ఏడో నిజాం- పరిపాలనాసంస్కరణలు
మీర్ ఉస్మాన్ అలీఖాన్ (క్రీ.శ. 1911-1948)
-క్రీ.శ. 1911లో తన తండ్రి మీర్ మహబూబ్ అలీఖాన్ మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించాడు. అసఫ్‌జాహీ వంశపాలకుల్లో చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇతన్నే ఏడో నిజాం అంటారు. తన తొలి సంవత్సరాల పాలనాకాలంలో అనేక సంస్కరణలు చేశాడు. ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి జిల్లాల్లో పర్యటించాడు. రాజు పర్యటన సమయంలో ధనికులు, పేదలు నజర్ (కానుక) సమర్పించుకునే ఆనవాయితీ ఉంది. దీనిని తప్పనిసరి చేశాడు.
హిజ్ ఎగ్జాల్టెట్ హైనెస్
– బ్రిటీష్‌వారు ‘హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్’ అనే బిరుదును ఇచ్చి 25 తుపాకీగుళ్ల సైనికవందనంతో మీర్ మహబూబ్ అలీఖాన్‌ను సత్కరించారు. ఇలాంటి అత్యున్నతగౌరవాన్ని పొందిన సంస్థానాదీశుడు ఇతడొక్కడే.
నిజాం బిరుదులు
– ప్రజలు నిజాంను అనేక రకాల బిరుదులతో పిలిచేవారు. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఫతేజంగ్, ఫెయిత్పుల్ టు బ్రిటీష్ గవర్నమెంట్, ఆలా హజ్రత్ రుస్తుంకు ధీటైనవాడని ప్రజలు నిజాంను అభిమానించేవారు.
గొప్ప పరిపాలనాధ్యక్షుడు
– ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ చాలా సమర్థుడు. ఇతని కాలంలో హైదరాబాద్ రాజ్యం పరిపాలన, రవాణా, విద్య, పారిశ్రామిక, ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. పాలనావ్యవస్థలో ఏడో నిజాం తీసుకవచ్చిన మార్పులే, అభివృద్ధికి సోపానాలుగా మారాయి. అయితే నిజాం చివరి పాలనా సంవత్సరాల్లో కొన్ని ప్రజా ఉద్యమాలు జరిగి, కొంత అశాంతి ఏర్పడింది.
పరిపాలనాసంస్కరణలు
– దివాన్‌గా పనిచేస్తున్న మహారాజా కిషన్ ప్రసాద్‌ను 1912లో తొలగించాడు. 1901 నుంచి ఆయన దివాన్‌గా ఉన్నారు.
దివాన్‌గా మూడో సాలార్జంగ్
– కిషన్ ప్రసాద్ స్థానంలో దివాన్ (ప్రధానమంత్రి)గా మూడో సాలార్జంగ్ను 1912లో నియమించాడు. మూడో సాలార్జంగ్ అసలు పేరు మీర్ యూసఫ్ అలీఖాన్. ఇతడు 1914 వరకు దివాన్ పదవిలో ఉన్నాడు.
సర్ అలీఇమామ్
– 1919లో అలీఇమామ్ను దివాన్‌గా నియమించాడు. కొంతకాలం న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అలీఇమామ్ అప్పట్లో గొప్పపేరున్న ప్లీడర్. ఇతడు నజరానా పద్ధతిని ఆపేశాడు. సమర్థులైనవారికే ఉద్యోగాలిచ్చాడు. లంచగొండితనం నిర్మూలించేందుకు కృషి చేశాడు. హిందూ-ముస్లిం అనే భేదం చూపకుండా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను పై చదువుల కోసం విదేశాలకు వెళ్లడానికి ఉపకారవేతనం ఇచ్చేవాడు.
1919 సంస్కరణల ప్రభావం
– 1919లో భారతదేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణల ప్రభావం నిజాం రాజ్యంపై కూడా పడింది. రాయ్‌బల్ ముకుంద్‌ను ప్రత్యేక అధికారిగా నియమించి, రాజ్యాంగ సంస్కరణల గురించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆనాటి ప్రధానమంత్రి అలీఇమామ్ను కోరాడు.
అలీఇమామ్ తొలగింపు
– నిజాం సంస్థానంలో ముస్లిం జనాభా పెంచాలనే ఆలోచనతో మాప్లా (మలబార్ ప్రాంతం) జాతి వారిని రప్పించి వారికి పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాడు. అయితే హిందువుల మీద అనే క అత్యాచారాలు జరిపేవారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన హిందూ నాయకులు రెసిడెంట్‌కు మహజర్లు సమర్పించారు. తమ నిరసనను తెలిపారు. అప్పటికే రాజ్యాంగ సంస్కరణలను, అదేవిధంగా నజరానా పద్ధతిని రద్దు చేశాడు. దీంతో అలీఇమామ్పై గురుగా ఉన్న నిజాం, ఈసాకుతో అలీఇమామ్ను పదవి నుంచి తొలగించి, ఒప్పందం ప్రకారం రెండేండ్ల వేతనాన్ని ఇచ్చి, ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి సాగనంపాడు.
ప్రధానిగా కిషన్‌ప్రసాద్
– బ్రిటీషువారి జోక్యంతో మహారాజా కిషన్ ప్రసాద్‌ను ప్రధానమంత్రిగా నియమించాడు. ప్రధానమంత్రిగా కిషన్‌ప్రసాద్, కొత్వాల్‌గా రాజాబహదూర్ వెంకట్రామ్ రెడ్డిలు చేసిన కృషితో రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం
-ప్రభుత్వానికి అధిపతి రాజు అయినప్పటికీ, పరిపాలనలో సహాయం కోసం శాసన, కార్యనిర్వాహక శాఖలు ఉండేవి.
కార్యనిర్వాహక శాఖ
– కార్వనిర్వాహక శాఖకు ప్రధానమంత్రి అధ్యక్షుడు. ఏడుగురు మంత్రులుండేవారు. ఈ సభ రాజుకు పూర్తిగా సహకరిస్తుంది. వీరికి సహాయం చేయడానికి సెక్రటరీలుండేవారు.
శాసనశాఖ
– శాసనశాఖకు ప్రధానమంత్రి అధ్యక్షుడు. ఏదేని ఒక శాఖమంత్రి ఉపాధ్యక్షుడిగా ఉండేవాడు. 23 మంది సభ్యులుండేవారు. అధికారుల పాలనను ప్రశ్నించే హక్కు, బడ్జెట్ గురించి మాట్లాడే హక్కు ఈ సభకు లేవు. ఈ సభ నిర్ణయాల్ని అమలు చేయడం, సవరించడం మొదలైన అధికారాలు రాజుకు ఉన్నాయి. నిజాం తాను చేసిన వాగ్ధానం ప్రకారం (ఈ సభలో సభ్యుల సంఖ్యను పెంచుతానని వాగ్ధానం చేశాడు) అరువముదు అయ్యంగార్ కమిటీ నివేదికను అనుసరించి ఈ సభ సభ్యుల్ని పెంచాడు. కానీ ఈ సంస్కరణ అమలవ్వలేదు.
సుభా
– పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాలుగు సుభాలుగా విభజించాడు. అవి ఔరంగాబాద్, గుల్బర్గా, మెదక్, వరంగల్లు. సుభా పై అధికారి సుబేదార్. శాంతిభద్రతలను కాపాడటం రెవెన్యూ వసూళ్లు, జిల్లా కు చెందిన అధికారులపై ఆజమాయిషీ చేయడం మొదలైన విధుల్ని నిర్వహించే వారు సుబేదార్లు.
జిల్లా
– నిజాం తన రాజ్యంలో 17 జిల్లాల్ని ఏర్పాటు చేశాడు. కర్ణాటకలోని గుల్బర్గా సుభాలో, మూడు జిల్లాలు ఔరంగాబాద్ సుభాలో ఐదు జిల్లాలు, తెలంగాణలోని మెదక్, వరంగల్ సుభాల్లో 9 జిల్లాలుండేవి.
డివిజన్లు
– ప్రతి జిల్లాను 2 లేదా 3 డివిజన్లుగా విభజించారు.
తాలూకాలు
– డివిజన్లు తాలూకాలుగా విభజించారు. ప్రతి డివిజన్లో 2 లేదా 3 తాలూకాలుండేవి. దీనికి పాలకుడు తహసీల్దార్.
– తాలూకాను 3 లేదా 4 సర్కిల్లు లేదా హల్కాలుగా విభజించారు. వాటిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్లుండేవారు.
గ్రామం
– పరిపాలనలో చివరిది గ్రామం. మాలి పటేల్ (భూమిశిస్తు వసూల్), పోలీస్ పటేల్(శాంతిభద్రతలు), పట్వారీ( భూమి రికార్డులు, శిస్తు) మొదలైన అధికారులు గ్రామస్థాయిలో ఉండేవారు. నీరడి (చెరువుల పర్యవేక్షణ), సేతుసింధి (శాంతిభద్రతల వార్తలు, ప్రకటనలు), తలారి(శిస్తు వసూళ్లలో సహాయం చేసేవాడు) తదితర అధికారులుండేవారు.
ఉస్మాన్‌సాగర్
– ఉస్మాన్సాగర్నే గండిపేట చెరువు అంటారు. దీనిని మూసీ వరదల నివారణ కోసం నిజాం నిర్మించాడు. ఇది హైదరాబాద్ ప్రజల నీటి కొరతను తీర్చిన మొట్టమొదటి జలాశయం.
-హిమాయత్‌సాగర్: మూసీ ఉపనది ‘ఈసా లేదా ఈసీ’పై హిమాయత్‌సాగర్ నిర్మించబడింది.
– నిజాంసాగర్: ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో మంజీరానదిపై నిజాంసాగర్‌ను నిర్మించాడు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది.
– పోచారం చెరువు: ఈ చెరువును రూ. 34,00,000ల ఖర్చుతో నిర్మించాడు. దీనికింద 1300 ఎకరాలు సాగవుతుంది. దీన్ని 1922లో నిర్మించాడు.
– రాయంపల్లి చెరువు: ఇది మెదక్ జిల్లాలో ఉంది.
-పాలేరు చెరువు: ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది పాలేరు నదిపై నిర్మించబడింది.
– వైరాప్రాజెక్టు: దీనిని వైరా నదిపై నిర్మించారు. ఇది ఖమ్మం జిల్లాలో ఉంది.
– వీటితోపాటు ఫతేనగర్ చెరువు, డిండిప్రాజెక్ట్, బేనూర్ ప్రాజెక్టు మొదలైన వాటిని నిర్మించాడు.
– పరిశ్రమలు: పరిశ్రమల స్థాపన అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేశాడు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిశ్రమలు స్థాపించి నీళ్లు, విద్యుత్, భూమి వంటి వసతులు కల్పించాడు.
-కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్: దీనిని 1918 లో స్థాపించారు.
– ఆజంజాహీ బట్టలమిల్లు: 1922లో వరంగల్ జిల్లాలో స్థాపించారు. ఇది బట్టలను ఉత్పత్తి చేసే పరిశ్రమ.
– ఉస్మాన్‌షాహీ బట్టల మిల్లు: ఇది 1925లో నాందేడ్‌లో స్థాపించబడింది.
– సిమెంట్ పరిశ్రమ: షాబాద్ వద్ద 1931లో స్థాపించబడింది.
– బొగ్గు పరిశ్రమ: 1932లో కొత్తగూడెం (ఖమ్మం జిల్లా)లో స్థాపించబడింది.
– చార్మినార్ సిగరెట్ కంపెనీ: దీనిని 1919లో హైదరాబాద్‌లో స్థాపించారు. దీన్నే హైదరాబాద్ చార్మినార్ కంపెనీ అని కూడా అంటారు.
– బటన్ఫ్యాక్టరీ: ఇది 1916లో స్థాపించబడింది.
– సిర్పూర్ కాగజ్మిల్లు: ఈ మిల్లును 1942లో సిర్పూర్ (ఆదిలాబాద్ జిల్లా)లో నిర్మించారు.
-వజీర్‌సుల్తాన్ టొబాకో కంపెనీ: ఈ కంపెనీని విఠల్‌వాడిలో 1916లో నిర్మించాడు. దీన్ని 1930లో ముషీరాబాద్, ఆజామాబాద్ ప్రాంతానికి మార్చారు.
– ఆల్విన్ మెటల్ వర్క్ కంపెనీ: దీన్నీ 1942లో హైదరాబాద్‌లో స్థాపించాడు.
– ప్రాగాటూల్స్ కంపెనీ: ఈ కంపెనీని 1943లో కవాడిగూడ (సికింద్రాబాద్) దగ్గర స్థాపించారు. దీన్ని ప్రాగాటూల్స్ లిమిటెడ్ పేరుతో డిఫెన్స్శాఖకు అప్పగించారు.
– సింథటిక్ బయోకెమికల్స్ కంపెనీ: 1942లో సనత్‌నగర్‌లో స్థాపించారు.
– ఆస్బేస్టాస్ రేకుల కంపెనీ: ఈ కంపెనీని 1946లో సనత్‌నగర్‌లో స్థాపించారు.
– ఖారానా జిందా తిలిస్మాత్: ఈ కంపెనీని జిందాతిలిస్మాత్, ఫారూకి పళ్లపొడి, జిందాబామ్ మొదలైన వాటిని ఇది ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 1920లో హకీం మహమ్మద్ మొహీనుద్దీన్ ఫారూకి హైదరాబాదులో స్థాపించాడు.
– సింగరేణి కాలరీస్: సింగరేణి గ్రామం (ఖమ్మం జిల్లా)పేరుతో సింగరేణిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బొగ్గు గనులు బయటపడ్డాయి. లండన్‌కు చెందిన హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ బొగ్గు గనులు తవ్వింది. 1920 తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీ) అనే కొత్త సంస్థ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కంపెనీ పరిపాలనా బాధ్యతల్ని చేపట్టింది.
– దక్కన్ విమానయాన సంస్థ (1945): బేగంపేటలో నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా స్థాపించబడ్డాయి. క్రీ.శ 1953లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో కల్సిపోయాయి.
– సెంట్రల్ బ్యాంక్: 1941లో నెలకొల్పిన ప్రభుత్వ బ్యాంక్ ఇది. ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా సిక్కా ను ప్రవేశపెట్టాడు. దీన్ని ఉస్మాన్‌అలీఖాన్ స్థాపించాడు. మొదట దీన్ని హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అని పిలిచేవాడు. ప్రస్తుతం దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తున్నారు. ఇది స్టేట్ బ్యాంక్‌గా ఉండేది. బ్రిటీష్ ఇండియాలో నిజాం రాజు మాత్ర మే సొంత కరెన్సీ చెలామణి చేసుకునే హక్కును కలిగి ఉండేవాడు. 1918లో నిజాం రాజు తన సొంత వెయ్యి రూపాయల నోటును జారీ చేశాడు.
మధుసూదన్ బోయిన
నారాయణ ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్.
9440082663
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు