చరిత్రలో పితృహంతకుడిగా పేరుపొందిన రెండో రాజు?

1. వైదిక సాహిత్యం ప్రకారం మగధ మొదటి పాలకుడు ప్రమగండ. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో ఈ సామ్రాజ్య పాలకుడు బృహద్రథ వంశానికి చెందిన బృహద్రథుడు. ఈ వంశంలో గొప్పవాడు బృహద్రథుడి మనమడు జరాసంధుడు. ఈ వంశంలోని చివరి రాజును చంపి క్రీ.పూ. 544లో హర్యాంక వంశాన్ని స్థాపించి మగధను పాలించాడు బింబిసారుడు. అయితే బృహ ద్రథ వంశంలోని చివరిరాజు పేరు?
1) రిపుంజయుడు 2) రిపునాథుడు
3) జరాసంధుడు 4) బృహద్రథుడు
2. చారిత్రకంగా మగధ సామ్రాజ్యాన్ని మొదటగా పాలించిన వంశం హర్యాంక వంశం. ఆ తరువాత శిశునాగ, నంద, మౌర్య, శుంగ, కణ్వ వంశాలు వరుసగా పరిపాలించాయి. ఆయా వంశాలకాలంలోనే మగధ విస్తరించి వర్థిల్లింది. బింబిసారుడు బ్రహ్మదత్తుడిని ఓడించి అంగరాజ్యాన్ని జయించాడు. ఆ రాజ్యానికి తన కుమారుడిని ప్రతినిధిగా నియమించాడు. అతడి పేరేమిటి?
1) ధననందుడు 2) అశోకుడు
3) జీవకుడు 4) అజాతశత్రువు
3. బింబిసారుడి బిరుదులు సేనియ, శ్రేణియ. ఇతడు గౌతమ
బుద్ధుని సమకాలికుడు. బింబిసారుని ఆస్థానంలో జీవకుడు అనే వైద్యుడు, భోజకుడు అనే గ్రామాధికారి ఉన్నారు. జీవకుడు బౌద్ధమతాభిమాని. అయితే బింబిసారుడు గౌతమ బుద్ధునికి దానం చేసిన విహారమేది?
1) లుంబిని 2) కరందవేణు వనం (వెదరుతోట)
3) గండక్ 4) సోన్
4. బింబిసారుని తండ్రి పేరు భట్టియ అని, బింబిసారుడికి 500 మంది భార్యలు ఉన్నారని, ఈ వివాహాల ద్వారానే ఎక్కువగా మగధను విస్తరింపజేశాడని తెలిపే బౌద్ధమత గ్రంథమేది?
1) మహావగ్గ 2) సుత్తపీఠిక
3) వినయపీఠిక 4) అభిదమ్మ పీఠిక
5. బింబిసారుడిని అజాతశత్రువు చంపి క్రీ.పూ. 493లో సింహానాన్ని అధిష్టిస్తాడు. దీంతో దేశ చరిత్రలోనే తొలి పితృహంతకుడిగా అప్రతిష్ట తెచ్చుకున్నాడు. ఇతడు క్షత్రియుడే భగవంతుడైతే నేనుకూడా భగవంతుడిని అని అన్నాడు. వజ్జి గణ రాజ్యాన్ని ఆక్రమించి దానికి చిహ్నంగా పాటలీ జలదుర్గంను నిర్మించాడు. దీన్నే ఉదయనుడు పాటలీపుత్ర నగరంగా మార్చాడు. ఇది ఏ నదుల సంగమ స్థానం వద్ద ఉంది?
1) రావి, బియాస్, సట్లేజ్ 2) గంగ, సింధు, బ్రహ్మపుత్ర 3) గంగ, రావి, బియాస్ 4) గంగ, సోన్, గండక్
6. బుద్ధుడు మరణించిన సంవత్సరంలోనే అజాతశత్రువు తన రాజధాని రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. దీనికి అధ్యక్షత వహించిన బుద్ధుని ప్రియ శిష్యుడు మహాకాశ్యపుడు. ఈ సంగీతిలో సుత్త, వినయపీఠికలు వెలువడినాయి. అయితే ఈ సంగీతి ఎప్పుడు జరిగింది?
1) క్రీ.పూ. 488 2) క్రీ.పూ. 483
3) క్రీ.పూ. 484 4) క్రీ.పూ. 487
7. హర్యాంక వంశ రాజులకు మగధ సామ్రాజ్య విస్తరణ పట్ల ఉన్న ప్రేమ ప్రజలపై లేదు. దీంతో ప్రజలు తిరుగుబాటు చేసి హర్యాంక వంశ చివరి పాలకుడు నాగదాసకుడిని సింహాసన భ్రష్టుడినిచేసి అతడి మంత్రి అయిన శిశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడిని రాజుగా నియమించారు. ఈ వంశంలో 10 మంది రాజులున్నారు. అందులో శిశునాగుడు కుమారుడు కాలాశోకుడు గొప్పవాడు. ఇతన్ని పురాణాలు ఏమని పిలిచాయి?
1) కాకవర్ణుడు 2) కాళకేయుడు
3) కాకుత్సుడు 4) కాంతనుడు
8. కాలాశోకుడు వైశాలిలో రెండో బౌద్ధ సంగీతి నిర్వహించాడు. దీనికి సభాకామి అధ్యక్షత వహించాడు. ఈ సంగీతిలోనే బౌద్ధమతం థేరవాదులు, మహాసాంఘికులుగా విడిపోయింది. అయితే కాలాశోకుడిని, అతడి 10 మంది కుమారులను చంపి, మగధ సింహాసనాన్ని అధిష్టించి, నంద వంశాన్ని స్థాపించిన రాజు ఎవరు?
1) నందరాజు 2) ఆనందుడు
3) మహాపద్మనందుడు 4) పద్మానాయుడు
v9. దేశంలో మొదటి క్షత్రియేతర, బ్రాహ్మణేతర రాజవంశం నంద వంశం. మహాపద్మనందుడు శూద్ర స్త్రీకి జన్మించినట్లు పురాణాలు చెబుతుండగా, మంగలి అని జైన గ్రంథాలు తెలుపుతున్నాయి. అయితే ఇతడు శూద్రుడు అని పేర్కొంటున్న గ్రంథం?
1) మహా వగ్గ 2) పరిశిష్ట పర్వన్
3) సుత్త పీఠిక 4) వినయ పీఠిక
10. పరిశిష్ట పర్వన్ గ్రంథాన్ని రాసింది హేమచంద్రుడు. ఖారవేలుని హాథిగుంఫా శాసనం మహాపద్మనందుడు కళింగను జయించినట్లు తెలుపుతుంది. నంద వంశంలోని రాజుల సంఖ్య 9. అందువల్ల వీరిని నవనందులు అంటారు. గ్రీకు రచనల్లో అగ్రసేన్గా పిలువబడిన మహాపద్మనందుడి బిరుదులు ఏవి?
ఎ. ఏకరాట్ బి. ఉగ్రసేనుడు
సి. మహాక్షత్రియాంతక డి. అభినవ పరశురామ
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) పైవన్నీ
11. నంద వంశంలో చివరి రాజు ధననందుడు. ఇతడిని గ్రీకు రచనలు అగ్రమిస్గా పేర్కొన్నాయి. అయితే ఇతడి సైనిక శక్తికి భయపడి యుద్ధం చేయకుండా విదేశీ రాజు వెనుదిరిగి వెళ్లాడని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఆ విదేశీ రాజు ఎవరు?
1) ఫిలిప్ 2) డేరియస్ 3) అలెగ్జాండర్ 4) సైరస్
12. కోసలరాజు ప్రసేనజిత్తు తన సోదరి కోసలదేవిని బింబిసారుడికి ఇచ్చి వివాహం చేసి కట్నం కింద కాశీ పట్టణాన్ని ఇచ్చాడు. అయితే ప్రసేనజిత్తు సృష్టించిన పదవి పేరేమిటి?
1) సేనాపతి 2) ప్రధానమంత్రి
3) సైనిక మంత్రి 4) ముఖ్యమంత్రి
13. హరప్పా నాగరికత తరువాత రక్షణ గోడలు కలిగిన ఆధారాలు
దొరికిన, క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన పట్టణం?
1) గిరివ్రజం 2) రాజగృహం 3) పాటలీపుత్రం 4) అవంతి
14. కృష్ణుడి శత్రువైన శిశుపాలుడు ఛేది జనపదానికి చెందినవాడు. అయితే వ్యాకరణవేత్త పాణిని ఏ జనపదానికి చెందినవాడు?
1) అవంతి 2) మల్ల 3) వజ్జి 4) గాంధార
15. కాశీ రాజ్యం కోసం ప్రసేనజిత్తు కుమార్తెను వివాహం
చేసుకున్నాడు అజాతశత్రువు. ప్రసేనజిత్తు కుమార్తెపేరేమిటి?
1) వజ్జర 2) వనిత 3) వాసవి 4) కోసలదేవి
16. ప్రసేనజిత్తు కుమారుడు కూడా తండ్రిని చంపి రాజ్యాన్ని ఆక్రమించాడు. దేశ చరిత్రలో రెండో పితృహంతకుడిగా పేరుపొందాడు. అయితే అతడి పేరేమిటి?
1) విదురుడు 2) విదూషకుడు
3) విరూధకుడు 4) ఉదయనుడు
17. తొలిసారిగా రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చిన అజాతశత్రువు కుమారుడు ఎవరు?
1) ఉగ్రసేనుడు 2) ఉదయనుడు
3) ఉలూకుడు 4) ఉపేందరుడు
జవాబులు
1-1, 2-4, 3-2, 4-1, 5-4, 6-2, 7-1, 8-3, 9-2, 10-4, 11-3,12-1, 13-2, 14-4, 15-1, 16-3, 17-2
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు