Indian History | ‘క్విట్ ఇండియా నాయకి’గా పేరుపొందింది ఎవరు?
క్విట్ ఇండియా ఉద్యమం
- భారత స్వాతంత్య్ర సమరంలో చివరి ఘట్టం అయిన ఈ ఉద్యమం 1942, ఆగస్ట్ 8న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానం నుంచి ప్రారంభమైంది. ఇది ఒక శాసనోల్లంఘన ఉద్యమం. దీన్నే ‘భారత్ చోడో లేదా ఆగస్ట్ ఉద్యమం లేదా ఆగస్ట్ క్రాంతి లేదా 1942 తిరుగుబాటు’ అని పిలుస్తారు.
- రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితులు క్విట్ ఇండియా ఉద్యమానికి కారణమయ్యాయి. ఈ యుద్ధకాలంలో అనేక ప్రాంతాల్లో బ్రిటన్ జపాన్ చేతిలో ఓడిపోయి జపాన్ దురాక్రమణ నుంచి భారతదేశాన్ని రక్షించలేని స్థితికి చేరింది. భారతీయులను సంప్రదించకుండా బ్రిటిష్ వారి తరఫున భారత్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని బ్రిటన్ ముందుగానే తెలియజేసి ఆ తర్వాత భారతీయుల మద్దతును పొందడానికి క్రిప్స్ రాయబారం పంపారు. కానీ గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1942, ఆగస్టులో బొంబాయిలో సమావేశమైన కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించింది.
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదనలు
1) రైతాంగం ఎలాంటి పన్నులు చెల్లించొద్దు
2) ఆహార పంటలు, పశు సంపదను అమ్మవద్దు
3) పేపర్ మనీని అంగీకరించవద్దు
4) స్వరాజ్, పంచాయతీల వ్యవస్థీకరణ
5) రోడ్డు, టెలిగ్రాఫ్, రైల్వేలు విధ్వంసపరచడం
- 1942, ఆగస్టు 10న లార్డ్ లిన్లిత్ గో జాతీయ కాంగ్రెస్‌పై నిషేధం విధించి ఉద్యమం ఆరంభంలోనే నాయకులందరినీ అరెస్ట్ చేసి రహస్య ప్రదేశాలకు తరలించారు. అదేవిధంగా గాంధీని పుణెలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో బంధించారు. దీంతో ఉద్యమానికి నాయకత్వం కరువైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలు చేసినందున లార్డ్ లిన్లిత్ గో సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అని వర్ణించాడు.
- ఐఎన్‌సీ నాయకుల అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ముఖ్యులైన జేపీ నరేంద్రదేవ్, రామ్ మనోహర్ లోహియా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. చాలా పట్టణాలు బ్రిటిష్ సైన్యం తీసుకోవాల్సిందిగా గాంధీపై ఒత్తిడి తీసుకొచ్చారు.
- బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన హింసాకాండకు వ్యతిరేకంగా, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్బంధంలో ఉంటూనే గాంధీ 1943, ఫిబ్రవరి 12న ‘21 రోజుల ఉపవాస దీక్షను ప్రారంభించారు. దీంతో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులైన మోడీ, అనీ, సర్కార్ రాజీనామా చేశారు. 1944, మే 6న గాంధీ జైలు నుంచి విడుదల కావడంతో ఈ ఉద్యమం ముగిసింది.
రాజాజీ ఫార్ములా(1944)
- తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఐఎన్‌సీ, ముస్లిం లీగ్ మధ్యగల రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సీ రాజగోపాల చారి ఒక ప్రణాళికను ‘ది వే ఔట్’ అనే పేరుతో ఒక పాంప్లెంట్ విడుదల చేశారు. దీన్నే రాజాజీ ఫార్ములా లేదా సీఆర్ ఫార్ములా అని పిలుస్తారు. ఈ ఫార్ములాను ఐఎన్‌సీ, ముస్లింలీగ్ వ్యతిరేకించగా, గాంధీ ప్రశంసించారు.
ముఖ్యాంశాలు
1) తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముస్లిం లీగ్ జాతీయ కాంగ్రెస్‌తో సహకరించాలి
2) కాంగ్రెస్ స్వాతంత్య్ర సాధన డిమాండ్‌కు ముస్లిం లీగ్ సహకరించాలి
3) యుద్ధానంతరం వాయవ్య భారత్, ఈశాన్య భారత్‌లోని ముస్లిం మెజారిటీ ప్రాంతాలు స్వతంత్రంగా ఉండాలా లేదా అనే నిర్ణయాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చేయాలి.
4) ఒకవేళ విభజనకు సమ్మతమైతే రక్షణ, వాణిజ్య, కమ్యూనికేషన్స్ మొదలైన వాటిపై సంయుక్త ఒప్పందం జరగాలి. - పైన చెప్పిన నిబంధనలన్నీ బ్రిటన్ సంపూర్ణ అధికారాలు భారత్‌కు సంక్రమింపజేసినప్పుడు మాత్రమే అమల్లోకి వస్తాయి.
మహ్మద్ అలీ జిన్నా అభ్యంతరాలు - జిన్నా ద్విజాతి లేదా ద్విదేశీ సిద్ధాంతాన్ని (టూ నేషన్స్ థియరీ) అంగీకరించాలని కాంగ్రెస్‌ను పట్టుబట్టాడు. అంతేకాకుండా వాయవ్య భారత్, ఈశాన్య భారత్‌లోని కేవలం ముస్లింలు మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఉమ్మడి కేంద్రం అనే భావనను తరస్కరించారు. దీనిపై తర్వాత గాంధీ, జిన్నా బొంబాయిలో సమావేశమై చర్చించారు. కానీ ఈ చర్చలు కూడా విఫలమయ్యాయి.
దేశాయ్-లియాఖత్ ఒప్పందం (1945) - కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగించడానికి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకుడైన భూలాభాయ్ దేశాయ్ ముస్లింలీగ్ సహాయ నాయకుడైన లియాఖత్ అలీఖాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా వీరు కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రతిపాదనను రూపకల్పన చేశారు. దీని ప్రకారం..
- కేంద్ర కార్యవర్గంలో కాంగ్రెస్, లీగ్ సమాన సంఖ్యలో వ్యక్తుల్ని నియమిస్తాయి.
- రిజర్వ్ అయిన సీట్లలో 20 శాతం సీట్లను మైనారిటీలకు కేటాయించారు.
- ఆ తాత్కాలిక ప్రభుత్వం 1935 చట్ట పరిధిలో పని చేస్తుంది. కానీ కాంగ్రెస్‌కు గాని, ముస్లింలీగ్‌కు గాని పైన చెప్పిన అంశాలపై సయోధ్య కుదరలేదు.
సప్రూ కమిటీ - 1944లో ఈ కమిటీ తేజ్ బహదూర్ అధ్యక్షతన ఏర్పడింది. ఈ కమిటీ 1945లో 21 సూచనలతో తన నివేదికను సమర్పించింది.
ముఖ్య ప్రతిపాదనలు - సమాన సంఖ్యలో హిందూ, ముస్లిం సభ్యులతో రాజ్యాంగ సమితి వ్యవస్థాపన.
- ముప్పాతిక వంతు సభ్యుల ఆమోదం ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోవడం.
- వీటితో పాటు దేశ విభజనను, ప్రత్యేక నియోజకవర్గాలను ఈ కమిటీ తిరస్కరించింది. హిందూ, ముస్లిం నాయకులు కూడా ఈ పథకాన్ని తిరస్కరించారు.
వేవెల్ ప్రణాళిక (1945) - యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం 1945, మే నాటికి ముగింపు వచ్చినప్పటికీ బ్రిటన్‌కు జపాన్ ముప్పు మాత్రం అలాగే ఉంది. అందువల్ల బ్రిటన్ ప్రధాని అయిన చర్చిల్ భారతీయులకు కొన్ని అధికారాలను బదలాయించి వారి మద్దతు పొందాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే లార్డ్ వేవెల్ను భారతీయ నాయకులతో చర్చలు జరపమని ఆదేశించారు. భారతదేశానికి వచ్చిన తర్వాత వేవెల్ తన ప్రణాళికను వెల్లడించారు.
ముఖ్యాంశాలు - నూతన రాజ్యాంగం ఏర్పడి భారతీయుల ఆమోదం పొందేలోపు ఒక తాత్కాలిక వెసులుబాటును మాత్రమే ప్రణాళిక ప్రతిపాదిస్తుంది. వివిధ రాజకీయ సంస్థల ప్రతినిధులతో ఒక వైస్రాయ్ కార్యసమితిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో అధ్యక్షుడిగా వైస్రాయ్, యుద్ధ వ్యవహారాలను చూస్తున్న ముఖ్య సైన్యాధిపతి ఇద్దరు మాత్రమే ఆంగ్లేయులు ఉంటారు. వైస్రాయ్ కార్యసమితిలో హిందూ, ముస్లింలు ప్రాతినిథ్యం సమానంగా ఉండటం జరుగుతుంది. ఈ విధమైన ఏర్పాటు వల్ల దేశ విభజనను నిరోధించవచ్చు.
- నాటి రాజకీయ ప్రతిష్టంభనను అంతమొందించి, భారతీయులు స్వపరిపాలన లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది.
- సరిహద్దుల ఏర్పాట్లు, ఆదివాసీ తెగల వ్యవహారాలు తప్ప మిగతా విషయాలన్నీ భారతీయుల నిర్వహణలోనే ఉంటాయి.
- వైస్రాయ్ కార్యసమితి 1935 చట్టం పరిధిలో పని చేస్తుంది. వైస్రాయ్ మంత్రుల సలహా ఆధారంగానే వైస్రాయ్ తన వీటో అధికారాన్ని వినియోగిస్తాడు.
- వైస్రాయ్ చక్రవర్తి ప్రతినిధిగా కార్యసమితి అధ్యక్షుడిగా ఉంటాడు. కాబట్టి భారత్‌లో బ్రిటన్ వాణిజ్య ప్రయోజనాలను పర్యవేక్షించడానికి ఒక హై కమిషన్‌ను నియమించారు.
- కార్యసమితి తాత్కాలిక జాతీయ ప్రభుత్వంగా పని చేస్తుంది.
- ఈ తాత్కాలిక ఏర్పాటు ముందు జరగబోయే రాజ్యాంగ నిర్మాణానికి ఏ విధంగానూ ప్రతిబంధకంగా ఉండదు.
- గవర్నర్ల నిర్వహణలో ఉండే రాష్ర్టాల్లో తిరిగి మంత్రివర్గాలు సంకీర్ణ పద్ధతిలో ఏర్పడుతాయి.
సిమ్లా ప్రణాళిక (1945) - గాంధీ-జిన్నా మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య సయోధ్య కుదర్చడానికి 1945, జూన్ 25న సిమ్లాలో గల వైస్రీగల్ లాంజ్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి 21 మంది హాజరయ్యారు. దీనికి హిందూ మహాసభ ప్రతినిధులకు ఆహ్వానం రాలేదు.
- ఈ సమావేశానికి హాజరైనది.. ఐఎన్‌సీ- మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం లీగ్- జిన్నా
ముఖ్యాంశాలు - ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని అన్ని పోర్ట్‌ఫోలియోలను పూర్తిగా భారతీయులకు వదిలిపెట్టడం
- ఈ కౌన్సిల్లో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిథ్యం కల్పించడం
- ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని 14 మందిలో ముస్లింలకు ముఖ్యంగా ముస్లింలీగ్‌కు 6 సీట్లు కేటాయించడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టడం వల్ల సమావేశం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు.
రాయల్ ఇండియన్ నేవీ (ఆర్ఐఎన్) తిరుగుబాటు (1946) - ఇది స్వాతంత్య్రోద్యమంలో చిట్టచివరి ప్రతిఘటన. జాతి వివక్ష, వేతనాల చెల్లింపు, ఆహార నిబంధనలు, జీవన స్థితులు లేదా పని పరిస్థితులు సరిగా లేకపోవడం, నియామకాలు, పదోన్నతిలో ఆశాభంగం వంటి కారణాలతో 1946, ఫిబ్రవరి 18లో సంకేతాల శిక్షణ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు చెందిన హెచ్ఎంఐఎస్ తల్వార్ అనే నౌకాదళ సైనికులు బొంబాయిలో నిరాహార దీక్ష చేశారు. ఆహార నిబంధనలు, పని పరిస్థితులు తక్షణ కారణాలయ్యాయి. బీసీ దత్ అనే వ్యక్తి నౌకపై క్విట్ ఇండియా అని రాయడంతో బ్రిటిష్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. దీంతో తల్వార్ నౌకలోని అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ తిరుగుబాటుకు మొదట కరాచి, తర్వాత బొంబాయి ప్రధాన కేంద్రాలయ్యాయి. ఆర్ఐఎన్లోని భారతీయులు ఎంఎస్ ఖాన్ అధ్యక్షతన ‘నేవల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ’ని ఏర్పాటు చేశారు. మొత్తం 78 నౌకల్లో సుమారు 20,000 మంది ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈ తిరుగుబాటుకు మద్దతుగా బొంబాయి సీపీఐ పార్టీ ఆందోళన చేసింది. దీనికి సామ్యవాద నాయకులైన అరుణా అసఫ్ అలీ, అచ్చుత్ పట్వర్ధన్ మద్దతిచ్చారు. చివరికి ఫిబ్రవరి 23 నాటికి వల్లభాయ్ పటేల్, మహ్మద్ అలీ జిన్నా కృషి మేరకు తిరుగుబాటుదారులు సరెండర్ అయ్యారు.
మాదిరి ప్రశ్నలు
1. ‘స్వాతంత్య్రం రాత్రికి రాత్రే, సూర్యోదయం కాకముందే కావాలి’ అని గాంధీ ఏ ఉద్యమం సందర్భంగా వ్యాఖ్యానించారు?
1) సహాయ నిరాకరణోద్యమం
2) క్విట్ ఇండియా ఉద్యమం
3) శాసనోల్లంఘన ఉద్యమం
4) రౌలత్ సత్యాగ్రహం
2. ‘క్విట్ ఇండియా నాయకి’గా పేరుపొందింది ఎవరు?
1) అరుణా అసఫ్ అలీ
2) సరోజినీ నాయుడు
3) విజయలక్ష్మీ పండిట్ 4) ఉషా మెహతా
3. గాంధీ ‘కాన్సైన్స్ కీపర్’గా పిలువబడింది?
1) చక్రవర్తుల రాజగోపాల చారి
2) జవహర్లాల్ నెహ్రూ
3) వల్లభాయ్ పటేల్
4) బాబు రాజేంద్రప్రసాద్
4. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో రహస్య రేడియోను నడిపింది?
1) మదన్ మోహన్ మాలవీయ
2) ఉషా మెహతా
3) రామ్ మనోహర్ లోహియా
4) పై అందరూ
5. క్విట్ ఇండియా ఉద్యమానికి గల ఇతర పేర్లు?
1) భారత్ చోడో 2) ఆగస్ట్ ఉద్యమం
3) ఆగస్ట్ క్రాంతి 4) పైవన్నీ
6. 1945లో సిమ్లాలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ ఏర్పాటు చేసిన సమావేశానికి జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ తరఫున హాజరయ్యింది?
1) గాంధీ-జిన్నా
2) జవహర్లాల్ నెహ్రూ-జిన్నా
3) మౌలానా అబుల్ కలాం ఆజాద్-జిన్నా
4) గాంధీ-మహ్మద్ ఇక్బాల్
7. ‘ప్రపంచమంతటా మనం విజయం సాధిస్తున్న ఈ తరుణంలో ఒక నికృష్టుడైన వృద్ధుని ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు’ అని గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది?
1) విన్స్టన్ చర్చిల్ 2) అట్లీ
3) వేవెల్ 4) లిన్ లిత్ గో
8. 1946లో రాయల్ ఇండియన్ నేవీలోని భారతీయులు ఎవరి అధ్యక్షతన ‘నేవల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ’ని ఏర్పాటు చేశారు?
1) వల్లభాయ్ పటేల్ 2) ఎంఎస్ ఖాన్
3) బీసీ దత్ 4) మహ్మద్ అలీ జిన్నా
9. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైనది?
1) ఈ ఉద్యమకాలంలో బ్రిటిష్ ప్రధానమంత్రి- విన్స్టన్ చర్చిల్
2) ఈ ఉద్యమ ప్రారంభ సమయంలో బ్రిటిష్ వైస్రాయ్- లిన్ లిత్ గో
3) ఈ ఉద్యమ ముగింపు సమయంలో బ్రిటిష్ వైస్రాయ్- వేవెల్
4) పైవన్నీ సరైనవే
జవాబులు
1-2, 2-1, 3-1, 4-4,
5-4, 6-3, 7-1, 8-2,
9-4.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు