తెలంగాణలో కవులు – సాహిత్యం
రాచకొండ పద్మనాయకుల యుగం గ్రూప్-1,2 ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు
# ఇతడి కాలం క్రీ.శ. 1310-1360. పద్మనాయకుడి రచన ‘సారంగధర చరిత్ర’ అనే యక్షగానం. తెలుగులో తొలి యక్షగానం సారంగధర చరిత్ర అని డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తన తెలంగాణ సాహిత్య చరిత్రలో అభిప్రాయపడ్డారు. అయితే దీనిమీద మరింత స్పష్టత రావాల్సి ఉంది.
అనపోత నాయకుడు
# ఇతడు కవి, పండిత పోషకుడే కాకుండా అభిరామ రాఘవమనే నాటకాన్ని రాశాడు. ఇతడు 1వ సింగ భూపాలుడి కొడుకు.
విశ్వేశ్వరుడు
# ఇతడు అనపోత నాయకుడి ఆస్థానంలో, తర్వాత 2వ సింగ భూపాలుడి ఆస్థానంలోనూ ఉన్న కవి, పండితుడు. ఇతని కాలం క్రీ.శ. 1320-1400. ఇతడి రచనలు..
1. వీరభద్ర విజృంభణం (డిమం),
2. కరుణా కందళం (అంకం) 3. చమత్కార చంద్రిక
# చమత్కారాన్ని కావ్యాత్మగా ప్రతిపాదించిన లక్షణ గ్రం థం చమత్కార చంద్రిక.
పశుపతి నాగనాథకవి
# అనపోతనాయకుడి మరొక ఆస్థాన కవి పశుపతి నాగనాథుడు. ఇతడు విశ్వేశ్వరుడి శిష్యుడు. ఈయన మద న విలాసం అనే భాణమును సంస్కృతంలో, విష్ణుపురాణమును తెలుగులో రాశాడు. మదన విలాసంలో పద్మనాయకుల చరిత్ర కనిపిస్తుంది.
# నరసింహ సూరి: ఇతడి స్వస్థలం ధర్మపురి. ఇతడు ‘ప్రయోగ పారిజాతం’ అనే గ్రంథాన్ని రచించాడు.
# రెండో సింగభూపాలుడు: ఇతడు అనపోతనాయకుడి కుమారుడు. శ్రీకృష్ణదేవరాయల వలె బముఖ ప్రజ్ఞాశాలి. ఇతడు గొప్ప సాహిత్య పోషకుడు, స్వయం గా రచయిత. ఇతడి సంస్కృత రచనలు 1. రసార్ణవ సుధాకరం (అలంకార శాస్త్రం), 2. సంగీత సుధాకరం (నాట్యశాస్త్రం), 3. కందర్పసంభవం (భాణం), 4. కువలయావళి (నాటిక), విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయాచార్య, నాగనాథుడు, శాకల్యమల్లభట్టు, శాకల్య అయ్యలార్యుడు ఇతడి ఆస్థానంలోనివారు.
#రసార్ణవ సుధాకరానికి మరోపేరు సింగభూపాలీయం. ఇందులో రంజకోల్లాస, రసికోల్లాస, భావకోల్లాస అనే మూడు ఉల్లాసాలు ఉన్నాయి. మల్లినాథసూరి, కుమార స్వామి, ధర్మ సూరి, రూపగోస్వామి వంటి ప్రసిద్ధ వ్యాఖ్యాతలు దీన్ని ప్రామాణిక గ్రంథంగా పేర్కొన్నారు.
# సారంగదేవుడు రచించిన సంగీత రత్నాకరానికి విపుల వ్యాఖ్యాన గ్రంథం ‘సంగీత సుధాకరం’. ఇందులో స్వర, రాగ, ప్రకీర్ణ, ప్రబంధ, తాళ, వాద్య, నృత్య విభాగాలతో ఏడు అధ్యాయాలున్నాయి.
# బొమ్మకంటి అప్పయాచార్యులు: ఇతడు రెండో సర్వజ్ఞసింగ భూపాలుడి ఆస్థాన పండితుడు. అమరకోశానికి ‘అమర పద పారిజాత’ అనే వ్యాఖ్యనం రాశాడు. ఇతడి కాలం క్రీ.శ. 1380 – 1412.
# మాధవ భూపాలుడు: ఇతడు రేచర్ల రావు మాదనీడుగా పిలువబడే రాచకొండను పరిపాలించిన ప్రభువు. ఇతడు శ్రీమద్రామాయణమునకు ‘రాఘవీయం’ అనే పేరుతో వ్యాఖ్యానం రాసి 1427లో శ్రీరామునికి అం కితం ఇచ్చినట్లు నాగారం శాసనం ద్వారా తెలుస్తున్నది. నాగారం శాసనాన్ని మాధవ భూపాలుడి భార్య నాగాంబికాదేవి వేయించింది. ఈ గ్రంథం ఇప్పుడు లభించడం లేదు.
# 3వ సర్వజ్ఞ సింగభూపాలుడు: ఇతడి కాలం క్రీ.శ. 1425-1475. రేచర్ల పద్మనాయక రాజుల్లో గొప్పవాడు మూడో సర్వజ్ఞ సింగభూపాలుడు. ఇతడు కవి కాకపోయినా స్వయంగా గొప్ప పండితుడని వెలగోటి వంశావళిలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. మహాకవి పోత న ఇతడి ఆస్థానంలో కొంత కాలం ఉండి భోగినీదండకాన్ని రాశాడు. ఆ తర్వాత రాజాస్థానం నుంచి బయటికి వచ్చాడు. మహావిద్వత్ శిరోమణి మల్లినాథసూరి, అతడి తమ్ముడు పెద్దిభట్టు ఇద్దరూ సింగ భూపాలుడితో సత్కరింపబడ్డారు.
# నూతన కవి సూరన: ఇతని కాలం క్రీ.శ. 1400-1480. ఇతడు రచించిన కావ్యం ధనాభిరామం. ఇది తెలుగు సాహిత్యంలో మొదటి కల్పిత ప్రబంధం. ధనం, సౌం దర్యం ఈ రెండింటిలో మనిషికి ఏది ముఖ్యమో తెలియజేస్తుంది.
# భైరవ కవి: ఇతడు గౌరన కుమారుడు. ఇతడి కాలం క్రీ.శ. 1420-1475. తెలంగాణలో బంధ కవిత్వ ప్రక్రియకు ఆద్యుడు. ఇతడి రచనలు శ్రీరంగమహత్మ్యం, రత్నపరీక్ష, కవిగజాంకుశం (ఛందోగ్రంథం).
# కొలని గణపతి దేవుడు: ఇతడి కాలం క్రీ.శ. 1400-1450. శివయోగసారం, మనోబోధ ఇతడి రచనలు. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో కొన్ని ఘట్టాలకు శివయోగసారమే ఆధారం.
# ఏకామ్రనాథుడు (1450-1550): ఇతడు ఓరుగల్లు ప్రాం తానికి చెందినవాడు. కాకతీయుల పరిపాలనా వైభవాన్ని తెలపడానికి ప్రయత్నించిన తొలి చరిత్రకారుడు. ఇతడి రచన ప్రతాపరుద్ర చరిత్రం. దీంతోపాటు ‘ద్వాత్రింశత్సాల భంజికల కథలు’ అనే గ్రంథాన్ని కూ డా రాసినట్లు తెలుస్తున్నది. ఇతడి గురువు నాగనాథుడు.
# తెలుగులో తొలి వచన రచన, తొలి చారిత్రక గ్రంథం ప్రతాపరుద్ర చరిత్రం. ఇది కాకతీయుల పుట్టుపూర్వోత్తరాలను, వారి వైభవాన్ని తెలుపుతుంది. ఈ గ్రంథా న్ని ఆధారంగా చేసుకొని కాసె సర్వప్ప ‘సిద్దేశ్వర చరిత్ర’ పేరుతో ద్విపద కావ్యాన్ని, కూచిమంచి జగ్గ కవి ‘సోమదేవ రాజీయం’ అనే పేరుతో పద్యకావ్యంగా రాశారు.
# పిడుపర్తి కవులు: పాల్కురికి సోమనాథుడి తర్వాత ఆయన మార్గంలో శైవ సాహిత్యాన్ని విరివిగా రాసినవారు పిడుపర్తి కవులు. ఓరుగల్లు ప్రాంతానికి చెందిన పిడుపర్తి 1వ బసవకవి పిల్లనైనారు కథ, బ్రహ్మోత్తర ఖండంతోపాటు గురుదీక్షాబోధన రాశాడు. ఇతని పెదనాన్న కొడుకైన పిడుపర్తి నిమ్మనాథుడు నిజలింగ చిక్కయ్య కథ అనే యక్షగానమును రాశాడు. 1వ బసవకవి కుమారుడు రెండో సోమనాథుడు పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రను పద్య ప్రబంధంగా రాశాడు. దీనిని పిడుపర్తి రెండో బసవ కవి పద్యకావ్యంగా రాశాడు.
#తిరుమల భట్టారకుడు: ఇతడు అప్పకవి పూర్వీకు డు. స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూల్ తాలూకాలోని లేమామిళ్ల గ్రామం. ఇతడు రచించిన గ్రంథం ‘కాలామృతం’.
# త్రిలోకభౌది: ఇతడు సుప్రసిద్ధకవి గౌరన మనుమడు. రాచకొండ ప్రాంతానికి చెందినవాడు. ఇతడు సకల ధర్మసారం రాశాడు.
# హరిభట్టు (1475-1535): ఖమ్మం ప్రాంతానికి చెందినవాడు హరిభట్టు. పోతన అనువాదం చేయని భాగవత షష్ఠ, ఏకాదశ, ద్వాదశ స్కంధాలను రసవత్తరంగా అనువదించడమే కాకుండా, రతిరహస్యం, వరాహ పురాణం, మత్స్యపురాణం, నారసింహ పురాణాలను రాశాడు.
# కుతుబ్షాహీల యుగం (1496-1687): కుతుబ్షాహీల రాజ్యస్థాపన 1518లోనే అయినా ఈ రాజ్యస్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా క్రీ.శ. 1496 నుంచి 1518 వరకు తెలంగాణ సుబేదారుగా పాలించాడు. అందువల్ల తెలంగాణకు సంబంధించినంతవరకు 1496 నుంచే కుతుబ్ షాహీల యుగంగా భావించవచ్చు అని డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘తెలంగాణ చరిత్ర’లో అభిప్రాయపడ్డారు. ఈ కాలంలో ప్రధాన కవులు చరిగొండ ధర్మన్న, పోశెట్టి లింగకవి, మరింగంటి సింగరాచార్యులు, అద్దంకి గంగాధర కవి, కందుకూరి రుద్రకవి, పొన్నగంటి తెలగన్న, సారంగు తమ్మయ్య మొదలైనవారు.
# చరిగొండ ధర్మన్న (1480-1530): తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్య కల్పనలు చేసినవాడు చరిగొండ ధర్మన్న. ఈయన రచించిన కావ్యం చిత్రభారతం. దీనిని ఓరుగంటిని పాలించిన చిత్తాపుఖాన్ మంత్రైన ఎనుముల పెద్దనకు అంకితమిచ్చాడు. గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం లాంటి యక్షగానాలు రావడానికి మూలం చిత్రభారతమే.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో రెండో సింగ భూపాలుడి రచన కానిది?
1) రసార్ణవ సుధాకరం 2) సంగీత సుధాకరం
3) కందర్భసంభవం 4) ప్రయోగ పారిజాతం
2. చమత్కారాన్ని కావ్యాత్మగా ప్రతిపాదించిన పండితుడు?
1) పశుపతి నాగనాథకవి
2) రెండో సింగభూపాలుడు
3) విశ్వేశ్వరుడు 4) దండి
3. ‘రసార్ణవ సుధాకరం’ అనేది?
1) అలంకార శాస్త్రం 2) నాట్యశాస్త్రం
3) సంగీత శాస్త్రం 4) ఛందశ్శాస్త్రం
4. మూడో సర్వజ్ఞ సింగ భూపాలుడి ఆస్థానంలో కొన్నాళ్లు ఉన్న కవి?
1) పోతన 2) విశ్వేశ్వరుడు
3) నరసింహ సూరి 4) నాగనాథుడు
5. తెలుగులో తొలి చారిత్రక వచన గ్రంథం?
1) సిద్ధేశ్వర చరిత్ర 2) ప్రతాపరుద్ర చరిత్రం
3) సోమదేవర రాజీయం 4) శివయోగ సారం
6. పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రను పద్య ప్రబంధంగా రాసిన కవి?
1) పిడుపర్తి సిమ్మనాథుడు 2) 1వ బసవ కవి
3) రెండో సోమనాథుడు 4) రెండో బసవ కవి
సమాధానాలు
1) 4, 2) 3, 3) 1, 4) 1, 5) 2, 6) 3
డా. తండు కృష్ణ కౌండిన్య
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ
దేవరకొండ, నల్లగొండ జిల్లా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు