సముద్రపు చుంచెలుకలు.. యాపిల్ నత్తలు
- అకశేరుకాలు
జంతువులను ప్రధానంగా అకశేరుకాలు, సకశేరుకాలుగా వర్గీకరించారు. పృష్ఠవంశం లేని జంతువులను అకశేరుకాలు అంటారు. లిబ్బీహెన్రియేటా హైమన్ అకశేరుకాలపై పరిశోధనలు జరిపి ఒక క్రమానుసార వర్గీకరణలో సాధికారత సాధించారు. ఈమె అకశేరుకాలపై వెలువరించిన చరిత్రాత్మక సంపుటాలు ఇప్పటికీ ఆధారమైనవిగా గుర్తింపు పొందాయి. వెన్నెముక లేకపోవడం, ఘనంగా ఉండే ఉదర నాడీ సంధులు కలిగిన నాడీదండాన్ని కలిగి ఉండటం అకశేరుకాల ముఖ్య లక్షణం. అంతేకాక వీటిలో ఆహారనాళం నాడీదండానికి పృష్ఠభాగంలో ఉంటుంది. అకశేరుకాలు అనేక రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు కూడా కనబరుస్తాయి. శరీర నిర్మాణంలో వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని వీటిని విభజించారు.
పొరిఫెరా
- రంధ్రాలు కలిగి ఉండటం అనే పదాన్ని ప్రతిపాదించి వీటికి జంతు స్వభావం ఉందని రాబర్ట్ గ్రాంట్ నిర్ధారించాడు. ఈ వర్గానికి చెందిన జీవులను స్పంజికలు అంటారు.
- ఇవి స్థానబద్ధ, కణస్థాయి వ్యవస్థను ప్రదర్శించే ప్రాథమికమైన బహుకణ జీవులు.
- స్పంజికల్లో కుల్యావ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా నిరంతరంగా నీటి ప్రసరణ జరుగుతుంది.
- ఇవి జాంతవ భక్షక జీవులు. వీటిలో కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది.
- ఇవి ఉభయ లైంగిక జీవులు. లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
- అంతర ఫలదీకరణం జరుగుతుంది. పూర్ణభంజిత విదళనం, పరోక్ష అభివృద్ధి జరుగుతుంది.
- ఇవి లోతైన సముద్ర ప్రదేశాల్లో నివసిస్తాయి. ఇవి ఏకాంత జీవులు. కంటకాలు సిలికాన్ డై ఆక్సైడ్తో తయారైనవి.
కొన్ని స్పంజికలు
- స్పాంజిల్లా- మంచినీటి స్పంజిక
- హయలోనీమా- గాజుతాడు స్పంజిక
- యుప్లెక్టెల్లా- వీనస్ పూల సజ్జ
- యూస్పాంజియా- స్నానపు స్పంజిక
- ఛలైనా-డెడ్మాన్స్ ఫింగర్
నిడేరియా/సిలెంటరేటా
- ఇవి ఎక్కువగా సముద్రజీవులు, ఏకాంత లేదా సహనివేశాలుగా, స్థానబద్ధ లేదా స్వేచ్ఛగా ఈదే జీవులు.
- ఈ జీవుల శరీరంలోని స్పర్శకాల్లో కుట్టుకణాలైన దంశ కణాలు ఉండటం వల్ల ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చింది. దంశ కణాలు ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి.
- కణజాల స్థాయి నిర్మాణాన్ని ప్రదర్శించే మొదటి ద్విస్తరిత బహుకణ జీవులు.
- శరీరం మధ్యలో గల కుహరాన్ని జఠర ప్రసరణ కుహరం లేదా సిలెంటరాన్ అంటారు. అందువల్ల ఈ వర్గాన్ని సిలెంటరేటా అని పిలుస్తారు.
- నిడేరియా జీవుల్లో కాల్షియం కార్బోనేట్ నిర్మిత బాహ్యాస్థిపంజరం ఉంటుంది.
- వీటిలో ముఖ్యంగా రెండు రకాల జీవకాలుంటాయి. అవి పాలిప్, మెడ్యుసా. పాలిప్ స్థానబద్ధ జీవి, స్థూపాకారాన్ని కలిగి ఉంటుంది. మెడ్యుసా గొడుగు ఆకారంలో ఉండి స్వేచ్ఛగా ఈదే జీవి.
ప్లాటిహెల్మింథిస్
- ఈ జీవుల దేహం పృష్టోదరంగా అణిగి ఉంటుంది. అందువల్ల వీటిని బల్లపరుపు పురుగులు అంటారు.
- ద్విపార్శ సౌష్ఠవం కలిగిన మొదటి జీవులు.
- ఇవి త్రిస్తరిత, శరీర కుహర రహిత లక్షణాలను, అవయవ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి.
- మిధ్యా ఖండీభవనం ప్రదర్శిస్తాయి. ఈ జీవులు ఏక దిశామార్గంలో గమనం జరుపుతాయి.
- విసర్జన జ్వాలా కణాల ద్వారా జరుగుతుంది. ఉభయలింగ జీవులు, అంతర్ ఫలదీకరణం జరుగుతుంది.
కొన్ని ప్లాటిహెల్మింథిస్ జీవులు
- పాసియోలా హెపాటికా- లివర్ఫ్లూక్
- సిస్టోసోమా హిమటోబియం- బ్లడ్ఫ్లూక్
- టీనియా సోలియం- పంది బద్దె పురుగు
- టీనియా సాజినేటా- పశు బద్దె పురుగు
- ఇకైనోకోకస్ గ్రాన్యులోసస్- కుక్క బద్దె పురుగు
నిమటోడా/నిమాటిహెల్మింథిస్
- దేహం అడ్డుకోతలో వర్తులాకారంగా ఉంటుంది. కాబట్టి వీటికి గుండ్రటి పురుగులు అని పేరు వచ్చింది.
- కొన్ని స్వేచ్ఛా జీవులు. మరికొన్ని మొక్కలు, జలచర, భూచర జంతువుల్లో పరాన్నజీవులుగా జీవిస్తాయి.
- గుండ్రటి పురుగులు. అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి. త్రిస్తరిత, ద్విపార్శ, మిద్యా శరీర కుహరం గల జీవులు.
- విసర్జన వ్యవస్థలో రెనిట్ గ్రంథులు (విసర్జక గ్రంథులు) కుల్యలు ఉంటాయి. ఏకలింగ జీవులు. లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి.
- అంతర్ ఫలదీకరణం జరుగుతుంది. కొన్ని అండోత్పాదక, మరికొన్ని శిశూత్పాదకాలు.
- నిమటోడ్లు ఒకసారి ప్రౌఢజీవిగా ఎదిగిన తర్వాత దేహ కణాల సంఖ్య (బీజకోశంలో తప్ప) స్థిరంగాను, కేంద్రకాల సంఖ్య కూడా స్థిరంగానే ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని యూటెలి అంటారు.
కొన్ని నిమాటిహెల్మింథిస్ జీవులు
- ట్రైకినెల్లా- ట్రైకినా పురుగు
- ట్రైక్యురిస్- విప్ పురుగు
- ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్- గుండ్రటి పురుగు
- ఎంకైలోస్టోమా- కొంకి పురుగు
- ఎంటిరోబియస్- పిన్వార్మ్
- ఉకరేరియా- ఫైలేరియా పురుగు
అనెలిడా
- అనెలిడా అనే పదాన్ని లామార్క్ ప్రతిపాదించాడు.
- ఇవి సాధారణంగా స్వేచ్ఛా జీవులు, జలచర జీవులు, భూచర జీవులు.
- పరాన్నజీవులు, శరీర నిర్మాణం అవయవ వ్యవస్థ స్థాయిని కలిగి ఉంటుంది.
- ద్విపార్శ, త్రిస్తరిత, సమ ఖండ విన్యాసాన్ని ప్రదర్శించే నిజ శరీర కుహర జీవులు.
- దేహంలోని వర్తుల, ఆయత కండరాలు గమనానికి తోడ్పడతాయి. శ్వాసక్రియ శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో జరుగుతుంది.
- సంవృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. హిమోగ్లోబిన్, క్లోరోక్రూవరిన్ లాంటి శ్వాస వర్ణకాలు ప్లాస్మాలో ఉంటాయి.
- అంత్య వృక్కాలు విసర్జన క్రియకు, ద్రవాభిసరణకు తోడ్పడతాయి.
- ఇవి ఏకలింగ జీవులు. స్త్రీ, పురుష జీవులు వేర్వేరుగా ఉంటాయి.
- కొన్ని ఉభయ లింగ జీవులు (వానపాము, జలగ). ప్రత్యుత్పత్తి సాధారణంగా లైంగికంగా జరుగుతుంది. జీవిత చరిత్రలో ప్రత్యేకమైన ట్రోకోఫోర్ డింభకం ఉంటుంది.
కొన్ని అనెలిడా జీవులు
- నీరిస్- ఇసుక పురుగు
- ఎఫ్రోడైట్- సముద్ర చుంచెలుక
- అరెనికోలా- లగ్ వార్మ్
ఆర్థ్రోపొడా
- ఇది జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం.
- ఇందులో అతిపెద్ద విభాగం ఇన్సెక్టా.
- భూమి మీద నామీకరించిన జాతుల్లో మూడింట రెండు వంతుల పైన ఆర్థ్రోపొడా జీవులే.
- జంతుజాలంలో ఇవి 80 శాతం ఉంటాయి.
- ద్విపార్శ, సమఖండ విన్యాసం, నిజశరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు.
- దేహం పెరుగుదలను అనుమతించడానికి ఆవర్తనంగా బాహ్యాస్థిపంజరం విసర్జితమవుతుంది. ఈ ప్రక్రియను నిర్మోచనం అంటారు.
- దేహం ఖండితాలుగా విభజితమై తల, ఉరం, ఉదరం అనే భాగాలను కలిగి ఉంటుంది. కీళ్లు కలిగిన ఉపాంగాలు వీటి ప్రత్యేకత.
- శరీర కుహరం ఒక రక్తకుహరం. కాని ఇది నిజమైన శరీర కుహరం కాదు.
- ఈ వర్గంలోని జీవుల్లో మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, లేక వాయునాళాలు వంటి శ్వాసావయవాలుంటాయి. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, హీమోసయనిన్ అనే శ్వాసవర్ణకం కలిగి ఉంటుంది.
- విసర్జన మాల్ఫీజియన్ నాళికలు, హరితగ్రంథులు, కోక్సల్ గ్రంథుల ద్వారా జరుగుతుంది.
- సాధారణంగా ఏక లింగ జీవులు. అంతర్ ఫలదీకరణం జరుగుతుంది.
కొన్ని మొలస్కా జీవులు
- పైలా- యాపిల్ నత్త
- ఎప్లీసియా- సముద్ర చెవుల పిల్లి
- డోరిస్- సముద్ర నిమ్మకాయ
- యూనియో- మంచినీటి ఆల్చిప్ప
- మైటిలస్-సముద్రపు ఆల్చిప్ప
- పింక్టాడా-ముత్యపు చిప్ప
- సెపియా- కటిల్ చేప
- ఆర్కిట్యూథిస్- అతిపెద్ద సజీవ అకశేరుక జీవి
- ఆక్టోపస్- దయ్యపు చేప
ఆర్థిక ప్రామఖ్య కీటకాలు
- ఎపిస్ మెల్లిఫెరా- తేనెటీగ
- బాంబిక్స్ మోరి- పట్టుపురుగు
- లాక్సిఫర్ లక్కా- లక్క పురుగు
- సజీవ శిలాజం- లిమ్యులస్ (రాచపీత)
మొలస్కా
- జంతు సామ్రాజ్యంలో రెండో అతిపెద్ద వర్గం.
- ఈ జీవులు భూచర లేదా జలచర, ద్విపార్శ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి.
- దేహాన్ని కప్పి కాల్కేరియస్ కర్పరం ఉంటుంది. స్పష్టమైన తల, కండరయుత పాదం, అంతరాంగ సముదాయాన్ని కలిగి ఖండిత రహితంగా ఉంటుంది.
- అంతరాంగ సముదాయాన్ని కప్పుతూ ఒక మృదువైన స్పంజిక లాంటి ప్రావారం ఉంటుంది.
- శరీర కుహరం రక్త శరీర కుహరం. దంతపు గుల్లలో తప్ప మిగతా జీవుల్లోని ఆస్యకుహరంలో ఆకురాయి లాంటి నికషణ అవయవం ఉంటుంది. దీన్ని రాడ్యులా అంటారు.
- వివృత రక్త ప్రసరణ వ్యవస్థ రక్తంలోని రాగిని కలిగిన హీమోసయనిన్ అనే శ్వాసవర్ణకం కలిగి ఉంటుంది.
- స్పర్శకాలు, కళ్లు, ఓస్ప్రేడియం (నీటి స్వచ్ఛతను పరీక్షిస్తుంది) మొదలైన జ్ఞానాంగాలుంటాయి.
- ఏకలింగ జీవులు, అండోత్పాదకాలు, పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది.
ఇఖైనోడర్మెటా
- ముళ్లు కలిగిన చర్మం గల సాగరజీవులు ఈ వర్గానికి చెందుతాయి.
- ఇవి పంచకిరణ వ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. కానీ వీటి డింభకాలు ద్విపార్శ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి.
- ఈ వర్గ జీవుల విశిష్ట లక్షణం జలప్రసరణ వ్యవస్థ లేదా అంబులేక్రల్ వ్యవస్థ కలిగి ఉండటం. ఇది శరీర కుహర ఉత్పాదితం. చలనానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి, ఆహార రవాణాకు శ్వాసక్రియకు తోడ్పడుతుంది.
- ప్రత్యేక విసర్జకావయవాలు ఉండవు. వ్యాపనం ద్వారా జరుగుతుంది.
- నాడీ వ్యవస్థ తక్కువ అభివృద్ధి చెందింది. మెదడు ఉండదు. బలహీన జ్ఞానాంగాలుంటాయి.
- ఇవి ఏక లైంగిక జీవులు. లైంగిక ద్విరూపకతను ప్రదర్శించవు. లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
- అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది.
ఉదా: సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు