‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
IIIవ దశ క్రీ.శ. 1858 నుంచి 1909 వరకు1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటీష్ పాలకులు విజయం సాధించారు. ఈ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్.
1858 భారత ప్రభుత్వ చట్టం
విక్టోరియా రాణి చేసిన ప్రకటనను 1858, నవంబర్ 1న లార్డ్ కానింగ్ అలహాబాద్‌లో వినిపించాడు. ఈ చట్టం ప్రకారం కంపెనీ పాలన రద్దు చేశారు. దేశంలో బ్రిటీష్ రాణి పాలన ప్రారంభమైంది. దీంతోపాటు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదా భారతదేశ వైశ్రాయ్‌గా మారింది. దేశ మొదటి వైశ్రాయ్ లార్డ్ కానింగ్. ఈ చట్టం ప్రకారం ఒక కార్యదర్శి, 15 మంది సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. భారతరాజ్య మొదటి కార్యదర్శి సర్ చార్లెస్ వుడ్. 1859లో లార్డ్‌కానింగ్ పోర్ట్‌పోలియో విధానాన్ని ఏర్పాటు చేసి దీన్ని 1861లో చట్టంలో చేర్చారు. ఈ చట్టం ఆధారంగా భారతదేశ వ్యవహారాల కార్యాలయాన్ని లండన్‌లో ఏర్పాటు చేశారు.
1861 భారతీయ మండళ్ల చట్టం
ఈ చట్టం ఆధారంగా బెంగాల్, పంజాబ్, ఈశాన్య రాష్ర్టా ల్లో శాసన మండళ్లు ఏర్పాటు చేశారు. 1862లో కలకత్తాలో మొదటి హైకోర్టును ఏర్పాటు చేశారు. అనంతరం బొం బాయి, మద్రాసుల్లో కోర్టులను ప్రారంభించారు. 1866లో అలహాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ చట్ట సమయంలో భారతదేశ వైశ్రాయ్‌గా లార్డ్ కానింగ్ ఉన్నారు. 1870లో లార్డ్ మెయో స్థానిక సంస్థల బలోపేతం కోసం ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1882 మే 18న లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలన తీర్మానాన్ని ప్రకటించారు. దీంతో ఆయన స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పిలవబడ్డారు.
1892 ఇండియన్ కౌన్సిళ్ల చట్టం
ఈ చట్టం అమలులోకి వచ్చిన సయమంలో లార్డ్లాన్స్ డౌన్ వైశ్రాయ్‌గా ఉన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులను సంతృప్తిపరచడానికి ఈ చట్టాన్ని ప్రకటించారు. కేంద్ర శాసన సభలో సభ్యుల సంఖ్యను పెంచారు. శాసన సభకు బడ్జెట్‌పై చర్చించే అవకాశం కల్పించారు. భారతదేశంలో పోటీ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు.
క్రీ.శ. 1909 నుంచి 1919 వరకు
బ్రిటీష్ ప్రభుత్వం 1907లో పరిపాలనా వికేంద్రీకరణ సంఘాన్ని ఏర్పాటు చేయగా.. 1908లో సమర్పించిన నివేదికలో అధికార వికేంద్రీకరణ జరగాలని సిఫారసు చేశారు. ఈ సంఘానికి సర్చార్లెస్ హబ్‌హౌస్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం
ఈ చట్టం సమయంలో భారత కార్యదర్శిగా లార్డ్ మార్లే, వైశ్రాయ్‌గా లార్డ్ మింటోలు పదవిలో ఉండటంతో దీనికి మింటో మార్లే సంస్కరణల చట్టం అనే పేరు వచ్చింది. మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. లార్డ్ మింటోను మత ప్రాతిపదిక నియోజక వర్గాల పితామహుడు అంటారు (Father of Communal Electorate) ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసన మండలి సభ్యుల సంఖ్యను 16 నుంచి 60 మందికి పెంచారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు అవకాశం కల్పించారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో నియమించబడిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఈ చట్టాన్ని హిందువులకు, మహ్మదీయులకు అడ్డుగోడలు సృష్టించిన చట్టమని, భారతదేశ విభజనకు మూలకారణం అని భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విమర్శించారు.
1919 భారత ప్రభుత్వ చట్టం
దీనిని మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అని కూడా అంటారు. ఈ చట్ట సమయంలో కార్యదర్శిగా మాంటెగ్, వైశ్రాయ్‌గా ఛేమ్స్ఫర్డ్డ్ పనిచేశారు. భారతీయులకు పాక్షికంగా రాజకీయ అధికారాన్ని బదిలీ చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. డయార్కీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది విలియం డ్యూక్. ఈ చట్టం ఆధారంగా కేంద్రంలో తొలిసారి ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. ప్రావిన్సుల్లో తొలిసారిగా రిజర్వ్డ్, ట్రాన్స్‌ఫర్డ్ పాలన అంశాలుగా వేరు చేశారు. రిజర్వ్డ్ అంశాలు 28, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలు 22. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్లను వేరు చేశారు.
1921లో సాధారణ బడ్జెట్ నుంచి ఆర్క్వర్త్ కమిటీ సిఫారసు మేరకు రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు. కేంద్ర రాష్ర్టాల మధ్య పాలన అంశాలను 2 జాబితాలుగా విభజించారు. కేంద్ర జాబితాలో 47 అంశాలు, రాష్ట్ర జాబితాలో 51 అంశా లు ఉన్నాయి. 1919 చట్టం ద్వారా శాసనసభకు నియమించబడ్డ తాత్కాలిక సభాధ్యక్షుడు సర్ ఫ్రెడరిక్ వైట్, ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు విఠల్‌భాయ్ పటేల్. ఈ చట్టం ద్వారా పబ్లిక్ సర్వీసులు భర్తీ చేయడానికి పబ్లిక్‌సర్వీస్ కమిషన్‌ను, ప్రజా పద్దుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. పన్నులు చెల్లించేవారికి విచక్షణా పూరిత ఓటు హక్కును కల్పించారు. 1923లో విస్కౌంట్ లీ కమిషన్ సిఫారసు మేరకు దేశంలో రాస్ భాస్కర్ చైర్మన్‌గా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను 1926లో ఏర్పాటు చేశారు. 1919 చట్టం ద్వారా భారత దేశంలో తొలిసారిగా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని, పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు.
మాదిరి ప్రశ్నలు
1. శాసన మండలిని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? ( డీ )
ఏ) 1784 ఫిట్స్ ఇండియా చట్టం
బీ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
సీ) 1833 చార్టర్ చట్టం
డీ) 1853 చార్టర్ చట్టం
2. INDIAN WAR OF INDEPENDENCE
గ్రంథ రచయిత? ( బీ )
ఏ) బహదుర్ షా-II బీ) వీడీ సావర్కర్
సీ) రాజ్ మండల్ పాండే డీ) సర్ అర్థర్ కాటన్
3. భారతదేశ వ్యవహారాల కార్యదర్శి పదవిని 1858లో ఏర్పాటు చేయగా మొదటి కార్యదర్శి ఎవరు?( ఏ )
ఏ) సర్ చార్లెస్ ఉడ్ బీ) లార్డ్ మెకాలే
సీ) దినకర్ రావు డీ) లార్డ్ కానింగ్
4.పోర్ట్ పోలియో పితామహుడు? ( డీ )
ఏ) రిప్పన్ బీ) వారన్ హేస్టింగ్
సీ) కారన్ వాలీస్ డీ) కానింగ్
5. కిందివానిలో అతి ప్రాచీన హైకోర్టు ఏది?( ఏ )
ఏ) కలకత్తా బీ) అలహాబాద్ సీ) ఢిల్లీ డీ) చండీగఢ్
6 . 1909 చట్ట సమయంలో భారత రాజ్య కార్యదర్శి ఎవరు?(బీ)
ఏ) లార్డ్ మింటో బీ) లార్డ్ మార్లే
సీ) లార్డ్ మాంటింగ్ డీ) లార్డ్ ఛేమ్స్‌ఫర్డ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు