కర్ణాటక అంతర్యుద్ధాలు – ఆంగ్లేయులతో ఒప్పందాలు
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన విశాలమైనది హైదరాబాద్ రాజ్యం. 1724లో ముబారిజ్ ఖాన్‌ను షఖర్ఖేడా యుద్ధంలో ఓడించి ఈ రాజ్యంలో స్వతంత్రపాలనను ఏర్పాటు చేశాడు. 1724లో కమ్రుద్దీన్ ఖాన్‌తో ప్రారంభమైన నిజాం పాలన 1948లో మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో ముగిసింది.
తెలంగాణ చరిత్ర
- కుతుబ్‌షాహీల అనంతరం 1687 నుంచి 1724 వరకు హైదరాబాద్ రాష్ట్రం మొగలుల పరిపాలనలో ఉండేది. అనంతరం కృష్ణ్ణా గోదావరి నదుల మధ్య ఉన్న విశాల దక్కన్ ప్రాంతం అసఫ్‌జాహీల ఆధీనంలోకి వెళ్లింది. అసఫ్‌జాహీ వంశ స్థాపకుడు కమ్రుద్దీన్ ఖాన్ (నిజాం ఉల్ ముల్క్) 1688లో తన 17వ ఏట తండ్రికి తోడుగా ఆదోని దుర్గం ముట్టడిలో దాన్ని చేపట్టడంలో విజయం సాధించాడు. మొదటి ప్రయత్నంలో అతను చూపించిన ప్రతాపానికి మెచ్చిన ఔరంగజేబ్ ఖాన్ అనే బిరుదునిచ్చాడు. 1693లో పన్హాలను ఆకమించిన మరాఠాలపై దాడికి వెళ్లి వారిని తరిమికొట్టాడు. అందుకు ‘చిన్ఖిలిచ్ఖాన్’ అనే బిరుదు ఇచ్చాడు. తర్వాత కాలంలో జరిగిన అనేక దండయాత్రల్లో విజయం సాధించడంతో అతన్ని 5000/ 5000 మున్సబ్ దారిగా నియమితులయ్యాడు. ఔరంగజేబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అతని మరణానంతరం వారి కుమారుల వారసత్వ తగాదాలను తగ్గించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే దక్కన్ సుబేదారుగా నియమించబడ్డాడు. నాదిర్షా దండ యాత్రలో మొగల్ సైన్యం నాదిర్షా సైన్యం ముందు నిలువలేకపోయింది. దాంతో నిజాం ఉల్‌ముల్క్ నాదిర్షాతో మధ్యవర్తిత్వం నెరిపి రక్తపాతాన్ని ఆపాడు. నెమ్మదిగా దక్కన్లో తనస్థానాన్ని స్థిరపరచుకున్నాడు. 1724 షఖర్ఖేడా యుద్ధం కంటే ముందే దక్కన్లో అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
- మరాఠాలు చౌత్ సర్దేశ్ముఖి పన్నులను చెల్లించడానికి నిరాకరించడంతో 1727, 1729లో రెండు సార్లు మహారాష్ర్టులతో తలపడాల్సి వచ్చింది. 1728లో భోపాల్ యుద్ధంలో నిజాం ఓడిపోయాడు. దక్కన్లో ఒకవైపు మరాఠాలు, మరోవైపు యురోపియన్ల వల్ల నిజాం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నిజాం మరణానంతరం వారసత్వ తగాదాలు, యూరోపియన్ల జోక్యంతో నిజాం రాజ్యం కొంత ఒడిదొడుకులకు లోనైంది.
- మొదటి నిజాం మీర్ కుమ్రుద్దీన్ కాలంలో కర్ణాటక పరిస్థితులు ప్రశాంతంగా లేవు. కర్ణాటక దక్కన్ సుబేదారుగా ఉన్న నిజాం ఉల్‌ముల్క్ ఆధీనంలో ఉండేది. నాటి కర్ణాటక నవాబు సాదతుల్లాఖాన్కు సంతానం లేకపోవడంతో మేనల్లుడ్లు దోస్త్ అలీఖాన్, బాకర్ అలీలను దత్తత తీసుకున్నాడు. నిజాంతో సంబంధం లేకుండా సాదతుల్లాఖాన్ చక్రవర్తి నుంచి దోస్త్ అలీఖాన్‌కు వారసత్వాన్ని మంజూరు చేయించుకున్నాడు. దోస్త్ అలీఖాన్ కర్ణాటక సింహాసనం అధిష్ఠించిన అనంతరం దక్కన్ సుబేదారుకు చెల్లించాల్సిన కప్పం మానేశాడు. ఇంతలో రఘోజీ భోంస్లే, ఫతేసింగ్ల నాయకత్వంలో 1740లో చౌత్ పన్నులను వసూలు చేయడానికి కర్ణాటక వెళి రాజధాని ఆర్కాట్‌ను ముట్టడించారు. ఆర్కాట్ రాజ్య రక్షణలో భాగంగా దోస్త్ అలీఖాన్ దామెర్ల చెరువు వద్ద ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత కాలంలో అంతర్గత తగాదాలతో అస్తవ్యస్తమైన కర్ణాటక పరిస్థితులను నిజాం చక్కదిద్దాడు.
కర్ణాటక యుద్ధాలు
- దక్షిణ భారతదేశ రాజకీయాలను సమూలం గా మార్చిన యుద్ధాలుగా మూడు కర్ణాటక యుద్ధాలను ప్రధానంగా చెప్పవచ్చు. ఈ యుద్ధాలకు అనేక కారణాలు దోహదం చేశాయి. అందులో ముఖ్యమైనవి.
1) ఫ్రెంచ్, ఇంగ్లండ్ కంపెనీల మధ్య వ్యాపార పోటీ. రెండు కంపెనీలు భారతీయ వ్యాపారంలో గుత్తాధిపత్యం సంపాదించడానికి ప్రయత్నించే క్రమంలో వారి మధ్య యుద్ధాలు అనివార్యమయ్యాయి.
2) దక్షిణ భారతదేశంలో వ్యాపారాధిపత్యానికి ఇరు కంపెనీలు ప్రయత్నించడం.
3) ఇంగ్లిష్వారిని భారతదేశం నుంచి పంపించాలనే ప్రధాన ధ్యేయంతో ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ ప్రయత్నించడం.
4) మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఇందులో ఇంగ్లండ్, ఫ్రెంచ్ రెండు దేశాలు చెరోపక్షం చేరి యుద్ధంలో పాల్గొనడం వల్ల భారత దేశంలో ఇరు కంపెనీల మధ్య మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. - మొదటి కర్ణాటక యుద్ధం వల్ల అన్వరుద్దీన్ అసమర్థత, నవాబు సైనిక బలం స్పష్టంగా యూరోపియన్ కంపెనీలకు తెలిసిపోయాయి. స్థిర నౌకాదళసైన్యం లేకపోవడం, అధునాతన ఆయుధాలు సమకూర్చుకోలేకపోవడం, వ్యూహాలు లేకపోవడం వంటి కారణాలతో అన్వరుద్దీన్ సైన్యం ఓటమిపాలైంది. ఈ యుద్ధం వల్ల నిజాం, మొఘల్ రాజుల చరిష్మా తగ్గిపోయింది. బ్రిటిష్‌వారికి ఈ యుద్ధం ఒక గుణపాఠం నేర్పింది.
- రెండో కర్ణాటక యుద్ధం స్థానిక రాజుల మధ్య ప్రారంభమైన వారసత్వ తగాద. అన్వరుద్దీన్, చందాసాహెబ్ల మధ్య వారసత్వ తగాదతో ప్రారంభమైంది. దోస్త్ అలీకి మొగలాయి చక్రవర్తి నుంచి వంశపారంపర్యహక్కులు లభించాయి. మహారాష్ట్ర దాడుల వల్ల దోస్త్ అలీ మరణించగా చందా సాహెబ్‌ను బంధించి సతారా జైలులో ఉంచారు. దక్కన్ సుబేదారు నిజాం ఉల్-ముల్క్ మరణించడంతో చందా సాహెబ్‌ను మహారాష్ర్టులు విడుదల చేశారు. కర్ణాటక చేరి కర్ణాటక నవాబుగా ప్రకటించుకోవడంతో అతడిని ప్రతిఘటించడానికి అన్వరుద్దీన్ ప్రయత్నించాడు.
- ఫ్రెంచి వారు చందాసాహెబ్ కర్ణాటక నవాబుగా, ముజఫర్‌జంగ్‌ను దక్కన్ సుబేదారు గా గుర్తించారు. 1749లో చందాసాహెబ్, ముజఫర్‌జంగ్, డ్లూప్లెక్స్ సైన్యాలు యుద్ధం ప్రారంభించాయి. వీరిని ప్రతిఘటించడానికి అన్వరుద్దీన్ ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు సరికదా అన్వరుద్దీన్ కూడా మరణించాడు. ఈ యుద్ధాన్ని అంబూర్ యుద్ధం అంటారు.
బొబ్బిలి యుద్ధం
- దక్కన్లో ఫ్రెంచి వారి అధికారాన్ని వ్యతిరేకిస్తూ వివిధ ప్రాంతాల్లో జమీందారులు తిరుగుబాటు చేశారు. అయితే వీరిలో ఒక్క విజయరామరాజు మాత్రమే ఫ్రెంచివారికి సహాయం చేశాడు. సర్కార్ ప్రాంతంలో పరిస్థితులను చక్కదిద్దడానికి బుస్సీ హైదారాబాద్ నుంచి బయలుదేరాడు. బుస్సీ రాకను తెలుసుకున్న ఇబ్రహీంఖాన్ బొబ్బిలి రాజు వద్దకు పారిపోయాడు. బుస్సీ దగ్గరకు విజయరామరాజు రాకపోవడంతో విజయరామరాజు బొబ్బిలిరాజుకు వ్యతిరేకంగా ఫ్రెంచివారిని రెచ్చగొట్టడం, తదనానంతరం జరిగిన పరిణామాలతో 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది.
మూడో కర్ణాటక యుద్ధం:
- ఫ్రెంచ్, ఇంగ్లండ్ మధ్య మళ్లీ వివాదం ఆరంభమైంది. ఈ రెండు దేశాలు సప్తవర్ష సంగ్రామంలో చెరోపక్షంలో చేరాయి. దాంతో కర్ణాటకలో రాజకీయవాతావరణం వేడెక్కింది. 1758లో మూడో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది.
నిజాం బ్రిటిష్ సంబంధాలు
- సలబత్ జంగ్ క్రీ.శ. 1751-1762) దక్కన్ సుబేదారుగా ఉన్న కాలంలో ఫ్రెంచ్రాజు ప్రాబల్యం పెరిగింది. వారికి ఉత్తర సర్కారులు లభించాయి నిజాం ఆరో కుమారుడు నిజాం అలీఖాన్‌కు ఫ్రెంచివారి పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని నిరసించాడు. దాంతో అలీఖాన్‌ను సలబత్ జంగ్‌ను బందించి దౌలత్కోటలో బందీలుగా ఉంచారు. తర్వాత మహారాష్ర్టుల దాడులు పెరగడంతో తమ్ముడితో రాజీకుదుర్చుకొని బందీ నుంచి విడిపించి 1757లో బీరార్ సుబేదారుగా నియమించాడు. బందీ నుంచి విడుదలైన తర్వాత 1757, 1759లో రెండవసారి పోరాడి ఓటమిపాలయ్యాడు 1757లో సింధ్‌ఖేడ్ వద్ద పీష్వాతో ఒప్పందం చేసుకొని మొదటి సారిధరార్కోటను, 25 లక్షల రూపాయలను కప్పంగా మహారాష్ర్టులకు చెల్లించాడు. 1759లో అహ్మద్‌నగర్, దౌలతాబాద్, బుర్హాన్పూర్, బీజాపూర్లను మహారాష్ర్టులు స్వాధీనం చేసుకున్నారు.
- 1761లో మూడోపానిపట్టు యుద్ధంలో అహ్మద్‌షా అబ్దాలీవల్ల ఓడిపోయిన పీష్వా బాజీరావు ఓటమి తట్టుకోలేక మరణించాడు. అదే అదనుగా భావించిన నిజాం అలీఖాన్ పూనాపై దండెత్తాడు. ఆ నగరాన్ని ధ్వంసం చేశాడు. 1762లో పీష్వా మాదవరావు 27 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే ప్రాంతాలను నిజాంకు అప్పగించి సంధి చేసుకున్నాడు.
- నిజాం అలీ 1762 పాలన చేపట్టడంతో అనేక సమస్యలు పరిష్కరించాల్సి వచ్చింది. ఉత్తర సర్కారుల్లో పరిస్థితి దిగజారింది. ఏలూరు, రాజమండ్రి, ముసఫానగర్లకు హుస్సేన్ అలీఖాన్‌ను ఫౌజ్‌దారుగా నియమించాడు. చీరాకోల్ (శ్రీకాకుళం) సర్కార్ ఆదాయాలను వసూలు చేసే బాధ్యతను విజయనగరం రాజుకు అప్పగించారు. ఈ ఏర్పాట్లు ఆంగ్లేయులకు కలవరం పుట్టించాయి. మహారాష్ట్రతో యుద్ధంలో ఆంగ్లేయులు సహాయం చేయలేదనే కోపంతో నిజాం అలీఖాన్ కఠినంగా వ్యవహరించాడు. దీంతో ఆంగ్లేయులు నిజాం అలీఖాన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఉత్తర సర్కారుల్లో పేరుమోసిన దుబాసి కాండ్రీంగుల జోగిపంతులు సంప్రదింపులు జరిపి 9 లక్షలకు 5 ఉత్తర సర్కారులను కంపెనీ వశం చేయడానికి నిజాంను ఒప్పించాడు.
- ముర్తిజానగర్ (గుంటూరు) ఆంగ్లేయులతో సంధిచేసుకోకపూర్వమే నిజాం తమ్ముడైన బసాలత్జంగ్ ఆధీనంలో ఉంది. నిజాంకు వ్యతిరేకంగా బసాలత్జంగ్ ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకొన్నాడు. దాంతో ఆగ్రహించిన నిజాం బ్రిటిష్‌వారికి లేఖరాశాడు. దాంతో తిరిగి గుంటూరును నిజాం అలీకి ఇస్తున్నట్లు తెలియజేశారు. కానీ బసాలత్ జంగ్ మరణానంతరం కారన్ వాలీస్ చర్చల ఫలితంగా గుంటూరును 1788 సెప్టెంబర్ 8న ఆంగ్లేయులకు నిజాం అలీ అప్పగించాడు.
త్రైపాక్షిక సంధి
- దక్కన్లో రోజురోజుకు ఆంగ్లేయుల అజమాయిషి పెరిగిపోసాగింది, 1782 రెండో మైసూర్ యుద్ధంలో హైదర్అలీ మరణించడంతో అతని కుమారుడు టిప్పుసుల్తాన్ మైసూర్ పాలకుడిగా సింహాసనం అధిష్ఠించాడు. 1784లో ఆంగ్లేయులతో మంగుళూరు సంధి చేసుకున్నాడు. టిప్పు సుల్తాన్‌ను ఓడించాలంటే నిజాం అలీ సహాయం అవసరమని భావించిన ఆంగ్లేయులు అందుకు నిజాం అలీని ఒప్పించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అటు మహారాష్ర్టులను ఒప్పించి వారితో కూడా సంధిచేసుకున్నారు. 1790లో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు.వీరు ముగ్గురు మైసూర్‌పై యుద్ధం ప్రకటించారు. దీన్నే మూడో మైసూర్ యుద్ధం అంటారు.
- మూడవ మైసూరు యుద్ధానంతరం తిరిగి మహారాష్ట్ర నిజాం రాజ్యాల మధ్య సంబధాలు మళ్లీ మొదటికి వచ్చాయి. మహారాష్ర్టులు తమ ప్రాంతాల్లో చౌత్ సర్దేష్ ముఖి పన్నుల వసూలును తీవ్రంగా వ్యతిరేకించారు. పన్నులు చెల్లించాలని నిజాంకి పీష్వా మంత్రి నానఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశాడు. 1795లో వీరిద్దరికీ మధ్య భీకర పోరు జరిగింది. నిజాం ఓటమిపాలయ్యాడు. రూ. 34,50,000 వార్షిక ఆదాయం వచ్చే ప్రాంతాలను మూడు కోట్లరూపాయలను నష్టపరిహారంగా చెల్లించాడు.
సైన్య సహకార ఒడంబడిక
- టిప్పు సుల్తాన్‌ను అణిచివేయాలంటే నిజాం మద్దతు చాలా అవసరమని నాటి ఆంగ్లేయ గవర్నర్ జనరల్ అభిప్రాయపడి నాజంతో 1798లో నిజాంతో రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు. దీన్నే సైన్య సహకార ఒడంబడిక అంటారు. ఆరు సైనిక పటాలను సమకూర్చుకుంటారు. ఈ సైనిక పటాలానికి అయ్యే ఖర్చు కింద ఏటా 24, 17,100 రూపాయలను నిజాం చెల్లించాలి.
నాలుగో మైసూరు యుద్ధం
- భారత గవర్నర్ జనరల్‌గా వచ్చిన వెల్లస్లీ 1799లో టిప్పుసుల్తాన్‌పై నాల్గో మైసూర్ యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో నిజాం అలీ బ్రిటిష్ వారి పక్షాన చేతులు కలిపాడు. టిప్పు సుల్తాన్ చివరి వరకు పోరాడి ఈ యుద్ధంలో మరణించాడు.
దత్త మండలాలు
- బ్రిటిష్‌వారు నిజాంతో స్నేహ సంబంధాలను మరింత పటిష్టపరచుకోవడానికి 1800లో ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం సహకార సైన్యదళాల సంఖ్యను కంపెనీ పెంచింది. యుద్ధసామగ్రి తుపాకులు, ఫిరంగులు పెరిగాయి. 1792 లో శ్రీరంగపట్నం, 1799 మైసూరు ఒప్పందం ద్వారా సంపాదించిన ప్రాంతాలను ఆంగ్లేయులకు శాశ్వతంగా అప్పగించాడు.
- ఆంగ్లేయులు హైదరాబాద్ రాజ్యాన్ని తమ సైనిక అవసరాల కోసం పూర్తిగా వినియోగించుకున్నారు. 1766 నుంచి 1853 వరకు వివిధ ఒప్పందాల మూలంగా అమూల్యమైన భూములు, ఖనిజ వనరులు గల ప్రాంతాలను స్వాధీనం చేసుకొన్నారు. ఉత్తర సర్కారులు, దత్త మండలాలు, బీరార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఆర్థికంగా బలపడ్డారు. మీర్ ఆలం, చందూలాల్ వంటి ఉద్యోగుల వల్ల ఆంగ్లేయుల కుట్రల వల్ల నిజాం తన ప్రాభవాన్ని కోల్పోవలసి వచ్చింది. రస్సెల్‌ల, జాన్లాల వల్ల తీవ్ర ఇబ్బందులను హైదరాబాద్ రాజ్యం ఎదుక్కొంది. మహారాష్ట్ర, మైసూర్ యుద్ధాల వల్ల నిజాం రాజ్యం నిరంతరం శ్రమించాల్సి వచ్చింది. 1853 నుంచి ఆధునికతవైపు హైదరాబాద్ రాజ్యం పయనించింది.
Previous article
దేహంలో యూరియాను సంశ్లేషించే భాగం?
Next article
భూ పటలంలో ఎక్కువగా లభించే మూలకం ఏది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు