History – Indus Valley Civilisation | ఏ ప్రాంతాన్ని ‘ఆక్స్ఫర్డ్ సర్కస్’గా వర్ణించారు?
సింధూ నాగరికత
భారతదేశంలో అత్యంత పురాతన నాగరికతగా, ప్రపంచంలోనే ఈజిప్ట్, చైనా నాగరికతలకు సమానంగా వర్ధిల్లిన నాగరికతగా సింధూ నాగరికతను చెప్పవచ్చు.
- సింధూ ప్రజల పట్టణ ప్రణాళిక, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రపంచానికే ఒక దిశానిర్దేశం చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
సింధూ నాగరికత పేర్లు
- మొట్టమొదటగా హరప్పా నగరాన్ని కనుగొన్నారు. కాబట్టి ఆర్కియాలజీ సంప్రదాయం ప్రకారం హరప్పా టైప్ సైట్ (Type site) అంటారు. సింధూ నాగరికతకు హరప్పా నాగరికత అని సర్ జాన్ మార్షల్ పేరు పెట్టారు.
- సింధూ ప్రజలు మొట్టమొదటగా దేశంలో రాగి, తగరాన్ని కలిపి కంచు అనే మిశ్రమ లోహాన్ని తయారు చేసి
ఉపయోగించారు.
సింధూ నాగరికత – పట్టణాలు
1) హరప్పా
- సర్ జాన్ మార్షల్ హరప్పా నగరాన్ని ‘ఆకస్మికంగా ఉద్భవించిన నగరం’ అని పేర్కొన్నాడు. దీన్ని ‘గేట్ వే సిటీ’ అంటారు.
- రుగ్వేదంలో ‘హర యూసియా’ అని ప్రస్తావించిన నగరం హరప్పానే.
- అమ్మతల్లి, నటరాజ విగ్రహాలు (నాట్యం చేస్తున్న పురుషుడు) బయల్పడ్డాయి. మూపురం గల ఎద్దు ముద్రిక ఇక్కడ లభించింది. రెండు ప్రముఖమైన రాతి విగ్రహాలు లభించాయి. అవి ఎర్ర రాయితో చేయబడ్డాయి. అందులో ఒకటి చేతులు లేని నగ్నంగా ఉన్న పురుష విగ్రహం కాగా, రెండోది నర్తకి విగ్రహం.
- కంచుతో చేసిన అద్దాలు లభించాయి.
- హరప్పాను ‘ధాన్యాగారాల నగరం’ అని అంటారు. ఇక్కడ రెండు వరుసలుగా 6 చొప్పున 12 ధాన్యాగారాలు బయల్పడ్డాయి. ధాన్యాగారాల పక్కన చిన్న ఇల్లు ఉంది. దీనిలో కూలీలు నివసించినట్లుగా తెలుస్తుంది.
- ఇది పడవల తయారీ పరిశ్రమలకు, కాల్చిన కుండల పరిశ్రమలకు కేంద్రం (కుమ్మరి చక్రం). ‘H’ ఆకారపు సమాధులు ఈ నగరంలోనే బయల్పడ్డాయి.
- చెక్క శవపేటికలో శరీరాన్ని పెట్టినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి.
2) మొహెంజోదారో
- సింథీ భాషలో మొహెంజోదారో అంటే ‘మృతుల దిబ్బ’ అని అర్థం.
- ఇది సింధూ నాగరకతలో అతి పెద్ద నగరం. దీని జనాభా సుమారుగా 35,000-41,000.
దీనికి గల ఇతర పేర్లు
1) సింధూ నాగరికత ఉద్యానవనం
2) నిఖ్లిస్థాన్ 3) మోడల్ సిటీ - ఇది ఏడుసార్లు వరదలకు గురైన నగరం.
- మొహెంజోదారోలో మహా స్నానవాటిక, పెద్ద అసెంబ్లీ హాలు బయల్పడ్డాయి.
- మహా స్నానవాటికను కనుగొన్నది- మార్షల్
- పశుపతి మహాదేవుని ప్రతిమ మొహెంజోదారోలోనే లభ్యమయ్యింది.
- పశుపతినాథుని చుట్టూ పులి, ఏనుగు, ఖడ్గమృగం, బర్రె, రెండు జింకలు ఉన్నాయి. సింహం ప్రతిమ లేదు.
- మాతృదేవత గర్భం నుంచి పెరిగినట్లు కనిపించే ముద్ర కనుగొన్నారు.
- గడ్డమున్న పురోహితుని విగ్రహం బయల్పడింది (స్టియటైట్తో తయారీ).
- నూలు వస్త్రం, కొలబద్ద, ఎడ్లబండి లభ్యమయ్యాయి.
- నాట్యగత్తె కాంస్య విగ్రహం లభ్యమయ్యింది. ఇక్కడ కాలిన వస్త్రపు ముక్క బయల్పడింది. నూలు వడికే ఉండలు దొరికాయి.
- మహా స్నానవాటికకు పశ్చిమ దిశలో ‘అతిపెద్ద ధాన్యాగారం’ బయల్పడింది. మొహెంజోదారోలో బయల్పడ్డ అతిపెద్ద నిర్మాణం ధాన్యాగారం. దీన్ని హమాం అని పిలిచారు.
- ఇక్కడ రెండు రావి చెట్టు కొమ్మల మధ్య నిలబడి ఉన్న దేవత ముద్రిక లభించింది.
- అత్యధిక బావులు కనుగొన్న ప్రదేశం మొహెంజోదారో.
- మెసపటోమియా నాగరికతకు చెందిన 3 స్థూపాకార ముద్రికలు లభ్యమయ్యాయి. ఈ రెండు నాగరికతల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను సూచిస్తాయి.
- ఇక్కడ పశుపతి మహాదేవుని విగ్రహాన్ని (కొమ్ముల దేవుడు) కనుగొన్న తర్వాత ఈ దేవుడే తర్వాత హిందూమతంలో శివుడు అయ్యాడని అతడిని ప్రొటోశివ అని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు.
- ఇక్కడ రాతి లింగాలు, రాగితో చేసిన రెండు ఖడ్గాలు, కాంస్యంతో చేసిన రంపం బయల్పడ్డాయి.
3) చన్హుదారో
- మూడుసార్లు వరదలకు గురైన నగరం.
- లాంక్షైర్ నగరంతో పోల్చిన సింధూ పట్టణం.
- ఇది కోటలేని నగరం. ఇది పారిశ్రామిక పట్టణం, పూసల తయారీ పరిశ్రమకు కేంద్ర స్థానం. నటరాజ విగ్రహం ఇక్కడే లభించింది.
- ఇక్కడ సిరాబుడ్డి లభించింది. పిల్లి ఆనవాళ్లు బయల్పడ్డాయి. ఇక్కడ బొమ్మల తయారీ కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది.
- లిప్స్టిక్, కాంస్యంతో చేసిన ఎడ్లబండి బయల్పడ్డాయి.
4) లోథాల్ : గుజరాత్ భాషలో లోథాల్ అంటే ‘మృతుల దిబ్బ’. దీనికి గల ఇతర పేర్లు 1) మినీ హరప్పా 2) మినీ మొహెంజోదారో 3) కాస్మోపాలిటన్ నగరం.
- లోథాల్ నౌకాశ్రయాన్ని ఇటుకలతో కట్టారు. అంటే సింధూ ప్రజల మొదటి కృత్రిమ ఓడరేవు.
- లోథాల్ అంతర్జాతీయ రేవు పట్టణంగా విలసిల్లింది. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్టు లోథాల్.
- ఇది సింధూ నాగరికత ప్రజల సముద్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం పర్షియన్ గల్ఫ్ ముద్రిక లభించింది.
- ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిసారి ‘వరి’ పండించిన వారు లోథాల్ ప్రజలు (వరిపొట్టు లభించింది). వీధి వైపు గుమ్మాలు గల ఏకైక నగరం. దంతంతో చేసిన కొలబద్ద లభ్యమైన ప్రాంతం.
- పూసల, గాజుల పరిశ్రమ ఆధారాలు లభించిన ప్రాంతం. అద్దకం తొట్లు లభించాయి.
- స్త్రీ, పురుషులను కలిపి ఖననం చేసిన అంటే ద్వి ఖననం చేసిన సమాధి ఈ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఇది సతీసహగమనాన్ని సూచిస్తుంది. పాచికలు లభ్యమైన సింధూ నాగరికత ప్రాంతం.
- ఈ ప్రదేశంలో బయల్పడిన ఇతర ఆధారాలు హోమగుండం, చెస్బోర్డ్, టెర్రాకోటతో చేసిన గుర్రం బొమ్మ, బియ్యపు గింజ.
5) కాలిబంగన్ : కాలిబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం.
- హరప్పా పూర్వ సంస్కృతి, హరప్పా సంస్కృతి రెండూ కనిపించాయి.
- సింధూ ప్రజలు పూజించే ‘అమ్మతల్లి విగ్రహం’ ఇక్కడే లభ్యమయ్యింది.
- భారత ఉపఖండంలో అతి పురాతనమైన ‘వ్యవసాయ క్షేత్రం’ ఇక్కడే బయల్పడింది. నాగలితో దున్నిన ఆనవాళ్లు బయల్పడ్డాయి.
- ఇక్కడ ఒంటే కళేబరం బయల్పడింది.
- లిపి (సర్పలేఖనం) లభ్యమయ్యింది.
- ఏడు హోమగుండాలు (అగ్నిపూజ), జంతుబలికి సంబంధించిన ఆనవాళ్లు బయల్పడ్డాయి.
6) బనవాలి : హరప్పా పూర్వ సంస్కృతి, హరప్పా సంస్కృతి రెండూ కనిపించాయి.
- గ్రిడ్ విధానం పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న నగరం.
- మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం.
- ఇది వృత్తాకారంలో నిర్మితమైన నగరం.
- టెర్రాకోట మట్టితో చేసిన నాగలి బొమ్మ బయల్పడింది.
- 11 గదులు కలిగిన భవనం బయల్పడింది.
- బార్లీ పంటలను పండించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
- పులి ముద్ర (సీల్) లభ్యమయ్యింది.
7) సుర్కోటడ : గుర్రం అవశేషాలు లభ్యమైన ప్రదేశం.
- కుండల్లో శవాన్ని పూడ్చి పెట్టారు అనే ఆధారం లభించిన ప్రాంతం.
8) రంగ్పూర్ : వరి పొట్టు ఇక్కడే లభించింది.
9) ధోలవీర : ప్రస్తుతం దేశంలో లభించిన అతిపెద్ద హరప్పా నగరం.
- పట్టణ ఎగువ, మధ్య, దిగువ అనే 3 విధాలుగా విభజింపబడింది.
ఇక్కడ బయల్పడినవి..
1) షాపింగ్ కాంప్లెక్స్
2) పట్టాభిషేక మహోత్సవ ప్రదేశం (పెద్ద స్టేడియం)
3) నీటి నిల్వ కట్టడాలు (రిజర్వాయర్లు), సిల్వర్ ఆభరణాలు 4) రాతి ముంగీస
10) అమ్రి : మొదటిసారి మూపురం ఉన్న ఎద్దు ముద్రిక లభించింది.
- ఖడ్గమృగ అవశేషాలు లభ్యమయ్యాయి.
11) రోపార్ : హరప్పా సంస్కృతి, హరప్పా అనంతర సంస్కృతి బయల్పడింది.
- స్వాతంత్య్రం తర్వాత బయల్పడిన తొలి నగరం (సట్లెజ్ నదీ తీరం- పంజాబ్)
- యజమాని మరణానంతరం అతనితో పాటు తన జంతువులను (కుక్కలు) కూడా పూడ్చేవారు.
12. అలంగీర్పూర్ : ఇది హరప్పా నాగరికత పరిణతి దశకు చెందింది. హరప్పా నాగరికత తుది దశలో ఇక్కడ పత్తిని పండించారు.
13) గుమ్లా : ఇది కశ్మీర్లోని పట్టణం. ఇక్కడ సర్పపూజ ఆనవాళ్లు లభ్యమయ్యాయి.
14) కోట్డిజి : ఇక్కడ రాతి బాణాలు బయల్పడ్డాయి. - ఇది అగ్ని వల్ల నాశనమైన పట్టణం.
15) రాఖిగర్హి : ఇది ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధూ నాగరికత నగరం.
నగర నిర్మాణం
- సింధూ నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత.
పట్టణ ప్రణాళిక - ఈ నగరాల్లో ఇళ్లను గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించారు.
- నగరంలోని ప్రధాన వీధులు, ఉపవీధులు, ఒకదానికొకటి క్రమపద్ధతిలో ఖండించుకొని నగరాన్ని దీర్ఘచతురస్రాకార విభాగాలుగా విభజించే వ్యవస్థను గ్రిడ్ వ్యవస్థ అంటారు.
- ఈ గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించిన ప్రస్తుత నగరం చండీగఢ్, కాగా గ్రిడ్ వ్యవస్థ కనబడని ఏకైక నగరంగా బనవాలి పిలువబడింది.
- రహదారులన్నీ పరస్పరం 90 డిగ్రీల కోణంలో ఖండించుకుంటూ సమాన భాగాలుగా విభజించబడినవి. ఈ నగరాలను ఆకాశం నుంచి చూస్తే చెస్బోర్డు మాదిరిగా కనబడుతుంది.
- ప్రధాన వీధులు ఉత్తర, దక్షిణ దిశల్లో ఉండేవి. ఉపవీధులు తూర్పు, పడమర దిశల్లో ఉండేవి. తూర్పు వీధిని ‘రాజవీధి’గా పేర్కొనేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు తూర్పు, దక్షిణ వీధులు కలిసే ప్రాంతాన్ని ‘ఆక్స్ఫర్డ్ సర్కస్’గా వర్ణించారు.
నిర్మాణాలు
- సింధూ ప్రజలు తమ నిర్మాణాల్లో విస్తృతంగా ఉపయోగించింది కాల్చిన ఇటుకలు. వీరు ఇటుకలను పేర్చే విధానాన్ని (ఇంగ్లింగ్ బాండింగ్) మొదటిసారి ప్రవేశపెట్టారు. ఎత్తయిన ప్రదేశంలో అంటే ఎగువ నగరంలో పాలకులు, పురోహితులు, వర్తకులు (కులీన వర్గాలు) నివసించగా, పల్లపు ప్రాంతాల్లో అంటే దిగువ నగరంలో సామాన్య ప్రజలు నివసించేవారు.
- విభజన కోట గోడ ద్వారా జరిగేది. చన్హుదారో నగరంలో కోటగోడ లేదు. కాబట్టి నగర విభజన జరగలేదు. ఇదిలా ఉంటే ధోలవీరను మాత్రం ఎగువ నగరం, మధ్య నగరం, దిగువ నగరం అని మూడు నగరాలుగా విభిన్నమైన ప్రణాళికతో నిర్మించారు.
నివాస గృహాలు - తూర్పు వైపున పల్లపు ప్రాంతాల్లో నివాస భవనాలను నిర్మించారు. గృహాలను ఎత్తయిన వేదికలపై నిర్మించారు. ఈ విధంగా ఎత్తయిన వేదికలపై గృహాలను నిర్మించడానికి ప్రధాన కారణం సింధూ నది వరదలు. ఈ గృహాలు వీధులకు ఇరువైపులా నిర్మించారు.
- ప్రతి గృహంలో సాధారణంగా బావి, స్నానవేదిక ఉండేవి. ధనవంతుల ఇళ్లలో బావి, స్నానవేదికతో పాటు అదనంగా పెరడు, మురుగుదొడ్లు ఉండేవి. ఈ ఇళ్లకు కిటికీలు, ప్రవేశ మార్గం వెనుకవైపు నుంచి ఉండేవి.
- చరిత్రకారుల ప్రకారం దుమ్ము, ధూళిని నిరోధించడానికి ఈ ప్రణాళిక చేపట్టి ఉండవచ్చు. అయితే లోథాల్లో మాత్రం తలుపులు, కిటికీలు రహదారివైపు ఉండేవి.
- సింధూ ప్రజలు ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.
- ప్రతి ఇంటి బయట చెత్తకుండీ ఉండేది. ఇంటిలోని చెత్తను పారవేయడానికి ఇంటిగోడకు రంధ్రం ఉండేది.
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ - సింధూ నాగరికత ప్రజలు ప్రత్యేక శ్రద్ధతో మురుగునీటి పారుదల కాల్వలను నిర్మించారు. ప్రతి ఇంటి నుంచి మురుగునీరు ప్రత్యేకమైన మురుగు కాల్వల ద్వారా ప్రధానమైన మురుగునీటి కాల్వలోకి చేరుతుంది. మ్యాన్హోల్స్ కూడా నిర్మించారు.
- కొన్ని ఇళ్లవారు టెర్రాకోట పైపులతో నిర్మితమైన గొట్టాల ద్వారా ప్రధాన మురుగునీటి కాల్వలోకి నీరు వదిలేవారు. అత్యంత ఆశ్చకరమైన అంశం ఏమిటంటే అన్ని నగరాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉండగా, బనవాలిలో మాత్రం ఇది కనబడదు.
మాదిరి ప్రశ్నలు
1. చన్హుదారో గురించి సరైనవి?
1) లాంక్షైర్ నగరంతో పోల్చిన సింధూ పట్టణం
2) మూడుసార్లు వరదలకు గురైన నగరం
3) ఇది కోట లేని నగరం 4) పైవన్నీ
2. ‘ఆకస్మికంగా ఉద్భవించిన నగరం’ అని సర్ జాన్ మార్షల్ ఏ నగరాన్ని పేర్కొన్నాడు?
1) మొహెంజోదారో 2) హరప్పా
3) లోథాల్ 4) కాలిబంగన్
3. హరప్పా సంస్కృతి, హరప్పా అనంతర సంస్కృతి ఎక్కడ బయల్పడింది?
1) అలంగీర్పూర్ 2) కోట్డిజి
3) రోపార్ 4) రంగ్పూర్
సమాధానాలు : 1-4, 2-2, 3-3
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు