టీఆర్ఎస్ పుట్టుకతో ఉవ్వెత్తున ఉద్యమం
ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ నిర్వహణ బాధ్యతనంతా తెలంగాణ మహాసభ పక్షాన వీ ప్రకాశ్ తన భుజాలపై వేసుకున్నారు. ఈ ర్యాలీకి వచ్చి ఎంతో ఉత్తేజాన్ని పొందిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇల్లు జలదృశ్యంను తెలంగాణ ఐక్యవేదికకు కార్యాలయంగా వాడుకోవడానికి ఇచ్చారు. అప్పటివరకు ఐక్యవేదిక కార్యాలయాన్ని కాచిగూడ లింగంపల్లి రోడ్డులో ఉన్న సుప్రభాత్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. ఈ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ పత్రికను వీ ప్రకాశ్, సామ జగన్‌రెడ్డి నడిపారు. 1997, నవంబర్ 1న గన్‌పార్క్ స్థూపం వద్ద కాళోజీ ఈ పత్రికను ఆవిష్కరించారు. ఐక్యవేదిక ఉద్యమాలతో పాటుగా సేవా కార్యక్రమాలను కూడా చేసింది. ఇది చేసిన సేవా కార్యక్రమాల్లో ముఖ్యమైనవి. తెలంగాణ ఐక్యవేదిక సభ్యులు స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 3 వేల చొప్పున అందించింది (1998-99).
-కరవు బారినపడిన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలోని రాయపూరు గ్రామాన్ని దత్తత తీసుకొని ఎండాకాలంలో 3 నెలల పాటు సీఈసీ గోపాల్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ సహకారంతో బియ్యం, గోధుమలు, జొన్నలు మొదలైనవాటిని గ్రామంలోని ప్రతి కుటుంబానికి పంపిణీచేసింది.
-1998 జూలైలో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వ్యాపించి వేలసంఖ్యలో మరణాలు సంభవించాయి. అయితే ప్రభుత్వం దాన్ని అతిసార వ్యాధిగా గుర్తించింది. అటువంటి సమయంలో తెలంగాణ ఐక్యవేదిక తరఫున నిజనిర్ధారణ సంఘం (బీఎన్ శంకర్, వీ ప్రకాశ్, మల్లెపల్లి లక్ష్మయ్య) వెళ్లి కలరాగా నిర్ధారించి 2,500 మంది మరణించారని తెలిపింది.
-బీ జనార్దన్‌రావు చొరవతో ఈ సమాఖ్య గురించి వాల్‌స్ట్రీట్ జర్నల్ (అమెరికా)లో కూడా ప్రచురితమైంది.
-ఆ వెంటనే ప్రభుత్వం స్పందించి పలు చర్యలు తీసుకొంది. అంతర్జాతీయ సంస్థ నుంచి కూడా సహాయం లభించింది.
-అయితే తెలంగాణ ఐక్యవేదిక అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయింది.
-దాంతో తెలంగాణ ఐక్యవేదిక నాయకులు ఒక జనాకర్షణగల నాయకుడు ఉంటే తెలంగాణవాదం ప్రజల్లోకి వెళ్తుందని భావించారు.
-అటువంటి సమయంలో రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడైన జనార్దనరెడ్డి (పీజేఆర్)కి ఐక్యవేదిక ఉద్యమ నాయకత్వాన్ని అప్పగించాలని చూసింది. అయితే దానికి అతను సుముఖత వ్యక్తం చేయలేదు.
-2000, ఆగస్టు 11న సోనియాగాంధీ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా పీజేఆర్ సలహామేరకు తెలంగాణ ఐక్యవేదిక సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఒక నివేదికను రూపొందించింది.
-ఈ నివేదికతో పాటు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 41 ఎమ్మెల్యేల్లో 38 మంది సంతకాలు సేకరించింది.
-వీటిని జీ చిన్నారెడ్డి, పాల్వాయి గోవర్ధన్రెడ్డిల నాయకత్వంలో సోనియాగాంధీకి అందజేసింది.
-ఐక్యవేదిక అందజేసిన ఈ రిపోర్టుకు సానుకూలంగా నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు.
-ఇదే సమయంలో తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు నాటి అధికార తెలుగుదేశం పార్టీ ఎడతెరిపిలేకుండా విద్యుత్ చార్జీలను పెంచుతూపోయింది.
-అటువంటి సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఇబ్బందులపై స్పందిస్తూ నాటి డిప్యూటీ స్పీకర్ కే చంద్రశేఖర్‌రావు పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.
-అప్పుడు తెలంగాణ ఐక్యవేదిక నాయకులు.. జయశంకర్ నాయకత్వంలో కేసీఆర్‌ను కలిసి తెలంగాణలో ఒక్క విద్యుత్ సమస్యేకాదు అనేక సమస్యలు ఉన్నాయని అందుకుగల కారణాలను సవివరంగా వివరించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా కోరారు.
-ఐక్యవేదిక కృషివల్ల కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం
-తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ తన మేధాపరమైన మద్దతునందించారు. ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసి, అసంతృప్తితో రగులుతున్న తెలంగాణ ప్రజలను రాష్ట్ర ఏర్పాటు దిశగా నడిపించింది.
-టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ప్రక్రియ అయిన ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజకీయ అవసరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైంది. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఒక చారిత్రక అవసరంగా భావిస్తారు.
టీఆర్ఎస్ ఏర్పాటు, నేపథ్యం
-1995లో చంద్రబాబు సీఎం అయిన తరువాత తెలంగాణ ప్రాంతంపై వివక్ష మరింత ఎక్కువైంది. ఆంధ్ర వలస దోపిడీ మరింతగా పెరిగింది.
-ఆర్థిక సరళీకృత విధానాలు, సంస్కరణల పేరుతో తెలంగాణలోని అనేక ప్రభుత్వరంగ పరిశ్రమలను నష్టాల సాకు చూపి మూసివేసింది.
-లాభాల్లో ఉన్న నిజాం షుగర్స్ వంటి పరిశ్రమలను ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకు నామమాత్రపు ధరకు అమ్మివేసింది.
-చంద్రబాబు అనుసరించిన ఇలాంటి విధానాల వలన వేలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. నక్సలైట్ల అణచివేత పేరుతో తెలంగాణ ప్రాంతం అంతటా ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధం కొనసాగించింది.
-ఎన్కౌంటర్ల పేరుతో నిరాయుధులైన వందలాదిమంది యువకులను పోలీసులు కాల్చిచంపారు.
-తెలంగాణలో నూటికి 70 శాతం రైతాంగం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల 1956 నుంచి ఆంధ్రపాలకులు అనుసరిస్తున్న దారుణమైన వివక్షను, నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగించింది.
-తెలంగాణలో 1956లో చెరువులు, కుంటల కింద సుమారు 11 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందగా 2001 నాటికి అది రెండున్నర లక్షల ఎకరాలకు పడిపోయింది.
-శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, మూసీ, కడెం వంటి భారీ ప్రాజెక్టుల కింద ఆంధ్రపాలకులు అనుసరించిన వివక్షవల్ల ఆశించిన ఆయకట్టుకు సాగునీరు అందలేదు.
-ఒక పక్కన వర్షాభావ పరిస్థితులు, మరో పక్క బోర్లు, బావుల్లో నీరు లేకపోవడం రైతులను సంక్షోభంలోకి నెట్టింది. అప్పుల భారం పెరిగిపోయి తెలంగాణవ్యాప్తంగా 1997-2000 మధ్యకాలంలో కొన్నివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
-దీంతో ఎంతో ఆవేదన చెందిన కేసీఆర్ 2000 సెప్టెంబర్ మొదటివారంలో చంద్రబాబుకు ఒక లేఖ రాస్తూ అందులో తెలంగాణ రైతుల దయనీయ పరిస్థితిని వివరించారు. ఈ కరెంట్ చార్జీల పెంపువలన తెలంగాణ రైతుల ఉన్న గోచీ కూడా ఊడిపోతుందని లేఖలో ప్రస్తావించారు.
-అంతేకాకుండా అంతకుముందే చంద్రబాబు ఆధ్వర్యంలో తయారైన విజన్ 2020 డాక్యుమెంట్‌లోని అంశాలు నచ్చని కేసీఆర్ దానిపై వ్యాఖ్యానిస్తూ హరిజనులు, గిరిజనులు, వెనుకబడినవర్గాలు, మైనారిటీల ప్రసక్తిలేని పత్రం ఇదేం పత్రం, ఇందులో తెలంగాణ అభివృద్ధిని గురించి అసలు ప్రస్తావించలేదెందుకని ప్రశ్నించారు.
-కేసీఆర్ ఆలోచనలు తెలంగాణవైపు అడుగులు వేస్తున్నాయని పసిగట్టిన అనేక మంది కేసీఆర్‌ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి చర్చించడం ప్రారంభించారు.
-ఈ సందర్భంలోనే 1969లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినవారిలో ఒకరైన సంతపురి రాఘవరావు 2000, సెప్టెంబర్‌లో కేసీఆర్‌ను కలిసి తెలంగాణ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించారు.
-2000 అక్టోబర్‌లో ప్రొ. జయశంకర్, కేసీఆర్‌ల మధ్య జరిగిన చర్చలో తెలంగాణ కోసం ఎంతోమంది నాయకులతో కలిసి పనిచేశాను. కానీ మీతో మాట్లాడిన తరువాత మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం నాలో కలుగుతుందని అన్నారు.
-సుమారు 7 నెలలు ప్రతిరోజూ తెలంగాణవాదులతో చర్చలు జరిపి, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి వివరంగా తెలుసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
-పార్టీ ఆవిర్భావానికంటే ముందే తెలంగాణవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, తెలుగుదేశం పార్టీలోని తన సహచరులను, ప్రముఖ కాంగ్రెస్ నాయకులను ఎంతోమందిని కలిసి ఉద్యమంలోకి ఆహ్వానించారు.
-తెలంగాణ ఐక్యవేదికకు కార్యాలయంగా ఉన్న జలదృశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి ఇవ్వడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అనుమతించారు.
-2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జలదృశ్యంలో జరిగింది.
-పార్టీ జెండాగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మ్యాపుగల గులాబీ రంగు జెండాను నిర్ణయించారు. పార్టీ ఏర్పాటును సంతోషంగా ఆహ్వానించిన తెలంగాణ ప్రజలు కేవలం తొమ్మిది రోజుల్లోనే 19 లక్షల మంది సభ్యులుగా చేరారు.
సింహగర్జన సభ
-గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటూ కేసీఆర్ 2001, మే 17న కరీంనగర్లో సింహగర్జన సభను ఏర్పాటుచేశారు.
-ఈ సభను సక్సెస్ చేయడంపై తెలంగాణ ఉద్యమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే లక్షలాదిమంది ప్రజలు సభకు తరలివచ్చి విజయవంతం చేశారు.
-2001, మే 17న ఉదయం 10 గంటలకు జలదృశ్యం నుంచి సుమారు 200 వాహనాల్లో ఎందరో న్యాయవాదులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో కరీంనగర్ సభకు వెళ్లారు.
-సిద్దిపేట దాటేసరికి వాహనాల సంఖ్య సుమారు 2 వేలు దాటింది. దారి పొడవునా గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు కాన్వాయ్‌ని ఆపి కేసీఆర్, జయశంకర్లకు తిలకం దిద్ది, మంగళహారతులు పట్టారు.
-జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. హైదరాబాద్‌లో బయలుదేరిన ఈ కార్ల ర్యాలీ సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకుంది.
-కేసీఆర్ సభాస్థలికి చేరేసరికి ఆ మైదానమంతా జనంతో నిండిపోవడమే కాక రోడ్లపై, పక్కనున్న భవనాలపై వేలసంఖ్యలో జనం ఉన్నారు.
-ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, ఎంపీ శిబూసోరెన్ అనూహ్యమైన ప్రజల స్పందనను చూసి ఎంతో ఆశ్చర్యపోయి తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా పునరుద్ధరిస్తున్నారని కేసీఆర్‌ను అభినందించారు.
-రాత్రి 7 గంటలకు ప్రారంభమైన సభ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. ప్రొ. జయశంకర్‌కు పాదాభివందనం చేసిన కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
-ఈ సభలో కేసీఆర్ తెలంగాణ రైతులు, చేనేత కార్మికుల కడగండ్లను, పెరుగుతున్న ఆత్మహత్యలను, మూసివేసిన ఫ్యాక్టరీలు, ఉద్యోగ నియామకాల గురించి, ప్రభుత్వం సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణితో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఆధారాలతో సహా వివరించారు.
-ఇంకా రామగుండంలో ఉన్న ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రప్రభుత్వం మూసివేయడానికి ఒప్పుకుంటూ, డీలాపడిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని మూయకుండా ఉంచడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాల గురించి కేసీఆర్ తెలంగాణ పల్లె ప్రజలకు అర్థమయ్యే భాషలో సామెతలతో ప్రసంగించారు.
-జనంలో నుంచి కొందరు యువకులు చేతిలో ఒక ప్రముఖ దినపత్రిక కాపీలను కేసీఆర్‌కు చూపుతూ ఈ పత్రిక తెలంగాణకు వ్యతిరేకంగా రాస్తున్నది, ఏం చేయమంటారు అని ప్రశ్నించారు.
-దీనికి బదులుగా కేసీఆర్ ఇష్టంలేకపోతే ఆ పత్రికను చదవడం మానేయమని జవాబు ఇచ్చారు. ఈ విధంగా కేసీఆర్ తొలిరోజు నుంచే హింసకు, విధ్వంసాలకు, విద్వేషాలకు తావులేని విధంగా ఉద్యమానికి రూపకల్పన చేశారు.
-అంతకుముందు ఈ సభలో ప్రసంగించిన ప్రొ. జయశంకర్ సమైక్య రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.
-రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు సుమారు 5 గంటలు ప్రదర్శించిన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిన గీతాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి.
-ఈ విధంగా మొదటి సభ విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీ 2001, జూన్ 1న పాలమూరులో, 2న నల్లగొండలో, 4న నిజామాబాద్‌లో, 5న నిర్మల్‌లో, 21న వరంగల్‌లో భారీ సభలను నిర్వహించింది. ఈ సభలకు అంచనాలకు మించి జనం హాజరయ్యారు.
-అన్ని సభల్లోనూ కేసీఆర్‌ది ఒకటే మాట. ఆంధ్రుల దోపిడీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని, తాను ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలని ఎలుగెత్తి చాటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు