ముసునూరి నాయకులు- విమోచనోద్యమ కర్తలు (తెలంగాణ హిస్టరీ)
కాకతీయుల పతనానంతరం మహమ్మదీయుల పాలన మొదలైంది. ఓరుగల్లును సుల్తాన్పూర్గా పేరుమార్చి పరిపాలన మొదలు పెట్టారు. వీరి పాలనా కాలంలో అవలంబించిన విధానాలు, అకృత్యాలకు ప్రజలు విసిగిపోయి పాలనపట్ల తిరస్కార భావాన్ని ఏర్పరుచుకున్నారు. తుగ్లక్ సైన్యాలు కొద్ది కాలంలోనే ఆంధ్రదేశాన్నంతటిని ఆక్రమించాయి. క్రీ.శ. 1326లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలనలో ఆమోదయోగ్యం కాని విధానాలు ప్రవేశ పెట్టడంతో సామ్రాజ్యంలో నలుదిక్కులా తిరుగుబాట్లు చెలరేగాయి.
-మొదటగా సుల్తాన్ నిస్సహాయతను గుర్తించి మధుర వజీర్‌ఖాన్ సయ్యద్ జలాలుద్దీన్ స్వతంత్రం ప్రకటించుకున్నాడు.ఈ సంఘటన దక్షిణాది రాజ్యాలకు మరింత ప్రోత్సాహం ఇచ్చింది.
-ఇదే అదునుగా భావించి తిరుగుబాట్ల పరంపరలో భాగంగా ఆంధ్రదేశంలో కాకతీయ నాయకులు ఇచ్చిన స్పూర్తితో సుల్తాన్ పరోక్ష పాలనను వ్యతిరేకించి విమోచనోద్యమ నాయకుడైన ముసునూరి కాపయ నాయకుడు కర్ణాటక హొయసాల పాలకుడైన 3వ వీర భల్లాలుడి సాయంతో క్రీ.శ.1336లో వరంగల్‌పై దండెత్తి మాలిక్ మక్బూల్‌ను పారదోలి ఓరుగల్లు కోటపై స్వతంత్ర పతాకాన్ని ఎగురవేశారు. దీనితో ఆంధ్రదేశంలో ముస్లింల పాలన అంతమైంది.
కాకతీయ రాజ్య శిథిలాల నుంచి కుల ప్రాతిపదికన ముసునూరి, వెలమ, రెడ్డి అనే మూడు స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. ఆంధ్రదేశ జాతీయత విచ్ఛిన్నమైంది. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ బహమనీ సామ్రాజ్య స్థాపనకు కారకులయ్యారు.
కులప్రాతిపదికన స్థాపించిన ఈ రాజవంశాల్లో ఐక్యత కొరవడి ముస్లింలను ప్రతిఘటించడానికి బదులు ఆధిపత్యం కోసం పరస్పర యుద్ధాల్లో నిమగ్నులై బహమనీ రాజ్య విస్తరణకు తోడ్పాటు అందించారు. ఒకరి తర్వాత ఒకరు బహమనీ స్రామజ్య కాంక్షకు బలైపోయారు.
ఆంధ్రదేశంలో మొదటిసారిగా తురుష్క పాలనను ప్రతిఘటించిన వారు ముసునూరి నాయకులు. ముస్లింల కబంధ హస్తాల నుంచి ఆంధ్రదేశానికి విముక్తి కలిగించడానికి ముసునూరు నాయకులు విమోచనోద్యమాన్ని ప్రారంభించారు.
ముసునూరి నాయకులు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ముసునూరి నాయక రాజ్య చరిత్రను తెలుసుకోవడానికి ఎక్కువగా శాసనాలు, సమకాలీన రచనలే ఆధారంగా ఉన్నాయి. ముసునూరి వంశీయు లు ముసునూరు అనే గ్రామవాసులు. వారి స్వగ్రామం వల్లనే వారికి ముసునూరు అనే ఇంటిపేరు వచ్చిందని ముసునూరి ప్రోలయ నాయకుని విలాస శాసనం పేర్కొంటుంది. కాపయ నాయకుని ప్రోలవరం శాసనం, ముసునూరి అనితల్లి కలువచేరు శాసనం, చోడభక్తిరాజు పెంటపాడు శాసనం, పద్మనాయకులు శాసనాలు, పిల్లలమరి శాసనం, గణపేశ్వర శాసనాలు వీరి చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు.
1323లో ఓరుగల్లు పతనానంతరం తురుష్కుల పాలనలో చెలరేగిన అసంతృప్తిని అవకాశంగా తీసుకొని భద్రాచల ప్రాంత అరణ్య భూముల్లోని గిరివన దుర్గాలను తన స్థావరంగా ఏర్పరచుకొని ప్రోలయనాయకుడు తురుష్కులతో పోరాడి వారిని ఓడించాడు. ఈ పోరాటంలో వేంగి పాలకుడు వేంగిభూపాలుడు, తన పినతండ్రి కొడుకు కాపయ నాయకుడు ప్రోలయకు తోడయ్యారు. గోదావరి ప్రాంతంలో రేఖపల్లిని రాజధానిగా చేసుకొని స్వతంత్ర రాజ్యం స్థాపించాడు. ఓరుగల్లు తప్ప మిగతా ఆంధ్రదేశం తురుష్కుల నుంచి విముక్తి అయ్యింది.
ఈ విజయాలను చూసి నెల్లూరు గుంటూరు ప్రాంతాల్లో ప్రోలయ వేమారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రేచర్ల వెలమ సింగమనాయుడు తురుష్కుల పాలన నుంచి ప్రజలను విముక్తులను చేశారు. ప్రోలయ నాయకుడు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు. రైతులపై విధించిన పన్నులను రద్దు చేశాడు. ఉత్తరాంధ్రపై కళింగులు దండెత్తగా వారిని ఎదుర్కొనే సందర్భంలో ప్రోలయనాయకుడు యుద్ధభూమిలో మరణించాడు.
తర్వాత కాపయ నాయకుడు 1335 నుండి 1368 వరకు పరిపాలించాడు. 1936లో ఓరుగల్లుపై దండెత్తి ముస్లిం గవర్నర్ మాలిక్ మక్బూల్‌ను ఓడించి తరిమివేశాడు. తన ఆధీనంలో ఉన్న ఓరుగల్లు రాజ్య రక్షణకు కాపయనాయకుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఓరుగల్లు కోటను పునరుద్దరించి రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి రాజ బంధువులను, తనకు విశ్వాసపాత్రులైన వారిని రాజ్య పాలకులుగా, ఉన్నత పదవుల్లో నియమించాడు.
కాపయ నాయకుడు దక్కన్లో మిగిలి ఉన్న తుగ్లక్ సామ్రాజ్యంపై మరొక తిరుగుబాటు ఉల్లాఉద్దీన్ మహమద్షా నాయకత్వంలో స్వతంత్ర బహమనీ (1341) రాజ్యస్థాపనకు దారితీసింది. కాపయ నాయకుడు బహమనీ రాజ్య స్థాపనకు హసన్గంగుకు సహకరించాడు. ఈ స్నేహం ఎంతోకాలం నిలవలేదు. బహమనీ సుల్తానులకు దక్షిణాపథంలో ఇస్లాం అధికార విస్తరణే లక్ష్యం అయింది. బహమనీల దండయాత్రలో మూడుసార్లు సంధి చేసుకొని కోటలను, నగదును కాపయ నాయకుడు చెల్లించవలసి వచ్చింది. అదే సందర్భంలో కాపయ నాయకుడు ఆధీనంలో ఉన్న ప్రాంతాలను కళింగ గంగులు దండయాత్ర చేసి ఆక్రమించారు. సైన్యాలు వెనుతిరగగానే మంచికొండ, కొప్పుల వంశాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఉత్తరాంధ్రలో రెడ్ల అధికారం నెలకొన్నది. ఆ సమయంలోనే తెలంగాణలో రేచర్ల వెలమ సింగనాయుడు విజృంభించాడు. కృష్ణానది తీరప్రాంత రాజ్యాన్నంతటిని విస్తరించాడు. అతని మరణానంతరం అతని కుమారుడు అనపోతనాయుడు ఆమనగల్లు నుంచి రాజధానిని రాచకొండకు మార్చి కాపయ నాయకుడిపై దండెత్తాడు. ఓరుగల్లు సమీపంలో క్రీ.శ. 1367-68 మధ్య జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు. దాంతో తెలంగాణలో ముసునూరి వారి పాలన ముగిసింది.
వరంగల్‌ను రాజధానిగా చేసుకొని తెలంగాణ తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన కాపయ నాయకుడు ధిక్కరించి అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి ఆంధ్రదేశం మరోసారి విచ్ఛిన్నమైంది.
స్వతంత్ర రాజ్యాలు
రాచకొండ – రేచర్ల పద్మ నాయకులు
కొండవీడు – రెడ్డి రాజులు
పీఠాపురం – కొప్పుల వెలమలు
ప్రాక్టీస్ బిట్స్
1. ముసునూరి నాయకులకు వారి స్వగ్రామం ముసునూరు పేరుమీదే వారి ఇంటి పేరు వచ్చిందని పేర్కొంటున్న శాసనం?
ఎ) విలాస తామ్ర శాసనం
బి) కలువచేరు శాసనం
సి) పెంటపాడు శాసనం
డి) ప్రోలవరం శాసనం
2. కింది శాసనాలను అవి వేసిన వారితో జతపరచండి?
శాసనం వేయించిన వారు
1) విలాస తామ్ర శాసనం ఎ) కాపయ నాయకుడు
2) కలువచేరు శాసనం బి) చోడభక్తిరాజు
3) పెంటపాడు శాసనం సి) ప్రోలయ నాయకుడు
4) ప్రోలవరం శాసనం డి) అనితల్లి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-సి డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3. ఓరుగల్లు విజయం తర్వాత కోటలోకి ప్రవేశించి ఏ బిరుదులతో కాపయ నాయకుడు సింహాసనం అధిష్టించాడు?
ఎ) ఆంధ్రసురత్రాణ బి) ఆంధ్రాదీశ్వర
సి) ఎ, బి డి) ఏదీకాదు
4. కాపయ నాయకుడు తెలంగాణలోని సబ్బి మండలానికి ఎవరిని రాజప్రతినిధిగా నియమించాడు?
ఎ) ముప్ప భూపాలుడు
బి) అనపోత నాయుడు
సి) చెలుంగున్నవుడు
డి) కూనప నాయకుడు
5. ముప్ప భూపాలుడు దేనిని రాజధానిగా చేసుకొని పాలించాడు?
ఎ) కోరుకొండ బి) రామగిరి
సి) తొయ్యేటి డి) రాజమహేంద్రవరం
6. తురుష్కల నుంచి రాజ్య విముక్తి పొందిన తరువాత నష్టపోయిన అగ్రహారాలతోపాటు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి, రైతులపై పన్నులను రద్దుచేసిన వారు ఎవరు?
ఎ) ప్రోలయ నాయకుడు
బి) అనపోతనాయుడు
సి) కాపయనాయకుడు
డి) కూనపనాయుడు
7. ప్రోలయనాయకుడు పునరుద్దరించిన కార్యక్రమాలన్నింటిని ఏ శాసనంలో పేర్కొన్నాడు?
ఎ) గణపేశ్వర శాసనం
బి) గురజశాసనం సి) విలాస శాసనం
డి) ప్రోలవరం శాసనం
8. రేచర్ల సింగమనాయకుడు యుద్ధంలో కాపయ నాయకుడిని ఓడించినట్లు తెలియజేస్తున్న ఆధారలేవి?
ఎ) వెలుగోటి వారి వంశావళి
బి) పెరిస్టారచనలు
సి) గణపేశ్వర శాసనం
డి) ఆర్యావటి శాసనం
9. కాపయ నాయకుని సమకాలీన రాజులు ఎవరు?
1) పద్మ నాయకులు
2) విజయనగర రాజులు
3) రెడ్డిరాజులు 4) ఢిల్లీ సుల్తానులు
5) బహమనీ సుల్తానులు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 3, 4, 5 డి) 1, 2, 3, 4, 5
10. ముసునూరి నాయకరాజ్య చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడే సమకాలీన రచనలేవి?
ఎ) పెరిస్టా రచనలు
బి) వెలుగోటివారి వంశావళి
సి) ఎ, బి డి) ఏవీకాదు
11. ముసునూరి ప్రోలయ నాయకుడు తురుష్కులతో యుద్ధాలు చేసి గోదావరి సమీపంలో మాల్యవంత దగ్గర ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు?
ఎ) మహబూబ్‌నగర్ బి) రేఖపల్లి
సి) విలాస డి) ఓరుగల్లు
12. బహమనీ రాజ్యస్థాపనకు హసన్గంగూకు కాపయ నాయకుడు సహాయం చేశాడిని ఎవరి రచనల వల్ల తెలుస్తుంది?
ఎ) ఫెరిస్టా రచనలు
బి) వెలుగోటి వంశావళి
సి) పల్నాటి వీర చరిత్ర డి) ఏదీకాదు
13. క్రీ.శ. 1350లో హసన్ గంగూ ఓరుగల్లును ఓడించడానికి తన సేనాని సికిందర్ చేతిలో ఓడిపోయిన కాపయ నాయకుడు ఏదుర్గాన్ని ఇచ్చి సంధి చేసుకున్నాడు?
ఎ) గోల్కొండ బి) భువనగిరి
సి) కౌషల్పూర్ డి) రాచకొండ
14. క్రీ.శ. 1356లో రెండవసారి హసన్‌గంగూ ఓరుగల్లుపై దండెత్తాడు. రెండవసారి కూడా కాపయ నాయకుడు ఓడిపోయి ఏ దుర్గాన్ని సుల్తాన్‌కు ఇచ్చాడు?
ఎ) గోల్కొండ బి) భువనగిరి
సి) కౌషల్పూర్ డి) రాచకొండ
15. 1964-65లో మూడోసారి మహమ్మద్‌షా జరిపిన దాడి నుంచి ప్రజలను రక్షించుకోవడానికి జరిపిన సంధిలో బహమనీలకు యుద్ధ పరిహారంగా వేటిని చెల్లించాడు?
1) గోల్కొండ దుర్గం
2) 100 ఏనుగులు, 250 గురాలు
3) 33 లక్షల రూపాయలు
ఎ) 1, 2 బి) 1, 3
సి) 2, 3 డి) 1, 2, 3
16. హసన్‌గంగూ రెండవసారి ఓరుగల్లు కోటపై జరిపిన దండయాత్రలో భాగంగా కృష్ణ్ణానదీతీరంలోని ధాన్యకటక అమరేశ్వరాలయాన్ని దోచుకున్నాడని తెలియజేస్తున్న శాసనాలు?
ఎ) గణపేశ్వర శాసనం
బి) ప్రోలవరం శాసనం
సి) రెడ్డిరాజుల శాసనాలు డి) పైవన్నీ
17) కాకతీయుల నాటి నాయకులందరూ ప్రతాపరుద్రుడిని సేవించినట్లే కాపయ నాయకునికి సేవలందించేవారని వర్ణించిన శాసనం?
ఎ) కలువచేరు శాసనం
బి) పిల్లలమరి శాసనం
సి) ఆర్యావటి శాసనం
డి) గణపేశ్వర శాసనం
18. కాపయనాయకుని కాలంలో స్థాపించబడిన రాజ్యాలు ఏవి?
1) రేచర్ల పద్మనాయకులు – సింగమనాయకుడు
2) కొండవీడు రెడ్డి రాజులు – ప్రోలయ వేమారెడ్డి
3) విజయనగర రాజ్యం – హరిహర బుక్కరాయలు
4) బహమనీరాజ్యం – హసన్‌గంగూ
ఎ) 1, 2. 4 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3
19. విమోచనోద్యమంలో ప్రోలయ నాయకునికి సహకరించినవారు?
1) ప్రోలయ వేమారెడ్డి
2) రేచర్ల సింగమ నాయకుడు
3) వేంగీ భూపాలుడు
4) ముసునూరి కాపయ నాయకుడు
5) మంచికొండ గణపతి నాయకుడు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4, 5 డి) 3, 4, 5
20. కాపయ నాయకుడిని అనుమగంటి పురవరాధీశ్వరుడు అని పేర్కొన్న శాసనం?
ఎ) గణపేశ్వర శాసనం
బి) పిల్లలమరి శాసనం
సి) ఆర్యావటి శాసనం
డి) కలువచేరు శాసనం
సమాధానాలు
1-ఎ 2-బి 3-సి 4-ఎ 5-బి 6-ఎ 7-సి 8-ఎ 9-డి 10-సి 11-బి 12-ఎ 13-సి 14-బి 15-డి 16-సి
17-ఎ 18-బి 19-సి 20-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు