తెలంగాణ సాయుధ పోరాటం
– తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో ఒక మరిచిపోలేని ఘట్టంగా పేర్కొనవచ్చు. ఈ పోరాటం 1946లో ప్రారంభమై 1951, అక్టోబర్ 21న ముగిసింది. ఐదేండ్లు నిరాటంకంగా సాగిన ఈ పోరాటంలో దాదాపు 4000 మంది మరణించారు.
– తెలంగాణ ఆంధ్ర మహాసభ, భారత కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పోరాటాన్ని నిర్వహించాయి. నాటి తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల్లో వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలించడం, దున్నేవాడికి భూమి ఉండాలనే నినాదంతో పోరాడారు. భూస్వాములకు, దేశ్‌ముఖ్‌లకు, జాగీర్దార్లకు, దేశ్‌పాండేలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కౌలుదారులకు న్యాయపరమైన కౌలు, వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచడం, పాత రుణాల రద్దు, చిన్న సన్నకారు రైతుల పంటలు భూస్వాముల పాలుకాకుండా కాపాడటం వంటి ప్రస్తావనలు కమ్యూనిస్ట్ భావాల పట్ల రైతులు, కూలీలు, కౌలుదారులు ఆకర్షితులయ్యారు.
– అప్పటి రోజుల్లో భూస్వాములు ప్రజలను 82 రకాల పన్నులతో దోపిడీ చేసేవారు. ప్రతి పౌరుడికి రెండెకరాల భూమి, ఉండేందుకు ఇల్లు, వ్యక్తి గౌరవంతో జీవించేలా పోరాటం చేశారు. నాగు వడ్డీ విధానాన్ని రూపుమాపడం అర్హులైన పేదలకు భూ పంపిణీ లక్ష్యంగా సాయుధ పోరాటానికి బీజాలు పడ్డాయి.
– ప్రపంచ రైతాంగ పోరాటాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ సాయుధ పోరాటం 1945 నుంచి 1951 మధ్యకాలంలో 4 దశల్లో జరిగిందని చెప్పవచ్చు.
1) మొదటి దశ (1940-46): తెలంగాణలో రహస్యంగా స్థాపించిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆంధ్ర మహాసభల పేరుతో కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాపింపజేశారు.
2) రెండో దశ (1946-47): ఈ దశలో కమ్యూనిస్టులు సన్న చిన్న కారు రైతుల సమస్యలతో పాటు సామాజిక రుగ్మతల (వెట్టి, కట్టుబానిసత్వం)కు వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం ప్రారంభించారు.
3) మూడో దశ (1947-1948, సెప్టెంబర్ 17): ఈ దశలో నిజాం అనుకూల రజాకార్లతోపాటు భూస్వాములు, పెత్తందార్ల అణచివేత, దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ సందర్భంలో రజాకార్లకు, కమ్యూనిస్టులకు జరిగిన పోరాటంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
4) నాలుగో దశ: నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రత్యేక దేశంగా ఉండటానికే మొగ్గుచూపాడు. ఈ దశలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానానికి కేంద్ర బలగాలను పంపారు.
– కేంద్ర బలగాల లక్ష్యం నిజాం సైన్యం. కానీ ప్రత్యేక పరిస్థితిలో కమ్యూనిస్టులపై ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ సంస్థానంలోని కొంతమంది భూస్వాములు, జాగీర్దారులు, ప్రజల్ని దోచుకునే వర్గాలు కమ్యూనిస్టులను ఎదిరించలేకపోయారు. ఈ అసహాయతను కేంద్ర బలగాలపై చూపెట్టి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై వేశారు. ఇది నమ్మిన కేంద్ర బలగాలు రజాకార్లతోపాటు కమ్యూనిస్టులను తమ లక్ష్యంగా చేసుకొన్నాయి.
-1948, సెప్టెంబర్ 17న నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. భారత బలగాల ధాటికి, ఒత్తిడికి తలొగ్గిన కమ్యూనిస్టులు 1951, అక్టోబర్ 21న తమ సాయుధ పోరాటాన్ని విరమించారు. దీంతో భారతదేశ రైతాంగ పోరాటాల్లో ప్రముఖంగా నిలిచి ప్రపంచాన్ని ఆకర్షించిన తెలంగాణ సాయుధ పోరాటానికి విరామం ఏర్పడిందని చెప్పవచ్చు.
పోరాటానికి దారితీసిన పరిస్థితులు
– నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా భూస్వామ్య దోపిడీ వర్గాల నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యంగా తెలంగాణ సాయుధ పోరాటానికి బీజాలు పడ్డాయి.
-రజాకార్ల అరాచకాలకు, నిజాం పోలీసుల దమనకాండకు విరుగుడుగా సాయుధ పోరాటం ఆరంభమయ్యింది. దొడ్డి కొమురయ్య (1946, జూలై 4) అమరత్వం వంటివి తెలంగాణ సాయుధ పోరాటానికి తక్షణ కారణాలుగా చెప్పవచ్చు. రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొయిద్దీన్, చండ్ర రాజేశ్వరరావు వంటి నాయకుల మార్గదర్శనంలో తెలంగాణ సాయుధ పోరాటం పతాకస్థాయికి చేరింది.
కారణాలు
-భూస్వామ్య విధానం- నాడు తెలంగాణలో నిరంకుశ, నియంతృత్వ పాలనతోపాటు ఫ్యూడలిజమ్ కూడా అమల్లో ఉండేది. సంస్థానం మొత్తం భూమిలో 30 శాతం జాగీర్దారుల చేతిలో 10 శాతం భూమి సర్ఫేఖాస్ రూపంలో మిగతా 60 శాతం భూములు ఖల్సా భూములుగా ఉండేవి. ఈ ఖల్సా భూములు దేశ్‌ముఖ్‌ల, సర్దేశ్ముఖ్ల, పెద్ద భూస్వాముల చేతిలో ఉండేవి. అయితే వీరి అకృత్యాలకు, అరాచకాలకు అవినీతికి అడ్డూఅదుపు ఉండేది కాదు. 1930 నాటికి మొత్తం సాగు భూమిలో 70 శాతం కేవలం 550 మంది భూస్వాముల చేతిలో ఉండేది. 5000 నుంచి 15,000 ఎకరాలు గల భూస్వాములు ఉండేవారు.
-నిజాం నిరంకుశ పాలన- నిజాం రాజు నియంతృత్వంతోపాటు మతమౌఢ్యం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రజలను పన్నులతో హింసించేవాడు.
-ఇస్లాం మతం ప్రచారం కోసం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అనే సంస్థ ను నెలకొల్పాడు. ప్రారంభంలో సంప్రదాయ ఇస్లాం బోధనల ప్రచారానికి పరిమితమయ్యింది. ఖాసిం రజ్వీ క్రియాశీలత్వం పెరగడంతో రజాకార్ల అరాచకత్వానికి తెరలేసింది. బైరాన్‌పల్లి సంఘటన వంటివి ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
– ప్రజల సామాజిక స్థితిగతులు- నాటి తెలంగాణ సమాజంలో అత్యధికులు పేదవారు నిరక్షరాస్యులుగా ఉండేవారు. విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ఉండేవారు. వీరిలో ఎక్కువ శాతం ప్రజలు అగ్రవర్ణాలకు, భూస్వాములకు, పెత్తందార్లకు ఊడిగం చేసేవారు.
ఆర్థిక పరిస్థితి- నాగు వడ్డీ వ్యాపారుల వల్ల రైతులు ఆర్థిక దోపిడీకి గురయ్యారు. వడ్డీ చెల్లించడం కోసం ఆస్తులు సైతం అమ్ముకునేవారు. చెల్లించలేనివారు వెట్టిచాకిరీ, కట్టు బానిసత్వం, నిర్బంధ కార్మికత్వం చేయాల్సివచ్చేది. దీనికి విరుగుడుగా ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటంవైపు మొగ్గుచూపారు.
నిజామాంధ్ర మహాసభ పాత్ర- తెలంగాణ ప్రజలను జాగృతం చేసి వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించడంలో నిజామాంధ్ర మహాసభ కీలక పాత్ర పోషించింది. నిజామాంధ్ర మహాసభ 1944లో అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. అతివాదులు కమ్యూనిస్టు పార్టీలో చేరగా మితవాదులు స్టేట్ కాంగ్రెస్‌లో చేరారు. నాటి విముక్తి పోరాటానికి స్టేట్ కాంగ్రెస్ సహాయ నిరాకరణ వంటి గాంధేయ పంథాను నమ్ముకోగా అతివాదులు సాయుధ పోరాటం వైపు మొగ్గుచూపారు.
నిజాం ప్రజావ్యతిరేక చర్యలు- నిజాం ప్రభుత్వం ‘గస్తీ నిషాన్-53’ విధించి ప్రజల వాక్స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం హరించివేసింది. అంతేకాకుండా నారాయణగూడలోని ఆంధ్ర బాలికోన్నత పాఠశాలలో తెలుగు మీడియంలో విద్యాబోధన విధానం ప్రారంభిస్తే ఆ పాఠశాలను నిజాం ప్రభుత్వం నిషేధించింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో బోధన చేయడం వల్ల యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసింది.
హిందూ సంస్కృతి వ్యతిరేక చర్యలు- నిజాం ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా, వారి అస్థిత్వం నిలుపుకొనేందుకు కొన్ని జిల్లాలు/నగరాల పేర్లు మార్పుచేశారు. అవి..
– ఎలగందల- కరీంనగర్
– పాలమూరు- మహబూబ్‌నగర్
-ఇందూరు- నిజామాబాద్
-మెతుకు- మెదక్
-మానుకోట- మహబూబాబాద్.
-భువనగిరి- భగర్
రైతులపై ప్రభుత్వం విధించిన లెవీ– నూతన లెవీ విధానం ప్రకారం ధాన్యాన్ని నిల్వ చేసుకోరాదు. ఈ విధానంలో రైతులు వాణిజ్య పంటలు పండించరాదు. లెవీ విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులు తమ ఉత్పత్తులు విక్రయించాలి. ఈ లెవీ విధానం రెండు రకాలుగా ఉంటుంది.
1) గల్లా లెవీ- ఈ విధానంలో రైతు ఒక ఎకరానికి 20 షేర్ల ధాన్యాన్ని పన్ను రూపంలో చెల్లించాలి.
2) ఖుషి గల్లా- రైతు తన ఇష్ట ప్రకారం ప్రభుత్వానికి ఎంతైనా ధాన్యం చెల్లించవచ్చు.
రాజకీయ చైతన్య పాఠశాలలు- నిజాం ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా నాటి సమాజంలోని కొంతమంది కమ్యూనిస్టు నాయకులు ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి పాఠశాలలు నెలకొల్పారు. జగిత్యాల పాఠశాలలో ఆళ్వార్‌స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు శిక్షణ ఇచ్చారు. కంకిపాడులో రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఎన్జీ రంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలపై శిక్షణ ఇచ్చారు.
ప్రజల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక చైతన్యం కలిగించి అభ్యుదయ సమాజ నిర్మాణం కోసం కృషిచేశారు. ఈ కారణాలవల్ల రైతు కూలీలు, కార్మికులు, చేతివృత్తులవారు, హిందూ సాంప్రదాయ వాదులు, రైతులు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.
ఫలితాలు
1) సాయుధ పోరాటం వల్ల భూ సంస్కరణల ఆవశ్యకత దేశమంతా మార్మోగింది.
2) ఫలితంగా 1949లో భూస్వాములకు పరిమితి విధించి సంస్కరణలు ప్రవేశపెట్టారు.
3) ఆచార్య వినోబాభావే భూదాన ఉద్యమం ప్రారంభించారు.
4) తెలంగాణ ప్రజల మనస్సులో నాటుకొని ఉన్న బానిస ప్రవృత్తి, వెట్టిచాకిరీ చాలావరకు దూరమైంది.
5) జాగీర్దార్ల రద్దు చట్టం, కౌలు వ్యవసాయ భూముల చట్టం, ఇనాం భూముల రద్దు వంటి అనేక చట్టాలను తీసుకువచ్చారు.
6) కనీస వేతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
7) సాయుధ పోరాటం వల్ల కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు, భూమిలేనివారికి అందజేశారు.
8) కౌలు వ్యవసాయం చేసేవారికి భూమిని సొంతం చేశారు.
9) సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో ప్రజాచైతన్యాన్ని కలిగించడమే కాకుండా వివిధ రకాలైన సంస్థల ఏర్పాటుకు దోహదపడింది.
10) విసునూర్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పేద రైతు షేక్ బందగీ సాగించిన పోరాటం, 1940లో పాలకుర్తి చాకలి ఐలమ్మ పంట స్వాధీనం, మొండ్రాయి, ధర్మాపురంలో భూస్వాముల దురాక్రమణలో ఉన్న భూమిని ప్రజలు స్వాధీనం చేసుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. వీర తెలంగాణ విప్లవ పోరాటం గ్రంథ రచయిత?
1) చండ్ర పుల్లారెడ్డి
2) పుచ్చలపల్లి ఆనందయ్య
3) రావి నారాయణరెడ్డి
4) తుమ్మ మధుకర్ రెడ్డి
2. నా జీవన పథంలో గ్రంథ రచయిత?
1) ఆరుట్ల రామచంద్రారెడ్డి
2) రావి నారాయణరెడ్డి
3) నల్లా నర్సింలు
4) చండ్ర పుల్లారెడ్డి
3. వీర తెలంగాణ నా అనుభవాలు-జ్ఞాపకాలు పుస్తక రచయిత?
1) నల్లా నర్సింలు
2) రావి నారాయణరెడ్డి
3) చండ్ర పుల్లారెడ్డి
4) ఆరుట్ల రామచంద్రారెడ్డి
4. తెలంగాణ పోరాట స్మృతులు గ్రంథ రచయిత?
1) ఆరుట్ల రామచంద్రారెడ్డి
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) మఖ్దూం మొయిద్దీన్
4) ఆరుట్ల కమలాదేవి
5. తెలంగాణ పోరాటం-నా అనుభవాలు పుస్తక రచయిత?
1) రావి నారాయణరెడ్డి
2) నల్లా నర్సింలు
3) దేవులపల్లి రామానుజరావు
4) చండ్ర వెంకటేశ్వరరావు
6. కింది వారిలో తెలంగాణ టైగర్‌గా ప్రసిద్ధి చెందినవారు?
1) నల్లా నర్సింలు
2) రాజేశ్వరరావు
3) రావి నారాయణరెడ్డి
4) ఎవరూకాదు
7. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన సంవత్సరం?
1) 1939 2) 1921
3) 1940 4) 1937
8. కేంద్రం నుంచి వచ్చి హైదరాబాద్‌లో పర్యటించి హైదరాబాద్ గడ్డపై ఒక్క కమ్యూనిస్టును కూడా ఉండనివ్వనని చెప్పింది?
1) జేఎన్ దరి 2) నెహ్రూ
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) సీఎం వెల్లోడి
9. తెలంగాణ సాయుధ పోరాటం ఏ రోజున విరమించారు?
1) 21/10/1952
2) 21/10/1951
3) 5/5/1946
4) 5/9/1946
10. తెలంగాణ సాయుధ పోరాటం ఏ దేశ సలహా మేరకు విరమింపజేశారు?
1) రష్యా 2) చైనా
3) వియత్నాం 4) జపాన్
సమాధానాలు
1-1, 2-2, 3-2, 4-1, 5-2, 6-1, 7-1, 8-3, 9-2, 10-1.
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు