సకల జనుల ఉద్యమం.. స్వరాష్ట్ర నినాదం
- 14 ఫిబ్రవరి తరువాయి
1969 తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు
- కె.ఆర్. అమోస్ ఆధ్వర్యంలోని టీఎన్జీవో యూనియన్ 1968 జూలై 10న తెలంగాణ హామీల దినం నిర్వహించింది.
- 1968 వేసవి కాలంలో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ అనే పేరుతో సుమారు 20 మంది ఇల్లెందు యువకులతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. రామదాసు అధ్యక్షుడిగా, ముత్యం వెంకన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
- ఖమ్మంలోని గాంధీచౌక్‌లో 1969 జనవరి 8న తెలంగాణ రక్షణల అమలు కోసం
దీక్ష ప్రారంభించారు. - కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లోని నాన్ ముల్కీలను తొలగించాలనే డిమాండ్‌తో పోటు కృష్ణమూర్తి 1969 జనవరి 10న పాల్వంచలో ఆమరణ నిరాహార
దీక్ష ప్రారంభించారు. - తెలంగాణ రక్షణల అమలు కోసం చర్చించడానికి 1969 జనవరి 19న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
- తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ పిలుపు మేరకు 1969 మార్చి 17న తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్ జరిగింది.
- తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్‌ను 1969 మార్చి 25న తెలంగాణ ప్రజా సమితిగా మార్చారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితికి కూడా మదన్మోహన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మేడ్చల్ పంచాయతీ సమితి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు ఎస్.వెంకట్రామ్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 17 మందితో అడ్‌హక్ కమిటీ ఏర్పడింది.
- ప్రధాని ఇందిరాగాంధీ ఏప్రిల్ 11న లోక్‌సభలో తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు.
- 1969 ఏప్రిల్ 22న తెలంగాణ వంచన దినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రుల దిష్టిబొమ్మల దహనం, నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛందంగా ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. దాదాపు అన్ని జిల్లాల్లో అరెస్టులు, లాఠీఛార్జీలు జరిగాయి. వరంగల్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
- 1969 మే 1న కోర్కెల దినంగా నిర్వహించాలని తెలంగాణ ప్రజా సమితి పిలుపునిచ్చింది.
- 1969 మే 22న తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలను డా.చెన్నారెడ్డి స్వీకరించారు. 1969 జూన్ 17న తెలంగాణ మహిళా దినం నిర్వహించారు.
- తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ కోర్కెలను బుట్టదాఖలు చేస్తున్నందుకు నిరసనగా ఉపాధ్యాయ దినమైన సెప్టెంబర్ 5ను ‘ఉపాధ్యాయుల దుర్దశ దినం’గా
జరుపుకోవాలని తెలంగాణ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల గిల్డ్ వారు నిర్ణయించారు. - ఆర్టికల్ 371-క్లాజ్-డి ద్వారా లభించిన అధికారం ప్రకారం భారత రాష్ట్రపతి 1975 అక్టోబర్ 18న ‘ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్
రిక్రూట్మెంట్) ఆర్డర్ 1975ను భారత ప్రభుత్వ నోటిఫికేషన్ నంబర్ జీఎస్ఆర్ 524(ఇ) రాష్ట్రపతి జారీ చేశారు. దీన్నే ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 674ను 1975 అక్టోబర్ 20న జారీ చేసింది. - 1985 డిసెంబర్ 30న జీవో 610 జారీ అయ్యి 1986 మార్చి 31 నాటికి అమలు కావాలని ఆదేశించారు.
- 2009 అక్టోబర్ 9: రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ద్వారా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ నిబంధనను అనుసరించి పోలీస్ అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్ నగరాన్ని 6వ జోన్లో భాగంగా పరిగణించకుండా ఫ్రీ జోన్‌గా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు.
- 2009 అక్టోబర్ 21: సిద్దిపేటలో తెలంగాణ ఉద్యోగ గర్జన, 14 ఎఫ్ తొలగింపు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్, ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని మొదటిసారి కేసీఆర్ ఈ సభలోనే అన్నారు.
- 2009 నవంబర్ 29: సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి రంగధాంపల్లి (సిద్దిపేట) నిరాహార దీక్ష స్థలికి వస్తుండగా అలుగునూరు దగ్గర పోలీసులు కారును అడ్డుకుని ప్రొ.జయశంకర్‌ను కారులో నుంచి దింపి కేసీఆర్, నాయిని నరసింహారెడ్డి, డా.జి. విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజయ్య యాదవ్‌లను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అప్పుడు కేసు పెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఆయనను ఖమ్మం జైలుకు తీసుకెళ్లారు. జైల్లోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
- 2009 డిసెంబర్ 7: నాటి ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ దీక్షపై అఖిలపక్ష సమావేశంలో ఎంఐఎం మినహా కాంగ్రెస్, బీజేపీ, పీఆర్పీ, సీపీఐ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించాయి.
- 2009 డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించగా కేసీఆర్ దీక్ష విరమించారు.
- 2009 డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తూ అన్ని రాజకీయ పార్టీలతో, గ్రూపులతో తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటుందని చిదంబరం ప్రకటించారు. ప్రకటన అనంతరం ప్రొ.జయశంకర్‌ను వెంటబెట్టుకుని జానారెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి సారథ్యం వహించాల్సిందిగా కేసీఆర్, జానారెడ్డి ప్రొ.జయశంకర్‌ను కోరారు. ఆ ప్రతిపాదనను సున్నితంగా నిరాకరిస్తూ ప్రొ.కోదండరాం పేరును సూచించారు.
- డిసెంబర్ 24: బంజారాహిల్స్‌లోని కళింగ ఫంక్షన్‌హాలులో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుపై సమావేశమయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ. ప్రజారాజ్యం, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు, శాసన సభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు
హాజరయ్యారు. - 2010 ఫిబ్రవరి 3: సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి.ఎన్. శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- 2010 డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై నివేదికను సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ, సీల్డు కవరులో నివేదికలోని 8వ అధ్యాయాన్ని చిదంబరానికి అందించారు.
- 2011 జనవరి 6: అఖిలపక్ష సమావేశాన్ని చిదంబరం నిర్వహించారు. ఈ సమావేశాన్ని టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ పార్టీలు బహిష్కరించాయి. హాజరైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, పీఆర్పీ, మజ్లిస్ పార్టీలకు శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందజేశారు. ఇందిరాపార్క్ వద్ద ఐకాస ధర్నాకు కేసీఆర్ హాజరయ్యారు.
- 2011 జనవరి 17: తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని రహదారులపై జిల్లా కేంద్రాల్లో ఐకాస రాస్తారోకోల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.
- 2011-మార్చి 1: తెలంగాణలో ‘పల్లె పల్లె పట్టాలపైకి’ కార్యక్రమం నిర్వహించగా ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్‌రోకో కార్యక్రమం విజయవంతమైంది.
- 2011 మార్చి 10: ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ విజయవంతమైంది. ఆంధ్రపెద్దల విగ్రహాలను తెలంగాణ ఉద్యమకారులు కూల్చివేశారు. పోతన విగ్రహం వద్ద కేసీఆర్, కోదండరామ్ ప్రసంగాలు, నాయకులు వెళ్లిపోగానే కార్యకర్తలపై, కళాకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. తెలంగాణ గాయకుడు నేర్నాల కిశోర్‌తో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్, కోదండరాం, హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు వందలాది మందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి.
- 2011 జూన్ 19: వంటావార్పు కార్యక్రమంలో భాగంగా ‘పట్నం రోడ్లపై పొయ్యి పెడదాం’, ‘రాజధానిలో వంట.. ఢిల్లీలో మంట’ అనే నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
- 2011 సెప్టెంబర్ 13: సకలం బంద్, సమ్మె ఆరంభం
- 2011 సెప్టెంబర్ 18: సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పాల్గొనడంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్.
- 2012 జనవరి 19: అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యలో ‘తెలంగాణ పోరు యాత్ర’ ప్రారంభం.
- 2012 ఫిబ్రవరి 9: 22 రోజుల పాటు సాగిన కిషన్‌రెడ్డి తెలంగాణ పోరు యాత్ర 8 జిల్లాల గుండా 88 నియోజకవర్గాల మీదుగా సాగి భద్రాచలంలో ముగిసింది.
- 2013 జనవరి 27: ఇందిరాపార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం 36 గంటల సమర దీక్ష కార్యక్రమాన్ని భారీ నిరసనలతో నిర్వహించారు.
- 2013 మార్చి 21: టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు జాతీయ రహదారి (44)పై భారీ నిరసన కార్యక్రమం ద్వారా బంద్‌ను నిర్వహించి, వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రవాణా స్తంభించిపోయింది.
- 2013 ఏప్రిల్ 29: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల పాటు నిర్వహించే సత్యాగ్రహ దీక్ష జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
- దీక్ష ముగింపు సమయంలో తెలంగాణ వాదులు కొందరు పార్లమెంట్ వైపు దూసుకెళ్లగా మరికొందరు కాంగ్రెస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు.
- 2013 జూన్ 14: టీజేఏసీ పిలుపు ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, బాష్పవాయువు గోళాలు ప్రయోగించడంతో అసెంబ్లీ ప్రాంగణమంతా రణరంగమైంది. ఈ కార్యక్రమంలో 47 మంది ఎమ్మెల్యేలను, 14 మంది ఎమ్మెల్సీలను, ఓ ఎంపీని అరెస్ట్ చేయగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, విద్యాసాగర్‌రావు అసెంబ్లీపైకి ఎక్కి నల్లజెండాలతో నిరసన తెలిపారు.
- 2013 జూలై 30: తెలంగాణ ఏర్పాటు కోసం యూపీఏ, సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
- 2013 సెప్టెంబర్ 29: నిజాం కళాశాలలో టీజేఏసీ ఆధ్వర్యంలో లక్షల మందితో నిర్వహించిన సకల జనభేరి భారీ బహిరంగ సభ విజయవంతమైంది.
జీబీకే పబ్లికేషన్స్ హైదరాబాద్, 8187826293
- Tags
Previous article
Top Universities and Cities in Canada
Next article
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2022 థీమ్ ఏమిటి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు