ఉద్యోగాల సర్వీస్ రూల్స్ రివర్స్
# 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 12 ఏండ్లకాలంలో తెలంగాణకు చెందిన ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, వేతనాలను సవరించడంలో, బదిలీలు, విధుల నిర్వహణల్లో ఆంధ్ర ఉన్నతోద్యోగులు, ఆంధ్ర పాలకులు చాలా అన్యాయం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఆంధ్ర ఆధిపత్యవాదులు ఖాతరు చేయలేదు.
# మరోవైపు ప్రభుత్వంలో, రెవెన్యూ శాఖలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు, అవినీతిపరులైన అధికారులు విచ్ఛలవిడిగా బోగస్ ముల్కీ సర్టిఫికెట్లను జారీచేయడం, అవసరంలేని, తెలంగాణ విద్యావంతులకు ఈ ప్రాంతంలో అందుబాటులో లేని విద్యార్హతలను ఉద్యోగ నియామకాలకు అర్హతలుగా పెట్టి అర్హులైనవారు లభించలేదనే సాకుతో నాన్ ముల్కీలను చట్టబద్ధంగానే తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో నియమించారు. ఈ కారణాలవల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. భవిష్యత్తులో తమకు ఇక ఉద్యోగాలు లభించవేమోననే భయం, ఆందోళన తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువైంది.
# ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 12 ఏండ్లలో తెలంగాణ ప్రాంత వ్యక్తికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని యథేచ్ఛగా ఆంధ్రకు తరలించి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. చట్టబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రీజినల్ కమిటీ (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) కోరలు పీకి నామమాత్రపు కమిటీగా దిగజార్చారు. పెద్దమనుషుల ఒప్పందంలో పేర్కొన్న ప్రాంతీయ మండలి అధికారాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కుదించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కేటాయించే అధికారాన్ని రీజియనల్ కమిటీ పరిధి నుంచి తప్పించి ద్నీక నామమాత్రపు సలహాసంఘంగా మార్చారు. ఆంధ్ర పాలకులు ఒప్పందంలో అంగీకరించినట్లు 20 మంది సభ్యులను కాకుండా తెలంగాణ ప్రాంతంలోని మొత్తం శాసన సభ్యులను రీజియనల్ కమిటీలో సభ్యులుగా చేసి వారి మధ్య గ్రూపులు, ముఠాల సంస్కృతికి తెరలేపారు.
# తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (హెచ్ఐసీసీ)ని ఐదేండ్లపాటు కొనసాగించాలని పెద్దమనుషుల ఒప్పందంలో ఒప్పుకుని 13 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేశారు. తెలంగాణ రాజకీయ నాయకులను తమకు బానిసలుగా మార్చుకోవాలనే ఆంధ్ర పాలకుల కుట్రలో భాగమే ఈ హెచ్ఐసీసీని ఏపీసీసీలో విలీనం చేయడం.
# 1960లో నీలం సంజీవరెడ్డిని ఢిల్లీకి పిలిపించి జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవినిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంత సీనియర్ మంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేవీ రంగారెడ్డిని ఎన్నుకోవాలని ప్రధాని పండిట్ నెహ్రూ, ఢిల్లీ పెద్దలు నీలం సంజీవరెడ్డిని ఆదేశించినా, ఆయన ప్రధాని ఆదేశాలను ధిక్కరించి రాష్ట్ర శాసనసభ్యుల్లో ముఠాలను సృష్టించి, కేవీ రంగారెడ్డిని తప్పించడానికి దళితుడైన దామోదరం సంజీవయ్యను తన స్థానంలో ముఖ్యమంత్రిగా నియమించుకున్నాడు. తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా కుట్ర చేశాడు. (కేవీ రంగారెడ్డి స్వీయ చరిత్ర)
ఉద్యోగాల్లో అన్యాయాలు
# ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంత్సరం తర్వాత 1957, డిసెంబర్ 7న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా ‘ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్-1957’ను జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉద్యోగ రంగానికి చెందిన పలు అంశాలకు సంబంధించి గతంలో ఉన్న చట్టాల (ముల్కీ రూల్స్)ను రద్దు చేస్తూ జారీ చేసిన చట్టమిది. ప్రత్యేక పరిస్థితులవల్ల ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఉద్యోగ నియమకాలకు సంబంధించి స్థానికత విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలను రూపొందించడానికి రాజ్యాంగపరంగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రూల్స్-1959’ను 1959, మార్చి 21న ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో (కంటోన్మెంట్ బోర్డు మినహా) ఉద్యోగ నియమకాలకు సంబంధించి కింది అర్హతలను పాటించాలి.
# గత 15 ఏండ్ల నుంచి స్థానికుడై ఉండాలి.
# సెక్రటేరియట్, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉన్నత కార్యాలయాల్లో ఉత్పన్నమయ్యే ప్రతి మూడు ఉద్యోగాల్లోని రెండో ఉద్యోగ ఖాళీలో నియామకానికి సంబంధించి ఈ నిబంధల కింద 15 ఏండ్ల స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్‌ను కలిగి ఉన్న వ్యక్తి అర్హుడు.
# స్థానికత ఆధారంగా సర్టిఫికెట్‌ను రెవెన్యూ రీజినల్ అధికారి విచారణ జరిపి జారీ చేస్తారు.
# ఈ స్థానికత నియామకాలు తెంగాణలోని నాన్‌గెజిటెడ్, స్థానిక సంస్థల్లోని ఉద్యోగ నియామకాల్లో మాత్రమే వర్తిస్తాయి.
నిబంధనల ఉల్లంఘన
# తెలంగాణ ప్రాంత ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు, రూల్స్ ఉన్నా వాటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా సెక్రటేరియట్లో, ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నత కార్యాలయాల్లో (హెచ్వోడీలు) తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రభుత్వోద్యోగాల్లో ఆంధ్ర ప్రాంతంవారికి ఉద్యోగాలిచ్చారు.
# సెక్రటేరియట్, హెచ్వోడీల్లో ప్రతి మూడు ఉద్యోగ ఖాళీల్లో రెండో ఉద్యోగ ఖాళీకి తెలంగాణ వ్యక్తిని (స్థానికత ఆధారంగా) నియమించాలన్న నిబంధన ఉన్నందున మిగతా రెండు ఉద్యోగ ఖాళీలు ఆంధ్రా ప్రాంతంవారికి రిజర్వ్ పోస్టులని చెప్పడం పూర్తిగా తప్పు. ఇది రూల్స్‌ను వక్రీకరించడమే. కానీ 1956, నవంబర్ నుంచి 1968 వరకు ఆ రెండు ఉద్యోగాలను ఆంధ్రావారి సొత్తు లాగే భావించి ఆ ప్రాంతంవారినే భర్తీ చేశారు.
# తెలంగాణకు చెందిన లక్షా యాభైవేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రకంగా ఆంధ్ర అధికారుల వేధింపులు, అన్యాయాలకు గురయ్యారు.
# 1968 వరకు ఉద్యోగ నియామకాల్లో మినహాయింపులు ఆరు విధాలుగా ఉన్నాయని రీజినల్ కమిటీ అభిప్రాయపడింది.
1) భార్య, భర్తలు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారనే కారణంతో
2) అర్హతగల స్థానికులు లభించడంలేదనే కారణంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో స్థానికేతరుల నియామకం
3) తాత్కాలిక సర్దుబాటు కోసం జరిగిన నియామకాలు
4) పరస్పర ఆమోదంతో బదిలీలు
5) పాకిస్థాన్, బర్మా కాందిశీకులు, సైన్యంలోని అధికారుల కుటుంబాలపై ఆధారపడినవారు
6) సానుభూతితో, మానవీయ కోణం నుంచి జరిగినవి.
# ఈ విధమైన మినహాయింపులు పొందినవారే కాకుండా అధిక సంఖ్యలో స్థానికేతరులను తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో భర్తీ చేయడాన్ని సమీక్షించాలని 1968లో రీజినల్ కమిటీ చైర్మన్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందిస్తూ ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖ సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల ఉన్నతాధికారులకు అక్రమంగా ఎలాంటి మినహాయింపులు లేకుండా భర్తీ అయిన స్థానికేతరులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించింది.
# తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా, స్థానికేతర ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రూల్స్-1959ను సవరిస్తూ వచ్చింది. ఏకీకృత సర్వీసుల పేరుమీద కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది.
అటవీ శాఖలో
# ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రూల్స్-1959లోని రూల్ 3ని ఆసరా చేసుకుని ఆంధ్రలో ఉద్యోగాల నుంచి తొలగించిన 44 మంది ఫారెస్టు శాఖకు చెందిన సిబ్బందిని తెలంగాణ ప్రాంతంలో నియమించింది ప్రభుత్వం.
# అర్హులైన తెలంగాణ స్థానికులు అందుబాటులో ఉన్నప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం-1957లోని నిబంధనలను, రూల్స్‌ను సడలించి స్థానికేతరులను తెలంగాణ ఉద్యోగాల్లో నియమించే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు.
# ఆంధ్ర ప్రాంతంవారికి లాభం చేకూర్చడానికి అనేక సార్లు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం-1957లోని నిబంధనలను సవరించింది ప్రభుత్వం. భారత ప్రభుత్వం ఈ ఉల్లంఘనలను, అన్యాయాలను చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షకపాత్ర వహించింది.
# 1961 వరకు ఉన్న తెలంగాణలోని ఉద్యోగ ఖాళీల్లో ఆంధ్ర ప్రాంతంవారిని నియమించారు. ప్రత్యక్ష నియామకాల్లో 2:1 నిష్పత్తిని కూడా పాటించలేదు.
స్థానికేతర ఉపాధ్యాయులు
# అర్హులైన స్థానికులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు లభించడంలేదనే సాకుతో సుమారు 2500 మంది ఉపాధ్యాయులను తెలంగాణలో నియమించారని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి.
# న్యాయంగా అయితే ఉపాధ్యాయుల అర్హతలు సడలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లభించకపోవడానికి కారణం శిక్షణ సంస్థలు లేకపోవడమే. ఈ ఉపాధ్యాయుల నియామకాల సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఖాళీల్లో స్థానికులను నియమిస్తూ వారిని నిర్ణీత గడువు (రెండు లేదా మూడేండ్లలో)లోగా శిక్షణ పొందాలని రూల్స్‌ను సవరించి ఉంటే ఎంతోమంది స్థానికులు ఉద్యోగాలు పొంది ఉండేవారు. ప్రభుత్వం కూడా తెలంగాణ జిల్లాల్లో అవసరమైనన్ని టీచర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్లు నెలకొల్సాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు