Indian History | గాంధీ ఏ ఉద్యమాన్ని ‘ఫైట్ ఫర్ ఫినిష్’గా వర్ణించారు?
శాసనోల్లంఘనోద్యమం (1930-34)
హెన్రీ డేవిడ్ థోరో రచించిన ‘ఎస్సే ఆన్ డ్యూటీ ఆఫ్ సివిల్ డిస్ఒబిడియన్స్ మూవ్మెంట్’ ప్రకారం ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చట్టాలు చేసినప్పుడు ప్రజలు వాటిని ఉల్లంఘించడం వారి ప్రాథమిక హక్కు అని, దీన్ని శాసనోల్లంఘన అని పిలుస్తారని వివరించాడు. గాంధీ భారత్‌లో ప్రారంభించిన శాసనోల్లంఘనోద్యమానికి ఇదే ఆదర్శం.
1930, ఫిబ్రవరిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక ఉప్పు చట్టాలను ఉల్లంఘించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు 1930లో గాంధీ లార్డ్ ఇర్విన్‌కు 11 ప్రతిపాదనలను తెలియజేస్తూ లేఖ రాశారు. వీటినే 11 పాయింట్ అల్టిమేట్లీ అని పిలుస్తారు. అవి..
1) భూమి శిస్తులో 50 శాతం తగ్గింపు.
2) ఉప్పు పన్ను రద్దు, ఉప్పు మీద ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం.
3) సముద్ర తీర నౌకా రవాణాను భారతీయులకు కేటాయించడం.
4) రూపాయి- స్టెర్లింగ్ (ఇంగ్లండ్ కరెన్సీ) మారకపు నిష్పత్తిని తగ్గించడం
5) దేశీయ జౌళి పరిశ్రమకు రక్షణ కల్పించడం
6) సైనిక వ్యయంలో 50 శాతం తగ్గింపు
7) పౌర పాలన వ్యయంలో 50 శాతం తగ్గింపు
8) మత్తు పదార్థాలను (మద్యపానం) పూర్తిగా నిషేధించడం
9) రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం
10) కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాన్ని ముఖ్యంగా సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్
డిపార్ట్మెంట్)ని సంస్కరించడం
11) స్వీయ రక్షణ కోసం పౌరులు-ఆయుధాలు ధరించడానికి వీలుగా ఆయుధాల చట్టంలో మార్పులు
- ఈ లేఖను వైస్రాయ్ ‘లార్డ్ ఇర్విన్’ తిరస్కరించాడు. దీంతో 1930, మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరి కాలినడకన దండిని చేరాలని గాంధీ నిశ్చయించారు.
- 78 మంది సత్యాగ్రహంతో, 25 రోజులు 200 మైళ్ల దూరం ప్రయాణించి ఏప్రిల్ 6న దండి చేరుకొని అక్కడే ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. దీన్నే దండి మార్చ్ అని అంటారు.
- గాంధీ ఈ ఉద్యమాన్ని ‘ఫైట్ ఫర్ ఫినిష్’గా అభివర్ణించారు.
- దండిలో ఏప్రిల్ 6న ఉప్పును తయారు చేయడంతో దేశంలో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది.
- ఉప్పును తయారు చేయడంతో పాటు విదేశీ వస్త్ర బహిష్కరణ, మద్యపాన వ్యతిరేక ప్రచారం, అస్పృశ్యతను నివారించడం వంటి అనేక నిర్మాణ కార్యక్రమాలను శాసనోల్లంఘనోద్యమంలో గాంధీ రూపకల్పన చేశారు.
- ఈ ఉద్యమంలో భాగంగా గుజరాత్, బెంగాల్లో పన్నుల నిరాకరణ ఉద్యమం కూడా జరిగింది.
- ఈ ఉద్యమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
- గాంధీని 1930, మే 5న అరెస్ట్ చేసి ఎరవాడ జైలుకు పంపగా తర్వాత సరోజినీనాయుడు, అబ్బాస్ త్యాబ్జీ ఉద్యమానికి సారథులయ్యారు.
- ఈ ఉద్యమంలో భాగంగా ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటిష్ పాలకులు ఐఎన్సీని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు.
- ధరాసణ ఉప్పు కొఠారులపై ‘సరోజినీ నాయుడు, మణిలాల్ గాంధీ (గాంధీ కుమారుడు)’ దాడిచేసిన ఈ సంఘటనను ‘వెబ్మిల్లర్’ అనే అమెరికా జర్నలిస్ట్ వివరించాడు.
ఉద్యమం నిలిపివేత
- 1931, మార్చి 5న జరిగిన గాంధీ-ఇర్విన్ ఒప్పందం ప్రకారం ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, 1932లో తిరిగి ప్రారంభించారు. 1934, మేలో ఐఎన్‌సీ సమావేశం ఏర్పాటు చేసి శాసనోల్లంఘనోద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ - ఈయన వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో శాసనోల్లంఘనోద్యమానికి నాయకత్వం వహించారు. ఈయనకు సరిహద్దు గాంధీ, బాద్షా ఖాన్ అనే బిరుదులు ఉన్నాయి.
- ఈయన 1929లో ఖుదా-ఎ-కద్మత్గార్ (భగవత్ సేవకులు) అనే ఒక యువజన సంఘాన్ని స్థాపించారు.
- వీరు ఎర్రటి వస్ర్తాలు ధరించడం వల్ల వీరిని రెడ్ షర్ట్స్ దళం అని కూడా పిలిచేవారు.
- వీరు వలసవాదానికి వ్యతిరేకంగా, పఠాన్ ప్రాంతంలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి పాటుపడ్డారు.
- ఈయన ఫక్తూన్, పుష్తో అనే పత్రికలను స్థాపించారు.
- 1930లో శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో ఇతని అరెస్టుకు నిరసనగా పెషావర్‌లో పెద్ద ఎత్తున వీధుల్లో ఆగ్రహంతో కూడిన ప్రదర్శనలు చేశారు.
- భారత విభజనను వ్యతిరేకించినందున సంప్రదాయ ముస్లింలు ఈయనను ‘ముస్లిం ద్రోహి’గా పిలిచారు.
- విదేశీయుడైనప్పటికీ 1987లో భారత ప్రభుత్వం ఇతనికి భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది. ఆ విధంగా భారతరత్న పొందిన తొలి విదేశీయుడిగా కీర్తిగాంచాడు.
రౌండ్ టేబుల్ సమావేశాలు (1930-32)
- ఈ సమావేశాలకు కారణాలు-
1) రాజ్యాంగ సంస్కరణలు లేదా భారత భవిష్యత్ రాజ్యాంగం
2) స్వరాజ్, స్వపరిపాలన
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం - ఇది 1930, నవంబర్ 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. నాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి 89 మంది ప్రతినిధులు (బ్రిటిష్ ఇండియా-57, సంస్థానాలు-16, ఇంగ్లండ్-16) హాజరయ్యారు. సంపూర్ణ స్వరాజ్య ప్రతిపాదికను కొనసాగించడానికి వైస్రాయ్ అంగీకరించకపోవడం (1931, మార్చి 5) కారణంగా ఈ సమావేశాన్ని జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది.
సిఫారసులు
1) ఐసీఎస్, ఐపీఎస్ స్థాయి ఉద్యోగుల నియామకం భారతదేశమే చేపట్టాలి.
2) సైన్యంలో భారతీయుల సంఖ్యను పెంచాలి.
3) వాయవ్య సరిహద్దు ప్రావిన్సు (ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) కోసం ఒక మంత్రిని నియమించాలి.
4) భారత్ నుంచి బర్మాను, బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ను వేరు చేయాలి.
5) అఖిల భారత సమాఖ్య రూపకల్పన
6) సమాఖ్య ప్రభుత్వాలు (రాష్ర్టాలు, వాటి శాసనసభలకు బాధ్యత వహిస్తాయి.
7) సంస్థానాలకు స్వయం ప్రతిపత్తి - కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని బహిష్కరించడంతో బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం మధ్యలోనే ముగించి 1931, సెప్టెంబర్‌లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని దానికి గాంధీని హాజరయ్యేటట్లు చూడాలని లార్డ్ ఇర్విన్‌ను ఆదేశించారు.
గాంధీ-ఇర్విన్ ఒడంబడిక/ ఢిల్లీ ఒడంబడిక (1931, మార్చి 5)
- మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌ను రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు ఒప్పించడానికి చేసిన ప్రయత్నమే ‘గాంధీ-ఇర్విన్ ఒప్పందం’. ఈ ఒప్పందంలో సర్ తేజ్ బహదూర్, ఎంఆర్ జయకర్ మధ్యవర్తిత్వం వహించారు.
ఇర్విన్ ఒప్పుకొన్న గాంధీ డిమాండ్లు
1) శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా తీసుకొచ్చిన ఆర్డినెన్సుల ఉపసంహరణ
2) ఉప్పు తయారీపై ఆంక్షల తొలగించాలి.
3) హింసకు పాల్పడినవారిని మినహాయించి మిగతా రాజకీయ ఖైదీలందరి విడుదల.
4) సత్యాగ్రహం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి ఇవ్వడం
5) మద్యం, వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్ నిర్వహణ
గాంధీ ఒప్పుకొన్న ఇర్విన్ డిమాండ్లు
1) శాసనోల్లంఘనోద్యమాన్ని ఆపివేయాలి.
2) రెండో రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరవ్వాలి.
1931- ఐఎన్‌సీ కరాచీ సమావేశం - గాంధీ-ఇర్విన్ ఒడంబడికపై చర్చించి, దాన్ని ఆమోదించడం కోసం 1931, మార్చిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం కరాచీలో నిర్వహించింది. 1931, మార్చి 23న భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయడంతో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ-ఇర్విన్ ఒడంబడికలో భాగంగా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల మరణశిక్షపై గాంధీజీ చర్చించలేదనే కారణంగా గాంధీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ఈ సమావేశంలో కింది తీర్మానాలు ఆమోదించారు.
1) మహాసభ ముగ్గురు అమరవీరుల బలిదానానికి శ్రద్ధాంజలి తీర్మానాన్ని చేసింది.
2) గాంధీ-ఇర్విన్ ఒప్పందాన్ని ఆమోదించింది. దీంతో శాసనోల్లంఘనోద్యమం రద్దయ్యింది.
3) పూర్వ స్వాతంత్య్ర లక్ష్యాన్ని పునరుద్ఘాటించింది.
4) సామ్యవాద అత్యున్నత లక్ష్యం అని ప్రకటించింది.
5) సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపకల్పన చేసిన ప్రాథమిక హక్కుల తీర్మానం ఆమోదించబడింది.
6) జవహర్లాల్ నెహ్రూ రూపకల్పన చేసిన జాతీయ ఆర్థిక విధాన తీర్మానం ఆమోదించబడింది.
రెండో రౌండ్‌టేబుల్ సమావేశం
- ఇది 1931, సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 1 వరకు రామ్సే మెక్‌డొనాల్డ్ అధ్యక్షతన లండన్‌లోని జేమ్స్ ప్యాలెస్‌లో జరిగింది.
- మొదటి సమావేశానికి హాజరైన వారు దీనికి కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున హాజరైన ఏకైక ప్రతినిధి గాంధీ. ఈ సమావేశంలో ప్రధానంగా సమాఖ్య నిర్మాణం, మైనారిటీల గురించి చర్చ జరిగింది.
- హాజరైన ఇతరులు
1) మహ్మద్ ఇక్బాల్ (ఉర్దూ కవి)
2) అలీ ఇమామ్ (నేషనలిస్ట్ ముస్లిం పార్టీ)
3) ఎస్కే దత్తా 4) జీడీ బిర్లా
5) సరోజినీ నాయకుడు (వ్యక్తిగత హోదాలో)
6) మదన్ మోహన్ మాలవీయ
(వ్యక్తిగత హోదాలో)
సిఫారసులు
1) ఈ సమావేశం రాజ్యాంగ శాసనాధికారాలకు, న్యాయాధికారాలకు తుది రూపం ఇచ్చింది.
2) కేంద్ర, రాష్ర్టాల మధ్య జరగాల్సిన ఆర్థిక వనరుల పంపిణీని వివరించింది.
3) సమాఖ్య రాజ్యంలో సంస్థానాలు చేరే పద్ధతి కూడా వివరించారు. - రెండో రౌండ్‌టేబుల్ సమావేశంలో అనేక వర్గాలు తమకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని కిరీటాన్ని అంబేద్కర్ సమర్థించగా, దీన్ని గాంధీ ఈ సమావేశాన్ని బహిష్కరించారు. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీ 1932లో తిరిగి శాసనోల్లంఘనోద్యమాన్ని ప్రారంభించాడు. దీంతో బ్రిటిష్ వారు 1932, జనవరి 4న గాంధీని అరెస్ట్ చేసి పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. కాబట్టి జనవరి 4న ‘అఖిల భారత ఖైదీల దినం’గా జరుపుకొంటారు.
మాదిరి ప్రశ్నలు
1. గాంధీ ఏ ఉద్యమాన్ని ‘ఫైట్ ఫర్ ఫినిష్’గా వర్ణించారు?
1) సహాయ నిరాకరణోద్యమం
2) శాసనోల్లంఘనోద్యమం
3) క్విట్ ఇండియా ఉద్యమం
4) రౌలత్ సత్యాగ్రహం
2. దండి మార్చ్‌ను ఉద్దేశించి ‘నెపోలియన్ ఎల్బో దీవి నుంచి పారిస్‌కు చేరిన యాత్ర’ అని ప్రకటించింది?
1) సుభాష్ చంద్రబోస్
2) జవహర్లాల్ నెహ్రూ
3) ఎంఎన్ రాయ్
4) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
3. ‘ఖుదా-ఎ-కద్మత్గార్ (భగవత్ సేవకులు)’ అనే పేరుతో యువజన సంఘాన్ని స్థాపించింది?
1) మీర్జా మహ్మద్ ఇస్మాయిల్
2) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
3) గోపాలకృష్ణ గోఖలే
4) దాదాభాయ్ నౌరోజీ
4. గాంధీ-ఇర్విన్ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించింది?
1) సర్ తేజ్ బహదూర్
2) ఎంఆర్ జయకర్
3) బీఆర్ అంబేద్కర్ 4) 1, 2
5. కింది వాటిలో సరైనవి?
1) మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం సమయంలో బ్రిటిష్ వైస్రాయ్- ఇర్విన్
2) రెండో రౌండ్‌టేబుల్ సమావేశంలో బ్రిటిష్ వైస్రాయ్- వెల్లింగ్టన్
3) 1 4) 1, 2
6. గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగిందెప్పుడు?
1) 1931, మార్చి 5
2) 1932, మార్చి 5
3) 1931, ఫిబ్రవరి 21
4) 1931, మార్చి 6
7. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో హిందూ మహాసభ తరఫున ప్రాతినిధ్యం వహించింది?
1) ఎంఆర్ జయకర్
2) బీఎస్ మూంజే
3) రామస్వామి మొదలియార్
4) 1, 2
8. ఈ ఒప్పందం అమలుకు ‘నా ప్రాణాన్ని పణంగా పెట్టాను’ అని గాంధీ దేన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు?
1) ఇర్విన్ ఒడంబడిక
2) తీన్ కథియా రద్దు
3) పూనా ఒడంబడిక 4) 1, 2
9. గాంధీ పాల్గొన్న ఏకైక రౌండ్‌టేబుల్ సమావేశం?
1) మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం
2) రెండో రౌండ్‌టేబుల్ సమావేశం
3) మూడో రౌండ్‌టేబుల్ సమావేశం
4) నాలుగో రౌండ్‌టేబుల్ సమావేశం
10. ఫక్తూన్, పుష్తో అనే పత్రికలను స్థాపించింది?
1) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
2) దాదాభాయ్ నౌరోజీ
3) మహ్మద్ అలీ జిన్నా
4) ఎంఆర్ జయకర్
11. శాసనోల్లంఘనోద్యమంలో భాగంగా సరోజినీ నాయుడు ఎక్కడ జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది?
1) మచిలీపట్నం 2) విశాఖపట్నం
3) ధరాసణా 4) బొంబాయి
సమాధానాలు
1-2, 2-1, 3-2, 4-4, 5-4, 6-1, 7-4, 8-3, 9-2, 10-1, 11-3.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు