ఉవ్వెత్తున ముల్కీ ఉద్యమం
1952 ఆగస్టు 22న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బూర్గుల వరంగల్ పట్టణాన్ని సందర్శించారు. ఆరోజు వరకు ప్రభుత్వం నుంచి ముల్కీ సమస్యపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇచ్చిన హామీని అమలు జరపనందుకు ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు వరంగల్‌లో సీఎంను కలిశారు. దీంతో బూర్గుల తాను హైదరాబాద్ వెళ్లగానే కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రకటన విడుదల చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. అయితే అదేరోజు సాయంత్రం విద్యార్థుల యాక్షన్ కమిటీ సమావేశమై ఆగస్టు 27వ తేదీలోపు సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రకటన రాకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రికి లేఖరాసి ఆగస్టు 24న పంపించారు.
హైదరాబాద్‌కు వ్యాపించిన ముల్కీ ఉద్యమం
# ఆగస్టు 24న హైదరాబాద్‌లోని బొల్లారంలో విద్యార్థుల సమావేశం జరిగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరైన ఈ సభలో నాన్-ముల్కీల నియామకాలపై వక్తలు ప్రసంగించారు. ఆగస్టు 26 నుంచి సమ్మె ప్రారంభించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఆగస్టు 26న బొల్లారంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి నాన్-ముల్కీలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు నగరంలో విద్యార్థులు ప్రదర్శనలు, తరగతుల బహిష్కరణ సెప్టెంబర్ మూడో వారం వరకు కొనసాగాయి.
ముల్కీ సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
# వరంగల్ విద్యార్థులకు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఇచ్చిన మాట ప్రకారం ముల్కీ సమస్యపై విచారించడానికి, బోగస్ ముల్కీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన గైర్-ముల్కీలను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించడానికి, ముల్కీ రూల్స్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వరంగల్ కలెక్టర్ ద్వారా విద్యార్థి కార్యాచరణ కమిటీ కన్వీనర్ బుచ్చయ్యకు తెలిపారు. కానీ ఈ ఉపసంఘాన్ని నియమించినట్లు మొదటిసారి పత్రికా ప్రకటన సెప్టెంబర్ 7న వెలువడింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం
# వరంగల్ విద్యార్థులపై అన్యాయంగా లాఠీచార్జి జరపడాన్ని రాష్ట్రంలోని విద్యార్థి లోకం సీరియస్‌గా తీసుకుంది. మరునాడు ఆగస్టు 29న అన్ని జిల్లాలు, జంటనగరాల్లో విద్యార్థులంతా సమ్మెకు దిగారు. వరంగల్ విద్యార్థులకు మద్దతుగా నాన్-ముల్కీలకు వ్యతిరేకంగా నల్లగొండ, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఆందోళన ఉధృతమైంది.
సిటీ కాలేజీ సంఘటన
# సెప్టెంబర్ 3న ముల్కీ ఉద్యమం ఉధృతమైంది. తెలంగాణలోని మరాఠ్వాడా, గుల్బర్గా, బీదర్ తదితర జిల్లాలకు కూడా ముల్కీ ఉద్యమం వ్యాపించింది. సెప్టెంబర్ 3న సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 కింద ఊరేగింపులు, సభలు, రాళ్లు, ఆయుధాలు వెంటబెట్టుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అదే రోజు సిటీ కాలేజీ చుట్టూ వందకు పైగా పోలీసులతో టియర్ గ్యాస్ బృందాలతో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
# అయితే విద్యార్థులు రాళ్లు విసరడంతో కమిషనర్ అక్కడ ఉన్న మేజిస్ట్రేట్‌కు పరిస్థితి చేయిదాటిపోతున్నదని చెప్పడంతో ఆయన ఫైరింగ్‌కు ఆదేశించారు. అప్పటికి సుమారు ఏడెమినిది వేల మంది ఆ ప్రదేశంలో ఉన్నారు. ఒకటి, రెండు రౌండ్లు గుంపులోనివారికి తగలకుండా కాల్పులు జరిపారు. అయితే ఎవరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో నేరుగా గుంపుల మీద ఫైరింగ్ చేయడంతో ఔట్‌పోస్టు ఎదురుగా ఉన్న యువకుడు కిందపడిపోయాడు. అతన్ని వ్యానులో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే విద్యార్థులు, జనం మళ్లీ గుమిగూడి నినాదాలిస్తూ పోలీసుల వైపు కదిలారు. కొందరు మళ్లీ రాళ్లు విసరడంతో పాటు మదీనా ముందు బస్సులను ధ్వంసం చేశారు.
మరోసారి కాల్పులు మరోవ్యక్తి మృతి
# అఫ్జల్‌గంజ్ వైపు నుంచి వచ్చిన పోలీసులు 303 రైఫిల్స్‌తో అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. బస్సును తగులబెట్టడానికి ప్రయత్నిస్తున్న యువకుడు బుల్లెట్ దెబ్బలకు నేలకొరిగాడు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సిటీ కాలేజీ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు ఫైరింగ్ జరిగిన విషయాన్ని తెలుసుకున్న నగరంలోని జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మేజిస్ట్రేట్ అబ్దుల్ బషీర్‌ఖాన్ అంచనా ప్రకారం జనం సుమారు నలభై వేల మంది ఉన్నారు. ఒక పక్క బస్సులను తగులబెడుతుండటం, మరో పక్క పోలీసులపై రాళ్ల వర్షం, ఈ పరిస్థితుల్లో పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కమిషనర్ కోరడంతో మేజిస్ట్రేట్ ఆ రోజు రెండోసారి విద్యార్థులను హెచ్చరించిన తర్వాత ఫైరింగ్‌కు ఉత్తర్వులిచ్చారు. 15 నిమిషాల పాటు పోలీసులు 12 రౌండ్లు కాల్పులు జరిపారు. చాలామందికి తూటాలు తగిలి నేలపై పడిపోయారు. ఈ విధంగా ముల్కీ ఉద్యమం రక్తసిక్తమైంది. ఆ రోజు జరిగిన కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఉస్మానియా ఆసుపత్రిలో మరణించారు. అయితే 3న కాల్పుల్లో మరణించిన నలుగురిలో ఒక్కరు కూడా విద్యార్థులు లేరని ప్రభుత్వం ప్రకటించింది. వీరు విద్యార్థులా.. నిజంగా ప్రభుత్వం ప్రకటించినట్లు ప్రైవేటు ఉద్యోగులా అనేది ఎవరు కూడా ఎంక్వయిరీ చేయలేదు.
ముఖ్యమంత్రి కారుకు నిప్పు
#సిటీ కాలేజీ, పత్తర్‌ఘాట్ పోలీసు కాల్పుల్లో పలువురు గాయపడటం, ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందడంతో విద్యార్థుల్లో ఆగ్రహం ఎక్కువైంది. సెంట్రల్ బ్యాంక్ దగ్గర ప్రతాప్ గిర్జీ కోఠిలో మహిళల సమావేశానికి ముఖ్యమంత్రి భార్య సీఎం కారులో వచ్చారు. అప్పటికే ముఖ్యమంత్రి భార్య ప్రసంగం పూర్తయింది. విద్యార్థులు.. పోలీసు కాల్పుల్లో ఐదారుగురు చనిపోయారు. మీటింగ్ ఆపండి అని మహిళలతో అన్నారు. ఆ సమయంలో సుమారు రెండు మూడు వేల మంది జనం, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. కొందరు ఆందోళనకారులు ముఖ్యమంత్రి కారును ధ్వంసం చేసి తగులబెట్టారు.
ఫతేమైదాన్‌లో విద్యార్థుల సమావేశం
#అబిడ్స్ రోడ్డు నుంచి ఊరేగింపుగా వచ్చిన వేలాది మంది విద్యార్థులు ఫతేమైదాన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు వీడీ దేశ్‌పాండే, వీకే ధాగె కూడా హాజరయ్యారు. వక్తలంతా ప్రభుత్వ దమననీతిని, పోలీసు కాల్పులను ఖండించారు. మరుసటి రోజు ఉదయం 9:30 నిమిషాలకు విద్యార్థులు, నాయకులు ఉస్మానియా ఆసుపత్రి వద్దకు చేరుకుని విద్యార్థుల మృతదేహాలతో ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. పోలీసు కాల్పులపై నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్‌ను నియమించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు.
మృతదేహాలను రహస్యంగా ఖననం
#సిటీ కాలేజీ కాల్పుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఊరేగింపుగా తీసుకెళ్లాలని ఉస్మానియా ఆస్పత్రి వద్దకు వచ్చిన నాయకులు, విద్యార్థులు కమిషనర్ చెప్పిన జవాబు విని నాయకులు షాక్‌కు గురయ్యారు. ‘మృతదేహాలను ఈ రోజు తెల్లవారుజామున మీరాలం చెరువు సమీపంలో ఖననం చేశామని కమిషనర్ చెప్పాడు. ఈ విషయం పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి కూడా ఆలస్యంగా చెప్పారు. ఉదయం కుమారి పద్మజానాయుడు, డా. వాఘ్రిలను కలిసినపుడు ఆయనకు విషయం తెలియదు. విషయాన్ని కమిషనర్ నుంచి విన్న నేతలంతా భగ్గుమన్నారు. మృతదేహలను బంధువులకు ఇవ్వకుండా ఖననం చేసే అధికారం ఎవరిచ్చారని కమిషనర్‌ను నిలదీశారు. ఇప్పుడు తమ చేతిలో ఏమీ లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కమిషనర్ చెప్పాడు. నాయకులంతా కుమారి పద్మజానాయుడు, వాఘ్రిలను ముఖ్యమంత్రి దగ్గరకు పిలిపించారు. వీరు సీఎంను కలుసుకుని విషయం చెప్పగానే ఆయన కమిషనర్‌ను పిలిచి చీఫ్ సెక్రటరీ సమక్షంలో మీరాలం ట్యాంక్ దగ్గర ఖననం చేసిన మృతదేహలను వెలికి తీయించి వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు.
# ఉస్మానియా ఆసుపత్రి ఎదుట గుమిగూడిన వేలాది మందికి ఈ విషయం చెప్పి వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించి స్వస్థలాలకు పంపించడానికి కుమారి పద్మజానాయుడు, వాఘ్రీ ప్రయత్నించారు. పోలీసు పెట్రోలింగ్ వాహనాల ద్వారా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, వారి సంబంధీకులకు శ్మశానం వద్ద అప్పగిస్తున్నామని ప్రకటించారు. జనం అక్కడి నుంచి వెళ్లడం ప్రారంభం కాగానే కొందరు జనంలోంచి ఇదంతా మోసం, అబద్ధం మనల్ని పక్కదారి పట్టిస్తున్నారని అరిచారు. అదే సమయంలో తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో జనం రాళ్లు విసరడం ప్రారంభించారు.
పోలీసు కాల్పుల్లో నలుగురి మృతి
# పోలీసు అధికారులు లాఠీచార్జి, టియర్‌గ్యాస్ కోసం ఆదేశించారు. కమిషనర్ కాల్పులు జరపొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చినా పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపారు. 15 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఐదుగురు వ్యక్తులు బుల్లెట్ దెబ్బలకు తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయారు. మొత్తం 44 రౌండ్లు కాల్చారు. ఆ సమయానికి ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలలో 30 వేల నుంచి 40 వేల మంది గుమిగూడారు.
హైదరాబాద్‌లో తొలి బహిరంగ సభ
#ముల్కీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో ఆగస్టు 27న మొదటిసారిగా భారీ బహిరంగ సభ జరిగింది. సికింద్రాబాద్ మేయర్ డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో హైదరాబాద్ శాసనసభ్యుడు, పీసీసీ సభ్యుడైన గోపాల్‌రావు ఎక్బోటే ప్రసంగించారు.
వరంగల్‌లో విద్యార్థులపై లాఠీచార్జి
# ఆగస్టు 27 సాయంత్రం జరిగిన సమావేశంలో విద్యార్థి కార్యాచరణ కమిటీ ప్రభుత్వం ‘మంత్రివర్గ ఉపసంఘం’ ఏర్పాటు చేసినందున విద్యార్థులు సమ్మె విరమించాలని నిర్ణయం తీసుకుని, మరునాడు ఉదయమే అన్ని స్కూళ్లు, కాలేజీల ప్రవేశ ద్వారాల వద్ద బోర్డులపై రాశారు. పేపర్లు అతికించారు. ఆగస్టు 28న కలెక్టర్, ఎస్పీ ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో ఉండి పక్కనే ఉన్న హైస్కూల్లో పరిస్థితిని కిటికీ ద్వారా గమనిస్తూ ఉన్నారు. ఇంతలో క్లాసులో ఉన్న విద్యార్థులను బయటకు రమ్మని కొందరు బలవంతం చేస్తున్న విషయాన్ని గమనించి కొందరు పోలీసులను వెంట తీసుకుని హైస్కూల్‌కు వెళ్లారు. వీరిని చూడగానే విద్యార్థులు ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఎందుకొస్తున్నారని నిలదీసి వాదనకు దిగారు. కొద్దిసేపటికి పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. హైస్కూల్ ఆవరణలో ఉన్నవారిపై లాఠీచార్జి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు గాని, శాంతిభద్రతలకు గాని ఆ విద్యార్థులు ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు. క్లాసులకు హాజరుకావాలన్న ఎస్పీ, కలెక్టర్ల మాటను లక్ష్య పెట్టనందుకే ఈ లాఠీచార్జి జరిగిందని భావించవచ్చు.
జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్
# 1952 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో సిటీ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి ఏరియాల్లో జరిగిన పోలీసు కాల్పులపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించడానికి హోంశాఖ 1952 సెప్టెంబర్ 9న హైకోర్టు న్యాయమూర్తి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్‌ను నియమించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జస్టిస్ జగన్మోహన్ రెడ్డికి 1952 సెప్టెంబర్ 10న లేఖ రాశారు. అనంతరం హైదరాబాద్ ప్రభుత్వం సెప్టెంబర్ 9న హోంశాఖ ఉత్తర్వుల (ఎస్.పి.ఎల్/ పి.బి.ఎల్ /29/52) ఆధారంగా సెప్టెంబర్ 12, 1952న కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ తరఫున రిజిస్ట్రార్ జీబీ తివారి బహిరంగ విచారణ నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఇందులో 1952, సెప్టెంబర్ 19 నుంచి హైదరాబాద్ హైకోర్టు ఆవరణలోని కోర్టు హాలులో బహిరంగ విచారణ ప్రారంభించాలని న్యాయమూర్తికి సూచించారు. దీంతో జస్టిస్ జగన్మోహన్రెడ్డి విచారణ ప్రారంభించి విధి విధానాలను తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు