్రశ్నార్థకం చేశాయి.
బ్రిటిష్ వలసపాలన కాలంలో 1869లో రూపొందించిన చోటా నాగపూర్ టెనెన్సీ చట్టం ప్రకారం గిరిజన భూములను, ఆస్తులను గిరిజనేతరులు కొనడం నిషేధం. అయితే ఆచరణలో మాత్రం ఇది సాధ్యం కాలేదు. దీనికితోడు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన అటవీ విధానాలవల్ల గిరిజనుల అటవీ భూముల నుంచి, వనరుల నుంచి దూరమయ్యారు. శతాబ్దాలుగా అడవులను, కొండలను నమ్ముకున్న గిరిజనులు తమ భూముల నుంచి దూరమై పరాయీకరణకు గురయ్యారు.
ఉద్యమ గమనం
గిరిజనేతరుల దోపిడీ నుంచి రక్షణ పొందడం కోసం, దళారీలు, వడ్డీ వ్యాపారులు, అటవీ సిబ్బంది అమానుష కార్యకలాపాలకు వ్యతిరేకంగా స్వయం ప్రతిపత్తి గల గిరిజన రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమైంది. అణచివేతకు, నిరాదరణకు గురైన తమ సంస్కృతిని జీవన విధానాలను, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి వచ్చిన సాంఘిక ఉద్యమమే జార్ఖండ్ ఉద్యమం.
1928లో జార్ఖండ్ ఉన్నతి సమాజ్ అనే గిరిజన సంస్థ సైమన్ కమిషన్ ముందు హాజరై జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని నివేదించారు. అయితే అది విజయవంతం కాకపోవడంతో 1948లో జైపాల్‌సింగ్ నాయకత్వంలో జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా జార్ఖండ్ పార్టీ స్థాపించబడింది. కానీ అంతర్గత కారణాల వల్ల ఈ పార్టీ ముందుకు కొనసాగలేకపోయింది. అనంతరం కార్మిక నాయకుడు ఏకే రాయ్ నాయకత్వంలో శిబుసోరెన్, మహతోధీరజ్ కృషి వల్ల జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పేరుతో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.
సాంఘిక పెత్తందారి ఆధిపత్యం నుంచి విముక్తి, సాంస్కృతిక పరిరక్షణకు సంప్రదాయాలు, విలువలను కాపాడుకుంటూ 1974-77 మధ్యకాలంలో ధన్‌బాద్, గిరిదిష్ సంతాల్ పరగణా జిల్లాల్లోని గిరిజనులు గతంలో అన్యాక్రాంతమైన తమ భూములను బలవంతంగా ఆక్రమించుకొన్నారు. జార్ఖండ్ ఉద్యమానికి జార్ఖండ్ విద్యార్థి యూనియన్ నుంచి కూడా మద్దతు లభించింది. దీంతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారిం ది. ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 1995లో జార్ఖండ్ స్వయం ప్రతిపత్తి మండలిని ఏర్పాటు చేసింది. దీని ప్రభావం పెద్దగా లేకపోవడంతో జార్ఖండ్ ఉద్యమం మరింత ఉధృతమైంది. చివరకు 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 200 0, నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. (రాష్ట్రంలో ప్రధాన తెగలు ఒరాన్లు, సంతాల్, హరో)
ఇతర ఉద్యమాలు – ద్రవిడియన్ ఉద్యమం
ఇది రామస్వామి (పెరియార్) నాయకత్వంలో జరిగింది.
మద్రాసు ప్రెసిడెన్సీలోని పాఠశాలల్లో హిందీ భాషను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించింది.
పెరియార్ 1944లో ద్రవిడ కజగంను ఏర్పాటు చేసి ద్రవిడనాడు అనే ప్రత్యేక దేశం కావాలని ఉద్యమించారు.
గూర్ఖాలాండ్ ఉద్యమం
పశ్చిమబెంగాల్లో గూర్ఖాలాండ్ ఉద్యమం ప్రారంభమైంది.
1980లో సుభాష్ ఘీషింగ్ ఏర్పాటు చేసిన గూర్ఖా విమోచన సంస్థ ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం పోరాటం చేసింది.
ఈ పోరాట ఫలితంగా 1988లో డార్జిలింగ్ గూర్ఖా స్వయం ప్రతిపత్తి కొండ ప్రాంత మండలి ఏర్పాటైంది.
గూర్ఖా జనముక్తి మోర్చా బిమల్ గురాంగ్ నాయకత్వంలో డార్జిలింగ్ కొండ ప్రాంతంలో నివసించే గూర్ఖా ప్రజలు గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమించారు.
2005, డిసెంబర్ 7న కేంద్ర ప్రభుత్వం డార్జిలింగ్ గూర్ఖా కొండ ప్రాంత మండలికి 6వ షెడ్యూల్ హోదాను ఇచ్చింది.
2011 జూలై 18న గూర్ఖా జనముక్తి మోర్చా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
పశ్చిమబెంగాల్ చట్టం 2012 ప్రకారం డార్జిలింగ్ గూర్ఖా కొండ ప్రాంత మండలి స్థానంలో గూర్ఖా ప్రాదేశిక పాలనా మండలిని ఏర్పాటు చేశారు.
బోడోలాండ్ ఉద్యమం
బోడోలు అసోంలోని మైదాన ప్రాంతంలో నివసించే ప్రధాన గిరిజన తెగ.
బెంగాల్ నుంచి వలస వచ్చిన వారికోసం 1991లో చేసిన అస్సాం ఒప్పందం వల్ల స్థానిక బోడో గిరిజనుల జీవనం దెబ్బతిన్నది. బోడో ప్రజల సాంస్కృతిక గుర్తింపు, భాష ప్రమాదంలో పడ్డాయి.
ఉపేంద్రనాథ్ బ్రహ్మ నాయకత్వంలో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ బోడోల అస్తిత్వాన్ని కాపాడటం కోసం హింసామార్గంలో ఉద్యమించింది.
నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్, బోడో లిబరేషన్ టైగర్స్ బోడోయేతర ప్రజలపై హింసాత్మక దాడులకు పాల్పడ్డారు.
బోడో ఉద్యమాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు..
1. మొదటి బోడో ఒప్పందం- 1993: దీనిప్రకారం బోడో స్వయం ప్రతిపత్తి మండలి ఏర్పాటైంది.
2. రెండో బోడో ఒప్పందం-2003: బోడో ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేరుస్తూ 46 మంది సభ్యులతో కూడిన బోడోలాండ్ ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేసింది.
3. గోపాలకృష్ణ పిైళ్లె కమిటీ- 2014: ప్రత్యేక బోడోలాండ్ ఏర్పాటును అధ్యయం చేయడానికి కేంద్ర ఈ ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.
మహా నాగాలాండ్ ఉద్యమం
ఈశాన్య భారతదేశంలోని గిరిజన తెగలు ప్రధానంగా ఆస్ట్రో మంగోలాయిడ్ జాతికి చెందినవారు. వీరికి చారిత్రకంగా, సాంస్కృతికంగా భారతదేశంతో ఎలాంటి పోలికలు లేకపోవడం, సాంస్కృతిక వైరుధ్యాలు, ఆర్థిక అసమానతలు, ఈశాన్య రాష్ర్టాల్లో స్వయంప్రతిపత్తి ఉద్యమాలకు దోహదపడ్డారు. బ్రిటిష్ వలస పాలనకు ముందు, వారి పాలనా కాలంలో స్వతంత్రంగా ఉన్న ఈశాన్య ప్రాంతాలు స్వాతంత్య్రానంతరం రాజ్యాధికారాన్ని కోల్పోయి దేశంలో విలీనమయ్యాయి. ఆ తర్వాత తమ సంస్కృతికి మనుగడ తదని…., అభద్రతా భావానికి లోనై తిరిగి స్వయంప్రతిపత్తి కోసం ఉద్యమించారు.
బ్రిటిష్ వలసపాలన కాలంలో 1929లో సైమన్ కమిషన్ ముందు హాజరై బ్రిటిష్ పరిపాలన కింద నాగాలను మినహాయించాలని మెమోరాండం ఇచ్చారు. దీంతోప్రారంభమైన నాగా ఉద్యమం 1956లో నాగాలాండ్ సార్వభౌమాధికారం డిమాండ్‌తో వెలుగులోకి వచ్చింది. నాగా నేషనలిస్ట్ కౌన్సిల్ నాగా ప్రజల స్వయం నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం కోసం హింసామార్గంలో ఉద్యమించారు. జాకోఫిజో నాయకత్వంలో మహానాగాలాండ్ దేశం ఏర్పాటు కోసం దశాబ్దాల పాటు ఉద్యమం జరిగింది.
1960లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, నాగాల మధ్య జరిగిన 16 అంశాల ఒప్పందం ఫలితంగా 1963, డిసెంబర్ 7న 13వ రాజ్యాంగ సవరణ చట్టం (1962) ప్రకారం అసోం రాష్ట్రం నుంచి నాగా ప్రాంతాన్ని వేరుచేసి నాగాలాండ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారు.
నాగాలాండ్ ఏర్పాటైనప్పటికీ, దాని చుట్టూ ఉన్న ఇతర రాష్ర్టాల్లో నాగాలు నివసించే ప్రాంతాలన్నింటినీ కలిపి మహా నాగాలాండ్ దేశాన్ని ఏర్పాటు చేయాలని జాకోఫిజో నాయకత్తంలో తీవ్రవాద కార్యకలాపాలు హింసా మార్గంలో కొనసాగాయి. ఈ తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో భాగంగా భారత ప్రభుత్వం అంతర్గత భద్రత నిర్వహణ చట్టం (Maintenance of Internal Security Act) రూపొందించి కఠినంగా వ్యవహరించింది. దీంతోపాటు 1975లో కేంద్ర ప్రభుత్వం నాగాల మధ్య షిల్లాంగ్ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా నాగా ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడంతోపాటు నాగాలాండ్ అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించి పాలనా వ్యవస్థలో వారికి భాగస్వామ్యాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ఇది పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ఫలితంగా కొత్తగా మరికొన్ని నాగా విముక్తి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1979లో భారత్ నుంచి విముక్తి అనే లక్ష్యంతో నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ పేరుతో ఒక తీవ్రవాద సంస్థ ఆవిర్భవించింది.
మహానాగాలాండ్ డిమాండ్ అనేది దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేవిధంగా ఉండటంతో భారత ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరించలేదు. నాగాలాండ్‌తో సహా మిగతా ఈశాన్య రాష్ర్టాల్లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమాలను, తీవ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్నది.
ఈశాన్య రాష్ర్టాల్లో వేర్పాటువాదాన్ని నిర్మూలించడంలో భాగంగా కొండ ప్రాంతాల స్వయంప్రతిపత్తి మండళ్లను ఏర్పాటు చేసింది.
ప్రాక్టీస్ బిట్స్
1. ఏ స్వయం ప్రతిపత్తి ఉద్యమం దేశసార్వభౌమత్వాన్ని ప్రశ్నించింది? (4)
1) ఖలిస్థాన్ ఉద్యమం 2) మహానాగాలాండ్
3) ద్రవిడియన్ 4) పైవన్నీ
2. ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణచివేసిన తీరు? (2)
1) ఆపరేషన్ పోలో 2) ఆపరేషన్ బ్లూస్టార్
3) ఆపరేషన్ ఖలిస్థాన్ 4) ఆపరేషన్ టెర్రర్
3. ఖలిస్థాన్ ఉద్యమంతో సంబంధం లేని అంశం? (3)
1) బింద్రన్‌వాలే మరణం
2) ఇందిరాగాంధీ మరణం
3) రాజీవ్‌గాంధీ మరణం
4) ఆపరేషన్ బ్లాక్ థండర్
4) నాగాలాండ్ సార్వభౌమాధికార డిమాండ్‌తో ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? (2)
1) 1950 2) 1956 3) 1960 4) 1966
5. బోడోలాండ్ ఉద్యమానికి కారణమైన అస్సాం ఒప్పందం ఎప్పుడు జరిగింది? (2)
1) 1990 2) 1991 3) 1992 4) 1993
6. దేశ ఖనిజ సంపదలో జార్ఖండ్ ప్రాంతం వాటా? (2)
1) 25 శాతం 2) 28 శాతం
3) 31 శాతం 4) 34 శాతం
7. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది? (2)
1) 19వ 2) 84వ 3) 88వ 4) 96వ
8. ద్రవిడ ఉద్యమ నాయకుడు? (1)
1) పెరియార్ 2) అన్నాదురై
3) కరుణానిధి 4) జయలలిత
9. కొంగునాడు ఉద్యమం ఏ రాష్ట్రంలో జరుగుతున్నది? (3)
1) కర్ణాటక 2) కేరళ
3) తమిళనాడు 4) తెలంగాణ
10. డార్జిలింగ్ గూర్ఖా కొండ ప్రాంత మండలికి ఎన్నో షెడ్యూల్ హోదాను కల్పించారు? (3)
1) 4వ 2) 5వ 3) 6వ 4) 7వ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు