దక్షిణ దేశ పాలకులు ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
దక్షిణ భారతదేశంలో పలు ప్రాంతాల్లో సుమారు 6 శతాబ్దాలపాటు పరిపాలించిన ప్రఖ్యాత రాజ వంశం చాళుక్యులు. దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్య యుగం ప్రసిద్ధి చెందింది. చాళుక్యుల్లో బీజాపూరు జిల్లాలోని బాదామి (వాతాపి)ని రాజధానిగా చేసుకొని పరి పాలించిన వారిది మాతృశాఖ. ఈ వంశంలో నుంచి శాఖగా విస్తరించిన తూర్పు చాళుక్య వంశం వేంగీని నాలుగున్నర శతాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా పాలించింది. చివరిలో తంజావూరు చోళులకు వారసులై రెండు శతాబ్దాల పాటు తమిళ ప్రాంతాన్ని పాలించారు. వీరి కాలంలో రాజకీయంగానే కాకుండా సాంస్కృతికంగా దక్షిణ దేశ సంస్కృతి శోభాయమానంగా విలసిల్లింది. వీరి కాలంలో ప్రాచీన వేదాంతం, సాహిత్యం, శిల్పకళలు తుది రూపాన్ని సంతరించుకొని అత్యున్నత దశకు చేరుకున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రదేశాల్లో వీరు నిర్మించిన దేవాలయాలు అద్భుత శిల్పకళలకు నిలయమై చాళుక్యుల శైలిని చాటుతున్నాయి.
దక్షిణాదిని పాలించిన రాజ వంశాలలో చాళుక్యులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పరమత సహనంతో పాలన సాగించారు.
1. బాదామి చాళుక్యులు (క్రీ.శ.543-752)
2. తూర్పు చాళుక్యులు (వేంగీ చాళుక్యులు) (క్రీ.శ.624-1075)
3. వేములవాడ చాళుక్యులు (క్రీ.శ.750-973)
4. ముదిగొండ చాళుక్యులు (క్రీ.శ.850-1200)
5. కళ్యాణి చాళుక్యులు (క్రీ.శ.973-1157)
# చాళుక్యుల చరిత్ర కూడా శిల లేదా తామ్ర పత్ర శాసనాల ఆధారంగానే తెలుస్తున్నది. వీరి తామ్ర పత్ర శాసనాల్లో ఇతరుల కంటే భిన్నంగా కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. వీరి కాలంలో మూడు స్పష్టమైన దశలను గమనించొచ్చు. గుణగ విజయాధిత్యుడు సింహాసనం అధిష్టించినప్పటి నుంచి తూర్పు చాళుక్యుల్లో కొంత మార్పు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వేములవాడ చాళుక్యులకు సంబంధించి తామ్ర శిలా శాసనాలు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.
# చాళుక్యుల యుగంలో వెండి, బంగారు, రాగి నాణేలు చెలామణిలో ఉండేవి. వీరి కాలంలో బంగారు నాణేన్ని గద్య అని పిలిచే వారు. అది 88 గ్రైన్ల బరువుండేది. గద్య నాణేలకు వేరే పేర్లు ఉండేవి. రాజ నారాయణ గద్య, సురభి గద్య, త్యాగగద్య అని, వెండి నాణేన్ని మాడా అని, రాగి నాణేలను కాసు అని పిలిచేవారు.
# చాళుక్యుల వాస్తు శిల్ప నిర్మాణాలు వారి మత పోషణ, శిల్ప కళాభివృద్ధికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి. వీరు శైవ, జైన, వైష్ణవ మతాలను ఆదరించారు. సమదృష్టితో చూశారు. నవబ్రహ్మ ఆలయాలను ఆలంపూర్లో నిర్మించారు. వేములవాడలో నిర్మించిన రాజరాజేశ్వరాలయం వీరికాలంలో శైవాలయంగా ప్రసిద్ధి చెందింది.
బాదామి చాళుక్యులు (క్రీ.శ.543-752)
# బాదామి చాళుక్యులను పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు
# చాళుక్యుల పూర్వీకులు ఇక్ష్వాకులకు సామంతులుగా కడప జిల్లాలోని హిరణ్య రాష్ట్రాన్ని పాలించారు. వీరి జన్మభూమి హిరణ్య రాష్ట్రం దాంతోపాటే తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతాలను కలిపి పాలించారు. క్రీ.శ. నాలుగో శతాబ్దం మొదట్లో పల్లవులు ఇక్ష్వాకులను కూలదోసి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారికి విధేయులుగా ఉండటానికి ఇష్టపడని చాళుక్యులు పల్లవులపై దండెత్తారు. అదే సమయంలో కదంబరాజ్య మయూరశర్మకు పల్లవులతో విరోధం ఏర్పడి చాళుక్యులతో కలసి పోరాడారు. ఫలితంగా మయూర శర్మతోపాటు చాళుక్యులు కర్ణాటక ప్రాంతానికి తరలి వెళ్లి బాదామి ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించారు.
# వీరి రాజలాంఛనం వరాహం. చాళుక్య వంశ మూల పురుషుడు జయసింహవల్లభుడు.
బాదామి చాళుక్యుల్లో ముఖ్యులు
-మొదటి పులకేశి (క్రీ.శ.535-566)
-కీర్తి వర్మ(క్రీ.శ.566-597)
-మంగళేశుడు (క్రీ.శ.598-609)
-రెండోపులకేశి (క్రీ.శ.609-642)
-విక్రమాదిత్యుడు (క్రీ.శ.642-680)
-వినయాదిత్యుడు (క్రీ.శ.680-696)
-విజయాదిత్యుడు (క్రీ.శ.696-733)
-రెండో విక్రమాదిత్యుడు (క్రీ.శ.733-744)
-రెండో కీర్తి వర్మ (క్రీ.శ.745-752)
తూర్పు చాళుక్యులు (క్రీ.శ 624-1075)
# తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి ఎనలేని సేవచేసిన రాజవంశాల్లో తూర్పు చాళుక్యులు (వేంగి) ముఖ్యులు. కృష్ణా గోదావరి మధ్య ఉన్న వేంగీ ప్రాంతం వీరికి రాజధాని కావడం వల్ల వీరిని వేంగీ చాళుక్యులన్నారు. బాదామి చాళుక్యుల తర్వాత ఆంధ్రదేశంలో అత్యంత ప్రశంసనీయమైన చరిత్ర గలవారు. ఆంధ్రదేశాన్ని నాలుగున్నర శతాబ్దాలు పాటు పాలించారు. వేంగిలో స్థిరపడి స్థానిక భాషా భావంతో పరిపాలన సాగిస్తూ ఆంధ్ర సంస్కృతిని పరిరక్షించారు. స్వాంతంత్య్రాన్ని గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. తూర్పు చాళుక్య యుగాన్ని మూడు ఘట్టాలుగా విభజించారు. మొదటిది క్రీ.శ.624-753 ఈ కాలంలో వేంగీ రాజ్యం ప్రశాంతంగా ఉంది. రెండో ఘట్టం క్రీ.శ.753 నుంచి 973 ఈ కాలంలో రాష్ట్రకూటులకు వేంగీకి మధ్య బద్దవైరం ఏర్పడింది. మూడో ఘట్టం క్రీ.శ.973-1075లో రాష్ట్రకూట రాజ్య పతనం, కళ్యాణి చాళుక్యుల ఆవిర్భావం సంభవించాయి. వేర్వేరు ఘట్టాల్లో ఆక్రమణలు జరిగిన వేంగిపై ఆధిపత్యం మాత్రం క్రీ.శ. 624లోనే ప్రారంభమైంది. బాదామి చాళుక్య రాజు రెండో పులకేశి వేంగిప్రాంతాన్ని జయించిన తర్వాత తన సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడిని ఆ ప్రాంత రాజ ప్రతినిధిగా నియమించాడు. ఇతనే వేంగీ చాళుక్య రాజ్య స్థాపకుడు.
వేములవాడ చాళుక్యులు
# వీరు రాష్ట్రకూటులకు సామంతులు. పశ్చిమోత్తర తెలంగాణ ప్రాంతాలను పాలించారు. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ వీరి రాజధాని. వీరు రాష్ట్రకూటుల సామంతులుగా క్రీ.శ.750 నుంచి 973 వరకు సుమారు 225 సంవత్సరాలు పాలించారు. రాష్ట్రకూటుల దయతోప్రారంభమైన వీరి రాజ్యం మళ్లీ వీరితోనే అంతరించింది. వేములవాడ చాళుక్యుల గురించి తెలుసుకోవడానికి ఆరు శిలాశాసనాలు, రెండు తామ్రశాసనాలు లభించాయి. అరికేసరి క్రీ.శ.946లో వేయించిన కరీంనగర్ శాసనం, వేములవాడ శిలా శాసనాలు ప్రముఖంగా వీరి గురించి తెలియజేస్తున్నాయి. జినవల్లభుడు క్రీ.శ. 940లో వేయించిన కుర్క్యాల శాసనం వేములవాడ చాళుక్యుల వంశ వృక్షాన్ని తెలియజేస్తుంది. వీరి శాసనాల ప్రకారం వేముల వాడ చాళుక్యులకు మూల పురుషుడు సత్యాశ్రయ రణ విక్రముడు (క్రీ.శ.650-675), అతని కుమారుడు పృథ్వీపతి (క్రీ.శ.675-700), మహారాజు (క్రీ.శ.700-725), ఇతని కుమారుడు పృదువిక్రముడు (క్రీ.శ. 725-750) పరిపాలన చేశారు. అయితే వీరిపాలనకు సంబంధించిన వివరాలు, ఎక్కడ పరిపాలించింది, వారి రాజ్యవివరాలు స్పష్టంగా తెలియడం లేదు.
చాళుక్యుల ముఖ్యశాసనాలు
* కొల్లిపర తామ్ర శాసనం
* కురువగట్టు తామ్రశాసనం
* వేములవాడ తామ్ర శాసనం
* చెన్నూరు తామ్ర శాసనం
* కరీంనగర్ తామ్రశాసనం
* కుర్క్యాల శాసనం
* పర్బణి తామ్ర శాసనం
ముదిగొండ చాళుక్యులకు సంబంధించి
* మొగల్ చెరువు శాసనం
* క్రివ్వక శాసనం
* నారాయణగరి తామ్రశాసనం
* బెజవాడ తామ్ర శాసనం
* కురివి శాసనం
తూర్పు చాళుక్యుల్లో ముఖ్యులు
# కుబ్జ విష్ణువర్ధనుడు (క్రీ.శ. 624-641)
# మొదటి జయసిండు (క్రీ.శ.642-673)
# ఇంద్రభట్టారకుడు (క్రీ.శ.673)
# రెండో విష్ణు వర్ధనుడు (క్రీ.శ. 673-82)
# మంగి యువరాజు (క్రీ.శ.682-706)
# రెండో జయసిండు (క్రీ.శ.706-718)
# మూడో విష్ణువర్ధనుడు (క్రీ.శ.719-755)
# మొదటి విజయాదిత్యుడు (క్రీ.శ.755-772)
# నాలుగో విష్ణు వర్ధనుడు (క్రీ.శ. 772-808)
# రెండో విజయాదిత్యుడు (క్రీ.శ.808-847)
# కలి విష్ణువర్ధనుడు (క్రీ.శ. 847-848)
# గుణగ విజయాదిత్యుడు (క్రీ.శ. 849-892)
# మొదటి చాళుక్యభీముడు (క్రీ.శ. 892-921)
# మొదటి అమ్మరాజు (క్రీ.శ.921-927)
# రెండో చాళుక్యభీముడు (క్రీ.శ. 934-945)
# రెండో అమ్మరాజు (క్రీ.శ. 945-970)
# దానార్ణవుడు (క్రీ.శ. 970-973)
# జటాచోడ భీముడు (క్రీ.శ. 973-999)
# శక్తివర్మ (క్రీ.శ. 1000-1011)
# విమలాదిత్యుడు (క్రీ.శ.1011-1018)
# రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ. 1019-1061)
వేములవాడ చాళుక్యుల్లో ముఖ్యరాజులు
# వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750-775)
# మొదటి అరికేసరి (క్రీ.శ.775-800)
# మొదటి నరసిండు (క్రీ.శ. 800-825)
# రెండో యుద్ధమల్లుడు (క్రీ.శ.825-850)
# బద్దెగ (క్రీ.శ.850-895)
# రెండో నరసిండు (క్రీ.శ.915-930)
# రెండో అరికేసరి (క్రీ.శ.930-955)
# వేగరాజు (క్రీ.శ. 955-960)
# రెండో బద్డెగుడు (క్రీ.శ.960-965)
# మూడో అరికేసరి (క్రీ.శ.965-973)
ప్రాక్టీస్ బిట్స్
1. స్వతంత్ర చాళుక్య రాజ్య స్థాపకుడైన మొదటి పులకేశి ఎవరి కుమారుడు?
ఎ) రణరాగుడు
బి) కీర్తివర్మ
సి) జయసింహవల్లభుడు
డి) మంగళేశుడు
2. కొంకణి ప్రాంతాన్ని పాలించిన మౌర్యులను, బనవాసి కదంబులను, బళ్ళారిని ఏలిన నలవంశీయులను ఓడించి కొంకణి వరకు రాజ్యాన్ని విస్తరించి వాతాపిని సుందర నగరంగా తీర్చిదిద్దిన బాదామి చాళుక్య రాజు?
ఎ) మంగళేశుడు బి) కీర్తివర్మ
సి) మొదటి పులకేశి డి) రెండోపులకేశి
3. నాటి ఉత్తర దేశ చక్రవర్తి హర్షుడిని ఓడించిన పశ్చిమ చాళుక్య వంశ రాజుల్లో అగ్రగణ్యుడిగా కీర్తింపబడినది ఎవరు?
ఎ) రెండో పులకేశి బి) కీర్తివర్మ
సి) విక్రమాదిత్యుడు డి) వినయాదిత్యుడు
4. దక్షిణాపథం మీద ఆధిపత్యాన్ని సంపాదించే ఉద్దేశంతో దిగ్విజయ యాత్రలను సాగించి కదంబ, గాంగ, ఆలూప, మౌర్య, లాట, మాళవ, ఘార్జర రాజులను జయించినట్లు తెలిపే శాసనం?
ఎ) రణస్తిపూడి బి) తుమ్మెయనూర్
సి) ఐనవోలు డి) నారాయణగిరి
5. చాళుక్య రాజ్యాన్ని పల్లవుల నుంచి కాపాడి వారికి సహాయ పడిన పాండ్య, చోళ, కలభ్రులను జయించి, చాళుక్యుల అధికారాన్ని మూడు సముద్రాల వరకు విస్తరించినవాడు?
ఎ) విజయాదిత్యుడు
బి) రెండో విక్రమాదిత్యుడు
సి) విజయాదిత్యుడు
డి) విక్రమాదిత్యుడు
6. ఎవరి కాలంలో రాష్ట్రకూటరాజు దంతిదుర్గుడు కర్ణాటకలో బాదామి చాళుక్యవంశాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టాడు?
ఎ) రెండో కీర్తివర్మ
బి) రెండో విక్రమాదిత్యుడు
సి) వినయాదిత్యుడు
డి) విజయాదిత్యుడు
7. విషమసిద్ధి, కామధేవ, మకరధ్వజ అనే బిరుదులున్న తూర్పు చాళుక్య రాజ్యస్థాపకుడు ఎవరు?
ఎ) మొదటి జయసిండు
బి) ఇంద్రభట్టారకుడు
సి) రెండో విష్ణువర్ధనుడు
డి) కుబ్జ విష్ణువర్ధనుడు
8. తూర్పు చాళుక్యుల నాటి మొదటి తెలుగు శాసనాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని విప్పర్ల గ్రామంలో ఎవరికాలంలో వేయించారు?
ఎ) మొదటి జయసిండు
బి) ఇంద్రభట్టారకుడు
సి) కుబ్జ విష్ణువర్ధనుడు
డి) రెండో విష్ణువర్ధనుడు
9. వేములవాడ చాళుక్య వంశానికి చెందిన అరికేసరి విష్ణువర్ధనుడిని ఓడించి వేంగి, కలింగను జయించినట్లు తెలియజేసిన శాసనం?
ఎ) తిమ్మాపురం శాసనం
బి) పర్బణి శాసనం
సి) సాతలూరు శాసనం
డి) కురవి శాసనం
10. ఎవరికాలంలో తూర్పు చాళుక్యుల అధికారం మహానది నుంచి పులికాట్ సరస్సు వరకు వ్యాపించింది?
ఎ) గుణగ విజయాదిత్యుడు
బి) రెండో విజయాదిత్యుడు
సి) మొదటి చాళుక్య భీముడు
డి) మొదటి అమ్మరాజు
సమాధానాలు
1-ఎ 2-బి 3-ఎ 4-సి 5-డి 6-ఎ 7-డి 8-ఎ 9-బి 10-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు