‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
గత వారం తరువాయి..
అతివాద ఉద్యమం
అతివాద పద్ధతుల ద్వారా కొన్ని మంచి, చెడు ఫలితాలు వచ్చాయి. మంచి ఫలితాల్లో ముఖ్యమైంది బెంగాల్ విభజనను రద్దుచేయడం. భారతదేశ రాజధానిని బెంగాల్ నుంచి ఢిల్లీకి 1912లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిర్ణయించి మార్చింది. అతివాద నాయకుల్లో వారు అవలంబించిన పోరాట పద్ధతిపై నమ్మకంతో పాటు తమ శక్తి యుక్తులపై విశ్వాసం ఏర్పడింది. వారు కోరిన స్వపరిపాలన అనేది కూడా సరైనదని భావించారు. 1917లో మొదటి యుద్ధ కాలంలో భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మార్లే భారతీయుల మద్దతు మొదటి ప్రపంచ యుద్ధానికి కూడగట్టాలనే ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో క్రమంగా స్వపరిపాలనను ఏర్పాటు చేస్తుందని ప్రకటించాడు.
- పంజాబ్‌లో స్వదేశీ ఉద్యమాలు నిర్వహించిన ప్రముఖ అతివాద నాయకుడు.
- ఈయనను పంజాబ్ కేసరి అని కూడా అంటారు.
- 1905-08 మధ్య జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు. స్వదేశీ ఉద్యమం చివరి కాలంలో దేశ బహిష్కరణకు గురయ్యాడు. తర్వాత అమెరికా సంయుక్త రాష్ర్టాలకు వెళ్లి, అక్కడ హోంరూల్ ఉద్యమం నడిపారు.
- మదన్ మోహన్ మాలవీయతో కలిసి హిందూ సంఘటన ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమ ముఖ్య లక్ష్యం హిందూ ముస్లింల ఐక్యత సాధించడం.
- లాలా లజపతి రాయ్ వందేమాతరం అనే ఉర్దూ పత్రిక, ది పీపుల్ అనే ఆంగ్ల వార పత్రికలను స్థాపించారు.
- ఈయన భారతదేశంలో ఆధునిక విద్య పురోగతికి ఎనలేని కృషి చేశారు.
- 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లోని లాహోర్‌లో జరిపిన ఉద్యమం సందర్భంలో సాండర్స్ లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడి 1928, నవంబర్ 17న మరణించారు.
- జాతీయోద్యమం అతివాద నాయక త్రయంలో బాలగంగాధర్ తిలక్ బాల్‌గా ప్రసిద్ధులు. భారతీయుల ద్వారా లోకమాన్య బిరుదు పొంది, దేశంలో దేశభక్తి భావాన్ని విశేషంగా ప్రచారం చేసి, మకుటం లేని మహారాజుగా వెలుగొందారు.
- ఈయన లాఠీ క్లబ్బులు, అఖాడాలు అని పిలిచే వ్యాయామ శాలలు, గోవధ విభేక సంఘాలు నెలకొల్పి ప్రజల్లో జాతీయ భావాలు పెంపొందించారు.
- తిలక్ అగార్కర్, రనడే, దాదాభాయ్ నౌరోజీల వల్ల ప్రభావితుడై సాంఘిక, రాజకీయ దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాడు.
- రనడే స్థాపించిన దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీలో సభ్యత్వాన్ని పొందారు.
- 1893లో గణపతి ఉత్సవాలను, 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించి ప్రజల్లో దేశభక్తిని, జాతీయతను మేల్కొలపాలని ప్రయత్నించారు.
- 1896-97లో సంభవించిన కరవు వల్ల వేలకొద్దీ ప్రజలు మరణించిన సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని విమర్శించి, ఉద్యమాన్ని ప్రారంభించినందుకు తిలక్‌కు 18 నెలలు కారాగార శిక్షను బ్రిటిష్ ప్రభుత్వం విధించింది.
- ఈయన గీతారహస్యం అనే గ్రంథాన్ని రచించి కర్మ సిద్ధాంతానికి కొత్త భాష్యాన్ని చెప్పారు.
- ఈయన ‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే చరిత్రకు సంబంధించిన గ్రంథాన్ని కూడా రాశారు.
- తిలక్ పుణెలో స్వదేశీ నేత కంపెనీని స్థాపించారు. పుణెలో విదేశీ వస్త్ర దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వదేశీ వస్తు ప్రచారిణి సభకు నాయకుడిగా, సహకార విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.
- ఈ సందర్భంగా కేసరి పత్రికలో ‘మన దేశం మహావృక్షం లాంటిది, స్వరాజ్యం మూలాధారం, స్వదేశీ, ఆర్థిక బహిష్కారం కొమ్మలు’ అని తిలక్ పేర్కొన్నారు.
- తిలక్‌ను 1908లో రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసి మాండలే జైలుకు పంపారు. దీనికి నిరసనగా బొంబాయి కార్మిక వర్గం మొట్టమొదటిసారి సమ్మె చేసింది.
- దీన్ని లెనిన్ విప్లవ ప్రాముఖ్యమైనదిగా అభివర్ణించారు. అప్పటి దినపత్రిక ‘మద్రాస్ టైమ్స్’ తిలక్‌ను అరెస్ట్ చేయడం జాతి విపత్తు సృష్టించడం అని పేర్కొన్నది.
- అతివాద జాతీయోద్యమ నాయకుల్లో ప్రముఖులైన అరబిందో ఘోష్ స్వామి వివేకానందుని ఆధునిక వేదాంత ఉద్యమం వల్ల ప్రభావితుడయ్యాడు.
- రాజకీయ స్వాతంత్య్రం దేశానికి ఆయువు పట్టు అని ప్రకటించారు.
- ఈయన ‘న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్’ అనే శీర్షికతో ‘ఇందు ప్రకాష్’ అనే పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వ్యాసాలు రాశారు.
- అరబిందో ఘోష్ దృష్టిలో జాతీయత రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు, జాతీయత అనేది మతం, దాన్ని దైవం ప్రజలకు ఇచ్చింది. ఈ భావం హృదయానికి, ఆత్మకు సంబంధించినది.
- ఈయన వందేమాతరం పత్రిక నిర్వహణలో బిపిన్ చంద్రపాల్‌కు సహకరించారు. ఇతను బెంగాల్లో ‘జుగంతర్’ అనే పత్రికను ప్రారంభించారు.
- జాతీయోద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన అరబిందో ఘోష్ 1910లో రాజకీయ సన్యాసం చేసి పాండిచ్చేరి అడవుల్లోకి వెళ్లారు. ఈయన 1950లో మరణించారు.
- ఈయన బెంగాల్లో స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహించిన ప్రముఖ జాతీయ వాది. భారతదేశంలో అతివాద ఆలోచనా ధోరణికి పాల్‌ను పితృ సమానుడిగా పరిగణిస్తారు.
- బిపిన్ చంద్రపాల్ 1907లో ఆంధ్రలో పర్యటించి స్వదేశీ ఉద్యమ ప్రచారాన్ని వ్యాపింపజేశారు.
- ‘సంస్కరణ కాదు దేశానికి కావాల్సింది కొత్త రూపం సుమా’ అని ఈ సందర్భంగా బిపిన్ చంద్రపాల్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాజకీయ స్వాతంత్య్రమే దేశానికి ఊపిరి అని పిలుపునిచ్చారు.
- ఈయన న్యూ ఇండియా పత్రిక సంపాదకుడిగా పనిచేశారు. పారదర్శక్ అనే బెంగాలీ పత్రికను ప్రారంభించారు. ది బెంగాలీ పబ్లిక్ ఒపీనియన్, ది ట్రిబ్యూన్ పత్రికలకు సహాయ సంపాదకునిగా కూడా వ్యవహరించారు.
- బిపిన్ చంద్రపాల్ గొప్ప రచయితే గాక మానవతావాది కూడా. ఆయన రచించిన ‘నా జీవిత కాలం నాటి జ్ఞాపకాలు’ ప్రసిద్ధి చెందింది.
మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్‌లలో విప్లవ జాతీయవాదుల కార్యకలాపాలు - మొట్టమొదట బ్రిటిష్ ప్రభుత్వ అధికారులను చంపే ప్రయత్నం 1897, జూన్ 22న మహారాష్ట్రలోని పూనాలో జరిగింది. ఇందులో పాల్గొన్నది చాపేకర్ సోదరులుగా ప్రసిద్ధి చెందిన దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్.
- ప్లేగు కమిటీ అధ్యక్షుడైన మిస్టర్ రాండ్ అనే బ్రిటిష్ అధికారిని చంపాలని బాంబులు వేయగా అది విఫలమై అందులో లెఫ్టినెంట్ అయిరిస్ట్ అనే మరో బ్రిటిష్ అధికారి చనిపోయారు. ప్లేగు కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మిస్టర్ రాండ్ అతిక్రూరంగా ప్రవర్తించడమే దీనికి కారణం.
- తిలక్ తన మరాఠీ దినపత్రికలో మిస్టర్ రాండ్, అతను పంపిన సైనికుల ప్రవర్తన ప్లేగు వ్యాధి కంటే పరుషంగా ఉన్నదున్నట్లు రాశారు.
- ఈ సంఘటనకు బాధ్యులైన చాపేకర్ సోదరులను శిక్షించి, ఉరితీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పత్రికల్లో రాసినందుకు బాల గంగాధర్ తిలక్ 18 నెలల కఠిన కారాగార శిక్షకు గురయ్యారు.
- మహారాష్ట్ర విప్లవకారుల్లో అగ్రగణ్యుడు వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయన తన సోదరుడు గణేష్ సావర్కర్తో కలిసి ‘మిత్రమేల’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థే తర్వాత ‘అభినవ భారత్’ అనే సంస్థగా రూపుదిద్దుకొన్నది. ఈ విప్లవ సంస్థ కార్యకలాపాలు గణేష్ సావర్కర్ నడిపించేవారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే.. 1909, డిసెంబర్ 21న తిలక్‌కు ఆరు సంవత్సరాలు జైలుశిక్ష విధించిన నాసిక్ జిల్లా న్యాయాధికారి మిస్టర్ జాక్సన్‌ను తుపాకీతో కాల్చి చంపారు.
- విప్లవ వాదానికి రెండో ప్రధాన కేంద్రం బెంగాల్. ఇక్కడ అరబిందో ఘోష్ సోదరుడు బరీంద్రకుమార్ ఘోష్, స్వామి వివేకానందుని సోదరుడు భూపేంద్రనాథ్ దత్ విప్లవోద్యమాన్ని నిర్వహించారు.
- 1906లో బరీంద్ర కుమార్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్ ‘యుగాంతర్’ అనే పత్రికను స్థాపించారు. విప్లవ భావాలను ప్రచారం చేయడంలో ఈ పత్రిక ప్రముఖ పాత్ర వహించింది.
- దీనికి తోడు ‘వందేమాతరం, సంధ్య, నవశక్తి’ వంటి పత్రికలు కూడా విప్లవోద్యమాన్ని ఉధృతంగా ప్రచారం చేశాయి.
- బెంగాల్ యువతకు ధైర్యసాహసాలతో బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను ఎదిరించాలని, తమ రక్తాన్ని స్వాతంత్య్రం కోసం ధారపోయాలని బరీంద్ర ఉద్బోధించారు.
- రష్యన్, ఇటాలియన్ రహస్య సంఘాల తరహాలో ఈ రహస్య సంఘాలు పనిచేశాయి.
- బరీంద్ర కుమార్ ఘోష్, అతని సహచరులు స్థాపించిన ‘అనుశీలన్ సమితి’ చాలా ముఖ్యమైన సంస్థ.
- కలకత్తాలో స్థాపితమైన ‘యుగాంతర్’ మరొక శక్తిమంతమైన రహస్య సంఘం.
- బెంగాల్ రాష్ట్రంలో ‘అనుశీలన్ సమితి’కి ఐదువందల శాఖలున్నాయి.
- కలకత్తా, డక్కా రెండు ముఖ్య కేంద్రాలుగా రాష్ట్రవ్యాప్తంగా శాఖలు కలిగిన అనుశీలన్ సమితి ఉగ్రవాదుల కూడలి స్థానమైంది.
- ఈ సమితి విప్లవ సాహిత్యాన్ని పంచిపెట్టి అండర్ గ్రౌండ్ గ్రూపులను నెలకొల్పింది.
- విప్లవకారులను బ్రిటిష్ అధికారులు బాధించగా, ఈ వర్గాల వారిని శిక్షించడానికి నిర్ణయించాయి.
- 1907, డిసెంబర్ 6న విప్లవాదులు మిడ్నాపూర్ వద్ద బాంబు పేలుడు ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయాణం చేస్తున్న రైలును పేల్చివేయడానికి ప్రయత్నించారు.
- అదే నెలలో ఢక్నా జిల్లా మాజీ మేజిస్ట్రేట్ అలెన్‌ను కాల్చివేశారు.
- కలకత్తాలో మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు, కింగ్స్ఫర్ట్ విప్లవకారులకు దీర్ఘకాలం శిక్షలు విధించి, ప్రజల ఆగ్రహానికి పాత్రుడయ్యాడు.
- 1908లో ఖుదీరామ్ బోస్, ప్రపుల్ల చౌకీ, కింగ్స్ఫర్ట్ ప్రయాణం చేస్తున్నాడని దృఢంగా నమ్మి ఒక శకటంపై బాంబు వేశారు. తృటిలో కింగ్స్ఫర్ట్కు ప్రమాదం తప్పింది. ప్రపుల్ల చౌకీ ఆత్మహత్య చేసుకున్నాడు.
- పదిహేను సంవత్సరాల బాలుడు ఖుదీరామ్ బోస్‌ను విచారణ జరిపించి ఉరితీశారు. బోస్ ప్రతిష్ఠ ఎంతో ఇనుమడించింది.
- వేలకొద్దీ ప్రజలు అతడికి కన్నీటితో వీడ్కోలు పలికారు.
- విప్లవకారులు కలకత్తాలో బాంబులు తయారు చేసే కర్మాగారాన్ని నిర్వహించారు.
- పోలీసులు కర్మాగారంపై దాడిచేసి చాలా బాంబులను, పేలుడు పదార్థాలను, కొన్ని ముఖ్యమైన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. దీన్నే ‘అలీపూర్ కుట్ర కేసు’ అంటారు.
- అరబిందో ఘోష్, బరీంద్రకుమార్ ఘోష్, హరీంద్ర గోషాయిన్ మొదలైన 39 మందిని నిర్బంధించారు. గోషాయిన్ ప్రభుత్వ సాక్షిగా మారాడు.
- అందువల్ల విప్లవవాదులు అతడిని హత్య చేశారు. ఇద్దరికీ ఉరిశిక్ష విధించారు. 36 మందికి కఠిన శిక్ష విధించారు.
- ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించిన అశుతోష్ బిస్వాస్‌ను కాల్చి చంపారు. సాక్ష్యాధారాలు లేనందువల్ల అరబిందో ఘోష్‌ను విడుదల చేశారు.
మాదిరి ప్రశ్నలు
గతవారం తరువాయి..
6. కింది వారిలో మితవాద నాయకులు కానివారు?
1) ఫిరోజ్ షా మెహతా
2) గోపాలకృష్ణ గోఖలే
3) బిపిన్‌చంద్ర పాల్
4) సురేంద్రనాథ్ బెనర్జీ
7. 1897లో జరిగిన అమరావతి కాంగ్రెస్ సమావేశాన్ని ‘మూడు రోజుల తమాషా’గా వర్ణించింది?
1) బాలగంగాధర్ తిలక్
2) అశ్వనీకుమార్ దత్
3) అరబిందో ఘోష్
4) వినాయక దామోదర్ సావర్కర్
8. అతివాద నాయకులను ఉద్దేశిస్తూ పిచ్చి ఆస్పత్రి వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారని, మాట్లాడుతారని విమర్శించినది?
1) గోపాలకృష్ణ గోఖలే
2) ఫిరోజ్ షా మెహతా
3) పీ ఆనందాచార్యులు
4) సురేంద్రనాథ్ బెనర్జీ
9. కింది వాటిలో సరైనవి?
1) కృష్ణకుమార్ మిత్ర-
యాంటీ సర్క్యులర్ సొసైటీ
2) అశ్వనీదత్- స్వదేశీ బాంధవ్ సమితి
3) సతీష్ ముఖర్జీ- డాన్ సొసైటీ
4) పైవన్నీ సరైనవే
10. స్వదేశీ ఉద్యమ కాలంలో స్థాపించిన జాతీయ సంస్థలు?
1) స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ
2) బెంగాల్ కెమికల్స్ ఫ్యాక్టరీ
3) శాంతినికేతన్
4) పైవన్నీ
సమాధానాలు
6-3, 7-2, 8-1, 9-4, 10-4.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు