కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తుసేవలపై చేసే ఖర్చు?
జాతీయాదాయం – నిర్వచనాలు
ఆధునిక అర్థశాస్త్రంలో/స్థూల అర్థశాస్త్రంలో జాతీయాదాయం అనే భావనకు అధిక ప్రాధాన్యం ఉంది.
ఒకదేశ ఆర్థికాభివృద్ధి-జీవన ప్రమాణస్థాయి జాతీయాదాయంపై ఆధారపడి ఉంటాయి.
ఒక సంస్థ/ పరిశ్రమ పనిచేసే తీరును తెలుసుకోవడానికి ఆదాయ వ్యయాలను రాయడం ఎంత అవసరమో అదేవిధంగా ఒక దేశ ఆర్థికవ్యవస్థకు జాతీయాదాయం అంతే అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పనితీరు/మొత్తం ఆర్థికవ్యవస్థ పనితీరు తెలుసుకోవడానికి జాతీయాదాయం కొలమానంగా పనిచేస్తుంది. మానవజాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనం జాతీయాదాయం.
జాతీయాదాయం నిర్వచనాలు
సాధారణ నిర్వచనం
ఒక సంవత్సర కాలంలో ఒకదేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువల మొత్తాన్ని జాతీయాదాయం అంటారు.
సంప్రదాయ నిర్వచనాలు
‘ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజవనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసిన భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడిన నికర వస్తుసేవల మొత్తమే జాతీయాదాయం’ – ఆల్ర్ఫైడ్ మార్షల్
‘వినియోగదారులు, భౌతిక, మానవ వనరుల నుంచి పొందే వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం’ – ఫిషర్
‘విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా, ద్రవ్యరూపంలో లెక్కించడానికి వీలైన దేశంలోని ఆదాయ మొత్తమే జాతీయాదాయం’- ఆచార్య పిగూ
ఆధునిక నిర్వచనాలు (Modern Definations)
దేశంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థలు ఆర్థిక వ్యాపారాలకు ప్రతిఫలంగా పొందే నికర ఆదాయ సముదాయమే జాతీయాదాయం- కుజునెట్
‘ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రవహించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం’ – ఆచార్య శామ్య్యూల్సన్.
ఒక సంవత్సర కాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ లాభాల రూపంలో ‘ఒకదేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయాదాయం’ – కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ).
‘ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తమే జాతీయాదాయం’ – ఐక్యరాజ్యసమితి(UNO).
‘ఒక నిర్ణీత కాలంలో ఒకే వస్తువును రెండుసార్లు లెక్క కట్టకుండా జాగ్రత్తపడుతూ తయారైన అన్ని వస్తుసేవల విలువలను అంచనా వేస్తే అది జాతీయాదాయం’ – (NIEC) – భారత జాతీయాదాయ అంచనాల కమిటీ
జాతీయ ఉత్పత్తి = అంతిమ వస్తుసేవల విలువ = బాటకం + వేతనం + వడ్డీ + లాభం – జె.ఎం. కీన్స్
జాతీయాదాయం నిర్ణయించే అంశాలు
ఒక దేశ జాతీయాదాయ పరిమాణం ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే జాతీయాదాయ పరిమాణం అనేక అంశాలతో ప్రభావితమై ఉంటుంది.
జాతీయాదాయ అంశాల కారణంగానే వివిధ దేశాలలో జాతీయాదాయ స్థాయిలో వ్యత్యాసాలు కనిపిస్తాయి.
అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయాదాయం హెచ్చుగా ఉంటుంది.
ఉదా: అమెరికా, బ్రిటన్
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయాదాయం తక్కువగా ఉంటుంది.
ఉదా: భారత్, పాకిస్థాన్
జాతీయాదాయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు
సహజ వనరులు:
సారవంతమైన భూమి, సహజవనరులు, శీతోష్ణస్థితి, ఖనిజ సంపద, ఇంధన వనరులు మొదలైనవి జాతీయా దాయ పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. ఇవి అధికంగా ఉంటే ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరుగుతుంది.
ఉత్పత్తి కారకాల లభ్యత నాణ్యత:
ఉత్పత్తి ఒక దేశంలో అధిక సామర్థ్యంగల శ్రామికుల లభ్యత, మూలధన పెరుగుదల రేటు సమర్థవంతమైన వ్యవస్థాపకుల లభ్యతపైన జాతీయాదాయం ఆధారపడి ఉంటుంది.
సాంకేతిక పరిజ్ఞానం :
ఒక దేశంలో జాతీయాదాయ పరిమాణం సాంకేతిక విజ్ఞాన ప్రగతిపై ఆధారపడి ఉంటుంది.
రాజకీయ నిర్ణయాలు స్థిరత్వం :
ఒక దేశ ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెరుగుదలకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి.
పై అంశాలే కాకుండా ప్రభుత్వ విధానాలు, ఎగుమతి, దిగుమతి విధానాలు, మానవ వనరుల అభివృద్ధి, పరిశోధనలపై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయాదాయాన్ని నిర్ణయిస్తాయి.
జాతీయాదాయం – భాగాలు (Compound of National Income) దేశ జాతీయాదాయంలో ముఖ్యంగా 5 భాగాలున్నాయి. అవి
వినియోగం (C) (Consumption):
మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తుసేవలపై చేసే ఖర్చును వినియోగం అంటారు. వినియోగ వ్యయం వ్యక్తుల ఆదాయ స్థాయిలపై ఆధారపడుతుంది.
పెట్టుబడి (I) (Investment) :
వస్తుసేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక లేదా మూలధన వస్తువులపై సంస్థలు చేసే ఖర్చును పెట్టుబడి అంటారు. ఇవి మానవుని కోరికలను పరోక్షంగా సంతృప్తి పరుస్తాయి.
ఉదా: యంత్రాలు, యంత్రపరికరాలు
ప్రభుత్వ వ్యయం(G) (Government Expendature):
ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక వస్తు సేవలపై ఖర్చు చేస్తుంది. దీనిని ప్రభుత్వ వ్యయం అంటారు.
ఉదా: అవస్థాపన సౌకర్యాలు, విద్య, వైద్యం, రక్షణ, సామాజిక సేవలు మొదలైనవి.
నికర విదేశీ పెట్టుబడి (X-M)
(Net foreign Income): ప్రతి దేశం అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొని కొన్ని వస్తువులను ఎగుమతి చేసి తమకు కావలసిన మరికొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఈ విదేశీ వ్యాపారం వల్ల కలిగిన మిగులును జాతీయాదాయంలో కలపాలి. లోటును చెల్లించాలి. ఈ తేడాను నికర ఎగుమతులు అంటారు.
అంటే ఎగుమతి విలువ(x) నుంచి దిగుమతి విలువను(m) తీసివేస్తే మిగిలినది ‘నికర ఎగుమతులు’ అవుతుంది.
నికర విదేశీ ఆదాయం (Net income from abroad): ఒక దేశ ప్రజలు ఇతర దేశాల్లో సంపాదించి స్వదేశానికి పంపిన ఆదాయం నుంచి విదేశీయులు తమ దేశానికి పంపిన ఆదాయాలను తీసివేయగా వచ్చేది నికర విదేశీ ఆదాయం అంటారు.
l Y=C+I+G+(X-M)+ Net Income From abroad
ప్రాక్టీస్ బిట్స్
1. ఒక దేశ ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణస్థాయి దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) తలసరి ఆదాయం
బి) జాతీయాదాయం
సి) తలసరి వినియోగం డి) పైవన్నీ
2. కింది వారిలో ఆధునిక ఆర్థికవేత్త ఎవరు?
ఎ) ఆల్ర్ఫైడ్ మార్షల్ బి) ఇర్వింగ్ ఫిషర్
సి) ఎ.సి. పిగూ డి) జె.ఎం. కీన్స్
3. జాతీయాదాయ భాగాలు ఏవి?
ఎ) వినియోగం, పెట్టుబడి
బి) ప్రభుత్వ వ్యయం
సి) నికర విదేశీ పెట్టుబడి ఆదాయం
డి) పైవన్నీ
4. ఒక దేశ జాతీయాదాయం
ఎ) ఆ దేశ సహజ వనరులపై ఆధారపడుతుంది
బి) ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యతపై ఆధారపడుతుంది.
సి) సాంకేతిక పరిజ్ఞానం రాజకీయ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలపై ఆధారపడుతుంది. డి) పై అన్నీ
5. కింది వాటిలో జాతీయాదాయం దేనిలో భాగం?
ఎ) సూక్ష్మ అర్థశాస్త్రం బి) స్థూల అర్థశాస్త్రం
సి) బి, డి డి) ఆధునిక అర్థశాస్త్రం
6. ఒక దేశ/ఒక జాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనం?
ఎ) జాతీయాదాయం
బి) తలసరి ఆదాయం
సి) జీవన ప్రమాణం డి) పైవన్నీ
7. వినియెగదారులు భౌతిక/మానవ వనరుల నుంచి పొందే వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం అని నిర్వచించినది?
ఎ) మార్షల్ బి) ఫిషర్
సి) పిగూ డి) శామ్యూల్ సన్
8. “ఒక సంవత్సరకాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయాదాయం” ఈ నిర్వచనం ఎవరిచ్చారు?
ఎ) ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)
బి) కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ)
సి) జాతీయాదాయ అంచనాల కమిటీ (ఎన్ఐఈసీ)
డి) మార్షల్
9. కింది వాటిలో జాతీయాదాయం అధికంగా గల దేశం ఏది?
ఎ) భారతదేశం బి) బంగ్లాదేశ్
సి) అమెరికా డి) పాకిస్థాన్
10. కింది వాటిలో జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశం కానిది ఏది?
ఎ) సహజ వనరులు
బి) ఉత్పత్తి సాధనాలు
సి) సాంకేతిక పరిజ్ఞానం డి) పైవన్నీ
11. మానవుని కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులకు ఉదాహరణ?
ఎ) ఆహారం బి) వస్త్రం
సి) నీరు డి) భవనం
12. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తుసేవలపై చేసే ఖర్చును ఏమంటారు?
ఎ) వినియోగం బి) పెట్టుబడి
సి) ప్రభుత్వ వ్యయం డి) ఉత్పత్తి
13. ఎగుమతి విలువ నుంచి దిగుమతి విలువను తీసివేస్తే మిగిలేది?
ఎ) నికర ఎగుమతి బి) నికర దిగుమతి
సి) ఎ, బి డి) పైవేవీకావు
14. కింది వాటిలో నికర విదేశీ ఆదాయం?
ఎ) Y = C + I + G + (X-M)
బి) Y = C + I + G
సి) Y = C + I + G + (X-M) + (R-P)
డి) Y = C + I + G + (X-M) + Net Income from abroad
15. జాతీయాదాయం అనేది?
ఎ) నిల్వ బి) ప్రవాహం
సి) ఎ, బి డి) పైవేవీకావు
16. జాతీయోత్పత్తి అంతిమ వస్తుసేవల విలువ = బాటకం + వేతనాలు + వడ్డీ + లాభం
ఎ) మార్షల్ బి) కీన్స్
సి) పిగూ డి) సీఎస్ఓ
17. ప్రభుత్వ వ్యయం అంటే?
ఎ) ప్రజా సంక్షేమం కోసం వివిధ వస్తుసేవలపై ప్రభుత్వం చేసే ఖర్చు
బి) పరిపాలనా నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చు
సి) శాంతి భద్రతలపై ప్రభుత్వం చేసే ఖర్చు
డి) పైవన్నీ
18. యంత్రాలు, యంత్ర పరికరాలు అనేవి?
ఎ) వినియోగ వస్తువులు
బి) ఉత్పాదక వస్తువులు
సి) ఉచిత వస్తువులు డి) పైవన్నీ
19. విదేశీ వ్యాపార మిగులును జాతీయ ఆదాయంలో…
ఎ) కలపాలి బి) తీసివేయాలి
సి) రిజర్వుగా ఉంచాలి
డి) ఎ, సి
20. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను ఏమంటారు?
ఎ) ఉచిత వస్తువులు
బి) ఆర్థిక వస్తువులు
సి) వినియోగ వస్తువులు
డి) ఉత్పాదక వస్తువులు
21. ఆర్థికవ్యవస్థ పనితీరును తెలుసుకోవడానికి కొలమానంగా పనిచేసేది ఏది?
ఎ) తలసరి ఆదాయం
బి) తలసరి వినియోగం
సి) జాతీయాదాయం
డి) జీవన ప్రమాణం
22. అవస్థాపన సౌకర్యాలకు ఉదాహరణ?
ఎ) విద్య, వైద్యం
బి) రవాణా, బ్యాంకింగ్
సి) బీమా, సమాచారం డి) పైవన్నీ
23. స్వదేశీ రాబడి నుంచి విదేశీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేది?
ఎ) నికర విదేశీ ఆదాయం
బి) నికర విదేశీ చెల్లింపు
సి) నికర ఎగుమతులు
డి) నికర దిగుమతులు
24. సహజ వనరులు పుష్కలంగా ఉంటే?
ఎ) ఉత్పత్తి పెరుగుతుంది
బి) ఉత్పత్తి పెరిగి, ఆదాయం పెరుగుతుంది
సి) ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది
డి) ఆదాయం పెరుగుతుంది
25. జాతీయాదాయ పెరుగుదల దేనిపై ఆధార పడుతుంది?
ఎ) ఉత్పత్తి కారకాల లభ్యతపై
బి) ఉత్పత్తి కారకాల వినియోగంపై
సి) ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యతపై
డి) పైవన్నీ
26. ఆర్థికాభివృద్ధికి, జాతీయాదాయ వృద్ధిరేటు పెరుగుదలకు తోడ్పడేవి?
ఎ) సాంకేతిక పరిజానం
బి) రాజకీయ నిర్ణయాలు
సి) వనరులు
డి) పైవన్నీ
సమాధానాలు
1-బి 2-డి 3-డి 4-డి 5-సి 6-ఎ 7-బి 8-బి 9-సి 10-డి 11-డి 12-ఎ 13-ఎ 14-డి 15-బి 16-బి 17-డి 18-బి 19-ఎ 20-సి 21-డి 22-డి 23-ఎ 24-బి 25-సి 26-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు