ప్రధానితో తెలంగాణ, ఆంధ్రా నాయకుల చర్చలు ( తెలంగాణ హిస్టరీ )
గ్రూప్స్ ప్రత్యేకం
తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ, ఆంధ్రా నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం గురించి, సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
# 1969, ఏప్రిల్ 10న ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా హోంమంత్రి వైబీ చవాన్, కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప, కామరాజు, బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరాగాంధీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత చెన్నారెడ్డి, వీబీ రాజు, ఎన్ రామచంద్రారెడ్డి ప్రధానిని విడివిడిగా కలుసుకున్నారు. ఈ చర్చల్లో పీసీసీ అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం, కేంద్ర మంత్రి కొత్తా రఘురామయ్య, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పాల్గొన్నారు. లోక్‌సభ సభాపతిగా ఉన్న సంజీవరెడ్డి ఆహ్వానం ఉన్నా చర్చల్లో పాల్గొనలేదు.
# తెలంగాణకు జరిగిన అన్యాయాలను, నిధుల మళ్లింపును, ఉద్యోగాల కబళింపు మొదలైన అంశాలను చెన్నారెడ్డి, రామంచద్రారెడ్డి ప్రధానికి వివరించారు. మిగులు నిధులు రూ.34 కోట్లేనని లలిత్ కమిటీ చెప్పింది తప్పని రూ.వంద కోట్ల దాకా ఉంటుందని చెన్నారెడ్డి అన్నారు. న్యాయమూర్తి ద్వారా మరొకసారి విచారణ జరిపించాలన్నాడు. తెలంగాణ ప్రతినిధిగా చర్చల్లో పాల్గొన్న వీబీ రాజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దన్నాడు.
ఎనిమిది సూత్రాల పథకం
# ఏప్రిల్ 10న రెండు ప్రాంతాల నేతలతో, అంతకు ముందురోజు పార్లమెంటులోని పార్టీ నేతలతో తెలంగాణ సమస్య గురించి చర్చించిన ప్రధాని ఏప్రిల్ 11న లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు, తెలంగాణ ప్రజల ఉద్యోగ అవకాశాల విస్తృతికి గట్టి చర్యలు తీసుకోవడం తను జరిపిన చర్చల ప్రధాన లక్ష్యంగా ప్రధాని వివరిస్తూ తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు.
1) పదవీ విరమణ చేసిన లేదా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి అధ్యక్షతన ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలి. ఈ సంఘంలో రాష్ట్ర ఆర్థిక వనరుల సమాచారం ఆధారంగా బాగా తెలిసిన ఒక ఆర్థికవేత్తను, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ సీనియర్ ప్రతినిధిని సభ్యులుగా నియమిస్తారు. ఈ సంఘం మిగులు నిధులను నిర్ణయిస్తుంది. వచ్చే (మే, 1969) నెలాఖరుకే నివేదిక ఇస్తుంది.
2) తెలంగాణకు సంబంధించిన మిగులు నిధులను ఖర్చు చేసే విషయమై కేంద్ర ఆర్థిక, దేశీయాంగ మంత్రిత్వ శాఖలు ప్రణాళికా సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య వెంటనే చర్చలు జరగాలి. తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించడానికి కావాల్సిన నిధులను సమకూర్చాలి.
3) ముఖ్యమంత్రి సూచనపై వెంటనే తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఉన్నతాధికార సంఘం ఏర్పాటు చేయడానికి అంగీకరించడమైనది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ఈ సంఘంలో ప్రణాళికా సంఘ సభ్యుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, తెలంగాణ ప్రాంతీయ సంఘం చైర్మన్ సభ్యులుగా ఉంటారు. పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో వివిధ రంగాల్లో అభివృద్ధి లక్ష్యాల నిర్ణయం, నిర్వహణ కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ఈ ఉన్నతాధికార సంఘం విధులు.
4) నిర్ణయించిన ప్రణాళికలను అమలుపర్చడానికి ప్రణాళికా సంఘం సలహాదారుడి అధ్యక్షతన ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం. ఆ కమిటీలో కేంద్ర హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉండటం.
5) తెలంగాణ ప్రాంతీయ సంఘానికి, తరువాత ఆ ప్రాంతపు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన యంత్రాంగానికి ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వడం.
6) తెలంగాణ ప్రాంతం వారికి ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో రాజ్యాంగ సంబంధమైన రక్షణలు సమకూర్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ విషయంలో న్యాయవేత్తతో కూడిన ఒక సంఘాన్ని
సంప్రదిస్తుంది.
7) ముఖ్యమంత్రి సూచనపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో (రాష్ట్రాల పునర్విభజన చట్టం కింద ఏర్పడిన) కేంద్ర సలహా సంఘం హైదరాబాద్‌ను సందర్శించి ప్రభుత్వ ఉద్యోగుల సాదకబాదకాలను, కోరికలను సాధ్యమైనంత త్వరలో పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తగిన సిఫారసులను హోంమంత్రికి సూచిస్తుంది.
# కేంద్ర, రాష్ట్ర సలహా సంఘాల సిఫారసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం దానిని తక్షణం అమలు చేయగలదని ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు.
8) తెలంగాణ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రద్ధ చూపగలిగేందుకు ప్రధానమంత్రి సంవత్సరానికి రెండుసార్లు ముఖ్యమంత్రితోనూ, పైన పేర్కొన్న సంఘాల్లోని ఆయన సహచరులతోనూ, సమీక్షా సమావేశాలు జరపాలని ముఖ్యమంత్రి సూచనపై నిర్ణయించామని ప్రధాని తెలిపారు.
#ప్రధాని తన ప్రసంగంలో పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూచన ప్రకారం, ‘ముఖ్యమంత్రి సూచించినట్లు’ అంటూ పేర్కొనడాన్ని బట్టి అంతకుముందు రెండురోజులు చవాన్, నిజలింగప్ప, కామరాజ్‌లు వివిధ పార్టీల నాయకుల సలహాలను విన్నా, ఒక్క ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి సలహాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ ఎనిమిది సూత్రాల పథకం వెల్లడిస్తున్నది.
# తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాలనుకుంటే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిని చర్చల్లో భాగస్వాములను చేయాల్సింది. కానీ ప్రధాని ఆ పనిచేయలేదు. ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన ఈ ఎనిమిది సూత్రాల పథకాన్ని ఇటు తెలంగాణ నేతలు, ఉద్యమకారులు, అటు దేశంలోని వివిధ ప్రతిపక్షాలు ఎవరూ అంగీకరించలేదు.
అష్ట సూత్ర పథకంపై పలువురి అభిప్రాయాలు
#తెలంగాణ సమస్య కేవలం రక్షణలకు, ఉద్యోగాలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. అది రాజకీయ సమస్య. దీనికి రాజకీయ పరిష్కారం కావాలని గుర్తించడానికి కేంద్ర నాయకులు తిరస్కరించారు – కొండా లక్ష్మణ్ బాపూజీ
# ఢిల్లీలో ఉన్నతాధికార సమావేశంలో సూచించిన పరిష్కార మార్గాలను లక్ష్యపెట్టాల్సిన అవసరం లేదు. ప్రధాని ప్రతిపాదనలకు విముఖత తెలుపుతూ ప్రజాసమితి ఏప్రిల్ 15న తెలంగాణ పోరాట దినోత్సవం జరపాలి – టీఎస్ సదాలక్ష్మి
# మొత్తం భాషా రాష్ట్ర సిద్ధాంతాన్ని తెలంగాణలో సవాలు చేశారు, ప్రధానమంత్రి ప్రకటించిన ప్రతిపాదనల వల్ల అక్కడ పరిస్థితి మెరుగుపడగలదా అని నాకు సందేహంగా ఉన్నది – ఏబీ వాజ్‌పేయి (జనసంఘ్)
#ప్రధానమంత్రి ప్రకటన చేసేముందు తెలంగాణ ప్రజాసమితి నాయకులను కూడా సంప్రదించాలి – కే మనోహరన్ (డీఎంకే)
# ‘ఈ ప్రకటన హుళక్కి. కాంగ్రెస్ వారి మధ్య తగాదా వల్ల ఈ ఆందోళన వచ్చింది. కాబట్టి వారందరికీ ఒక విందు ఇచ్చి సర్దుబాటు చేస్తే మానుకొంటారని అనుకోవడం పొరబాటు. ఇది తెలంగాణ వారిని తృప్తిపరచదు’
– గౌతు లచ్చన్న (ప్రతిపక్ష నేత)
తెలంగాణ ఉద్యోగ సంఘాల అసంతృప్తి
# ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటనపై తెలంగాణ ఎన్జీవోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని చేసిన ప్రకటనలో తెలంగాణ ఉద్యోగుల సమస్యపై కొత్తగా చెప్పినది ఏదీలేదని తెలంగాణ ఉద్యోగుల సంఘాల యూనియన్ల సంయుక్త మండలి కన్వీనర్ ఎం రామబ్రహ్మం అన్నారు.
#తెలంగాణ ఉద్యోగులకు రక్షణగా ముల్కీ నిబంధనలు పునరుద్ధరిస్తామని నిర్దిష్టమైన హామీ కూడా ప్రధాని ప్రకటనలో లేదు. ఈ నెల 15న తలపెట్టిన ఒక్కరోజు సమ్మెలో ఒకటిన్నర లక్షల మంది ఉద్యోగులు పాల్గొనడం మినహా గత్యంతరం లేదు’ అని రామబ్రహ్మం అన్నారు.
చెన్నారెడ్డి, ఇతర నేతల ప్రకటన
#ప్రధాని ప్రతిపాదనలు తెలంగాణ సమస్యలను పరిష్కరించజాలవని ప్రధానితో చర్చలు జరిపి వచ్చిన మరి చెన్నారెడ్డి, జే చొక్కారావు, నూకల రామచంద్రారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ పత్రికల వారితో అన్నారు. ప్రత్యేక తెలంగాణ వాదనను తాము అవును, కాదు అని ఇప్పుడే చెప్పలేం. తెలంగాణ ఆంధ్రా నుంచి విడిపోకుండానే ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చో ఇంకా ఆలోచిస్తున్నాం. ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం గాని, దేశీయాంగ మంత్రి గాని ఇక్కడికి వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించడం అవసరమని గట్టిగా విశ్వసిస్తున్నా మని చెన్నారెడ్డి అన్నారు.
ఎనిమిది సూత్రాల పథకం పర్యవసానం
# ఈ ఎనిమిది సూత్రాల పథకం తెలంగాణ ఉద్యమ నేతలను, ప్రజలను సంతృప్తిపర్చలేకపోయింది. ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన విద్యార్థి నాయకులను, ఉద్యోగ సంఘాల, రాజకీయ నాయకులను, అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి ఉద్యమంలో అప్పటిదాకా పాల్గొనని, తటస్థంగా లేదా వ్యతిరేంగా ఉన్న నాయకులతో ప్రధాని చర్చలు జరిపి ఈ ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రకటించడం ఉద్యమ కార్యకర్తలకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఎనిమిది సూత్రాల పథకంలో చెప్పిన సంఘాలు, కమిటీలన్నీ కాలయాపన చేసి తెలంగాణ ఉద్యమంపై నీళ్లు చల్లడానికి బ్రహ్మానందరెడ్డి చేసే కుట్రలో భాగమని ఉద్యమ నాయకులు భావించారు. ఢిల్లీలోని జాతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా ఈ అష్టసూత్ర పథకం సరైన పరిష్కార మార్గాలను సూచించడం లేదన్నారు.
# ప్రధాని ప్రకటనను నిరసిస్తూ తెలంగాణ న్యాయవాదులు కోర్టులను బహిష్కరించారు. తెలంగాణ వాదులు, సంఘాలు, నాయకులు, జాతీయ పార్టీలు విమర్శించినా వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రధాని ఇందిరాగాంధీ ఈ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకాన్ని ప్రకటించింది?
1) 1969, ఏప్రిల్ 11
2) 1969, ఏప్రిల్ 10
3) 1969, ఏప్రిల్ 12
4) 1970, ఏప్రిల్ 11
2. కుమార్ లలిత్ కమిటీ మిగులు నిధులు రూ.34 కోట్లు అని చెప్పగా, అది తప్పని మిగులు నిధులు రూ.100 కోట్ల వరకు ఉంటాయని ప్రధానితో అన్నది?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) మరి చెన్నారెడ్డి
3) వీబీ రాజు
4) జే నరసింగరావు
3. ప్రధాని ప్రతిపాదించిన ఎనిమిది సూత్రాల పథకానికి విముఖత తెలుపుతూ ఏప్రిల్ 15న ‘తెలంగాణ పోరాట దినోత్సవం’ జరపాలని పిలుపునిచ్చినది?
1) తెలంగాణ ఉద్యోగుల సంఘం
2) తెలంగాణ ప్రాంతీయ సమితి
3) తెలంగాణ ప్రజాసమితి
4) తెలంగాణ ప్రజా కన్వెన్షన్
4. తెలంగాణ సమస్య కేవలం రక్షణలకు, ఉద్యోగాలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. అది ‘రాజకీయ సమస్య’ అని అన్నది?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) మరి చెన్నారెడ్డి
3) సదాలక్ష్మి 4) గౌతు లచ్చన్న
5. కింది వాటిలో సరైనవి?
1) ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ప్రధాని ఢిల్లీలో 1969, ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు
2) ఈ సమావేశంలో ఒక్క స్వతంత్ర పార్టీ మాత్రమే ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడింది
3) 1 4) 1, 2
6. తెలంగాణ సమస్యపై ప్రధాని ఇందిరాగాంధీ ఇరుప్రాంతాల నాయకులతో చర్చలు
జరిపినది?
1) 1969, ఏప్రిల్ 9
2) 1969, ఏప్రిల్ 10
3) 1969, ఏప్రిల్ 11
4) 1970, ఏప్రిల్ 10
7. అష్టసూత్ర ప్రకటనను ఉద్దేశించి కాంగ్రెస్ వారి మధ్య తగాదా వల్ల ఈ ఆందోళన వచ్చింది. కాబట్టి వారందరికీ ఒక విందు ఇచ్చి సర్దుబాటు చేస్తే మానుకొంటారని అనుకోవడం పొరపాటు అని వ్యాఖ్యానించింది?
1) గౌతు లచ్చన్న 2) ఎన్జీ రంగా
3) చెన్నారెడ్డి 4) మదన్ మోహన్
8. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని’ డిమాండ్ చేసిన స్వతంత్ర పార్టీ సభ్యుడు?
1) ఎన్జీ రంగా
2) గౌతు లచ్చన్న
3) వీబీ రాజు
4) పట్టాభి సీతారామయ్య
సమాధానాలు
1-1, 2-2, 3-3, 4-1,
5-4, 6-2, 7-1, 8-1
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు