కాకతీయుల కాలంలో సప్తసంతానం
ఆర్థిక విధానం
# వ్యవసాయ రంగం – కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి అనేక చెరువులు, తటాకాలు నిర్మించారు. ఈనాటికి భారతదేశంలో వీరికాలం నాటి..
#కే సముద్రం – దీన్ని మొదటి ప్రోలరాజు కేసముద్రం అనే గ్రామంలో నిర్మించాడు. ఇది బృహత్ తటాకం నేటికీ పంటపొలాలకు నీరు అందిస్తున్నది.
# గణపతి దేవుని కాలంలో చెరువులను ఎక్కువగా నిర్మించారు. చెరువుల నిర్మాణాన్ని కాకతీయులు ‘సప్తసంతానంలో’ ఒకటిగా భావించేవారు. సప్తసంతానం అంటే..
1. స్వసంతానం 2. వనఃప్రతిష్ఠ 3. దేవాలయ నిర్మాణం 4. అగ్రహార నిర్మాణం 5. ప్రబంధ రచన 6. ధన నిక్షేపం 7. తటాక నిర్మాణం. వీటి అన్నింటిలో తటాక నిర్మాణం మిన్నగా భావించే వారు
కాకతీయులు నిర్మించిన చెరువులు..
1. రామప్ప 2. పాకాల 3. లక్నవరం
4. రుద్రసముద్రం 5.ఉదయసముద్రం
6. తిప్పసముద్రం 7. బయ్యారం చెరువు మొదలైనవి.
# ఆనాటి కాకతీయుల చెరువుల నిర్మాణం, వాటి ద్వారా చేసే వ్యవసాయ విధానం ప్రపంచానికే తలమానికం.
# మేళ్లచెర్వు: ఇక్కడి శాసనంలో ‘తటాకాల’ నిర్మాణం గురించి, వాటిద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు వివరించెను. అంటే ఒక రకంగా నేటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ వంటిది. ఈ మిషన్ కాకతీయ అనే ఆలోచన తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ దేశానికే తలమానికం అనడంలో సందేహం లేదు.
# పాకాల శాసనం: ఈ శాసనంలో కాకతీయుల కాలంనాటి వర్షపాతం గురించిన వివరాలు పొందుపర్చారు. సరైన వర్షపాతం కురవడం వల్ల ఓరుగల్లు ప్రాంతంలో ‘సువాసనలు’ వెదజల్లే బియ్యం (అంటే ప్రస్తుతం బిర్యాని రైస్ బాస్మతి వంటివి) అత్యధికంగా పండించే వారని ఇటలీ దేశానికి చెందిన మార్కొపోలో రాసిన గ్రంథం ‘నా యాత్రలు’లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు.
# మార్కొపోలో 1292లో దక్షిణ భారతదేశంలో కేవలం రెండు రాజ్యాలను మాత్రమే సందర్శించాడు.
1. పాండ్య రాజధాని ‘మధురై’లోని జటావర్మ కులశేఖర రాజు ఆస్థానాన్ని సందర్శించి మధురై సంపన్న నగరం అని పొగడాడు.
2. కాకతీయుల ఓరుగల్లు రాజ్యంలోని రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించి, రుద్రాంబ అద్భుతమైన వీరనారిగా ధైర్యసాహసాలు గల వనితగా పొగిడినాడు.
పాకాల చెరువు
# గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు మానేరు మీద 12 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి 17,258 ఎకరాల సాగు చేయగల పాకాల చెరువును తవ్వించాడు. ఈ రేచర్ల రుద్రుడు 8 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న రామప్ప చెరువును కూడా తవ్వించాడు.
# మేళ్లచెర్వు శాసనంలో చెరువుల గురించి వాటి నిర్మాణాల గురించిన వివరాలు కలవు. వాటిలో డ సముద్రం, గౌరసముద్రం, చింతననామ సముద్రం ముఖ్యమైనవి. రైతులు వరి, గోధుమ, కొరలు, జొన్నలు, నీలిమందు, పత్తి, అల్లం, ఉల్లి వంటి పంటలను పండించేవారు. వీరికి ఈ కాలువల ద్వారా పొలాలకు నీటి సౌకర్యం లభించేది.
1. మూసీనది నుంచి సాగే మూసేటి కాలువ వరకు
2. ఆలేరు నది నుంచి ఆలేటి కాలువ వరకు
3. కూచినేని కాలువ
4. బొమ్మకంటి కాలువ
5. రావిపాటి కాలువ మొదలైనవి. ప్రతాపరుద్రుడు అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మార్చి, కాకతీయ రాజ్యాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దాడు.
సామాజిక విధానం
#కాకతీయుల కాలంనాటి సమాజంలో ‘కులాలు’ ప్రధానంగా ఉండేవి. ప్రతి కులంలోనూ ఉపకులాలు ఉండేవి. ఏకామ్మనాథుని ‘ప్రతాపరుద్ర చరిత్ర’ వినుకొండ వల్లభుని ‘క్రీడాభిరామం’లో వృత్తుల గురించి వివరాలు ఉన్నా యి. హిందూమతాన్ని సంస్కరించే ఉద్దేశంతో శైవ, వైష్ణవ మతాలు వచ్చాయి. కులనిర్మూలన కోసం పుట్టిన వీటివల్ల సంఘంలో కొత్తకులాలు ఏర్పడటం విచిత్రం. అలా శైవుల్లో లింగాయతులు, బలిజలు, తంబళ్లుమొదలగు ఉపకులాలు ఏర్పడినవి. వైష్ణవుల్లో నంబులు, సాతానులు, దాసర్లు మొదలైన కులాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో బాల్య వివాహాలు జరిగేవి. అనులోమ (ఎక్కువ వర్ణంగల పురుషుడు తక్కువ వర్ణం గల స్త్రీని వివాహం చేసుకోవడం), ప్రతిలోమ (ఎక్కువ వర్ణంగల స్త్రీ, తక్కువ వర్ణం గల పురుషున్ని వివాహం చేసుకోవడం) వివాహాలు జరిగేవి.
ఉదా : రుద్రమదేవి కుమార్తె రుయ్యమ్మను బ్రాహ్మణ మంత్రి అన్నయ్యదేవుడు పెళ్లిచేసుకున్నాడు (1323 సంవత్సరంలో జూనాఖాన్ ఇతన్ని బంధించి ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఫిరోజ్షా తుగ్లక్ ఇతన్ని ఇస్లాంలోకి మార్చి ‘మాలిక్ మక్బూల్’గా పేరుపెట్టి తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. అనంతాచార్యులకు (వైష్ణవులు) శూద్ర మహిళతో సంబంధం, మాచల్దేవికి, రెండో ప్రతాపరుద్రునితో గల సంబంధం నాటి సామాజిక స్థితిగతులకు నిదర్శనాలు.
#నాటి సమాజంలో వెల్మలు, రెడ్డి కులస్థులకు మధ్య అధికారంకోసం పోటీ ప్రారంభమయినది. ఈ కాలం లో అష్టాదశవర్ణాల్లో అగ్రవర్ణులైన బ్రాహ్మణులు రాజకీయ ప్రాభల్యాన్ని కోల్పోయారు. కాకతీయ సమాజానికి ప్రధాన లక్షణం కుల సంఘాలు వీటిని ‘సమయములు’ అనేవారు. అక్కడ వాడ, భోగం వీధి, మేదరవాడ మొదలగు ఇళ్లు ఉండేవి.
# నాటి ప్రజలు వీధి నాటకాల్లో, పేరిణి నృత్యాలతో సంగీతం, సాహిత్యాల్లో మేటి. ఓరుగల్లులో ఒక చిత్రశాలను మాచల్దేవి నిర్మించింది. దీనిలో నటులకు శిక్షణనిచ్చేవారు.
మతవిధానం
# కాకతీయుల కాలంలో తెలంగాణలో బౌద్ధమతం నామమాత్రమైంది. కానీ జైనమతం ప్రబలంగా ఉండేది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జైనమతాన్ని ద్వంసం చేసినది వీరశైవులు. జైనమతంలోని వర్ణ రాహిత్యాన్ని శైవులు తమ ముఖ్య సిద్ధాంతంగా తీసుకున్నారు. రాజులను వశపరుచుకొని వారికి శైవ దీక్షనిచ్చి, వారి గురువులై, మంత్రులై, దండనాథులై వీర శైవులు జైనమత నిర్మూలనలో వీరవిహారం చేశారు.
8 వీరశైవానికి ప్రతీకగా వీరవైష్ణం వీరావేశంతో విజృంభించింది. కాకతీయుల కాలంలో జైన, వైష్ణవ, శైవ మతాలు పరస్పరం ప్రాబల్యంకోసం పోరాడుతూ ఉం డేవి. క్రీ.శ. 1200 నాటికి జైనం తెలంగాణ రాష్ట్రంలో క్షీణించిపోయింది. దానిస్థానాన్ని శైవం ఆక్రమించింది. చివరకు శైవ, వైష్ణవ మతాలు మాత్రమే మిగిలిపోయాయి.
జైనమతం
# తెలంగాణలో బౌద్ధం, జైనం ఒకేసారి ఆవిర్భవించాయి. అయితే బౌద్ధం క్షీణించినా జైనమతం తన వ్యక్తిత్వం విడనాడలేదు. మొదటి బేతరాజు జైనమతావలంబి. రెండోబేతరాజు ‘జాల్నా’ బసదికి దానం చేశారు. మొదటి ప్రోలరాజు జైనమతాన్ని ఆదరించాడు. ఈ వివరాలు హన్మకొండలో ఉన్న పద్మాక్షి అనే జైనాలయం ముందున్న శాసనంలో ఉన్నాయి. ఇతని మంత్రి బేతప్రగడ జైనమతస్థుడు. ప్రోలరాజు భార్య మైలమహాదేవి జైనమతం స్వీకరించింది.
# నాడు మెతుకుసీమ (మెదక్ జిల్లా)లోని జోగిపేట జైనమతానికి కేంద్రంగా ఉండేది.
# హన్మకొండలోని సిద్ధేశ్వరాలయం (జైనదేవాలయం)
# హన్మకొండలోని పద్మాక్షి దేవాలయం (జైనదేవాలయం)
#వీటి ఆధారంగా తొలి కాకతీయ రాజులు జైనమతస్థులు అని తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లుకు చెందిన జైన అప్పయాచార్య జీనేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించడాన్నిబట్టి చివరిదాకా తెలంగాణలో జైనమతం కొనసాగిందని తెలుస్తున్నది. క్రమంగా జైన గురువులపై, జైన గ్రామాలపై శైవుల దాడులు, రాజుల పోషణ, ప్రజల ఆధరణ క్రమక్రమంగా లభించపోవడమే జైనమతం పతనానికి ప్రధాన కారణాలు. గణపతిదేవుని కాలంలో అత ని గురువు ‘విశ్వేశ్వరశంబు’ జైనుల గ్రామాలను తగులబెట్టినట్లు శాసనాల్లో ఉంది.
బౌద్ధమతం
# 10, 11వ శతాబ్దంలోనే తెలంగాణలో కనుమరుగైన బౌద్ధమతం కాకతీయుల కాలంలో మరింత క్షీణించింది. ఈ కాలపు శాసనాల్లో చాలా అరుదుగా ఆ మత ప్రసక్తి కన్పిస్తుంది. బుద్ధుడు విష్ణువు అవతారాల్లో ఒకడు కావడం, బౌద్ధమత అంతానికి నాంది. బౌద్ధం హిందూమతంలో కలిసిపోయింది. 9వ శతాబ్దంలో ఈ మతం చివరి దశకు చేరుకుంది. నల్లగొండ జిల్లాలోని ఫణిగిరి బౌద్ధుల కేంద్రం ఇది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది.
శైవం
శైవమత శాఖలు. 1. పాశుపతం 2.కాలాముఖం, 3.కాపాలికం 4.ఆరాధ్యశైవం 5.వీరశైవం
#వీటిలో రాజాదరణను పొందిన శాఖ పాశుపతమే. రెండోబేతరాజు మొదట జైనాన్ని ఆదరించినప్పటికీ, కాలాముఖ శైవుడనే రామేశ్వర పండితుడికి ఒక గ్రామాన్ని దానమివ్వడాన్ని బట్టి శైవుడిగా మారాడని చెప్పవచ్చు. ఈ రామేశ్వర పండితుడు రెండో బేతరాజు కుమారులైన దుర్గరాజు, రెండో ప్రోలరాజులకు కాలాముఖ శైవదీక్షనిచ్చాడు. దీన్నిబట్టి రెండో బేతరాజు నుంచి కాకతీయులు శైవమతాన్ని ఆచరించినట్లు తెలుస్తున్నది. గణపతిదేవుని కాలంనుంచి పాశుపతశైవం పాలకుల్లోనూ, ప్రజల్లోనూ ఆదరణ పొం దింది.గద్వాలలోని పూడూరు గ్రామంలో గుడి బయట నగ్న జైన విగ్రహాలు ఉండటాన్ని బట్టి, వేములవాడలో జైనాలయాన్ని శివాలయంగా మార్చి జైన విగ్రహాలు బయటవేయడాన్ని బట్టి జైనాన్ని ధ్వంసం చేసిన వీరశైవం ఉనికి తెలుస్తున్నది. గోళకీ మఠాల స్థాపన కూడా ఈ విషయాన్ని సూచిస్తుంది. ఈ కాలం లో కాకతీయ రాజులు, రేచర్ల రెడ్లు మొదలగువారు నిర్మించిన అనేక శివాలయాలను బట్టి ఆనాడు శైవం విస్తృతమైన ఆదరణ పొందిందని తెలుసుకోవచ్చు.
వైష్ణవం
#కాకతీయులు శైవులు అయినప్పటికీ వారి సామంతులు చాలామంది వైష్ణవులు. కాకతీయులు కొంతవరకు వైష్ణవాన్ని ఆదరించారు.
# రుద్రదేవుడు : రుద్రేశ్వరాలయం (వేయి స్తంభాల గుడి)లో వాసుదేవుడిని ప్రతిష్టించాడు.
# గంగాధరుడు : రుద్రదేవుని మంత్రి గంగాధరుడు కేశవస్వామికి గుడి కట్టించడం.
# గణపతిదేవుని సోదరి మైలాంబ గోపాలకృష్ణునికి గుడి కట్టించడం.ప్రతాపరుద్రుడు చెన్నకేశవస్వామికి దానాలివ్వడం, అతని భార్య లక్ష్మీదేవి.. రామనాథ దేవుడికి కానుకలివ్వడం అందుకు నిదర్శనం. ఈ కాలంలో ధర్మపురి ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం. శైవమత ప్రచారానికి పాల్కురికి సోమన మొదలగువారి రచనలు వచ్చినట్టే వైష్ణవ మత ప్రచారానికి గోనబుద్ధారెడ్డి రంగనాథరామాయణం వచ్చింది.
గ్రామదేవతారాధన
# వైదిక మతాలయిన వైష్ణవ, శైవ దేవతల ఆరాధనతోపాటు పూర్వయుగం నుంచి సంప్రదాయంగా వస్తున్న గ్రామదేవతలు, గ్రామ శక్తుల ఆరాధన కూడా ఉన్నది. ఏకవీర (రేణుక/ఎల్లమ్మ) మైలారు దేవుడు, భైరవుడు, వీరభద్రుడు, మూసనమ్మ, కాకతమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోతరాజు మొదలైన గ్రామదేవతలను పూజించేవారు. బవనీలు (బైండ్లవారు), మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథలను రెండు రోజులు చెప్పేవారు.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు