ఏ మొక్కల్లో వేరు తొడుగుకు బదులు రూట్ పాకెట్స్ ఉంటాయి?
వృక్ష ప్రపంచం (Plant world)
పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం (Morphology of Flowering plants)
– మొక్క భాగాలైన వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం మొదలైన వాటి స్వరూపాన్ని గురించిన అధ్యయనాన్ని స్వరూపశాస్త్రం (Morphology) అంటారు.
వేరు (Root)
# విత్తనం మొలకెత్తినప్పుడు మొదటగా ఏర్పడే నిర్మాణాన్ని ప్రథమ మూలం (Radicle) అని, భూమిపైకి పొడుచుకుని వచ్చే నిర్మాణాన్ని ప్రథమ అక్షం/ప్రథమ కాండం (Plumule) అని అంటారు.
– వేరు ప్రథమ మూలం నుంచి ఏర్పడుతుంది.
– వేరుపై కణుపులు (Nodes), కణుపు మధ్యమాలు (Inter nodes) ఉండవు.
– వేరు కొనభాగం వేరు తొడుగుచే రక్షించబడి ఉంటుంది. కానీ పరాన్నజీవ వేర్లు, పూతికాహార వేర్లు, వృక్షోపజీవ వేర్లకు వేరు తొడుగు ఉండదు.
– నీటిపై తేలియాడే మొక్కల్లో వేరు తొడుగుకు బదులుగా రూట్ పాకెట్స్ ఉంటాయి.
– వేరు తొడుగు పోయినా తిరిగి ఏర్పడగలదు. కానీ రూట్ పాకెట్ పోతే తిరిగి ఏర్పడలేదు.
వేరు విధులు (Functions of root)
# వేరు మొక్కను భూమిలో స్థాపించి స్థిరత్వాన్ని ఇస్తుంది.
– మృత్తిక నుంచి నీటిని, ఖనిజ లవణాలను శోషిస్తుంది.
– ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది.
– మృత్తికా క్రమక్షయాన్ని నివారిస్తుంది.
– కరివేప, వేప మొక్కల్లో వేరు మొగ్గలు ప్రత్యుత్పత్తికి తోడ్పడుతాయి.
వేరువ్యవస్థ-రకాలు (Types of root system)
– ఇది రెండు రకాలుగా ఉంటుంది. అవి 1. తల్లివేరు వ్యవస్థ, 2. పీచువేరు వ్యవస్థ (Fibrous root system).
1. తల్లివేరు వ్యవస్థ (Tap root system): ద్విదళబీజ మొక్కలు (Dicotyledons).. అంటే చిక్కుడు, బఠాని, వేరుశనగ, ఆవాలు, మందార, వేప, మామిడి మొదలైనవి తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.
2. పీచువేరు వ్యవస్థ (Fibrous root system): ఏకదళ బీజాలు (Monocoty ledons).. అంటే వరి, గోధుమ, ఆస్పరాగస్ మొదలైన మొక్కలు పీచువేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. వేరు ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్క ఇతర భాగాల నుంచి ఏర్పడితే దాన్ని అబ్బురపు (Adven titious root) వేరు అంటారు. మాన్స్టెరా, మరిచెట్టులో ఈ రకమైన వేర్లు ఉంటాయి.
– నీటిలో పెరిగే ఉల్ఫియా, యుట్రిక్యులేరియా మొక్కల్లో వేర్లు ఉండవు.
వేరు రూపాంతరాలు (Modifications of Root)
వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి వేర్లలో కలిగే మార్పులను వేరు రూపాంతరాలు అంటారు. ఈ వేరు రూపాంతరాలు ప్రధానంగా ఐదు రకాలుగా ఉంటాయి.
నిల్వచేసే వేర్లు/దుంపవేర్లు (Storage roots/ Tuberous roots)
– కొన్ని రకాల మొక్కల వేర్లలో ఆహారపదార్థం నిల్వ ఉంటుంది. ఇలాంటి వేర్లనే నిల్వ వేర్లు లేదా దుంప వేర్లు అంటారు.
ఉదా:
-డాకస్ కరోటా (క్యారెట్)
-రఫానస్ సటైవం (ముల్లంగి (Radish), టర్నిప్
-చిలగడదుంప/మొరంగడ్డ (Sweet Potato)
– ఆస్పరాగస్
– బీటా వల్గారిస్ (బీట్ రూట్)
ఊడవేర్ల్లు/స్తంభాలవంటి వేర్లు (Prop roots/ Pillar roots)
– భారీ వృక్షాల కొమ్మల నుంచి వేర్లు ఏర్పడుతాయి. వీటినే ఊడలు అంటారు. ఈ ఊడలు కొమ్మలు వంగిపోయి విరగకుండా ఆధారాన్ని ఇస్తాయి. అందుకే వీటిని ఊడవేర్లు/స్తంభాలవంటి వేర్లు అంటారు.
ఉదా: ఫైకస్ బెంగాలెన్సిస్ (మరిచెట్టు) – మన జాతీయ వృక్షం
-కొన్ని రకాల మొక్కల కాండాల నుంచి వేర్లు పెరిగి ఆయా మొక్కలు వంగిపోకుండా ఊతాన్ని ఇస్తాయి. వీటిని ఊతవేర్లు అంటారు.
ఊతవేర్లు (Stilt roots)
ఉదా: చెరుకు, మొక్కజొన్న, జొన్న, వెదురు (Bamboo), మొగలి (Pendanus).
-చిత్తడి ప్రదేశాల్లో పెరిగే కొన్ని రకాల మొక్కల వేర్లు శ్వాసక్రియ విధులు నిర్వహిస్తాయి. ఇలాంటి వేర్లను శ్వాసవేర్లు అంటారు.
శ్వాసించే వేర్లు/శ్వాస మూలాలు (Pneumato Phores)
ఉదా: రైజోఫొరా, అవిసీనియా
వెలామిన్ వేర్లు (Velamen roots)
ఉదా: వాండా, వానిళ్ల
హాస్టోరియల్ వేర్లు/పరాన్నజీవ వేర్లు (Hastorial roots/Parasistic roots)
ఉదా: విస్కమ్, స్ట్రెయిగా, కస్క్యుటా, రఫ్లీషియా
బుడిపెవేర్లు (Nodular roots): ఉదా: ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కలు (కంది, పెసర, బఠాని, చిక్కుడు, వేరుశనగ, గ్లెరిసీడియా)
స్వాంగీకరణ వేర్లు/కిరణజన్య సంయోగక్రియ వేర్లు (Assimilatory roots/ Photosynt hetic roots):
ఉదా: టీనియోఫిల్లమ్
సంతులనం జరిగే వేర్లు (Balancing roots): ఉదా: ఫిస్టియా (అంతరతామర)
కాండం (The Stem)
– కాండం సాధారణంగా ప్రథమ అక్షం/ప్రథమ కాండం నుంచి ఏర్పడుతుంది.
– శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలను కలిగి నిటారుగా పెరిగే అక్షాన్ని కాండం అంటారు.
-కాండం కణుపులను, కణుపు మధ్యమాలను కలిగి ఉంటుంది. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కణుపులు అంటారు. రెండు కణుపుల మధ్య భాగాలను కణుపు మధ్యమాలు అంటారు.
– కాండం మొగ్గలను అగ్రస్థంగా (Termi nal)/గ్రీవస్థంగా (Axillary) కలిగి ఉంటుంది.
కాండం విధులు (Functions of root)
-ఇది పత్రాలు, ఫలాలు, పుష్పాలు కలిగిన శాఖలను విస్తరింపజేస్తుంది.
-ఇది నీరు, ఖనిజాలను, కిరణజన్య సంయోగ క్రియోత్పన్నాలను సరఫరా చేస్తుంది.
– కొన్ని మొక్కల్లో కాండాలు ఆహారాన్ని నిల్వ చేయడం, శాఖీయ వ్యాప్తి, యాంత్రిక బలాన్ని అందజేయడం, రక్షణ లాంటి ఇతర విధులను నిర్వర్తిస్తాయి.
కాండం రూపాంతరాలు (Modifications of stem)
-వివిధ రకాల విధులు నిర్వర్తించడం కోసం కాండంలో కలిగే మార్పులను కాండ రూపాంతరాలు అంటారు. కాండ రూపాంతరాలు కింది రకాలుగా ఉంటాయి.
1. భూగర్భ కాండ రూపాంతరాలు (Undergro und stem modifications)
-భూగర్భ కాండాలు కింది రకాలుగా రూపాంతరం చెందుతాయి.
దుంప కాండం (Stem tuber)
ఉదా: సోలనం ట్యూబరోజం (ఆలుగడ్డ)
కొమ్ము (Rizom)
ఉదా: జింజిబర్ (అల్లం), కర్క్యుమా (పసుపు)
కందం (Corm)
ఉదా: అమర్ఫోఫాలస్ (కంద-Zamikand), కొలకేసియా (చామగడ్డ)
లశునం (Bulb)
ఉదా: అలియం సెపా (నీరుల్లి)
2. వాయుగత కాండ రూపాంతరాలు (Aerial stem modifications)
– వాయుగత కాండాలు కింది విధంగా రూపాంతరం చెందుతాయి.
కాండ నులితీగలు (Stem tendrils)
ఉదా: కుకుంబర్ (దోస), గుమ్మడి, పుచ్చ, ద్రాక్ష
ముళ్లు (Thorns)
ఉదా: సిట్రస్ (నిమ్మజాతి మొక్కలు), బోగన్ విల్లియా (కాగితపు పూలచెట్టు)
పత్రాభ కాండాలు (Phylloclades)
ఉదా: ఒపన్షియా (బ్రహ్మజెముడు), యుఫోర్బియా (నాగబాలు), కాజురైనా (సరుగుడు)
క్లాడోఫిల్లు (Cladophylls)
ఉదా: ఆస్పరాగస్ (పిల్లి తీగలు)
లఘు లశునాలు (Bulbils)
ఉదా: డయాస్కోరియా – శాఖీయ కోరకాలు, అగేవ్ కిత్తనార – పుష్ప కోరకాలు
కొక్కేలు (Hooks)
ఉదా: ్యగోనియా
3. ఉపవాయుగత కాండ రూపాంతరాలు (Sub-aerial stem modifications)
– ఉపవాయుగత కాండ రూపాంతరాలు ఈ కింది విధంగా ఉంటాయి.
రన్నర్లు (Runners)
ఉదా: కొన్ని గడ్డి మొక్కలు, స్ట్రాబెరి (భూగర్భ కాండాలు), ఆక్సాలిస్ (ఉపవాయుగత కాండం)
స్టోలన్లు (Stolon)
ఉదా: నీరియం (గన్నేరు), జాస్మిన్ (మల్లె)
ఆఫ్సెట్లు (Off sets)
ఉదా: ఫిస్టియా (అంతర తామర), ఐకార్నియా (బుడగ తామర/గురపు డెక్క/బెంగాల్ జాతి)
పిలక మొక్కలు (Suckers)
ఉదా: అరటి, అనాస, కైసాంథిమమ్ (చామంతి)
పత్రం (The Leaf)
కాండం, శాఖలపై పార్శంగా ఏర్పడే, బల్లపరుపుగా ఉండే నిర్మాణాన్ని పత్రం అంటారు.
– పత్రం కణుపు వద్ద అభివృద్ధి చెంది గ్రీవంలో మొగ్గను (Axillary bud) కలిగి ఉం టుంది. ఈ గ్రీవపు మొగ్గ తర్వాత శాఖగా అభివృద్ధి చెందుతుంది.
– ఒక సాధారణ పత్రంలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి.. పత్ర పీఠం (Leaf base), పత్రవృంతం (Petiole), పత్రదళం (Leaf lamina).
ఈనెల వ్యాపనం (Venation)
-పత్రదళంలో ఈనెలు వలలాగా ఏర్పడితే దాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు.
ఉదా: ద్విదళబీజ మొక్కల పత్రాలు
– పత్రదళంలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా అమరివుంటే దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు.
ఉదా: అనేక ఏకదళబీజ మొక్కల పత్రాలు
-ఈనెలు పత్రదళానికి పటుత్వాన్ని కలుగజేస్తాయి.
– ఈనెలు నీరు, ఖనిజాలు, పోషక పదార్థాల రవాణాకు మార్గాలుగా ఉంటాయి.
పత్ర విన్యాసం (Phyllotaxy)
– కాండంపైన/శాఖలపైన పత్రాలు అమరివుండే విధానాన్ని పత్రవిన్యాసం అంటారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది. అవి..
1. ఏకాంతర పత్రవిన్యాసం (Alternate Phyllotaxy):
ఉదా: మందార (హైబిస్కస్ రోజాసైనెన్సిస్), ఆవ (Mustard), సూర్యకాంతం (పొద్దు తిరుగుడు) (Sun Flowers).
2. అభిముఖ పత్రవిన్యాసం (Opposite Phy llotaxy):
ఉదా: జిల్లేడు (కెలోట్రోపిస్), జామ (Guava).
3. చక్రీయ పత్రవిన్యాసం (Whorled Phyllotaxy):
ఉదా: గన్నేరు (నీరియం), ఆల్స్టోనియా (Alstonia)
పత్ర రూపాంతరాలు (Modifications of Leaves)
– కిరణజన్యసంయోగ క్రియ కాకుండా వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి పత్రంలో కలిగే మార్పులను పత్ర రూపాంతరాలు అంటారు. ఇవి ఈ కింది రకాలుగా ఉంటాయి.
-నులితీగలు (Tendrils): ఉదా: బఠాని
– కంటకాలు (Spines): ఉదా: ఒపన్షియా
– కండగల పత్రాలు (Fleshy leaves):
ఉదా: నీరుల్లి (Onion), వెల్లుల్లి (Garlic)
– ప్రభాసనాలు (Phyllodes): ఉదా: ఆస్ట్రేలియా తుమ్మ (ఆస్ట్రేలియన్ అకేసియా)
-కీటకాహార (బోను)/మాంసాహార పత్రాలు (Insectivorous)/Carnivorous)
ఉదా: డయోనియా – Venusfly Trap
నెపంథిస్ – కూజా మొక్క (Pitcher Plant)
యుట్రిక్యులేరియా – (Bladder wort)
డ్రాసిరా – (Sundew Plant)
-ప్రత్యుత్పత్తి పత్రాలు (Reproductive leaves) ఉదా: బ్రయోఫిల్లం (రణపాల)
పత్రం విధులు (Functions of leaf)
-కిరణజన్య సంయోగక్రియ.
– పత్రరంధ్రాల ద్వారా వాయువుల మార్పిడి.
-పత్రరంధ్రాల ద్వారా భాష్పోత్సేకం.
గమనిక: పత్రరంధ్రాల ద్వారా నీటిని ఆవిరిరూపంలో కోల్పోవడాన్ని భాష్పోత్సేకమని, బిందువుల రూపంలో కోల్పోవడాన్ని బిందుస్రావమని (గట్టేషన్) అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. అతిపెద్ద విత్తనం కలిగిన మొక్క ఏది?
1) ఆర్కిడ్ 2) లొడీసియా మాల్దీవికా
3) 1, 2 4) రఫ్లీషియా
2. ఏ మొక్కల్లో విత్తనాలు మొలకెత్తినప్పుడు బీజదళాలు భూమిలోపలే ఉంటాయి?
1) మొక్కజొన్న 2) బఠానీ
3) 1, 2 4) చిక్కుడు
3. ప్రత్యుత్పత్తి పత్రాలుగల మొక్క ఏది?
1) బ్రయోఫిల్లం (రణపాల)
2) డయోనియా
3) ఒపన్షియా 4) నీరుల్లి
4. నులితీగల (Tendrils)ను ఏ మొక్కల్లో చూడవచ్చు?
1) ఆవ 2) గన్నేరు
3) బఠానీ 4) ఆల్స్టోనియా
5. అల్లం, పసుపు దేని రూపాంతరం?
1) కాండం 2) వేరు
3) పత్రం 4) పుష్పం
6. ఏకాంతర పత్ర విన్యాసం (alternate Phyllotaxy) ఏ మొక్కల్లో చూడవచ్చు?
1) మందార 2) జిల్లేడు
3) గన్నేరు 4) జామ
7. వేటిలో మనం పిలక మొక్కలను చూడవచ్చు?
1) అరటి 2) అనాస
3) చామంతి 4) పైవన్నీ
8. అబ్బురపు వేరువ్యవస్థగల వృక్షం ఏది?
1) వేప 2) మామిడి
3) దానిమ్మ 4) మరి
1-2, 2-3, 3-1, 4-3,
5-1, 6-1, 7-4, 8-4.
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?